అట్టుడుకుతున్న అమరావతి... స్తంభించిన జనజీవనం... 

మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 35రోజులుగా నిరసనలు తెలుపుతున్న అమరావతి ప్రజలు ఇవాళ బంద్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా బంద్ కి పిలుపునిచ్చారు. దాంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రైతులు, మహిళలకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. అలాగే, పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. మంచినీళ్లలోపాటు ఎలాంటి ఆహార్ధాలను విక్రయించకూడదని, ఇవ్వకూడదని అమరావతి గ్రామాల వ్యాపారులు, ప్రజలు నిర్ణయించారు. ఇక, మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. శాసనసభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని అమరావతి పరిరక్షణ సమితి, అలాగే రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. అమరావతి రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అమరావతి రైతులు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని హైకోర్టు ఇచ్చినా పట్టించుకోకుండా మూడు రాజధానుల బిల్లును ఎలా ఆమోదిస్తారని రైతులు ప్రశ్నించారు. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని రైతులు హెచ్చరించారు. అయితే, అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి రైతులు... అసెంబ్లీని ముట్టడించే అవకాశముందని భావిస్తున్న పోలీసులు.... నలువైపులా మోహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం జంక్షన్ దగ్గర పెద్దఎత్తున బలగాలను పెట్టారు. అలాగే, సచివాలయం వెనుక వైపు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసుల దౌర్జన్యకాండ... అమరావతి పొలాల్లో ఘోరం...

అమరావతి రణరంగాన్ని తలపిస్తోంది. పోలీసుల దౌర్జన్యాలతో 29 గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నెలరోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. అమరావతి కోసం తరలివస్తోన్న రైతులు, మహిళలు, పిల్లలపై పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారు. లాఠీలతో గొడ్డును బాదినట్లు బాదేస్తున్నారు. దాంతో, పలువురు రైతులు, వృద్ధులు, మహిళలకి రక్తం కారేలా గాయపడుతున్నారు. ఇక, ఛలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అమరావతి పొలాలు యుద్ధ రంగాన్ని తలపించాయి. ఆంక్షలను సైతం లెక్కచేయకుండా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన అమరావతి ప్రజలపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవాళ్లను దొరికినట్లు చితక్కొట్టారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పొలాల్లోనే తరిమితరిమి కొట్టారు. మహిళలు, వృద్ధులని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీలు విరిగేలా కసితీరా కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. అంతేకాదు పలువురు బట్టలు చింపేశారు. మహిళలనైతే ఈడ్చిపడేశారు. దాంతో, వందలాది మంది రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల దౌర్జన్యంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక అమరావతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుళ్లూరు, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, దొండపాడు, ఉద్దండరాయునిపాలెం, మందడం తదితర గ్రామాల్లో అయితే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవరైనా అసెంబ్లీ వైపు వస్తున్నట్లు కనిపిస్తే చాలు తరిమితరిమి కొడుతున్నారు. అయితే, రక్తమోడినా, తీవ్ర గాయాలైనా, అమరావతి రైతులు, మహిళలు, వృద్ధులు, యువకుల పట్టుదల ముందు పోలీసుల ఆంక్షలు ఓడిపోతున్నాయి. అమరావతిని రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ ముందుకు కదులుతోన్న రైతులు, మహిళలను చూసి పోలీసులు సైతం బిక్కమొహం చేస్తున్నారు.

గల్లా జయదేవ్ పై పోలీసుల దౌర్జన్యం... అర్ధరాత్రి వరకు నరకం చూపిస్తూ... చివరికి సబ్ జైలుకు...

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ వైపు వచ్చిన గల్లా జయదేవ్ పై పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో, పోలీసులు-గల్లా జయదేవ్ మధ్య పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో గల్లా జయదేవ్ చొక్కా సైతం చిరిగిపోయింది. అయితే, గల్లా జయదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నర్సరావుపేట, రొంపిచర్ల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. అంతేకాదు చిరిగిపోయిన చొక్కా మార్చుకునేందుకు కూడా ఇబ్బందులు పెట్టారు. దాంతో, పోలీస్ స్టేషన్లో చిరిగిన చొక్కా విప్పి జయదేవ్ నిరసన తెలిపారు. ఆ తర్వాత రొంపిచర్ల పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు.... అర్ధరాత్రి వరకూ పోలీస్ వాహనంలోనే కూర్చోబెట్టి నరకం చూపించారు.  అయితే, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ వైపు వచ్చిన గల్లా జయదేవ్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాంతో, జయదేవ్ ను అర్ధరాత్రి మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అయితే, గల్లా జయదేవ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడమే కాకుండా, సబ్ జైలుకు తరలించారన్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు పెద్దఎత్తున జైలు దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలిపే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, గల్లా జయదేవ్‌తోపాటు పలువురు రైతులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ విజయరావు తెలిపారు. జయదేవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో... పోలీసులపై రాళ్లు రువ్వారని... దాంతో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ వివరించారు.

చేతులెత్తి వేడుకుంటున్నా... అమరావతిని మార్చొద్దు....

మూడు రాజధానుల బిల్లును టీడీపీ అధినేత, అపోజిషన్ లీడర్ చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ సీఎం జగన్ కు చేతులెత్తి వేడుకున్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ వెళితే రాష్ట్రానికి మంచిది కాదని సూచించారు. అయితే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతుండగా ప్రసంగానికి ఆటంకం కలిగించిన టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటేశారు. దాంతో, చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజంటూ మండిపడ్డారు. అయితే, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడ్డ అమరావతి రైతులను పరామర్శించేందుకు ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులకు సంఘీభావంగా పాదయాత్రగా వెళ్తున్న చంద్రబాబును అదుపులోకి తీసుకుని పీఎస్ కి తరలించారు. దాంతో, అర్ధరాత్రి కూడా అమరావతి గ్రామాల్లో అలజడి కొనసాగింది. అమరావతి పోరాటం ఇంతటితో ఆగదని చంద్రబాబు అన్నారు. ఏపీని కాపాడుకోవడం కోసం సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. టీడీపీ నేతలు, అమరావతి రైతులపై పోలీసుల దౌర్జన్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు... అక్రమ కేసులతో హింసిస్తున్నారని ఆరోపించారు.

మాట నెగ్గించుకున్న జగన్... 3 రాజధానుల బిల్లు ఆమోదం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాననుకున్న మాటే నెగ్గించుకున్నారు. నెల రోజులకు పైగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నా, విపక్షాలు వద్దంటున్నా వినిపించుకోకుండా... మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... అమరావతిలో శాసన రాజధాని... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్... ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి-పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చిన జగన్ ప్రభుత్వం... శాసనసభలో సుదీర్ఘంగా చర్చించింది. రాత్రి 11గంటల వరవకు శాసనసభను నిర్వహించిన ప్రభుత్వం.... సుదీర్ఘ చర్చల తర్వాత ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా చారిత్రాత్మక బిల్లులంటూ కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.  

పవన్ ని లెక్కచేయని రాపాక.. జగన్ కి జై కొట్టి, పక్కన కూర్చొని కబుర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ షాకిచ్చారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఓటు వేయాలని పార్టీ అధ్యక్షుడిగా పవన్ చెప్పినా.. రాపాక ఆయన మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాని ప్రకటించిన రాపాక.. అసెంబ్లీలో కూడా అదే విషయం చెప్పారు.  అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ చేసే ప్రతిదానిని వ్యతిరేకించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలిసిందని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. మూడు రాజధానులకు ఎవరూ వ్యతిరేకంగా లేరని, అందరూ అనుకూలంగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. సీఆర్డీఏ బిల్లు రద్దుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నానని, సీఎం జగన్ ని అభినందిస్తున్నానని అన్నారు. అంతేకాదు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. అసెంబ్లీలో రాపాక నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు ఏదో విషయమై చర్చించారు. తరువాత తన స్థానానికి వెళ్లి కూర్చొన్నారు. మొత్తానికి తన పార్టీ తరఫున ఉన్న ఒక్క ఎమ్మెల్యే పవన్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాడనే చెప్పాలి.

రాజధాని నిర్ణయంతో నా భవిష్యత్ నాశనమైనా పర్లేదు.. పొలం పని చేస్కుంటా!!

ఏపీ అసెంబ్లీలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో తన రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను వైఎస్ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. సీఆర్డీఏ రద్దు, అధికార-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను స్వాగతిస్తున్నట్టు ఆర్కే తెలిపారు. ఈ మూడు రాజధానుల ప్రకటనతో తనకి రాజకీయ భవిష్యత్ ఉన్నా లేకపోయినా జగన్ వెంట నడుస్తానని అన్నారు. రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే ఉంటా. రాజకీయాల్లో లేకపోతే నా పొలంలో ఉంటానని ఆర్కే స్పష్టం చేశారు. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం తమ అదృష్టమని, అమరావతికి దక్కిన గౌరవమని ఆర్కే అన్నారు. సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదని చెప్పుకొచ్చారు. రాజధాని అంటే అందరిదని, కొందరిది మాత్రమే కాకూడదని అన్నారు. రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని, అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆర్కే తెలిపారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఎంతో సంతోషించామని అన్నారు. అయితే, దాని వెనుక ఎంతో స్కామ్ జరిగిందని తెలిసి తాను ఎంతో బాధపడ్డానని ఆర్కే చెప్పారు. ప్రజలకు చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని, రైతుల ఆశలను ఆయన నీరు గార్చారని మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. రాజధాని కోసం చంద్రబాబు కష్టపడి ఉంటే తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రజలు ఎందుకు టీడీపీని ఓడించారని ఆర్కే ప్రశ్నించారు.

విమర్శల వర్షం... మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో జోరు అందుకున్న నేతల మాటలు

  తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటిలానే పోటీపడుతున్నాయి. ఈ సారి బీజేపీ కూడా పోటీలో ఉంది. మునిసిపాలిటీలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు ఎవరికి వారు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రచారానికి మరి కొన్ని గంటల్లో గడువు ముగుస్తుండడంతో ముఖ్య నాయకులు కూడా రంగం లోకి దిగుతున్నారు. అధికార పార్టీ మంత్రులు కూడా నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలకు పరిమితమయ్యారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ శివారు మునిసిపాల్టీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకరి పై ఒకరు మాటల తూటాలు విసురుతున్నారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలు దారం తెగిన గాలిపటాలన్న ఆయన 57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే పెన్షన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ డీల్లీలో లేదు.. గల్లీల్లో లేదు.. అలాంటి పార్టీకి ఓట్లేసి ప్రయోజనం లేదని విమర్శించారు.టీఆర్ఎస్ అధికారం లోకి వచ్చిన తర్వాత మునిసిపాలిటీలకు ఒరిగిందేమి లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు, నల్గొండ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. మునిసిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫెయిలయ్యారని ఆరోపించారు. మరోవైపు రాష్ర్టానికి కేంద్రం నిధులేవి ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు కిషనరెడ్డి, కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయే తెలంగాణ సర్కార్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ తమ అస్త్ర శస్త్రాలకు పదునుపెట్టాయి. అందరూ ఎవరికి వారు తమదే గెలుపని అనుకుంటున్నారు.. ఇక ప్రజల తీర్పే మిగిలి ఉంది.

ఈ మనిషికి నిద్ర ఎలా పడుతోంది?.. జగన్ పై ఫైర్!!

రాజధాని అంశంతో ఏపీ వాతావరణం వేడెక్కింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశ పెట్టడంతో.. రాజధాని ఉద్యమం మరింత ఉధృతమైంది. రైతులు, మహిళలు.. అరెస్టులు, లాఠీ దెబ్బలు లెక్కచేయకుండా.. పోరాడుతున్నారు. ప్రస్తుతం అమరావతి ఆందోళనతో అట్టుడుకుతోంది. అయితే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీలో ప్రశాంతంగా నిద్ర పోతున్నారంటూ.. టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. "ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే... మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే... ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?" అని లోకేష్ మండిపడ్డారు.

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ గల్లాని చొక్కా పట్టి లాగి అరెస్ట్!!

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతులు అసెంబ్లీ కాంప్లెక్స్‌ను నలువైపులా చుట్టుముట్టారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా దూసుకెళ్లేందుకు రైతులు యత్నించారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కూడా పోలీసులు దాడికి దిగారు. గల్లా చొక్కాను చించారు. గల్లాను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పోలీసులు ఆయనను లాగడంతో ఆయన చొక్కా చిరిగిపోయింది. దీంతో పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని అన్నారు. మహిళలను విచక్షణారహితంగా పోలీసులు కొడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ పోరాటాన్ని ఆపలేరని గల్లా స్పష్టం చేశారు.

లోకేష్ ఫైర్.. అమరావతిని పాకిస్థాన్ బోర్డర్ చేసిన వైసీపీ ప్రభుత్వం

అమరావతి రాజధాని తరలింపు పై ప్రభుత్వానికి ఇంత పట్టుదల ఎందుకని.. ఇంటికి పది మంది పోలీసులు కాపలాగా ఉండటం తగదని.. అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు మాజీ మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన వరుస ట్వీట్ లు చేశారు. ఈ రోజున పాకిస్థాన్ బోర్డర్ ను తలపించేటువంటి రీతిలో అమరావతిని మార్చారని ప్రధానంగా లోకేష్ విమర్శించారు.పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, మహిళలు రోడ్ల పైకి వచ్చి పెద్ద ఎత్తున ఒక రాష్ట్రం ఒక రాజధాని జై అమరావతి అని చాలా రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారని దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని లోకేష్ తెలియజేశారు. 2014 లో హైదరాబాద్ లో జరిగిన శాసన సభలో జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని రాజధానిగా అంగీకరించి ఇప్పుడు నిరాకరించడం మంచిది కాదని లోకేష్ వెల్లడించారు.  జగన్ గారు అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించాలి.. కానీ గత ఎనిమిది నెలలుగా ఆ ప్రాంతానికి కేటాయించింది సున్నా అని కేవలం ఒక్క పులివెందుల నియోజకవర్గానికే మూడు వేల కోట్లు కేటాయించం పట్ల లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపూర్ కి కియా మోటార్స్ ని, చిత్తూరు జిల్లాకి సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలని తీసుకురావటం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిషరీస్ ని పెద్దెత్తున ప్రోత్సహించటం.. విశాఖపట్నంకి ఐటీ పరిశ్రమలను తీసుకురావటం.. ఒక పెద్ద పేపర్ ఇండస్ట్రీ అయిన ఏషియన్ పేపర్ ను ప్రకాశం జిల్లాకు తీసుకురావటం ఇవన్నీ అభివృద్ధి వికేంద్రీకరణ చర్యలుగా ప్రభుత్వానికి కనిపించలేదా అని లోకేష్ నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిందంటే కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. అవగాహన లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అభివృద్ధి కొరకై వచ్చిన పరిశ్రమలను పంపిస్తే అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడ జరుగుతుందని లోకేష్ ఆరోపించారు.

వేడెక్కిన ఏపీ అసెంబ్లీ... 'బ్యాడ్ మార్నింగ్'తో స్పీకర్ కి స్వాగతం

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అనంతరం వికేంద్రీకరణ బిల్లుపై చర్చను మంత్రి బుగ్గన ప్రారంభించారు.  బుగ్గన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహల్ వంటి భవనాలు అవసరం లేదు. ప్రజలెవరూ రాజభవనాలు కోరుకోవట్లేదు. ప్రజలకు కావాల్సింది వసతులు, భద్రత అని అన్నారు. ఇది చారిత్రాత్మక బిల్లు. అమరావతిలోనే లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో రాజ్‌భవన్‌, సచివాలయం. కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని. పరిపాలన అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ బిల్లు.' అని బుగ్గన తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగింది.  మరోవైపు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ... 'ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారు కానీ.. ఇలా బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలం' అని ఎద్దేవా చేశారు.

చరిత్రలో ఇవాళ బ్లాక్‌ డే.. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు

ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదిస్తూ హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఒప్పుకోబోమని చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఇవాళ బ్లాక్‌ డే అని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని, 33రోజులుగా ఆందోళన చేస్తున్నా మొండిగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. భావితరాల కోసం పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని చెప్పారు. రాష్ట్రం మొత్తం అనధికారికంగా కర్ఫ్యూ విధించారని, ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, అరెస్ట్‌లు చేస్తున్నారని దుయ్యబట్టారు. అరెస్టులు చేయించడమనేది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇంతగా బందోబస్తు పెట్టలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని చంద్రబాబు స్పష్టం చేశారు.

స్పీకర్ వార్నింగ్... అయినా తగ్గేది లేదంటున్న జేఏసీ...

అమరావతి పరిరక్షణ సమితి, విపక్షాలు పిలుపునిచ్చిన ఛలో అసెంబ్లీ, జైల్ భరోపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అసెంబ్లీని ముట్టడిస్తాం... కట్టడి చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. చట్ట సభలను అడ్డుకోవడం, ముట్టడికి పిలుపునివ్వడం సభా హక్కులు, రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని స్పష్టంచేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనాసరే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టసభల్లోకి అగంతకులు ప్రవేశించకూడదనే నియమ నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే, నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ అవి చట్టాలకు లోబడే ఉండాలని సూచించారు. ముట్టడిస్తాం, కట్టడి చేస్తామంటే అది చట్టసభలనే హెచ్చరిస్తున్నట్లుగా ఉందని, ఇది మంచి పద్ధతి కాదని స్పీకర్ సీతారాం వ్యాఖ్యానించారు. అయితే, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినాసరే అసెంబ్లీని ముట్టడించి తీరుతామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు అంటున్నారు. ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరతామని ప్రకటించిన జేఏసీ నేతలు...  అరెస్టులు చేసినాసరే తమ పోరాటాన్ని ఆపేది లేదన్నారు.

అమరావతిలో యుద్ధ వాతావరణం... జైల్ భరోతో టెన్షన్ టెన్షన్....

ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది. మూడు రాజధానుల ప్రతిపాదన, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక బిల్లులను ఉభయసభల్లో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే, అమరావతి ఆందోళనలు పెద్దఎత్తున సాగుతుండటంతో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి, విపక్షాలు కలిసి ఛలో అసెంబ్లీ, జైల్ భరోకి పిలుపునివ్వడంతో ఆంక్షలు విధించారు. కేబినెట్ మీటింగ్, అలాగే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పరిసరాల్లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి ఉన్నందున ఆంక్షల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు, అమరావతి పరిరక్షణ సమితి, వివిధ రాజకీయ పార్టీలు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని విజయవాడ సీపీ తెలిపారు. అలాగే, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినాసరే అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించి తీరుతామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని జగన్ ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని కొనసాగించాలని పోరాటం చేస్తున్న మహిళలపై పోలీసులతో దాడులు చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ముట్టడిని విఫలంచేసేందుకు అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం అన్యాయమన్నారు. పోలీసుల అణచివేత చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో కూడా ఇంతటి నిర్బంధం లేదని చంద్రబాబు విమర్శించారు. నిరసన తెలిపే హక్కు కూడా ప్రజలకు లేదా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మూడు రాజధానులకే ఓటు

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం ఏడు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అంశంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. విశాఖకు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు కేటాయింపుకు నిర్ణయించింది. అమరావతిలో అసెంబ్లీ కొనసాగించేలా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల 15 ఏళ్లకు పెంచేలా.. పలు నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశంపై విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది. అదేవిధంగా పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు, 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

జగన్ ప్రభుత్వానికి మండలి గండం... ఇప్పటికిప్పుడు గట్టెక్కాలంటే కష్టమే...

జగన్ ప్రభుత్వాన్ని మండలి గండం వెంటాడుతోంది. 151 సీట్లతో శాసనసభలో తిరుగులేని బలాన్ని కలిగివున్న వైసీపీ సర్కారుకు ....శాసనమండలిలో మాత్రం మెజారిటీ లేదు. దాంతో, కీలక బిల్లుల ఆమోదం విషయంలో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. అంతేకాదు, మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో, ఏకంగా మండలినే రద్దు చేస్తామంటూ హెచ్చరికలు పంపింది జగన్ సర్కారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశాల్లో, అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు ఆమోదించకుండా మండలి తిప్పిపంపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు... అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు బిల్లులను మండలి తిప్పిపంపడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక, ఇఫ్పుడు, మరింత కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవడానికి జగన్ ప్రభుత్వం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చుతోంది. అయితే, ఇప్పుడు కూడా మండలి గండం వైసీపీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అయితే, మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ... ఈ బిల్లులను మండలిలో అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నెలరోజులకు పైగా పెద్దఎత్తున ఆందోళనలు, పోరాటం చేస్తున్న టీడీపీ.... జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో, ఈ బిల్లులకు మండలిలో ఆమోదం లభించడం కష్టమే. రాజధాని మార్పునకు సంబంధించిన బిల్లును మండలిలో తెలుగుదేశం కచ్చితంగా అడ్డుకుంటుంది. ఎందుకంటే, 58మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇక, టీడీపీకి అత్యధికంగా 26మంది సభ్యులు ఉండటంతో మండలిలో ప్రతిపక్షానిదే పైచేయిగా ఉంది. అందుకే, శాసనసభలో వైసీపీ సభ్యులు.... టీడీపీని ఆడుకున్నట్లే.... మండలిలో అధికారపక్షాన్ని... తెలుగుదేశం వాళ్లు ఆటాడుకుంటున్నారు. దాంతో, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.  రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు లాంటి బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకోవడం ఖాయం కావడంతో... వాటిని గట్టెక్కించడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్జనభర్జనలు పడుతున్నారు. బిల్లుల ఆమోదంపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఇఫ్పటికే పార్టీ పెద్దలు, మంత్రులతో చర్చించిన సీఎం జగన్... మండలి గండంపై మాత్రం తీవ్రంగా చర్చిస్తున్నారు. ఒకవేళ మండలిలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలన్నదానిపై దృష్టిసారించారు. అయితే, అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై గోప్యత పాటిస్తోన్న జగన్ ప్రభుత్వం.... మండలి గండాన్ని తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తోంది. ఒకవేళ బిల్లులను మండలి సెలెక్ట్ కమిటీకి పంపితే నెలా రెండు నెలలు సమయం పడుతుంది. అలా కాకుండా సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి శాసనసభకు పంపితే... మరోసారి తీర్మానం చేసి మండలికి పంపాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నెల సమయం పడుతుంది. అయితే, రెండోసారి కూడా మండలి తిరస్కరిస్తే... ఆ తర్వాత శాసనసభ నిర్ణయమే ఫైనలవుతుంది. మరి, మండలి విషయంలో ఏ ఆప్షన్ ను జగన్ ప్రభుత్వం ఎంచుకుంటుందో చూడాలి.

పేరుకే జనసేన ఎమ్మెల్యే... వాయిస్ మాత్రం వైసీపీదే... పవన్ మాటను లెక్కచేయని రాపాక... 

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పదేపదే తన బాస్ పవన్ కల్యాణ్ కు షాకిస్తున్నారు. పార్టీ స్టాండ్ కు భిన్నంగా వ్యవహరిస్తూ స్వతంత్రంగా ముందుకెళ్తున్నారు. పవన్ మాట ఒకటైతే... రాపాక వాయిస్ మరోలా ఉంటోంది. పేరుకే జనసేన ఎమ్మెల్యే... కానీ వాయిస్ మాత్రం వైసీపీదే...అన్నట్లుగా రాపాక వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని పవన్ వ్యతిరేకిస్తే... రాపాక సమర్ధించారు. అసెంబ్లీ లోపలా బయటా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతుగా మాట్లాడారు. ఇక, ఇప్పుడు మూడు రాజధానుల అంశంలోనూ పవన్ తో రాపాక విభేదించారు.  మూడు రాజధానులను పవన్ వ్యతిరేకిస్తుంటే, అందుకు భిన్నంగా రాపాక వ్యవహరిస్తున్నారు. ఒకవేళ, మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓటేస్తానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నవేళ... పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ్యవహరించడంపై పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తుంటే, రాపాక మాత్రం పార్టీ స్టాండ్ కు భిన్నంగా ప్రవర్తించడంపై జనసేనాని మండిపడుతున్నారు. మరి, రాపాక విషయంలో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.