జనసేన-బీజేపీ మైత్రితో జగన్ కి తిప్పలు తప్పేలా లేవు!!

జనసేన-బీజేపీ కలయికపై మౌనం వహించాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఈ పరిణామం పై స్పందించరాదని నిర్ణయించింది. అయితే వాటి చెలిమి సీఎం జగన్ మోహన్ రెడ్డికే తలనొప్పులు తెచ్చిపెడతుందని అంచనా వేస్తోంది. రాజధాని తరలింపు.. అక్రమాస్తుల కేసుల విషయంలో ఆయనకు ఇబ్బందులు ఎదురుకావచ్చు అని భావిస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో జనసేన బిజెపి పొత్తు ప్రస్తావనకు వచ్చింది. అయితే జరగబోయేది కొంత కాలం వేచి చూద్దామని అప్పటి వరకు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించాలని సమావేశంలో అభిప్రాయపడింది. రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున పరస్పర విమర్శలతో ఉద్యమం పక్కదారి పడుతుందని భావించి.. అందువల్ల తామే కొంత నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నట్టు టిడిపి నేతలు చెబుతున్నారు.  అమరావతి విషయంలో జనసేన, బిజెపి కలిసి ఉద్యమం చేపట్టే అవకాశముందని అంటున్నారు. బిజెపి సొంతంగా ఉద్యమం చేపట్టటమంటే రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్లేనని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని మార్పిడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం అంత తేలిక కాదని చాలా అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు. రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతుందని టిడిపి సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. జగన్ కేసుల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని మరో టీడీపీ నేత అన్నారు. తన కేసులో విచారణ జాప్యం కావడానికి జగన్ ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం పొందారని.. ఆ సహకారం ఆగిపోతే కేసుల విచారణలో వేగం పెరిగే అవకాశముందన్నారు. విచారణ త్వరగా ముగిస్తే శిక్షలు కూడా ఖాయం. జనసేనతో కలిసి బలపడాలనుకునే రాజకీయ పార్టీగా బిజెపి ఈ దిశగా పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతుంది.

మూడు రాజధానులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు... జగన్ వైఫల్యం కావొచ్చేమోనంటూ..! 

ఆమధ్య ట్విట్టర్ చిట్ చాట్ లో ఏపీ రాజధాని వివాదంపై సమాధానం దాటవేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.... ఇఫ్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడేమో ఏపీ రాజధాని వివాదం ఆంధ్రులకు సంబంధించిన విషయమంటూ తప్పించుకున్న కేటీఆర్... ఇప్పుడు మూడు రాజధానుల రగడపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక రాష్ట్రంలో రవ్వంత కూడా వ్యతిరేకత రాలేదన్నారు. అప్పుడున్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించామని గుర్తుచేశారు.  అయితే, ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనపై ఎందుకు వ్యతిరేకత వస్తోందో ఆలోచించుకోవాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత అమరావతి రైతులు, ప్రజలు, ఆయా పార్టీలు పెద్దఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, విమర్శలు ఎందుకు చేస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.  అయితే, తెలంగాణలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ ఒప్పించి మెప్పించి ముందుకెళ్లారని కేటీఆర్ అన్నారు. అందుకే, తెలంగాణలో 33 జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటైనా ఎక్కడా చిన్న ఆందోళన జరగకుండా విజయవంతంగా పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవిధంగా చెప్పాలంటే కేటీఆర్ వ్యాఖ్యలు... జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపాయని అంటున్నారు. అమరావతి గ్రామాల్లో ఇంత పెద్దఎత్తున ప్రజాగ్రహం వెల్లువెత్తడమంటే అది జగన్ ప్రభుత్వ వైఫల్యమేనన్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు.

పాలమూరు మంత్రుల్లో గుబులు... ఒక్కటి చేజారినా పదవి పోయినట్లే..!

మున్సిపాలిటీల్లో గెలవకపోతే మంత్రి పదవులు ఊడుతాయంటూ గులాబీ బాస్ చేసిన హెచ్చరిక మంత్రులకు దడ పుట్టిస్తోంది. దాంతో, కేసీఆర్ వార్నింగ్ ను సవాల్ గా తీసుకుంటున్న మంత్రులు... పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పట్టువదలని విక్రమార్కుల్లా పనిచేస్తున్నారు. తలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని... పంచుకుని అభ్యర్థుల గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍ హెచ్చరిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు సవాల్ మారింది. ఉమ్మడి జిల్లాలోని 17 పురపాలికల గెలుపు బాధ్యతంతా వీరిద్దరిపైనే పడింది. ఏ ఒక్క పురపీఠం చేజారినా వేటు తప్పదన్న భావనతో ఇద్దరు మంత్రులు తమ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అయితే, టికెట్లు దక్కనివారిని బుజ్జగించడం, వర్గ విభేదాలను క్లియర్ చేయడం పెద్దతలనొప్పిగా మారింది. ఇక, పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్ నగర్ లో పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ టీఆర్‍ఎస్‍ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీకి మంచి ఓట్లు రావడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుండెల్లో గుబులు నెలకొంది. ఇక, మంత్రి నిరంజన్‍ రెడ్డి నాగర్‍కర్నూల్‍ పార్లమెంటు సెగ్మెంట్ కే పరిమితమయ్యారు. వనపర్తి, కొల్లాపూర్‍, అలంపూర్‍ మున్సిపాలిటీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‍రెడ్డిపై వదిలిపెట్టారు. గద్వాల్ లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‍రెడ్డితో ఉన్న విబేధాల కారణంగా అటువైపు మంత్రి నిరంజన్ రెడ్డి చూడడంలేదని తెలుస్తోంది. నాగర్ కర్నూల్, గద్వాల మున్సిపాలిటీలు వదిలేసి వనపర్తి, అలంపూర్, ఐజ, కొల్లాపూర్‍ లో టీఆర్ ఎస్ గెలుపు కోసం నిరంజన్ రెడ్డి శ్రమిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు మంత్రులు ఎన్ని మున్సిపాల్టీల్లో గులాబీ జెండా ఎగరవేసి అధిష్టానానికి గిఫ్ట్ ఇస్తారోనన్న చర్చ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్త్రతంగా చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ కు పట్టిన గతే వైసీపీకీ పడుతుంది... జగన్ కు రాజకీయ సన్యాసమే...

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు పట్టిన గతే.... మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత వైసీపీకి పడుతుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చితే వైసీపీ మునిగిపోవడం ఖాయమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు తర్వాత వైసీపీ పతనం ప్రారంభమవడం ఖాయమన్నారు. అలాగే, దుర్మార్గపు ఆలోచనలు, నియంతృత్వ పోకడలతో జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతారని నిమ్మల కిష్టప్ప జోస్యం చెప్పారు. ఏవిధంగా చూసినా అన్ని ప్రాంతాలకు విశాఖ అనువైనది కాదని అన్నారు. అందుకే, అమరావతిని మార్చొద్దంటూ మంత్రులైనా జగన్ కు నచ్చజెప్పాలని సూచించారు. విశాఖపట్నం రాజధానిగా అనువైనది కాదని మంత్రివర్గ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి మంత్రులంతా చెప్పాలన్నారు. లేదంటే, మూడు రాజధానుల రగడ వైసీపీని కచ్చితంగా ముంచేస్తుందని నిమ్మల కిష్టప్ప హెచ్చరించారు.  

రాజధాని మార్పు ఫిక్స్... రైతులకి జగన్ సర్కార్ ఆఫర్స్!!

రాజధాని విభజన వ్యవహారం తుది అంకానికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మూడు సార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ.. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో సమావేశమైంది. ఈ మీటింగ్ లో అనేక అంశాలపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక పక్క రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్నా.. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుతమున్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో అమరావతి డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసే దిశగా తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.  ఇక ల్యాండ్ పూలింగ్ రైతులకు గత ప్రభుత్వం ఇస్తానన్న రిటర్నబుల్ ప్లాట్ల అంశాలపైన సీఎంతో భేటీలో హైపవర్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశంపైన కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ప్లాట్లు వద్దనుకునే రైతులకు భూమిని తిరిగి ఇవ్వాలన్న ప్రతిపాదనపైన భేటీలో చర్చించారని తెలుస్తోంది. వీలుంటే గతంలో వారిచ్చిన భూమిని తిరిగిచ్చేయాలని.. కుదరని పక్షంలో అందుబాటులో ఉన్న వేరే భూమి కేటాయించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  మరోవైపు అమరావతి రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇక రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి విషయంలో సీఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ తరహా ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వడం సాధ్యం కాదన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రైతుల అభ్యంతరాలను సీఆర్ డీఏ ద్వారా సేకరించే పనిలోపడ్డ ప్రభుత్వం వచ్చిన వినతుల ఆధారంగా తుది నిర్ణయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.మరో వైపు ఈ నెల 20 వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మూడురోజులపాటు జరిగే సమావేశాల్లోనే రాజధానిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

అమరావతిని మార్చడం జగన్ తరంకాదు... రంగంలోకి దిగిన బీజేపీ...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. సంక్రాంతికి ముందు జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజధాని తరలింపును అడ్డుకుంటామంటూ తీర్మానం చేయగా, ఇక ఇప్పుడు అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చనివ్వబోమంటూ తేల్చిచెప్పింది. అసెంబ్లీ బలముంది కదా అని ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటానంటే ఊరుబోమని జగన్ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ హెచ్చరించింది. ఏపీ రాజధానిగా ఆనాడు అసెంబ్లీ లోపలా బయటా అమరావతిని ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఇఫ్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుందన్నారు. ఒకవేళ జగన్ ఏకపక్షంగా ముందుకెళ్తే వైసీపీ ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని ఏపీ బీజేపీ నేతలు అల్టిమేటం ఇచ్చారు.  ఏపీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోకుండా నియంత మాదిరిగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటానంటే కుదరదని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని తేల్చిచెప్పిన కన్నా... జనసేనతో కలిసి ఉమ్మడి పోరాటాలు చేస్తామని తెలిపారు. పీపీఏలు, పోలవరం అంశాల్లో జగన్ అనుకున్నట్లు జరగలేదని, ఇఫ్పుడు రాజధాని విషయంలోనూ అదే జరుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అసెంబ్లీ 151 సీట్ల బలముందని...ఏమైనా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరంటూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అమరావతి విషయంలో ప్రజాపోరాటాలు చేస్తామని, అవసరమైతే న్యాయపరంగా కూడా ముందుకెళ్తామన్నారు. ఏదిఏమైనాసరే వైసీపీ పాలకులు అమరావతిని మాత్రం కదల్చలేరని తేల్చిచెకప్పారు.  కుటుంబ జోక్యం, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోతోందని ఏపీ బీజేపీ నేతలు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి-స్వర్గం చూపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి... కుటుంబం, కులానికి ప్రాధాన్యతనిస్తూ... అవినీతి అరాచకాలతో పాలన సాగిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. అలాగే, ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి పెట్టుబడి పెట్టినవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అయితే... వైసీపీ పెట్టుబడిదారుల బారిన రాష్ట్రం పడకుండా అడ్డుకుంటామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటించారు. ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ కూడా జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఏపీకి కులం, కుటుంబం, అవినీతి, అరాచకమనే గ్రహణాలు పట్టాయని.... వాటిని జాతీయవాదం, ప్రజాసంక్షేమమనే ఆయుధాలతో ఓడిస్తామన్నారు.

జగన్ కు మరో ఎదురుదెబ్బ... మళ్లీ షాకిచ్చిన సీబీఐ కోర్టు...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో మరోసారి జగన్ కు చుక్కెదురైంది. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న రెండు విజ్ఞప్తులను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే, సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలని, అలాగే ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఇరువర్గాల సుదీర్ఘ వాదనల తర్వాత డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇక, పెన్నా ఛార్జిషీట్లో అనుబంధ అభియోగపత్రంపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు నెక్ట్స్ హియరింగ్ ను జనవరి 24కి వాయివా వేసింది. ఈ కేసులో నిందితులంతా హాజరుకాగా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం మినహాయింపు లభించింది. ఇవాళ్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను న్యాయస్థానం అంగీకరించింది.

మునిసిపల్ ఎన్నికలు.. కొత్త తరహా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు

మునిసిపల్ ఎన్నికల వేళ పార్టీలు కొత్త ప్రచార ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. ఇన్నాళ్లు రోడ్ షోలు.. బహిరంగ సభలతో అదరగొట్టిన నేతలు ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని చానళ్లు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. అలా టీఆర్ఎస్ లో జోష్ నింపడమే కాకుండా పార్టీ పరంగా ఎలా ముందుకు వెళతామో స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా నిర్వహించాలి.. ఓట్లను ఎలా కలపాలి అనే విషయాల పై అభ్యర్థులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు.  కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా అభ్యర్థుల నుంచి కెటిఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రామగుండం, మిర్యాల గూడ, నల్గొండ జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులతో పాటు మహిళల క్యాండిడేట్ లతో మాట్లాడారు కేటీఆర్. స్థానికంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేయాలని సూచించారు. ఇటు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో కార్యకర్తలతో మాట్లాడారు. ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తూ స్థానిక యువతని ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. మొత్తానికి ప్రధాన పార్టీలు సోషల్ మీడియా బాట పట్టాయని చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికల ట్రెండ్స్ ను చెప్పకనే చెప్తున్నాయి.

క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి.. అయినా వీడని సస్పన్స్!!

ఊహించిందే జరిగింది. నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. అంతేకాదు, నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని కూడా హోంశాఖ రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి ఎక్కువ సమయం తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడం ఖాయమైంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించాక 14 రోజుల గడవుతో దోషులను ఉరి తీయాలనే నిబంధనలున్నాయని న్యాయవాదులంటున్నారు. ఈ నేపథ్యంలో, 22న ఉరిశిక్ష అమలవుతుందా? లేక మరి కొన్ని రోజులు పడుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

జూపల్లి తీరుపై కేసీఆర్ సీరియస్... పార్టీ నుంచి సస్పెండ్!!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్ లో చిచ్చు రాజేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు వివాదాస్పదంగా మారింది. పార్టీ అధిష్టానం ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన ఇండిపెండెంట్లను బరిలోకి దింపారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో 20 మంది ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. వీరంతా జూపల్లి వర్గమని తెలుస్తోంది. అంతేకాదు, జూపల్లి నిలబెట్టిన అభ్యుర్థులకే ఓట్లు వేయాలంటూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 20 వార్డుల్లో జూపల్లి వర్గీయులు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. జూపల్లి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, ప్రచార రథాలతో సందడి చేస్తున్నారు.  దీంతో కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో.. టీఆర్‌ఎస్‌లోని ఇరువర్గాల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కొల్లాపూర్‌ పట్టణంపై ఆధిపత్యం సాధించేందుకు స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇరువురు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే ఈ టీఆర్ఎస్ నేతల వర్గపోరు తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. మరోవైపు జూపల్లి తీరుపై టీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష పిటిషన్‌.. నిర్భయ దోషులకు ఉరి ఎప్పుడు?

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిని ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ గత మంగళవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు తాము ఉరిశిక్ష అమలు చేయబోమని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. క్షమాభిక్ష పిటిషన్‌ గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఈ పిటిషన్ పై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ మధ్యనే ఓ సందర్భంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని క్షమించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీంతో క్షమాబిక్ష పిటిషన్ ని రాష్ట్రపతి తిరస్కరించడం ఖాయమని అర్ధమవుతోంది. అయితే ఆయన తిరస్కరించినా కూడా 22 తేదీన ఉరి తీయకపోవచ్చని అంటున్నారు. నిబంధనల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాబిక్ష తిరస్కరణ తరువాత 14 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.

జగన్ అక్రమాస్తుల కేసు... సీబీఐ కోర్టుకి రాజకీయ ప్రముఖులు

హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం కోర్టుకు ఏ2 నిందితుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తదితరులు హాజరయ్యారు. సీబీఐ కోర్టుకు గత శుక్రవారం జగన్ హాజరైన విషయం తెలిసిందే. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ వేశారు. అలాగే ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలని కూడా గత వారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. నేటికి విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి పలువురు ప్రముఖులు ఈరోజు కోర్టుకి హాజరయ్యారు. మరి సీబీఐ కోర్టు ఏం చెప్పనుంది? జగన్‌కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

నేడు విచారణకు రానున్న సైకో శ్రీనివాసరెడ్డి కేసు.. ఉరిశిక్ష వేస్తారా?

నల్గొండ జిల్లా హజీపూర్ సీరియర్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు ఈరోజు విచారణకు రానుంది. హజీపూర్‌లో గతేడాది వెలుగులోకి వచ్చిన బాలికల వరుస హత్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలికలను హత్యాచారం చేసి పొలంలోని పాడుబడిన బావిలో కప్పెట్టాడు. ఈ విషయం చాలా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా కలకలం రేపింది. నిందితుడు శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాదనలు కూడా ముగిశాయి. ఈ హత్యలను శ్రీనివాసే చేశాడని చెప్పేందుకు పక్కా ఆధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే కోర్టుకు నివేదించారు. నిందితుడికి ఉన్న నేరచరిత్ర దృష్ట్యా ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి, అతనికి మరణశిక్ష విధించాలని గత విచారణలో ఆయన కోర్టును కోరారు. నిందితుడి తరపు న్యాయవాది మాత్రం బాలికల వరుస హత్యలకు, తన క్లైంట్‌కు సంబంధం లేదన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జనవరి 17 కి వాయిదా వేసింది. ఈరోజు తిరిగి విచారణ ప్రారంభం కానుండడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆ సైకో కిల్లర్ కి ఉరిశిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

బీజేపీ-జనసేన దోస్తీ.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది

బీజేపీ-జనసేన పార్టీ నేతల సమావేశం ముగిసింది. ఏపీలో బీజేపీ- జనసేన పార్టీ కలిసి పనిచేయనున్నాయని అధికారిక ప్రకటన వచ్చింది. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోదీని ఇష్టపడేవారు, జనసేన భావజాలాన్ని మెచ్చినవారంతా ఒక గూటికిందకు వచ్చామని తెలిపారు.  టీడీపీ, వైసీపీల ప్రభుత్వాలతో ప్రజలు విసిగి పోయారని.. ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఆ ప్రత్యామ్యాయమే బీజేపీ-జనసేన అని చెప్పారు. 2024లో ఏపీలో బీజేపీ-జనసేనల ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ, అవినీతి, నిరంకుశ పాలనను ప్రక్షాళన చేసే విధంగా తమ పొత్తు పని చేస్తుందని పవన్ తెలిపారు. రాజధానిపై ఐదు కోట్ల ప్రజలు పెట్టుకున్న ఆశలను వైసీపీ వమ్ము చేసిందని ఆరోపించారు. ఏపీ రక్షణ కోసం తమ కూటమి పని చేస్తుందని తెలిపారు. రెండు పార్టీల మధ్య అవగాహన కోసం కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం రాష్ట్రానికి చాలా మంచిదని తెలిపారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని పవన్ చెప్పారు.

వైసీపీకి ఊహించని షాక్.. రాజధాని వ్యూహం బెడిసికొట్టింది!!

ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. అమరావతి భారీ నిర్మాణాలకు అనుకూలం కాదంటూ ఐఐటీ మద్రాస్‌ పేర్కొందని బోస్టన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అమరావతిలో ఖర్చు ఎక్కువని, భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ మద్రాస్‌ పేరుతో మంత్రులు కూడా వ్యాఖ్యలు చేశారు. కొన్ని పత్రికలలోనూ ఐఐటీ మద్రాస్‌ పేరుతో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే ఈ కథనాలను ఐఐటీ మద్రాస్‌ వర్గాలు ఖండించాయి.  రాజధానిగా అమరావతి సురక్షితం కాదని నివేదిక ఇచ్చారా అంటూ ఐఐటీ మద్రాస్‌కు రాజధాని రైతుల మెయిల్‌ చేయగా...అలాంటి నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేస్తూ ఐఐటీ మద్రాస్‌ రిప్లయ్‌ ఇచ్చింది. అమరావతి నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పడం.. నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని పేర్కొంది. అమరావతిపై అలాంటి నివేదిక ఇవ్వాలంటే మెటీరియాలజీ విభాగం ఉండాలని, తమ సంస్థలో అలాంటి విభాగమే లేదని ఐఐటీ మద్రాస్‌ వర్గాలు తెలిపాయి. దీంతో అమరావతిపై నెగెటివ్‌ ప్రచారం చేయాలన్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసికొట్టిందని అమరావతి జేఏసీ తెలిపింది. మరి దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

అమరావతి పోరాటం..  29 గ్రామాల పోరాటం కాదు.. 5 కోట్ల ఆంధ్రుల పోరాటం

అమరావతిలో దీక్షలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావాన్ని ప్రకటించారు .ఆయన కుటుంబ సభ్యులు కూడా దీక్షలో పాల్గొన్నారు. జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు చంద్రబాబు. జగన పాలనలో అభివృద్ధి కనుమరుగవుతొందని ఆయన విమర్శించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందే సమయంలో ఈ పిచ్చి తుగ్లక్ పాలనతో వచ్చే అభివృద్ధిని ఆపేసి అరాచకానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎవరైతే ఆందోళన చేస్తారో వారందరని తిడుతున్నారని, నిన్నా,మొన్న పవన్ కళ్యాణ్ ని కూడా విపరీతంగా తిట్టారని ఆయన మండిపడ్డారు.  రాజధాని కోసం జరుగుతున్న పోరాటం కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలది మాత్రమే కాదని రాష్ట్రమంతటా మద్దతు లభిస్తోందని ఆయన వెల్లడించారు. అణచాలనుకుంటే అణగిపోయే ఉద్యమం కాదని పోరుబాటలో సాగుతున్న అమరావతి రైతులను చంద్రబాబు అభినందించారు. వారు చేసే పోరాటం ఇరవై తొమ్మిది గ్రామాల పోరాటం కాదని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం చేసే పోరాటమని చంద్రబాబు తెలియజేశారు. ఈ ఉద్యమం కోసం రాష్ట్రం మొత్తం ముందుకు వస్తున్నారని, దానికి మనస్పూర్తిగా వాళ్ళని అభినందింస్తున్నానట్లు తెలియజేశారు.ఈ ఉద్యమానికి స్పూర్తి ఇచ్చింది రైతులేనని, ఈ పోరాటం ప్రారంభించిన మిమ్మల్ని సర్కార్ అణగదొక్కాలకుంటున్నట్లు తెలియజేశారు. రైతులకు ఎళ్ళప్పుడు అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులకు శ్రీకారం...

అయోధ్య కేసు అయిపోయినప్పటినుంచి అందరి ధ్యాస మందిర నిర్మాణం పైనే ఉంది. హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ తేదీలు వచ్చేశాయి. ఆలయం నిర్మాణం ఎలా చేపడతారన్న విషయాలను బయట పెట్టింది. ఆలయం నిర్మించేందుకు, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం మీద అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ రెండో తేదీ లోగా ఈ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మందిర నిర్మాణ కమిటీ లో 11 మంది విశ్వ హిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతి నిధులు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు మందిర నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో మందిరం నిర్మించాలని తలపెట్టారు. ప్రభుత్వాల నుంచి కాకుండా దేశం నలుమూలల్లో ఉన్న ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని కూడా నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఎకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులకు తేదీలు రావడం పట్ల హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే రోజు రెండు సమావేశాలు.. ఏపీ సర్కార్ ఊహించని అడుగులు!!

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటొంది. ఈ నెల 18న క్యాబినెట్ సమావేశం కాగా 20 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా రెండూ ఒకే రోజు జరిపితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది ఏపీ సర్కార్. దీని ప్రకారం 20 ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి హైపవర్ కమిటీ నివేదికను ముందుగా ఆమోదిస్తారు.11:30 నిమిషాలకు అసెంబ్లీ భేటీ జరుగుతుండగా రాజధానితో పాటు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ విషయంలో చట్ట పరంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తరలింపు విషయంలో ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాల్సిందేనన్న ఆలోచనల్లో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రాజధాని విభజన విషయంలోనూ అలాగే వికేంద్రీకరణ విషయంలోనూ కొత్త చట్టాన్ని తెచ్చే దిశగా కసరత్తు చేయడమే కాక రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించే పనిలో పడింది ఏపీ సర్కార్. ఏపీ డిజిటలైజేషన్ అంటూ ఈక్వల్ డెవలప్ మెంట్ ఆఫ్ ఓల్డ్ రీజన్స్ బెల్ ట్వంటీ ట్వంటీ పేరుతో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సూచనలు వెలువడనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల్లో వివిధ జోన్ లుగా ఏర్పాటు చేసే దిశగా కొత్త బిల్లు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రతి జోన్ కు ప్రత్యేకంగా 9 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తారు. ప్రతి బోర్డుకు ఒకరు చైర్మన్ గా వ్యవహరిస్తారు, అలాగే వైస్ చైర్మన్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రాంతీయ బోర్డులో సభ్యులుగా 1 ఎంపి, 2 ఎమ్మెల్యేలు, మరో 4 ప్రతి నిధులు వుండేలా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సదరు ప్రాంతీయ బోర్డు కార్యదర్శిగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏఏ జోన్లలో ఏఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి,ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలను, కర్ణాటక మోడల్ తరహాలో బిల్లును రూపొందిస్తున్నారు.జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా దాదాపు ఇలాంటి సూచనలే చేశాయి. కొత్త చట్టాన్ని తీసుకు రావడంతో పాటు ఇప్పటికే ఉన్న సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు అధికారులు సీఆర్డీఏ రద్దుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తే ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.

పవన్ వేస్తోన్న అడుగులతో చంద్రబాబుకి తిప్పలు!!

అమరావతి పై ఇవాళ్టి భేటీలో బీజేపీ-జనసేన పార్టీలు ఏ నిర్ణయం తీసుకోనున్నాయి అని అందరిలో ప్రశ్నల మొదలయ్యాయి. ఢిల్లీలో ఇటీవల కమలదళం పెద్దలతో భేటీ అయిన జనసేనాని బిజెపితో కలసి పోరాడేందుకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ్టి సమావేశం తర్వాత జనసేన కాషాయ సేనగా మారుతుందని భావిస్తున్నారు కొందరు నేతలు . ఢిల్లీ పెద్దల డైరెక్షన్ లోనే బీజేపీ రాష్ట్ర నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సాగాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏపిలో బిజెపి అవకాశం కోసం గట్టిగా ఎదురు చూస్తొంది, నాయకులున్నా కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతోంది బీజేపీ. పవన్ లాంటి వ్యక్తి తోడూ దొరికితే కమలం మరింత దూకుడు చూపిస్తుందంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.మూడు రాజధానుల ప్రతిపాదన అమరావతి ఆందోళనతో అట్టుడుకుతుండడంతో పొత్తుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు కొందరు నేతలు.ఏ పార్టీ అయినా బీజేపీ తోనే కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉందని,కలిసి నడిస్తే దేనినైనా సాధించవచ్చని కొందరు కాషాయ నేతలు వెల్లడిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ వైపే చూస్తున్నాయన్నాయని ఈ నేపధ్యంలో జనసేన, బిజెపి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.ఈ మేరకు ఏపీ బిజెపి నేతలు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు.  ఏపిలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం టిడిపి అధినేత చంద్రబాబుకు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇటీవల జరిగిన జనసేన విస్తృత స్థాయి సమావేశంలోనూ మెజార్టీ నేతలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా పవన్ కళ్యాణ్ ఆలోచన మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్లు సమాచారం.జనసేన బిజెపి కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపి, జనసేన బిజెపి కూటమి మధ్య చీలి పోతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.