వివేకా కేసులో అన్నీ అనుమానాలే... సునీత పిటిషన్లో సంచలన ఆరోపణలు... 

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆయన కుమార్తె సునీత... అందుకు పలు కారణాలను న్యాయస్థానం ముందు ఉంచారు. తాము సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన కారణాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇప్పటివరకూ సిట్ ను మూడుసార్లు మార్చారని... గతంలో అదనపు డీజీ స్థాయి అధికారి సిట్ అధిపతిగా ఉండగా... ఇఫ్పుడు ఎస్పీస్థాయి అధికారిని నియమించారని... ఇలా, పదేపదే సిట్ ను, చీఫ్ ను మార్చడంపై తమకు అనుమానాలు ఉన్నాయని సునీత హైకోర్టుకు తెలిపారు. అలాగే, వైఎస్ వివేకా హత్య జరిగిన పది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపైనా, స్వాధీనంచేసుకున్న ఆధారాలపైనా పోలీసులు ఎందుకు మాట్లాడ లేదని సునీత ప్రశ్నిస్తున్నారు. అసలు అనుమానితుల కాల్ డేటాను పోలీసులు పరిశీలించారా? అలాగే, ప్రధాన అనుమానితుడైన కసునూరు వైసీపీ లీడర్ పరమేశ్వర్ రెడ్డి... వివేకా హత్య జరిగిన రోజు ఉదయం ఆస్పత్రిలో చేరి... ఆ తర్వాత ఓ హోటల్లో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కలవడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇక, వివేకా మర్డర్ జరిగిన రోజు కుటుంబ సభ్యులు... సన్నిహితులు వ్యవహరించిన తీరుపైనా సునీత అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు ప్రధాన అనుచరుడైన డాక్టర్ శివశంకర్ రెడ్డి... వివేకా మృతదేహమున్న బెడ్రూమ్ లో ఎందుకున్నారు? గామాలకు డ్రెస్సింగ్ చేసి కుట్లు వేయాలని ఎందుకు హడావిడి చేశారు. బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలను శుభ్రం చేయాలని వంట మనిషి లక్ష్మమ్మను యర్ర గంగిరెడ్డి ఎందుకు ఆదేశించారు? వివేకా ఇంట్లో ఆరోజు పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వైద్యులు ఉండగా... సాక్ష్యాలు చెరిపేశారన్న అభియోగంపై వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంటూ అనేక అనుమానాలను సునీత హైకోర్టు ముందు పెట్టారు.

బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ లో రక్తపు మరకలు ఉండగా... వివేకా తలపై లోతైన గాయాలు ఉండగా...ఉదయం పదకొండున్నర వరకు గుండెపోటుతో మరణించారని టీవీ ఛానెళ్లలో ఎలా ప్రసారమైంది? వివేకా మృతదేహంపై గాయాలున్న ఫొటోలు, వీడియోలు తమ దృష్టికి వచ్చేవరకు గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారని సునీత హైకోర్టుకు తెలిపారు. ఇక, ఉదయమే ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించిన సీఐ... అనుమానాస్పద మృతిగా కేసు ఎలా నమోదు చేశారు. అలా, కేసు నమోదు చేయాలని అతనికి సూచించిందెవరు? అసలు కేసే వద్దని యర్ర గంగిరెడ్డి ఎందుకు ఒత్తిడి తెచ్చారు? దీని వెనుక ఉన్నది ఎవరు? అంటూ సునీత అనేక అనుమానాలను లేవనెత్తింది.

వివేకా హత్య జరిగిన రోజు వాచ్ మన్ రంగయ్య ఇంట్లోనే ఉన్నాడని, కానీ తనకేమీ తెలియదని చెబుతున్నాడని సునీత హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తాము పులివెందుల ఎప్పుడొస్తున్నారంటూ ఫోన్ చేసి రంగయ్య ఆరా తీశాడని, కానీ ఇఫ్పుడు తాను ఫోనే చేయలేదని మాట మార్చాడని సునీత న్యాయస్థానికి తెలిపారు. అసలు, రంగయ్య కాపలాగా ఉండగా హంతకులు ఇంట్లోకి ఎలా వెళ్లగలిగారు? రంగయ్యకు తెలియకుండా ఎలా వెళ్లిపోయారు? అసలు, వాచ్ మన్ రంగయ్య పక్క తలుపులో నుంచి లోపలకు ఎలా వెళ్లాడు? అసలు ఆ తలుపు తెరిచి ఉందని రంగయ్యకు ఎలా తెలుసు? ఈ చర్యలన్నీ రంగయ్య వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని సునీత అంటున్నారు. అయితే, వివేకా శరీరంపై ఉన్న గాయాలు... ఇంట్లో సీన్ ఆఫ్ ఆఫెన్స్ చూస్తే... ఒకరి కంటే ఎక్కువ మంది ఈ హత్య చేసినట్లు అనిపిస్తోందని సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

Teluguone gnews banner