తప్పదా?.. అధిష్టానాన్ని కాదని పోటీ చేసిన అభ్యర్థులపై వేటు వేయనున్న టీఆర్ఎస్!

తెలంగాణలో కొత్త పాలక మండలి కొలువు తీరింది. అయినా టీఆర్ఎస్ లో ఆ హీట్ ఇంకా పోలేదు. ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన రెబల్స్ పై వేటు వేయాలని పార్టీ నేతలు కొందరు ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పోటీ చేసిన వారిని వదిలిపెట్టకూడదని కోరుతున్నారు. తమ ఓటమికి కారణమైన రెబల్స్ పై వేటు వేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. కొల్లాపూర్ తో సహా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన వారి జాబితా ఇప్పటికే మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఒక వైపు గులాబీ బాస్ కేసీఆర్ కూడా రెబల్స్ తో పాటు వారిని ప్రోత్సహించిన వారి పై గుర్రుగా ఉన్నారు. అయితే ఈ టైంలో వేటు వేస్తే పార్టీకొచ్చే లాభమేంటి అని ఆలోచనలో ఉంది టిఆర్ఎస్ అధిష్టానం. 

ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు.. ఇప్పుడు వేటు వేస్తే లాభం లేదని.. అందుకే కొంతకాలం సైలెంట్ గా ఉండాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. మరో వైపు వేటు వేయకపోతే పార్టీలో సీరియస్ నెస్ అనేది లేకుండా పోతుందని భవిష్యత్ లో మరోసారి ఇలా పార్టీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వీరిపై వేటు వేయాలా అనే అంశంపై పార్టీ పెద్దలు తర్జన భర్జన అవుతున్నారు. నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినా పార్టీ అధిష్టానం మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో ఏడాదిలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి కాబట్టి పార్టీ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తేనే అప్పుడు రెబల్స్ బెడద ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

Teluguone gnews banner