అట్టుడుకుతున్న అమరావతి... స్తంభించిన జనజీవనం...
posted on Jan 21, 2020 @ 10:12AM
మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 35రోజులుగా నిరసనలు తెలుపుతున్న అమరావతి ప్రజలు ఇవాళ బంద్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రైతులు, మహిళలపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా బంద్ కి పిలుపునిచ్చారు. దాంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రైతులు, మహిళలకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. అలాగే, పోలీసులకు పూర్తిగా సహాయ నిరాకరణకు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. మంచినీళ్లలోపాటు ఎలాంటి ఆహార్ధాలను విక్రయించకూడదని, ఇవ్వకూడదని అమరావతి గ్రామాల వ్యాపారులు, ప్రజలు నిర్ణయించారు.
ఇక, మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. శాసనసభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన తమ పోరాటం ఆగదని అమరావతి పరిరక్షణ సమితి, అలాగే రైతులు, మహిళలు తేల్చిచెప్పారు. అమరావతి రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అమరావతి రైతులు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని హైకోర్టు ఇచ్చినా పట్టించుకోకుండా మూడు రాజధానుల బిల్లును ఎలా ఆమోదిస్తారని రైతులు ప్రశ్నించారు. వీటన్నింటికీ జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని రైతులు హెచ్చరించారు.
అయితే, అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి రైతులు... అసెంబ్లీని ముట్టడించే అవకాశముందని భావిస్తున్న పోలీసులు.... నలువైపులా మోహరించారు. సచివాలయానికి వెళ్లే మల్కాపురం జంక్షన్ దగ్గర పెద్దఎత్తున బలగాలను పెట్టారు. అలాగే, సచివాలయం వెనుక వైపు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.