జగన్ కు ఏమి శిక్ష వేయాలన్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నడుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా జగన్ గారు ?, అంటూ సి.ఎం. ను నిలదీశారు.  అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసారు.మాస్కులు,వ్యక్తిగత రక్షణ కిట్లు కొనడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.కరోనా ని ఎలా నివారించాలి అని అడిగినందుకు నగరి కమిషనర్ వెంకట్ రామిరెడ్డి ని సస్పెండ్ చెయ్యడాన్ని నారా లోకేష్ ఖండించారు. అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికలు ముఖ్యం అని నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణం అయిన జగన్ గారికి ఎం శిక్ష వెయ్యాలని ఆయన ప్రశ్నించారు. జగన్ అసమర్ధత వలన కరోనా పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు కూడా కరోనా భారిన పడుతున్నారని, అనంతపురం జిల్లాలో ఇద్దరు డాక్టర్లు,ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా సోకిందని, డాక్టర్లు విధులు బహిష్కరించే పరిస్థితి వచ్చిందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

నెగెటివ్ వచ్చినా ఆ ల‌క్ష‌ణాలుంటే మ‌ళ్ళీ మ‌ళ్ళీ ప‌రీక్ష చేయించుకోవాలి!

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఓ డాక్టర్ తాజాగా కోవిడ్-19 బారిన పడడం వైద్య నిపుణులను కూడా కలవరపెడుతోంది. 60 ఏళ్లున్న జనరల్ ప్రాక్టీషనర్ ఇండోర్ లోని త్రివేణి కాలనీలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఆయన కరోనాతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  ఆయనకు కొద్దిరోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. అది సాధారణ ఎలర్జీగానే భావించారు. అయినప్పటికీ ఈ నెల 3, 4 తేదీల్లో కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. ఆ రెండు సార్లు కూడా నెగెటివ్ తేలడంతో డాక్టర్, ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  అలర్జీ లక్షణాలతో ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్లకు వైద్యసేవలు అందించారు. అయితే ఆయనకు కోవిడ్-19 సోకిందని తెలిసేటప్పటికే చనిపోవడం కలకలం రేపుతోంది. డాక్ట‌ర్ బ్ర‌తికి వున్న‌ప్పుడు చేసిన టెస్ట్‌లో నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఆయ‌న మ‌రో సారి చేయించుకుంటే పాజిటివ్ వ‌చ్చేదేమో. చ‌నిపోయిన త‌రువాత చేసిన ప‌రీక్ష‌లు పాజిటివ్ వ‌చ్చింది. ఆయన దగ్గరకు ట్రీట్ మెంట్ కోసం ఎంతమంది వచ్చారు? వారి కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారు? వారు ఎంతమందిని అటాచ్ అయ్యారు? అసలు ఆ కాలనీలో ఎంతమంది ఉన్నారు? అనే అంశాలపై ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. వైద్యుడు ఉంటున్న త్రివేణి కాలనీని సీజ్ చేశారు. అక్కడున్న అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.  వైద్యుడి పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. మొబైల్ ఫోన్ వీడియో కాల్ ద్వారా ఆయన శవాన్ని బంధువులకు అప్పగించడాన్ని ఆయన పిల్లలకు చూపించారు.

జర్నలిస్టులకు పీపీఈ లు, ఇన్సూరెన్స్ అక్కర్లేదా...?

కరోనా తో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే సమాజానికి, ప్రభుత్వానికి కనిపిస్తున్నారా..? సమాజం ఇంట్లో కదలకుండా కూర్చోవాలంటే, వారి ఇంట్లోకి సమాచారాన్ని చేరవేసేది జర్నలిస్టులే (టివి, పత్రికలే), మరి వీరు కనపడటంలేదా? కరోనా మహమ్మారి భయంతో ప్రపంచం వణుకుతూ, ఇంట్లోనే ఉంటే... ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండిపోయారు?, మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మీ గ్రామం ఎలా ఉంది? మీ ఇంటి బయట ఏమి జరుగుతుంది..? ప్రభుత్వం ఏమి చేస్తుంది.? పోలీసులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు.? వైద్యులు ఎలాంటి సాహసోపేత వృత్తి ధర్మం పాటిస్తున్నారు అని, అనునిత్యం మిమ్మల్ని టీవీ లకి, పత్రికలకు కట్టిపడేసేలా ప్రాణాలను పణంగా పెట్టి వృత్తి ధర్మం పాటిస్తుంది జర్నలిస్టులే..ఇది జర్నలిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంధిస్తున్న ప్రశ్న.  ప్రభుత్వం... కనీస గౌరవ వేతనమే కాదు కదా, అత్యవసర విధుల్లో భాగమైనా కనీసం ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేకంగా ప్రకటించలేకపోయింది.. వారి ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకోలేకపోయింది.. కరోనా నివారణలో మీరే ప్రథమ పాత్ర అంటూ డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తూ కనీసం పీపీఈ (Personal protective equipment) లు కూడా ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోంది. జర్నలిస్టులారా, మీకు ఎలాంటి ప్రత్యేక ఇన్సూరెన్స్ కేంద్రం ప్రకటించలేదు..? రక్షణ ముఖ్యం, మీ కోసం కాదు, మీ కోసం వేచి చూసే మీ కుటుంబ సభ్యుల కోసం.. ప్రభుత్వం స్పందించవచ్చు, ఎప్పటిలాగే ఊరుకోవచ్చు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి.

ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్ సీఎం కు నాయుడు లేఖ

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్  కుమార్ భల్లాలాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. లాక్ డౌన్ వల్ల గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మందిని ఆదుకోవాలని లేఖలో విన్నవించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్ లోని సోమనాథ్ జిల్లాలో చిక్కుకుపోయారని తెలిపారు. వారి యోగ క్షేమాల కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు వారికి గుజరాత్ లో ఆహారంతో పాటు వసతి సదుపాయాన్ని కల్పించాలని చంద్రబాబు కోరారు. నిత్యావసరాలను అందించాలని, వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని విన్నవించారు. దీంతో పాటు 4 వేల మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది ఫోన్ నంబర్లను లేఖలో జత చేశారు.

నిమ్మగడ్డ పై వేటు దుర్మార్గం: దేవినేని ఉమ

రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సి ఇ సి ) రమేష్ కుమార్ పై వేటు నిర్ణయం చట్ట ప్రకారంగా చెల్లుబాటు కాదని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. సీఎం జగన్ దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, కరోనా బారిన పడకుండా 5 కోట్ల ప్రజలను రమేష్ కుమార్ కాపాడారని దేవినేని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవని, మాస్క్ లు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వర రావు దుయ్యబట్టారు.  ఉద్యోగులపై జగన్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారని కూడా మాజీ మంత్రి ఆరోపించారు.

భానుమతి సినిమాకు అందుకే రాయలేనని చెప్పా: యర్రంశెట్టి సాయి

ఆయన పరిచయం అక్కర్లేని పేరున్న రచయిత, మాజీ రైల్వే అధికారి.... యర్రంశెట్టి సాయి. హ్యూమరాలజీ పేరిట ఒక తరాన్ని దశాబ్ద కాలం పాటు ఊపేసిన సాయి గారి పోస్టులు ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. సెటైర్లకు, పదునైన వ్యాఖ్యలకు యర్రంశెట్టి సాయి పెట్టింది పేరు. అభినేత్రి భానుమతి తో తనకున్న చిన్నపాటి అసోసియేషన్ పై ఆయన పెట్టిన పోస్టు, భానుమతి అభిమానులందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అదేదో ఆయన మాటల్లోనే చదవండి.... " ఎవరో భానుమతి ఫోటో పెట్టారు FB లో.వెంటనే ఒక ఫ్లాష్ బాక్ గుర్తుకొచ్చింది. భానుమతి గారిని ఒకసారి చెన్నై లో కలుసుకున్నాను. ఆ వివరాలు చెప్తాను. నేను రైల్వే అని మీకు తెలుసుకదా. ఒకసారి మా బాస్ (శాస్త్రి గారు)ఫోన్ చేసి, సాయీ. నువ్వు అర్జెంట్ గా చెన్నై వెళ్లి భానుమతి గారిని కలుసుకో. ఆమె ఒక మూవీ తీస్తున్నారు. దానికి నిన్ను రైటర్ గా పెట్టుకోమని ఆమెకు చెప్పాను అన్నారు.(శాస్త్రి గారికి భానుమతి గారు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అని నాకు తెలుసు.) నేను అప్పటికే రెండు మూడు సినిమాలకు వర్క్ చేసి వున్నాను. నాకున్న ప్రాబ్లెమ్ ఏమిటంటే అప్పటికే చాలా అద్భుతమైన ఇంగ్లీష్ మూవీస్ చూసి వుండటం చేత నాకు తెలుగు సినిమా కథలు ఓ పట్టాన నచ్చేవి కావు. నాకు మూవీ బ్రాడ్ అవుట్ లైన్ నచ్చక పోతే, మొదట్లోనే తప్పుకుంటాను.నాకు ఏమాత్రం నచ్చని సినిమాలు చాలా సక్సెస్ అయాయి కాబట్టి నా తింకింగ్ కరెక్ట్ కాకపోవచ్చు. భానుమతి గారు తను తీయాలనుకుంటున్న సినిమా కథ చెప్పారు. కథ సగం లోనే నాకు అర్థమై పోయింది.ఆ కధ సినిమాకి పనికి రాదని. అదే ఇంకెవరైనా అయితే సారీ. నేను ఈ కధకి న్యాయం చెయ్యలేను అని చెప్పి తప్పుకునే వాడిని. కానీ ఎదురుగ్గా ఉన్నది భానుమతి గారు. ఆమె సినిమాలు అన్నా,ఆమె నటన అన్నా ఎంతో ఇష్టం నాకు.ఎందుకంటే ఆమె కామెడీ కూడా అద్భుతంగా చేశారు. పైగా ఆమె మంచి రచయిత్రి. ఆ పరిస్థితుల్లో సారీ ఎలా చెప్పాలి అనేది నాకు పెద్ద సమస్య అయిపోయింది. ఎంతో కష్టం మీద ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకున్నాను. తరువాత ఆమె ఆ సినిమా నిర్మించారు. అది ఫ్లాప్ అయింది. బహుశా అదే ఆమె తన స్వంత బ్యానర్ మీద నిర్మించిన ఆఖరి చిత్రం అనుకుంటాను. అదే ఆ మహానటి తో నాకున్న అనుబంధం, " అంటూ యర్రంశెట్టి సాయి చెప్పుకుంటూ వచ్చారు. ఇదీ, తానూ అభిమానించే మహానటి, రచయిత్రి కూడాఅయిన భానుమతి గురించి సాయి చెప్పుకొచ్చిన ఇంటరెస్టింగ్ పాయింట్..

ఆర్డినెన్స్ సాయంతో నిమ్మగడ్డ రమేష్ పై వేటు.. గవర్నర్ ఆమోదంతో జీవో జారీ..

ఓవైపు ఏపీలో కరోనా వైరస్ కల్లోలం ఆగనే లేదు అంతలోనే ఏపీలో రాజకీయ నిర్ణయాలకు జగన్ ప్రభుత్వం తెరలేపేసింది. స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ ప్రభుత్వం ఇవాళ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడటంతో వెంటనే న్యాయశాఖ జీవో కూడా జారీ చేసేసింది. దీంతో కరోనా వైరస్ లాక్ డౌన్ లోనే నిమ్మగడ్డ రమేష్‌ పదవి కోల్పోయినట్లయింది.  ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ఏ క్షణాన వాయిదా పడ్డాయో కానీ అప్పటి నుంచి జగన్ సర్కార్ టార్గెట్ లోకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేరిపోయారు. అప్పటి వరకూ నిమ్మగడ్డ విధుల్లో కానీ, ఎన్నికల కమిషన్ గురించి కానీ పెద్దగా పట్టించుకోని జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడటం మొదలుపెట్టింది. అదీ ఏకంగా కులం పేరుతో ఆయన్ను దూషించే వరకూ ముఖ్యమంత్రే వెళ్లిపోయారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎన్నికల వాయిదా విషయంలో నిమ్మగడ్డ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే లభించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఏమీ చేయలేమనే నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ప్రభుత్వం ఇక దీనికి కారణమైన ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించే మార్గాలపై దృష్టిపెట్టింది.  రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంత సులువు కాదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై జగన్ సర్కారు ఇన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. అయితే చివరికి సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు దానికి గవర్నర్ ఆమోదం పొంది జీవో కూడా ఇచ్చేసినట్లయింది.  వాస్తవానికి ఎస్ఈసీ తొలగింపుకు పార్లమెంటు అభిశంసనతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. కానీ అది సాధ్యం కాదని తేలిపోవడంతో కమిషన్ లో సభ్యుల సంఖ్య పెంపు సహా పలు మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేసింది.  మరోవైపు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు నేపథ్యంలో ఆయన స్ధానంలో హైకోర్టు న్యాయమూర్తి స్ధాయి వ్యక్తిని నియమించాలని, అదీ మూడేళ్ల పదవీకాలంతోనే అనే నిబంధనలను తీసుకొచ్చేలా రాష్ట్రపతిని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతిని కోరుతూ ఓ లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మందు లేదు సామాజిక దూరం, పరిశుభ్రతే పరమౌషదం!

లాక్ డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన మేరకు అంగన్ వాడీ కేంద్రాలలో నమోదైన బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పాలు, గుడ్లు, బాలామృతం, నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సరుకులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారని ఈ రోజు హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ వద్ద ఎంజీ నగర్ అంగన్ వాడి కేంద్రాన్ని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నమోదైన బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సరుకులు, శానిటైజర్లు, మాస్క్ లు కూడా పంపిణీ చేశారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం నడుస్తోందని, ఈ సమయంలోనే మన అవసరం ప్రజలకు ఎక్కువగా ఉందని, వారికి ప్రభుత్వ సేవలన్నీ సకాలంలో అందించి ఆదుకోవాలన్నారు. అంగన్ వాడీలు బాగా పనిచేస్తున్నారని, వీరి సేవలు బ్రహ్మండంగా ఉన్నాయని, నీతి ఆయోగ్ కూడా మన అంగన్ వాడీలను ప్రశంసించిందని గుర్తు చేశారు. కరోనా వ్యాధికి మందులేదని, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే దీనికి పరమౌషదమని దీనిని అంగన్ వాడీలు పాటిస్తూ మిగిలిన వారంతా కూడా పాటించేలా చూడాలన్నారు.

చేతికొచ్చిన పంట నేల పాలైంది! బోరున విలపించిన రైతులు!

వడగళ్ల వానకు నష్టపోయిన అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటాం.! అండగా ఉంటామని, అధైర్య పడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రైతులకు భరోసా కల్పించారు.  సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలం గౌరాయపల్లి, కిష్టంపేట, కొండపాక మండలం దర్గా గ్రామాలలో శుక్రవారం ఉదయం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఉద్యాన వన, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు.  సిద్ధిపేట జిల్లాలో అకాల వర్షాలు కురిసి వందల ఎకరాల్లో వరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. నీటికి ధాన్యం తడిసి పోయి రైతులు తీవ్ర ఆవేదనను మంత్రి హరీశ్ రావుతో వెలిబుచ్చారు. ఈ మేరకు ప్రధానంగా జిల్లాలోని కొమురవెళ్లి మండలం గౌరాయపల్లి, కిష్టంపేట, కొండపాక మండలం దర్గా గ్రామాలలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన వడగళ్ల వర్షానికి వందల ఎకరాల్లో వరి పంటలు నష్టం వాటిల్లిన పంటలను హరీశ్ రావు పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు, వడగండ్ల వాన పడటంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు. కొమురవెళ్లి మండలంలో 6143 ఎకరాల్లో వరి పంటకు, 920 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారని, మండలంలో 226 మంది రైతులు పంట బీమా చేయగా, 113 మంది రైతులు బీమా చేయలేదని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా కొండపాక మండలంలో 6878 ఎకరాల్లో వరి పంట వేశారని, 136 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, మండలంలో 132 మంది పంట బీమా చేసుకోలేదని మంత్రి వెల్లడించారు.  నష్టపోయిన పంటలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందచేయాలని వ్యవసాయం, ఉద్యానవన, రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నివేదిక రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు.

సెల్ఫీ వీడియో లో నోరు జారినందుకు నగరి మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ 

కరోనా విషయంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాస్కులకు కూడా నిధులు లేవని కమిషనర్ కె వెంకటరామి రెడ్డి సెల్ఫీవీడియో ద్వారా వ్యాఖ్యలు  చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నగరి కమిషనర్ కామెంట్లను సీరియస్‍గా తీసుకున్న ఏపీ సర్కార్ , సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్దంగా కమిషనర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది,  ముందస్తు అనుమతి లేకుండా నగరి దాటి వెళ్లొద్దని స్పష్టం చేసింది. నగరి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‍గా సీహెచ్ వెంకటేశ్వరరావు ను నియమించింది.

మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

ఈ నెల 14తో ఇండియాలో లాక్ డౌన్ ముగుస్తుందా? లేదా? ఒకవేళ లాక్ డౌన్ ను తొలగించాలని కేంద్రం భావిస్తుంటే, తదుపరి కరోనా మహమ్మారిపై అవలంభించాల్సిన వ్యూహం ఏంటి? తదితర ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సమాధానం ఇస్తారని తెలుస్తోంది. శనివారం నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ ను నిర్వహించనున్న నరేంద్ర మోదీ, ఆ తరువాత జాతిని ఉద్దేశించి, మరోమారు ప్రసంగిస్తారని తెలుస్తోంది. కాగా, లాక్ డౌన్ కొనసాగుతుందని, అయితే, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం మారుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు ఉండబోవని, నిత్యావసరాల రవాణా మాత్రం కొనసాగుతుందని, స్కూళ్లు, కాలేజీలు, దేవాలయాల మూసివేత కొనసాగుతుందని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయిన నేపథ్యంలో, కొన్ని సెక్టార్లకు ఊరట కలిగిస్తూ, నిర్ణయాలు ఉంటాయని, సామాజిక దూరం పాటిస్తూ ఫ్యాక్టరీలను నిర్వహించే వీలు కల్పిస్తారని సమాచారం. కాగా, ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా, ఇండియాలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భారీగా నష్టపోయిన రంగాల్లో విమానయాన రంగం ముందు నిలిచింది. ఈ నేపథ్యంలో విమానంలో మధ్య సీటును ఖాళీగా ఉంచుతూ, బుకింగ్స్ తీసుకుని, విమానాలను నడిపించేందుకు కూడా అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బుధవారం నాడు జరిగిన వివిధ పార్టీల పార్లమెంటరీ నేతల సమావేశంలో, లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ప్రధాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. "ప్రతి ఒక్కరినీ కాపాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దేశంలో పరిస్థితిని దిగజారకుండా చూస్తాం. సోషల్ ఎమర్జెన్సీ అమలులోనే ఉంటుంది. ఇంకొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి. నిఘాను మరింతగా పెంచుతాం" అని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి తరువాత జీవితం ఎన్నడూ ఒకేలా ఉండబోదని, ప్రజల దైనందిన కార్యకలాపాల్లో మార్పు తప్పనిసరని కూడా ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, వేలాది మంది పేద కార్మికులు ఉపాధి కోల్పోయినా, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా, లాక్ డౌన్ ను పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధానిని కోరుతున్నారు. ఒడిశా అయితే, ఏకంగా లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది కూడా.

గుంటూరు లో మాస్క్ లేకుండా తిరిగితే వెయ్యి రూపాయల ఫైన్

గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ను మరింత కఠిన తరం చేస్తున్నట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మాస్క్ లు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేయనున్న అదికారులు. ఉదయం 6 గంటలనుండి 9 గంటలవరకు మాత్రమే కర్యూ సడలింపు. 9 గంటల తరువాత వాహనం కనబడితే సీజ్ చేస్తామని,  ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపించి కలెక్టరేట్ లో పాస్ పొందాలని అధికారులు సూచించారు. ఉద్యోగస్తుల వాహనాలు ఉదయం పదిగంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయట కనబడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 5 గంటలనుండి 7 గంటల వరకు ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నామన్నారు.

లాక్ డౌన్ దృష్ట్యా పేదలను ఆదుకోవాలి: నారా లోకేష్

లాక్ డౌన్ తో పేద ప్రజలు అల్లాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వాపోయారు. లాక్ డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనలోకి నెడుతున్నాయని, పనులు లేవు,తినడానికి తిండి లేదు,ఎక్కడకి కదలలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు పుట్టే అవకాశం కూడా లేదు.సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్న పేద కుటుంబాలను జగన్ గారు ఆదుకోవాలని, తక్షణమే 5 వేల రూపాయిల ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని లోకేష్ కోరారు. రైతుల కష్టాలు వర్ణనాతీతం. మద్దతు ధర లేదు,రవాణా సౌకర్యం లేదని, లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారని, అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని నారా లోకేష్ వివరించారు.  లాక్ డౌన్,అకాల వర్షాల కారణంగా వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే అంచనా వెయ్యాలని, రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే ఇచ్చి వారిలో ధైర్యాన్ని నింపాలని కోరారు.

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది! ఆర్బీఐ

కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన పరిస్థితులు మళ్లీ చక్కబడితే దేశీయ డిమాండ్, వృద్ధి పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వృద్ధి రేటును అంచనా వేయడం కష్టమని తెలిపింది.  కరోనా వైరస్ వ్యాప్తికి ముందు మన దేశంలో 2020-21 వృద్ధిరేటు కొంత గాడిలో పడవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడింది. అయితే 2019-20లో రబీ సీజన్ కలిసి రావడం, అధిక ఆహారం ధరలు గ్రామీణ డిమాండ్ పెంచాయని, కీలక రేట్ల కోత వల్ల బ్యాంకు రుణ రేట్లు తగ్గాయని ఆర్బీఐ వివరించింది.  రబీ అధిగ దిగుబడులు గ్రామీణుల కొనుగోళ్ల శక్తిని పెంచుతుందని తెలిపింది. మౌలిక రంగ వ్యయాలు పెంచడం, పన్ను రేట్ల కోత వంటి నిర్ణయాలు మన దేశంలో డిమాండ్ పెంచుతాయని తెలిపింది. కరోనా వ్యాప్తితో మొత్తం అంచనాలు తలకిందులవుతున్నాయని వెల్లడించింది.  దేశీయ లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్యపరమైన నిర్ణయాలకు కేంద్రం ఆర్థికపరమైన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయనే విశ్వాసం వ్యక్తం చేసింది.  ఈ కష్టకాలంలో దేశ వృద్ధిరేటును అంచనా వేయలేమని చెప్పింది. ద్రవ్యోల్భణం 2.4 శాతం 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ నాటికి ద్రవ్యోల్భణం 2.4 శాతానికి పడిపోవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. జనవరిలో 7.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నాటికి 6.6 శాతంగా ఉందని పేర్కొంది.

మంచినీళ్లు అనుకొని శానిటైజర్ తాగాడ‌ట ఆ డాక్ట‌ర్‌!

ఎవ‌రో కాదు ప్ర‌భుత్వ వైద్యాధికారి. అనంతపురం జిల్లాలో చిన్న పొరపాటుతో ప్రభుత్వ వైద్యాధికారి ఆస్పత్రి పాలయ్యారు. జిల్లాకు చెందిన వైద్యాధికారి అనిల్ కుమార్ ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దాహం వేయడంతో ఆయన మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్ తాగేశారు.  స్వల్ప అస్వస్థతకు గురికావ‌డంతో  కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.  అనిల్‌కుమార్‌కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని.. చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.  అనిల్‌కుమార్ శానిటైజర్ తాగడం కలకలంరేపింది. ఆయన పొరపాటున శానిటైజర్ తాగారా.. కావాలనుకునే తాగారా అన్న సందేహాలు వినిపించాయి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం పొరపాటున తాగారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రధానమంత్రికి సోనియా గాంధీ రాసిన లేఖ!

కోవిడ్ -19 యొక్క తీవ్రమైన సవాలును ఎదుర్కోవటానికి మా పార్టీ వైపు నుంచి ఏవైనా సలహాలను తెలియజేయాలని మీరు నన్ను కోరారు. ఆ నేపథ్యంలో నేను మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను. ఈ క్లిష్ట సమయాల్లో ఈ లేఖలో మేము పేర్కొన్న సలహాలు ఎంతగానో ఉపయోగ పడుతాయని ఆశిస్తున్నాను. పార్లమెంటు సభ్యుల జీతాలను 30 శాతం తగ్గించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన నిధులను మళ్లించడానికి ఉపయోగపడే కఠినమైన చర్యలు ఈ సమయంలో చాలా అవసరం. ఈ స్ఫూర్తితో నేను ఐదు ఖచ్చితమైన సలహాలను అందించడానికి మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను. మీరు ఈ సలహాల ప్రాధాన్యతలను గుర్తిస్తారని ఆశిస్తున్నాను.. 1. టెలివిజన్, ప్రింట్ మరియు ఆన్‌లైన్ - మీడియా ప్రకటనలపై ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలచే (‘పిఎస్‌యు’) రెండేళ్ల కాలానికి పూర్తి నిషేధం విధించండి. కోవిడ్ -19 లేదా ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలకు మాత్రమే మినహాయింపులు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మీడియా ప్రకటనల కోసం సంవత్సరానికి సగటున 1250 కోట్లు ఖర్చు చేస్తున్నందున ఇది కోవిడ్ యొక్క ఆర్థిక మరియు సామాజిక ప్రభావాలను తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది . 2. 20 వేల కోట్లతో చేపడుతున్న ‘సెంట్రల్ విస్టా’ సుందరీకరణ మరియు నిర్మాణ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయండి. ఇలాంటి సమయంలో అలాంటి వ్యయం వాంఛనీయం కాదు. ప్రస్తుతం ఉన్న చారిత్రక భవనాలలో పార్లమెంటు సంతృప్తిగా పనిచేయగలదు. ఈ సంక్షోభం ఉన్నంత వరకు ఇలాంటి అత్యవసరం లేని వ్యయాలు వద్దు. ఈ మొత్తాన్ని కొత్త హాస్పిటల్ మౌలిక వైద్య సదుపాయాలు మరియు డయాగ్నస్టిక్స్ అవసరాలకు కేటాయించడంతో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికులను వ్యక్తిగత రక్షణ సామగ్రి (‘పిపిఇ’) మరియు మెరుగైన సౌకర్యాలతో సమకూర్చవచ్చు. 3. భారత ప్రభుత్వ బడ్జెట్‌లో (జీతాలు, పెన్షన్లు మరియు కేంద్ర రంగ పథకాలు కాకుండా) 30 శాతం తగ్గింపును ఆదేశించడం అర్థవంతంగా ఉంటుంది. ఈ 30 శాతం (అనగా సంవత్సరానికి ₹ 2.5 లక్షల కోట్లు) వలస కార్మికులు, కార్మికులు, రైతులు, ఎంఎస్‌ఎంఇలు మరియు అసంఘటిత రంగంలో ఉన్నవారికి ఆర్థిక భద్రత ఏర్పాటు చేయడానికి కేటాయించవచ్చు. 4. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు బ్యూరోక్రాట్లతో సహా అన్ని విదేశీ సందర్శనలను ఇలాంటి అత్యవసర సమయంలో నిలిపివేయాలి. ప్రత్యేక అత్యవసర పరిస్థితుల్లో లేదా జాతీయ ప్రయోజనంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రధానమంత్రి మినహాయింపులు చేయబడతాయి. (ఇది గత ఐదేళ్లలో కేవలం ప్రధానమంత్రి మరియు కేంద్ర క్యాబినెట్ పర్యటనలకు సుమారు 393 కోట్లు వ్యయం చేశారు. ఇలాంటి నిధులతో కోవిడ్ -19 ను ఎదుర్కోవటానికి విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు. 5. ‘పీఎం కేర్స్’ ఫండ్ కింద ఉన్న మొత్తం డబ్బును ‘ప్రధానమంత్రుల జాతీయ సహాయ నిధి’ (‘పీఎం-ఎన్‌ఆర్‌ఎఫ్’) కు బదిలీ చేయండి. ఈ నిధులు కేటాయించిన మరియు ఖర్చు చేసిన పద్ధతిలో ​​పారదర్శకత, జవాబుదారీతనం మరియు ఆడిట్ ఇది నిర్ధారిస్తుంది. నిధుల పంపిణీ కోసం రెండు వేర్వేరు ఖాజానాలు కలిగి ఉండటం శ్రమ మరియు వనరులను వృధా చేసినట్లు అనిపిస్తుంది. PM-NRF (FY2019 చివరిలో) లో సుమారు 3800 కోట్లు వినియోగించలేదని నేను అర్థం చేసుకున్నాను. ఈ నిధులు, ప్లస్ ‘పిఎమ్-కేర్స్’ లోని మొత్తాన్ని సమాజంలో చాలా అట్టడుగున ఉన్నవారికి తక్షణ ఆహార భద్రత కల్పించడానికి ఉపయోగించుకోవచ్చు. ప్రతి భారతీయుడు ఈ వ్యాధితో పోరాడటానికి గొప్ప వ్యక్తి గత త్యాగాలు చేసాడు. మీ కార్యాలయం మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి సూచన మరియు నిర్ణయానికి ప్రజలంతా కట్టుబడి ఉన్నారు. శాసన కర్తలు మరియు కార్య నిర్వాహకులు ఈ నమ్మకాన్ని మరియు మంచి విశ్వాసాన్ని పరస్పరం పంచుకునే సమయం ఇది. దేశం ఎదుర్కొంటున్న కోవిడ్- 19 యొక్క తీవ్రమైన సవాలును ఎదుర్కోవడంలో మీకు మా నిరంతరమైన మద్దతు ఉందని తెలియజేస్తున్నాం..శ్రీమతి సోనియా గాంధీ.

అవుట్‌సోర్సింగ్ వైద్య సిబ్బందిపై ప్రభుత్వ జులుం!

ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల్ల‌ని ర‌క్షించే ప్రయత్నంలో రాత్రింబవళ్ళు అహర్నిశలు పోరాడుతున్న వైద్య సిబ్బందికి అవ‌స‌ర‌మైన ఆరోగ్య కిట్ల కొర‌త వుంది. అయితే అవుట్‌సోర్సింగ్‌లో ప‌నిచేసే వారిని అధికారులు క‌నీసం ప‌ట్టించుకోకుండా వారితో ప‌నిచేయించుకుంటున్నారు. ముఖానికి మాస్క్ లాంటి క‌నీస వ‌స‌తులు అడిగితే ఉద్యోగం నుంచి తీసివేశారంటూ 32 మంది న‌ర్స‌లు  రోడ్ల‌మీద‌కు వ‌చ్చి త‌మ గోడును వినిపిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమిస్తున్నా యూపీ ప్ర‌భుత్వం త‌మ‌ను విధుల నుంచి తొలగించిందని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే వైద్యం చేయడానికి సామగ్రి తగిన కిట్లు ఇవ్వండి అని అడగడం. అదే పెద్ద తప్పు. త‌మ‌పై జరుగుతున్న దాడి వైద్య సిబ్బంది ప్ర‌భుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌తో పాటు తాము ప‌ని చేస్తున్న‌ప్ప‌ట్టికీ అవ‌స‌ర‌మైన ఆరోగ్య కిట్‌ల‌ను త‌మ‌కు ఇవ్వ‌డం లేద‌ని అవుట్‌సోర్సింగ్ స్టాఫ్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. భ‌ద్ర‌త‌లేకుండా ఎలా ప‌ని చేయాల‌ని ప్ర‌శ్నిస్తే ఉద్యోగంలో నుంచి తీసివేశార‌ని న‌ర్సింగ్ స్టాఫ్ ఆరోపిస్తున్నారు.

సౌదీ రాజకుటుంబంలో కరోనా ప్ర‌కంప‌నం!

కరోనా మహమ్మారి సౌదీని వ‌ణికిస్తోంది. సౌదీ రాజకుటుంబంలో 150మందికి కరోన పాజిటివ్ వచ్చింది. వీరిలో కొంతమంది ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా వుంది. రాజ‌ధాని రియాద్ గవర్నర్ సీనియర్ యువరాజు ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో వైపు రాజు సల్మాన్ కూడా జెడ్డాకు సమీపంలోని ఒక దీవిలోని రాజప్రాసాదంలో ఇప్పటికే స్వీయ నిర్బంధంలో వున్నారు. రాజకుమారుడు సల్మాన్‌, తన కుమారుడు, ఇతర మంత్రులతో కలిసి అదే దీవిలోని మరోచోట ఉన్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌(ఎన్‌వైటీ) పత్రిక స్పష్టం చేసింది. సౌదీ రాజకుటుంబానికి చికిత్స అందించే కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ ఆసుపత్రి అధికారులు 500 పడకలు ఏర్పాటుచేయాల్సిందిగా ప్రభుత్వ అంతర్గత అధికారులు సందేశం పంపారు. దీంతో ఈ విషయం బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. సౌదీలో ఇప్పటివరకు మొత్తం 2932 మందికి కరోనా రాగా 631 మంది వైరస్ నుండి కోలుకున్నారు.