గల్లా జయదేవ్ పై పోలీసుల దౌర్జన్యం... అర్ధరాత్రి వరకు నరకం చూపిస్తూ... చివరికి సబ్ జైలుకు...
posted on Jan 21, 2020 @ 9:52AM
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ వైపు వచ్చిన గల్లా జయదేవ్ పై పోలీసులు విరుచుకుపడ్డారు. దాంతో, పోలీసులు-గల్లా జయదేవ్ మధ్య పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో గల్లా జయదేవ్ చొక్కా సైతం చిరిగిపోయింది. అయితే, గల్లా జయదేవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... దుగ్గిరాల, పెదకాకాని, గుంటూరు మీదుగా నర్సరావుపేట, రొంపిచర్ల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. అంతేకాదు చిరిగిపోయిన చొక్కా మార్చుకునేందుకు కూడా ఇబ్బందులు పెట్టారు. దాంతో, పోలీస్ స్టేషన్లో చిరిగిన చొక్కా విప్పి జయదేవ్ నిరసన తెలిపారు. ఆ తర్వాత రొంపిచర్ల పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు తీసుకొచ్చిన పోలీసులు.... అర్ధరాత్రి వరకూ పోలీస్ వాహనంలోనే కూర్చోబెట్టి నరకం చూపించారు.
అయితే, నిషేధాజ్ఞలను దాటుకుని అసెంబ్లీ వైపు వచ్చిన గల్లా జయదేవ్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాంతో, జయదేవ్ ను అర్ధరాత్రి మంగళగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించారు. అయితే, గల్లా జయదేవ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడమే కాకుండా, సబ్ జైలుకు తరలించారన్న విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు పెద్దఎత్తున జైలు దగ్గరకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. నిరసన తెలిపే కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే, గల్లా జయదేవ్‌తోపాటు పలువురు రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ విజయరావు తెలిపారు. జయదేవ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో... పోలీసులపై రాళ్లు రువ్వారని... దాంతో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ వివరించారు.