ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. భవనాలకు పార్టీ రంగులు తీసేయడానికి నిధులు కరువు!!
posted on Jan 31, 2020 8:51AM
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో గ్రామ సచివాలయం భవనాలకు పార్టీ రంగులు తీసేయడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే దీనికి నిధులు ఎక్కడి నుంచి తీసుకు రావాలంటూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హైకోర్టు సూచనల ప్రకారం ఈ రంగులు మార్చాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై పడింది. అయితే కమిషన్ ఆదేశాలను అధికార యంత్రాంగం పాటిస్తుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గ్రామ సచివాలయాల వ్యవస్థ అమలులోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం వాటితో పాటు కమ్యునిటీ భవనాలు, నీళ్ల ట్యాంకులు ఇతర ప్రభుత్వ భవనాలు కొన్ని చోట్ల పాఠశాల భవనాలను సైతం వైసీపీ రంగులలోకి మార్చింది. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు వేయకూడదు అని తెలిసినా పంచాయతీ రాజ్ కమిషనర్ పై ఒత్తిడి తెచ్చి అధికారికంగా మెమో ఇచ్చారు. అదే బాటలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఎన్ సీ నడిచారు. గతంలో పెయింట్ లు వేసిన కొత్త పంచాయతీ భవనాలు కూడా వైసిపి రంగుల్లోకి మారిపోయాయి.
యాభై శాతం రిజర్వేషన్ లపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వడంతో హై కోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాలన్నీ మళ్లీ తెల్ల రంగులోకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీల్లో నిధులు ఉన్నా లేకున్నా ఆయా పంచాయతీల కార్యదర్శులు నిధులు సమీకరించుకుని మరీ భవనాలకు వైసీపీ రంగులు వేయించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1300 కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇదే విషయమై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా సచివాలయ భవనాలకు పార్టీ రంగులేయడంపై ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని రంగులు మార్చాలని సూచించారు.
అయితే ప్రభుత్వ యంత్రాంగం ఈ ఆదేశాలు వెంటనే అమలు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్ట్ ఇచ్చిన పలు ఆదేశాలను అమలు చేయడం కన్నా ఏదో ఒక వంకతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ విషయం లోనూ కాలయాపన చేస్తుందంటున్నారు. గతంలో వైసీపీ పెయింట్ లు వేసేందుకు పంచాయతీ నిధులు వినియోగించుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు వాటిని మార్చేందుకు ఎస్ ఈ సీ వద్ద నిధుల్లేవు. ఎన్నికల నిర్వహణపై హై కోర్టు ఆదేశిస్తే ఒక నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ లకు మరో నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈలోపు సచివాలయాలతో పాటు ప్రభుత్వ భవనాల రంగులు మార్చడం సాధ్యమేనా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ బాధ్యత ఎన్నికల కమిషనర్ ది అని హై కోర్టు పేర్కొనడంతో ఈసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కోడ్ అమలు లోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించగలమని ఎస్ ఈ సి ఇప్పటికే సందేహాలు వ్యక్తం చేసింది. కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి అమలు చేయాలంటే క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులపై మరోసారి భారం పడుతోందని అంటున్నారు. అంతేకాకుండా ఇంత తక్కువ సమయంలో పెయింట్ లు మార్చడం వీలుకాదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గతంలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేసి కోడ్ ముగిసిన తర్వాత తొలగించారు. ఇప్పుడు అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.