నర్సీపట్నం డాక్టర్‌ ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్!

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి డాక్టర్ కె. సుధాకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద సుధాకర్‌పై కేసులు నమోదు చేసినట్టు నర్సీపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాస్కులు మరియు కనీస రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యం చేయాలంటూ డాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యలు  అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీశాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యల ప్రతిపక్ష టీడీపీ ఉందని అధికార పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రి, హోంమంత్రి మ‌ధ్య దూరం పెరుగుతోందా?

తెలంగాణ హోం శాఖా మంత్రి మొహమ్మద్ అలీని ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదు. ఈ విష‌యం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.  హోంమంత్రికి ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే మహమూద్‌ అలీ ప్రగతి భవన్‌కు వచ్చారు. అయితే ప్రగతిభవన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఆయనను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్‌ అలీ తిరిగి వెళ్లిపోయారు. ఆ త‌రువాత  ఆదివారం నాడు అదే ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో ఆరోగ్య మంత్రి ఈటేలా రాజేందర్, వ్యవసాయ మంత్రి మైనర్ నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, పౌర సరఫరా కమిషనర్ సత్య నారాయణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామ కృష్ణారావు ఉన్నారు. కానీ హోం మంత్రి మొహమ్మద్ అలీ క‌నిపించ‌లేదు. ఈ సంక్షోభ పరిస్థితిలో ఆ కీలకమైన సమావేశంలో, హోమ్ మినిస్టర్  హాజరు కాలేదు. సమీక్షా సమావేశంలో పాల్గొనమని కెసిఆర్ కోరారా లేదా అనేది తెలియ‌దు. నిజంగా సిఎం, హోం మినిస్ట‌ర్ మ‌ధ్య ఏదో న‌డుస్తోందా? లేక హోం మినిస్ట‌ర్ త‌బ్లీక్ జ‌మాత్ వారితోకానీ, వారి బంధువుల‌తో కానీ క‌లిసి వుంటార‌నే భ‌యంతో దూరం పెట్టారా?  అని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తనకు ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వివరణ ఇస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు.  అయితే నిన్నమంగ‌ళ‌వారం నాడు ఎం.ఐ.ఎం. నేత‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాజిక‌దూరాన్ని కూడా మ‌రిచి అంత ఆప్యాయ‌త‌తో క‌లిశార‌ట‌. సి.ఎం. కేసీఆర్ స్టైల్ వేరు.

లామినేట్‌ షీట్ తో కొత్తరకం మాస్క్! ధ‌ర 50 రూపాయ‌లే!

ఓ ప‌క్క‌ కరోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. మ‌రో వైపు మాస్కుల కొరత వుంది. ఈ నేప‌థ్యంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. పైగా మాస్కుల ధరలను ఒక్కసారి పెంచేశారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల, పరిశోధన సంస్థ. కొత్తరకం మాస్క్ ను త‌యారు చేసింది. ఆసుపత్రికి చెందిన యువ ఇంజనీరింగ్‌ బృందం సందీప్‌ వెంపటి, కార్తీకేశ్‌, ఆశిష్‌తోపాటు నేత్ర వైద్యులు వినీత్‌ జోషి తదితరులు ఈ వైజర్‌ను కొత్తరకం మాస్క్ ను రూపొందించారు. కరోనా చికిత్సలు అందించే వైద్యులు, సిబ్బందికి ఈ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన సందీప్‌ తెలిపారు.  లామినేషన్‌ కోసం ఉపయోగించే 150 మైక్రాన్ల ప్లాస్టిక్‌ షీట్‌ను తీసుకొని 3డీలో మాస్క్‌ నమూనాను రూపొందించారు. మాస్క్‌ను పెట్టుకునేందుకు అవసరమైన విడి భాగాల సాయంతో ఆసుపత్రిలోనే ఈ వైజర్‌ను తయారు చేశారు. దీనికి వెనుక రబ్బర్‌ బ్యాండ్‌తో మాస్క్‌ను అనుసంధానించడం వల్ల ప్రత్యేకంగా తాళ్లతో కట్టుకోవాల్సిన అవసరం ఉండదు.  ఒకసారి ముఖానికి తగిలించుకుంటే  మళ్లీ తీసేవరకు అలాగే ఉంటుంది. నుదురు నుంచి గడ్డం కిందవరకు ఈ మాస్క్‌ షీటు ఉంటుంది. దీంతో ఎలాంటి వైరస్‌ దాడి చేసే పరిస్థితి వుండ‌దు.  నిరాటంకంగా 8 గంటలపాటు వాడుకొని... తర్వాత షీట్‌ను శానిటైజర్‌ లేదా సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్నిసార్లయినా దీనిని శుభ్రంచేసి వాడుకోవచ్చని సందీప్ చెప్పారు.  ఇప్పటివరకు 2 వేల వైజర్లను తయారు చేశారు. దీని ధ‌ర 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయనున్నట్లు సందీప్‌ వెల్లడించారు.

సింగరేణిలో గల్లంతైన కార్మికుడు! గోదావరిఖనిలో టెన్షన్!

మంగళవారం ఏప్రిల్ 7న‌ గనిలో మోటార్ రన్ చేయడానికి వెళ్లిన సంజీవ్ అనే కార్మికుడు ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో గోదావరిఖనిలో విషాధం అలుముకుంది. విషయం తెలుసుకున్న సంజీవ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడి కోసం అధికారులు అర్ధరాత్రి వరకు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 11 ఇంక్లైన్ బొగ్గుగనిలోని నాలుగో సీమ్, ఒవటవ డిప్ వద్ద మోటార్ రన్ చేయడానికి సంజీవ్ వెళ్లినట్లు సింగరేణి సిబ్బంది తెలిపారు.  మంగళవారం రాత్రి జీఎంతో సహా అధికారులంతా కలిసి గనిలో వెతికారు. అయినప్పటికీ ఫలితం లేదు. సంజీవ్ గని లోపల సంప్‌లో పడినట్లు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు.

షబే బారత్ జాగారం! ఇంట్లోనే జరుపుకోండి! మసీదులకు వెళ్ళొద్దు!

కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి‌ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించబడుతున్న‌ నేపధ్యంలో ముస్లింలు ష‌బేబార‌త్ సంద‌ర్భంగా సామూహిక ప్రార్ధనలు చేయ‌వ‌ద్ద‌ని జమాతె ఇస్లామీ హింద్ పిలుపునిచ్చింది. ముస్లింలందరూ గురువారం రాత్రి సామాజిక బాధ్యతతో వ్య‌వ‌హ‌రించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డ్ సీఈఓ అలీం బాషా మసీదు కమిటీలకు ముస్లింలకు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెల 9 గురువారంనాడు జరిగే షబ్ ఎ బరాత్ పెద్దల పండగ జరుపుకోవడంలో ముస్లింలందరూ లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. ఫాతేహా ​​మొదలైన మతపరమైన ఆచారాలు ఇళ్లనుంచే నిర్వహించాలి. ముస్లిం స్మశానవాటికలో సమూహముగా ఫాతేహా ​​మొదలైనవాటిని నిర్వహించరాదని వ‌క్ఫ్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా వైరస్ శాశ్వతంగా ప్ర‌పంచం నుండి తొలగిపోయి ప్రజలందరికీ విముక్తి కలగాలని ప‌విత్ర షబే బారత్ సంద‌ర్భంగా అల్లాహ్ ను దువా చేసి వేడుకోవాల‌ని ఎం.బి.టి. నేత అంజ‌దుల్లాఖాన్ హైద‌రాబాద్‌లో పిలుపునిచ్చారు. ఈ మహోన్నతమైన, ప్రాముఖ్యత కలిగిన షబే బరాత్ పండుగను పుర‌స్క‌రించుకొని త‌మ‌ పూర్వీకులు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పేద వాళ్లకు అన్నదానం చేయ‌మ‌ని ఎం.ఐ.ఎం.పార్టీ ముస్లింల‌కు సూచించింది. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లోనే ప్ర‌త్యేక ప్రార్థనలు విడివిడిగానే జరుపుకోవాలని మ‌త‌పెద్ద‌లు సూచించారు.

వచ్చే వారం రోజలు అత్యంత కీలకం! అకుంఠిత దీక్షతో ఎదుర్కొందాం!

వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  మార్చి 24న ప్రధాని మోదీ మూడువారాల లాక్‌డౌన్‌ ప్రకటించాక మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం మూడో వారంలోకి చేరుకున్న క్రమంలో ఏప్రిల్‌ 14 తర్వాత ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి మాదిరిగానే దేశప్రజలంతా ప్రభుత్వానికి సహరించి కరోనాను పూర్తిగా అంతం చేయాలని  పిలుపునిచ్చారు. బలమైన నాయకత్వం వల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్నారు.  ఆర్థికంగా దేశానికి నష్టం వాటిల్లినప్పటికీ తిరిగి గాడిలో పెట్టవచ్చని, అదే మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావని ఈ సందర్భంగా ఆయన  వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కారణంగా కరోనావైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామన్నారు. భౌతికదూరం పాటించకపోతే ఎంతటి విపత్తు ఏర్పడుతుందో తబ్లీగీజమాత్‌ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైందని, ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కచ్ఛితంగా భారతదేశం కరోనాపై విజయం సాధించితీరుతుందని ఆయ‌న‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కలకాలం హాయిగా జీవించాలంటే ఇంకొన్ని రోజులు ఇబ్బందులను భరించాలని ప్రజలకు ఉప‌రాష్ట్ర‌ప‌తి విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా పై అంతిమ విజయం సాధించే వరకు అకుంఠిత దీక్ష ను మనం ప్రదర్శించాల్సి ఉందన్నారు.

ఊహాగానాలు వ‌ద్దు! లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకోలేదు!

ఏప్రిల్‌ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించడం పై కేంద్రం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణుల సూచనలు చేశారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఊహాగానాలు వద్దని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. మత ప్రదేశాల్లో కార్యకలాపాలపై మే 15 వరకు ఆంక్షలతో పాటు, మే15 వరకు విద్యా సంస్థల మూసివేయాల‌ని కరోనా నేప‌థ్యంలో కేంద్ర మంత్రుల బృందం సిఫారసు చేసింది. అయితే విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్‌ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగే అవకాశం వుంది. సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్‌ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్ట‌నున్నారు. ఆల్కహాల్‌ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.

హిందూ మ‌హిళ పాడే మోసిన ముస్లింలు!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని జునా ప్రాంతంలో నివాసం ఉంటూ దుర్గామాగా పిలువబడే 65 ఏళ్ల వృద్ధురాలు ఆనారోగ్యకారణాలతో మరణించింది. ఈ సమాచారాన్ని వేరే ప్రాంతంలో ఉన్న ఆమె కుమారులకు అందించగా వెంటనే వారు ఇండోర్‌కు చేరుకున్నారు. అయితే తల్లి దహనసంస్కారాలు చేసేందుకు వారివద్ద సరిపడా డబ్బులు లేవు. కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో బంధువులు, స్థానికులు ఎవరూ కూడా అంత్యక్రియలకు రావడానికి సాహసం చేయలేదు. దీంతో స్థానికంగా ఉన్న ముస్లింయువకులు అక్కడికి చేరుకుని దహనసంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అంతే కాదు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏ విధమైన వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, మాస్క్ లు ధరించి, తమ భుజాలపై పాడెను మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. తమకు ఆ మహిళ చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం తమ విధిగా భావించామని ముస్లిం యువకులు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనుషులంతా కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహరించుకుంటున్నారు. హిందూ-ముస్లిం భాయీ భాయీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులపై మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ ప్రశంసలు కురిపించారు.

కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా?

కరోనా వ్యాప్తికి పరోక్షంగా కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేస్తోన్న కేసీఆర్ పై డీజీపీ ఎందుకు కేసు బుక్‌చేయ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొదట్లో కరోనా వస్తే పారాసిటమల్ వేసుకుంటే సరిపోతుందన్న కేసీఆర్ ఇప్పుడు అది భయంకరమైన రోగం అంటున్నారని గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడటమేంటని ఆయ‌న అన్నారు. అన్నీ తనకే తెలిసినట్టు సీఎం కేసీఆర్ బుర్ర లేకుండా వ్యవహరించవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. కరోనాపై కేసీఆర్ ఎన్నిసార్లు మాటమార్చారో చూసుకుంటే ఆయనకే సిగ్గేస్తుందని, ఏప్రిల్ ఏడు తర్వాత కరోనా ఉండదన్న కేసీఆర్... తాజాగా జూన్ మూడు అంటున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఏం చెప్పినా చప్పట్లు కొట్టాలా అని ప్రశ్నించారు. తన తప్పుడు పనులను ప్రశ్నించే వాళ్లకు కరోనా రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రోజువారీ కూలీలకు కనీస వసతులు కల్పిస్తే వాళ్లు రోడ్లపైకి రారని రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కోసం వందల కోట్ల విరాళాలు వస్తున్నాయని వాటన్నింటినీ వారికి అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 63 హాట్ స్పాట్ లు....

ఆంధ్ర ప్రదేశ్ లో12గంటల వ్యవధిలో 11 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఎఫెక్ట్‌ మొదలైన తర్వాత అతితక్కువ కేసులు నమోదు. మొత్తం 314కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య. గుంటూరు జిల్లాలో కొత్తగా 9 కేసుల నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో నలుగురి మృతి. పూర్తిగా కోలుకుని ఆరుగురు డిశ్చార్జ్‌ అయ్యారు.  రాష్ట్రంలో63 హాట్ స్పాట్లు. 24గంటలు వైద్య పరీక్షలు. మూడు షిప్టు ల్లో పనిచేసేలా చర్యలు తిరుపతిలో కొత్త మిషన్ ..రోజుకు 3వేల పరీక్షలు. ఇప్పటికి లక్ష మందికి పైగా పరీక్షలు పూర్తి. 2లక్షల ర్యాపిడ్ టెస్టుల కిట్లకు ఆర్డర్. కర్నూలు లో అత్యధికంగా 74 మందికి కరోనా పాజిటివ్. నెల్లూరు 42,గుంటూరు 41,కృష్ణా29,కడప 28,ప్రకాశం 24,ప.గో.21,విశాఖ 220,చిత్తూరు 17,తూ. గో.11,అనంతపురం6 కేసులు నమోదు.

అందరికి టెస్ట్‌ చేయ‌డం ఆచరణ సాద్యం కాదు!

ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.

వేసవి సెలవులు రద్దు! లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పెంపు!

తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కోర్టు లాక్‌డౌన్ ను ఏప్రిల్ 30 వరకుపొడిగించి, వేస‌వి కోర్టు సెలవులను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. న్యాయమూర్తులు ప్రస్తుత పరిస్థితిపై బార్ లీడర్లు, వైద్య నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అనంతరం ఏప్రిల్ 30 వరకు కోర్టుల లాక్‌డౌన్ పొడిగించి, ఈ ఏడాది వేసవి సెలవులను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 5 వరకు చేస్తాయి. ఏప్రిల్ 25న మరోసారి పరిస్థితిని సమీక్షిస్తామ‌ని రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అప్పటి వరకూ వర్చువల్‌‌గా కోర్టులు అత్యవసర కేసులను విచారణ జరుపుతాయన్నారు. రాష్ట్రంలోని కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వ‌నున్నారు.

విజయవాడ నుంచి వెళ్లే బస్సులకు 15 నుంచి పచ్చ జెండా

ఏప్రిల్ 15 నుంచి బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ఏ పీ ఎస్ ఆర్టీసీ పేర్కొంది. దీంతో, పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడం వల్ల లాక్‌డౌన్ పొడిగిస్తారని వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది. ఇప్పటికే లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, వ్యాపార రంగాలు కుదేలయ్యాయి.  మళ్లీ పొడిగిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టేస్తుందని అధికార వర్గాల సమాచారం. వివరాల్లోకెళితే.. ఏపీఎస్ ఆర్టీసీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి బస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ పేర్కొంది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.  ఏసీ బస్సుల బుకింగ్స్‌ను మాత్రం నిలిపివేసింది. అది కూడా విజయవాడ బస్టాండ్ నుంచి వెళ్లే సర్వీసులను మాత్రమే ప్రారంభించింది. 115 సర్వీసులకు టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించిన ఆర్టీసీ, కరోనా ప్రభావం తగ్గితే దశల వారీగా బస్సుల బుకింగ్స్ ప్రారంభిస్తామని తెలిపింది.

కరోనాతో ఇండో అమెరికన్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిబొట్ల మృతి

ఇండో – అమెరికాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మ్ కంచిభొట్ల కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సుధామ తెలిపారు. అయితే ఆయన తొమ్మిదిరోజుల నుంచి హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మ్ కంచిభొట్ల యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకు కరెస్పాండెంట్‌గా వ్యవహరించారు. అమెరికాలో జర్నలిస్ట్ గా 28సంవత్సరాలు పనిచేశారు. దీంతో పాటు మెర్జర్ మార్కెట్స్ అనే ఫైనాన్సియల్ పబ్లికేషన్‌కు 11సంవత్సరాలు కంటెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. దీంతో పాటు న్యూస్ ఇండియా-టైమ్స్ వీక్లీ న్యూస్ పేపర్‌‌కు కూడా తన సేవలను అందించారు. బ్రహ్మ్ 1992వరకు భారత్‌లోనే జర్నలిస్ట్‌గా పనిచేసి… ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంబిస్తున్నందువలన బ్రహ్మ్ కంచిభొట్ల అంత్యక్రియలకు కేవలం 10మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయని చెప్పారు ఆయన కుమారుడు సుధామ. మార్చ్23న తన తండ్రి బ్రహ్మ్ కంచిభొట్లకు కరోనా లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు ఆయన సన్నిహితులు. దీంతో డాక్టర్లు చికిత్సను మొదలు పెట్టారని… మార్చ్ 28నాటికి పరిస్థితి విషమించడంతో లాంగ్ ఐలాండ్ అనే హాస్పిటల్‌లో చేర్పించామని.. అప్పటినుంచి బ్రహ్మ్ కంచిభొట్లను వెంటిలేటర్‌పైనే ఉంచారని చెప్పారు. అయితే సోమవారం కార్డియాక్ అరెస్ట్ అయిందని దీంతో బ్రహ్మ్ కంచిభొట్ల చనిపోయారని తెలిపారు. బ్రహ్మ్ కంచిభొట్లకు భార్య అంజనా, కొడుకు సుధామ, కూతురు సియుజనా ఉన్నారు.

40 మందికి పాజిటివ్ రావ‌డంతో 404కి పెరిగిన కరోనా కేసులు!

ప‌రిస్థితి తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణా స‌ర్కార్ మొత్తం ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజ్‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డానికి సిద్ధ‌మైంది. తెలంగాణాలోని మొత్తం 22 ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజ్‌ల‌ను క‌రోనా రోగుల కోసం ఉప‌యోగించ‌నున్నారు. ఈ కాలేజ్ హాస్పిట‌ల్స్‌లో 12 వేల ప‌డ‌క‌లు సిద్ధం చేశారు. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మంగళవారానికి 404కు చేరుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే 40 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఈరోజు ఏ ఒక్కరూ డిశ్చార్జి కాలేదని వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు మొత్తం 348 మంది ఉన్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే కరోనా రోగుల సంఖ్యలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (36), వరంగల్ అర్బన్ (23) ఉన్నాయి. జోగులాంబ గద్వాల (22), మేడ్చల్ మల్కాజ్ గిరి (15), ఆదిలాబాద్ (11) జిల్లాల్లోనూ కరోనా తాకిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను కూడా విడుదల చేశారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి హెల్త్ బులెటిన్‌లో వివరించారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఇప్పటివరకూ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగినట్లుగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సీఎస్ అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని వివరించారు.

గుంటూరు లో 10 కరోనా రెడ్ జోన్లు: జిల్లా కలెక్టర్

యువకులు వాహనాలతో రోడ్ల మీదకు వస్తే, పేరెంట్స్ మీద కేసులు: అర్బన్ ఎస్ పీ రామకృష్ణ  గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 8 కేసులు నమోదయ్యాయని, జిల్లాలో ఇప్పటివరకు 41 కేసులు నమోదు, కాగా వీటిలో 27 కేసులు గుంటూరులోనే నమోదయ్యాయని చెప్పారు.  మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్, ఆనందపేట, బుచ్చయ్యతోట, నల్లచెరువు, సంగడిగుంట,  శ్రీనివాసరావుతోట, ఆటోనగర్, ఎల్బీ నగర్, కొరిటపాడు ప్రాంతాలను రెడ్ జోన్లగా గుర్తించాం,రెడ్ జోన్లలో ఇళ్ల నుంచి ప్రజలు ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.   దిల్లీ వెళ్లివచ్చినవారిని కలిసినవారు, కోవిద్- 19 లక్షణాలున్నవారు పరీక్షలకు ముందుకు రావాలని,  ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్కులు మూసివేయాలని కోరారు.  ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమానితులు వస్తే నోటిఫై చేయాలని సూచించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు, నిత్యావసర దుకాణాలు, మందుల కోసం మాత్రమే రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  గుంటూరు నగరాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నామని,  ఇకపై గుంటూరుకు మూడే రహదారులు  ఉంటాయని, నిత్యవసరాల కొనుగోళ్ల  సమయాన్ని ఉదయం 6 నుంచి 9 వరకు కుదించామని జిల్లా కలెక్టర్ వివరించారు.  అర్బన్ ఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ,  రోడ్డు మీద యువకులు వాహనంతో వస్తే తల్లిదండ్రులపై కేసులు  నమోదు చేస్తామని హెచ్చరించారు. రెడ్ జోన్లలో రాకపోకలపై పూర్తిగా నిషేధం విధింపు ఉన్నట్టు ప్రకటించారు.

సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు!

నర్సీపట్నంలో ఆరోపణలు చేసిన వ్యక్తి అసలు డాక్టరేనా ? రాజకీయ నాయకుడా, అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. " సీఎంలను వాడు వీడు అంటున్న ఆ డాక్టర్ కి ఎంత బలుపు," అని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పేర్ని నాని, డాక్టర్ ఆరోపణ చేసిన ఆసుపత్రిలోనే 20పీపీఈలు ఉన్నాయని చెప్పారు. " అసలు ఆ ఆసుపత్రి కరోనా ఆసుపత్రి కాదు.ఏపీలో 7 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోజుకు 1175 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. 24,000 వేల బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి.ఎన్‌-95 మాస్క్‌లు,పీపీఈ కిట్స్‌ సమృద్ధిగా ఉన్నాయి," అని చెప్పిన మంత్రి ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు.

నెలాఖరు దాకా ప్రయివేట్ రైలు సర్వీసుల నిలిపివేత

కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడిగింపుపై సంప్రదింపులు సాగుతున్న క్రమంలో ఈనెల 30 వరకూ తాను నిర్వహిస్తున్న మూడు ప్రైవేట్‌ రైళ్ల సర్వీసులను నిలిపివేయాలని భారత రైల్వేల అనుబంధ ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ రైళ్లో టికెట్లను బుక్‌ చేసుకున్న ప్రయాణీకులందరికీ పూర్తి సొమ్మును రిఫండ్‌ చేస్తామని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అంతకుముందు ఐఆర్‌సీటీసీ 21 రోజుల లాక్‌డౌన్‌ ముగిసే ఏప్రిల్‌ 14 వరకూ బుకింగ్స్‌ను సస్పెండ్‌ చేసింది. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్‌ రైళ్లను, కాశీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. కాశీ మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ వారణాసి-ఇండోర్‌ రూట్‌లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్‌ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్‌ రైళ్లను ఏప్రిల్‌ 15-30 వరకూ ఐఆర్‌సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.