సిఎం‌ కేసీఆర్ మాటలకే పరిమితం అవుతున్నారు!

ఓ వైపు కరోనా ప్రభావం, మరోవైపు వడగళ్ళ వానతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. యాదాద్రి జిల్లాలో వడగళ్ల వానతో తీవ్ర నష్టం జరిగినా ఏ ఓక్క అధికార పార్టీ ఎమ్మెల్యే రైతులను పరామర్శించలేదు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఎంపి డిమాండ్ చేశారు. బత్తాయి నిమ్మ రైతులతో రైతులకు తీవ్ర నష్టాలు తెస్తున్నాయి.అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా సిఎం‌ కేసీఆర్ మాటలకే పరిమితం అవుతున్నారు. ప్రశ్నిస్తే ,లోపాలు బయటకు తీసుకువస్తే మీడియాను బెదిరిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సి.ఎం. ఫామ్ హౌజ్ చుట్టూ డబుల్ రోడ్లు ,ఫామ్‌హౌజ్ లో కొత్త ఇళ్లు, ప్రగతి భవన్ లో ఇళ్లు కట్టుకోవడానికే సిఎం బిజీగా వున్నార‌ని ఎంపి విమ‌ర్శించారు.

హైద‌రాబాద్‌లో 12 కంటైన్మెంట్ క్లస్టర్ లు...

కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు మిరాజ్ హుస్సేన్, డి జి పి మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, సి పి.అంజనీ కుమార్ లతో కలిసి ఖైరతాబాద్ జోన్లోని మల్లేపల్లి ( నాంపల్లి )లో పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కోవిద్ -19 నియంత్రణకు నగరంలో 12 కంటైన్మెంట్ క్లస్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లస్టర్ల పరిధి లోని ప్రజలు బయటకు రాకూడదని కోరారు. అలాగే బయటి వ్యక్తులు కూడా కంటైన్మెంట్ ప్రాంతంలోకి వెళ్లకూడదని సూచించారు. ఈ నిబంధనల అమలుకు పూర్తిగా బారికేడింగ్ చేసి, వైరస్ ను ఎక్కడ కక్కడ కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లోపల వున్న వారి సమస్యలను తెలియజేయుటకు ప్రత్యేక నెంబర్ ను కేటాయించ నున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు 12 కంటైన్మెంట్స్ ప్రకటించినట్లు తెలిపారు.కంటైన్మెంట్ నిబంధనల అమలును మానిటరింగ్ చేయుటకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని జి హెచ్ ఎం సి కమీషనర్ కు సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను అమలు చేయాలని జోనల్, డిప్యూటీ కమీషనర్లు ఆదేశించారు కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టుటలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇదేవిదంగా ఇకముందు కూడ వ్యవహరించాలని కోరారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ డాక్టర్ ప్రాణం తీసిన బ్రిటన్ లాక్ డౌన్

డాక్టర్ గోవర్ధనరెడ్డి. లండన్ వెళ్ళే చాలామంది తెలుగువాళ్ళకు ఆయన అక్కడ కేరాఫ్ అడ్రస్. నల్గొండ జిల్లా వాసి. వైద్యవిద్యలో పై చదువుల కోసం లండన్ వెళ్లి స్థిరపడి అక్కడే యాభయ్ ఏళ్ళకుపైగా వుంటున్నారు. లంకంత ఇల్లు. పెళ్లి చేసుకోలేదు. ఏడాదికోమారు హైదరాబాదు వచ్చి స్నేహితులను కలిసి తిరిగి వెళ్ళడం ఆనవాయితీ. ఫిబ్రవరి చివరివారంలో డాక్టర్ వెంకటరెడ్డి (మిర్యాలగూడ డాక్టరు గారు) ఇంట్లో ఓ సాయంత్రం అయన తన మిత్రులను కలుసుకున్నారు . ఒకళ్ళా ఇద్దరా దాదాపు పదిహేను ఇరవై మందిమి. డాక్టర్ గోవర్ధన రెడ్డిని చివరిసారి చూసింది అప్పుడే, అంటూ సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.    తరువాత వారానికే ఆయన లండన్ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు తలలో ఒక బొడిప లాంటిది వచ్చింది. పోయేది ఇంగ్లాండ్. అక్కడ వైద్యానికి కరువా అంటూ ధీమా. పైగా స్వయంగా ఆయనే డాక్టరు. లండన్ లో చూపించుకుంటే అన్ని పరీక్షలు చేసి కేన్సర్ అని తేల్చారు. వెంటనే కీమో తెరపి మొదలు పెట్టారు. కిందటి వారం కీమో రెండో సెషన్. ఒక రోజు ముందు హాస్పిటల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోను చేస్తారు. దానికోసం రెండు ఫోను నెంబర్లు ఇవ్వాలి. ఈలోగా దురదృష్టం కరోనా కమ్మేసింది. ఎక్కడ చూసినా లాక్ డౌన్. స్నేహితులు చాలామంది వున్నా ఎవ్వరూ ఇళ్లు వదిలి బయటకు కదలలేని పరిస్తితి. అంచేత తన పొరుగు ఇంటివాళ్ళ నెంబరు ఇచ్చారు. కీమో సెషన్ నాడు గుర్తు చేయడానికి ఆస్పత్రి వాళ్ళు ఫోన్ చేసారు. ఒకటికి పదిసార్లు ప్రయత్నించినా ఇటునుంచి జవాబు లేదు. దాంతో వాళ్ళు ఆయన పొరుగింటి వారికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి చూసారు. లోపల నుంచి అలికిడిలేదు. పోలీసులకు తెలియపరిచారు. వాళ్ళు వచ్చి తలుపులు తెరిపించి చూస్తే లోపల డాక్టర్ గోవర్ధన్ రెడ్డి అచేతనంగా పడివున్నారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. మరునాడు ప్రాణం పోయిందని నిర్ధారించారు. హైదరాబాదుకు కబురు అందింది, కరోనా కారణంగా ఇక్కడి వాళ్ళు కదలలేని పరిస్తితి. ఇక్కడికి తీసుకురాలేని పరిస్తితి. చివరికి అలా ముగిసిపోయింది డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి జీవితం అంటూ, ఆయన సన్నిహితులు వాపోయారు. డాక్టర్ గోవర్ధన రెడ్డి వస్తుతః సౌమ్యులు. ఆ రోజు వారితో గడిపింది కొద్ది గంటలే అయినా త్వరగా మరచిపోలేని వ్యక్తిత్వమని భండారు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ( ఫోటో లో తెల్ల లాల్చీ తో ఉన్నది డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, లండన్ లో ఆయన ఇంటి బయట, తన మిత్రులతో తీయించుకున్న ఫోటో )  

సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దనే ఉద్దేశంతో బొగ్గు తవ్వకాలను మాత్రం కొనసాగిస్తున్నారు. కానీ ఏప్రిల్ 1 నుంచి భూగర్భ గనుల్లో బొగ్గు తవ్వకాలను నిషేధించారు. ఓపెన్ కాస్ట్ గనులు మాత్రం యధావిధిగా పని చేస్తున్నాయి. అయితే కరోనా భూతం ఇప్పుడు సింగరేణిలోనూ కల్లోలం రేపుతోంది. సింగరేణిలో పని చేసే ఓ కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గని కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి నుంచి సింగరేణిలో పనిచేసే ఓ కార్మికుడు ఇటీవల మర్కజ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అతడి ద్వారా తన కుమార్తెకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే, వైరస్ బాధితుడు ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన తర్వాత కూడా విధులకు హాజరైనట్లుగా చెబుతున్నారు. దీంతో అతడితో కలిసి పనిచేసిన కార్మికులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సింగరేణిలో పని చేసే కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో యాజ‌మాన్యం అప్రమత్తమైంది. అతడితో ఎవరెవరు కలిసి పని చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం ఎప్పటికప్పుడు స‌మీక్ష చేస్తోంది.

నర్సరావుపేట లో రెండు రెడ్ జోన్లు

గుంటూరు జిల్లా నర్సరావు పేట లో నిన్న మృతి చెందిన మల్లెల శ్రీనివాసరావుకి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయినట్టు ఆర్ డీ ఓ, అలాగే డి ఎస్ పి ప్రకటించారు. శ్రీనివాసరావు నివాసం ఉండే వరవకట్ట, అలాగే అతను పని చేస్తున్న రామిరెడ్డిపేటని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. రెండు ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయబడుతుందని,  ఇక నుండి రెడ్ జోన్ ప్రాంతంలో ఎవ్వరూ కూడా బయటికి రావడానికి వీలులేదు. ప్రత్యేక వైద్య బృందాలతో ప్రతి ఇంటిని సర్వే చేపించడం జరుగుతుందని పోలీసు, రెవిన్యూ అధికారులు చెప్పారు. ప్రజలు కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలకు ముప్పు అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు.  

ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా కోటి పనిదినాలు

* ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం రూ.2149.78 కోట్లు * ఇప్పటికే కేంద్రం నుంచి రూ.460.81 కోట్లు  విడుదల. * జూన్ మాసాంతం వరకు చెల్లించేందుకు అందుబాటులో మరో రూ.1688.97 కోట్లు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్ తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ కార్యాచరణ వివరాలను మీడియాకు వెల్లడించారు.  ఉపాధి హామీ కోసం ఇప్పటికే రూ. 460.81 కోట్ల నిధులను  కేంద్రం విడుదల చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ జూన్ మాసాంతం వరకూ వేతన దారులకు చెల్లించటానికి మరో రూ.1688.97 కోట్ల నిధులు మనకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.  2019-2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020-21 లో  అదనంగా రూ. 26 లు పెంచి  రోజుకి  రూ. 237 లు   చొప్పున చెల్లించటం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. తద్వారా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రూ. 546 కోట్లు అదనంగా రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతన రూపంలో చెల్లింపులు జరుగుతాయని అన్నారు.    గత ఆర్దిక సంవత్సరంలో వేతన దారులకు రూ. 20.08 కోట్ల పనిదినాలు కల్పించి రూ 4084.86 కోట్లు వేతన రూపంలో చెల్లించటం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పధకం క్రింద గత ఆర్దిక సంవత్సరంలో మెటీరియల్ రూపంలో రూ  2624.18 లు, వేతన రూపంలో 4084.86 కోట్లు కలిపి మొత్తం రూ 6709.04 లు వ్యయం చేయటం జరిగిందని తెలిపారు. అయితే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాధాన్యతను ఇస్తూ 21 కోట్ల పనిదినాలను లక్ష్యంగా కేటాయించిందని తెలిపారు. ఇది గత సంవత్సరం కేటాయింపు కన్నా కోటి పనిదినాలు ఎక్కువని వెల్లడించారు.  రాష్ట్రానికి కేటాయించిన పనిదినాలను జిల్లా, ఇంకా నెలల వారీ లక్ష్యాలుగా విభజించి జిల్లా కలక్టర్లకు  పంపటం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ నిబంధననల ప్రకారం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో  జరిగే మొత్తం వ్యయంలో కనీసం 65% వ్యయం సహజ వనరుల యాజమాన్య పనులపై జరిగేలా కలక్టర్లు తగు జాగ్రత్త్తలు తీసుకోవలసినదిగా ఆదేశించటమైనది.    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల గ్రామీణ ప్రాంత పేదలు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందుల పాలుకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వారిని ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, భూగర్భగనుల శాఖామంత్రి వెల్లడించారు. ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, కూలీలు భౌతిక దూరంను పాటిస్తూ వాటిని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే కాలువలు, చెరువుల తవ్వకం వంటి  ఇతర పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టడం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

కరోనా రోగుల ట్రీట్మెంట్ కోసం ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూషన్

* కేరళ ప్రభుత్వానికి ఐ సి ఎం ఆర్ అనుమతి కోవిడ్ -19 వ్యాధికి సంబంధించి సౌత్ కొరియా అవలంబించిన ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూషన్  విధానాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయదలచింది. ఇందుకు  అవసరమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐ సి ఎం ఆర్ ఆమోదం కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది.  బ్లడ్ లోని ద్రవపదార్థ మైన ఈ ప్లాస్మా ను, వ్యాధి బారిన పడి దాని నుంచి బయటపడిన రోగుల నుంచి సేకరిస్తారు, అటువంటి రోగుల ప్లాస్మాలో ఈ వ్యాధికి సంబంధించిన యాంటీ బాడీస్ ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల,  ఈ వ్యాధిని అరికట్టేందుకు సహకరిస్తుంది సౌత్ కొరియా లో ఈ పద్ధతి ద్వారా వారు క్రిటికల్ కేసెస్ లో వైద్యాన్ని అందించే ఆ రోగులను కాపాడగలిగారు ఇదే పద్ధతిని ఇప్పుడు కేరళ ప్రభుత్వం అవలంబించేందుకు కావలసిన అనుమతులను ఐ సి ఎం ఆర్ ఇవ్వడం జరిగింది. మల్టీ సెంటర్ ట్రయల్స్ కు ఇంకా అనుమతులు రావాల్సి ఉన్నది. ఒక రికవర్ ఆయన రోగి నుంచి సుమారుగా 800 ఎం.ఎల్ ప్లాస్మాను తీసుకునే అవకాశం ఉంటుంది , ఒక్కొక్క రోగికి 200 ఎం.ఎల్ ప్లాస్మా ట్రీట్ మెంట్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది.  ఈ పద్ధతిలో ఫలితాలు సాధించినట్లు అయితే చాలా వరకు COVID-19 వలన సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని విజయవాడ కు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ సూచించారు.  

నిప్పులు చిమ్మే సూర్యుడి మధ్యన మర్యాద పురుషోత్తముడు!

* రామజన్మభూమి లోగో ఆవిష్కరించిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  * ఉవ్వెత్తున ఎగిసిన హిందూ జాతీయ వాదానికి, వాస్తవానికి రాజీవ్ గాంధీనే ప్రధాని హోదాలో బీజం వేశారనే వాదన ఇప్పటికీ 10, జనపథ్ లో వినిపిస్తూ ఉంటుంది  * తల్లి ఇందిరా గాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ అయిష్టంగానే ప్రధాని బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత యధాలాపంగా రామజన్మభూమి అంశం లో ఆయన తీసుకున్న నిర్ణయాలు -తర్వాతి ఉద్యమాలకు ఆక్సిజన్ అందించటం అందరికీ తెలిసిన విషయాలే  శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా రిలీజ్ చేసిన రామజన్మభూమి లోగో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హనుమజ్జయంతి సందర్భంగా ట్రస్ట్ ఈ లోగో ను రిలీజ్ చేసింది. ప్రకాశిస్తున్న సూర్యుడి మధ్యలో శ్రీరాముడు కనిపించేలా ఆకర్షణీయంగా లోగో ను రూపొందించారు. ఎరుపు, పసుపు, కాషాయ రంగులతో ఈ లోగో కు మరింత వన్నె తెచ్చారు. అయోధ్య లో శ్రీ రామ మందిర పునర్నిర్మాణం కోసం ఏర్పడిన ఈ ట్రస్ట్, ఏప్రిల్ 2 వ తేదీన ఆలయ నిర్మాణానికి శంకు స్థాపన కూడా చేసింది. ఈ సందర్భంగా,అయోధ్యలో ఒక పండుగ వాతావరణం ఆ రోజు నుంచీ నెలకొంది.   శతాబ్దాల పోరాటం తర్వాత జరగబోతున్న ఈ మహత్కార్యం వెనుక ఎవరెవరు, ఏ స్థాయిలో తమ సేవలందించారో అయోధ్య వాసులు, సాధు సంతులు గుర్తు చేసుకోవటం మొదలెట్టారు.  అయోధ్య వివాదాస్పద స్థలం రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన అంతిమ తీర్పులో- ప్రధాన న్యాయమూర్తిగా హోదాలో  రంజన్‌ గొగోయి, ఆ స్థానంలోకి రానున్న ఎస్‌.ఎ.బాబ్డే లతో సహా పంచసభ్య ధర్మాసనం నిర్విరామంగా నలభై రోజులు వాదోపవాదాలు విని ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కూడా కావడం అసాధారణ ప్రక్రియ. ఆ రీత్యా తీర్పుపై సమీక్షలు, పునర్విచారణలు అంత తేలికగా అనుమతి పొందలేకపోవచ్చు. బ్రిటిష్‌ పాలనలో నూట నలభై ఏళ్ల కింద మొదలై, స్వాతంత్య్రానంతరం డెబ్బై ఏళ్ల కిందట మరింత క్లిష్టమై, నూట పాతికేళ్లుగా కోర్టుల ముందు తిరుగుతున్న ఒక వివాదం, ఇంత వేగంగా తేల్చి చెప్పడం నిజంగానే గతంలో ఎరగని విషయం. ఇందులో జయాపజయాల ప్రసక్తి లేదనీ అందరూ తీర్పునకు కట్టుబడి శాంతిని కాపాడాలని ప్రధాని మోడీ, ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ అంటున్నారు. శాంతి సామరస్యాలను కాపాడుకోవాలని నొక్కి చెబుతూనే తీర్పునకు సంబంధించిన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారూ వున్నారు. దానికి సమస్య జటిలతతో పాటు తీర్పు లోని సంక్లిష్టత మిశ్రమ స్వభావం కూడా కారణమని చెప్పాలి. అయోధ్య వివాదం ఏయే దశల్లో ఎన్ని మలుపులు తిరిగిందీ కుదుపులు తెచ్చింది చాలా వివరంగా వచ్చింది గనక మళ్లీ ఏకరువు పెట్టడం అనవసరం. వివాదాస్పద స్థలంలో రామమందిరం కూలగొట్టి బాబర్‌ మసీదు కట్టించాడు గనక అక్కడే రామ మందిరం కట్టాలన్నది సంఘ పరివార్‌ ప్రధాన నినాదం. 1949 నుంచి తాళాలు పడి వున్న వివాదాస్పద స్థలం తాళాలు తెరిపించి ఆ తాళం దాని చేతికి ఇచ్చింది అప్పటి కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ గాంధీ. ఉత్తరోత్తరా 1992 డిసెంబర్‌ ఆరున మసీదు కూల్చివేతకు అవకాశమిచ్చింది పి.వి నరసింహారావు. సాధు సంతుల పేరిట ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది అద్వానీ బృందం. ఇదీ క్లుప్తంగా చరిత్ర. 'భిన్న విశ్వాసాల మధ్య ఘర్షణ వస్తే పరస్పరం సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. లేదంటే కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాలి'. అని ఈ కాలమంతటా కూడా వామపక్షాలు లౌకిక వాదులూ చెబుతూ వచ్చారు. ఆ సమయంలో పరివార్‌ అందుకు సుతరామూ అంగీకరించలేదు. విశ్వాసాలు, కోర్టు తీర్పులకూ రాజ్యాంగ నిబంధనలకు అతీతమని వాదించారు అద్వానీ. అలా అంటూనే కోర్టుకు ఇచ్చిన మాట తప్పి కూల్చివేతకు కారకులైనారు.  1992 తర్వాత పాతికేళ్లకు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం విశ్వాసాలు వున్నాయనే నిజం ఆధారంగా తీర్పు నివ్వడం పెద్ద విశేషం. కూల్చివేయబడిన మసీదు గోపురాల మధ్యనే రాముడు జన్మించాడని హిందువులు బ్రిటిష్‌ వారి కాలం నుంచి విశ్వసిస్తున్నారని కోర్టు విశ్వసించింది. మసీదు ప్రాంగణంలో 'రామ్‌ చబూత్రా'కు అది పరిమితం కాదని నొక్కి చెప్పింది. నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కంచె వేసిన కారణంగా వారు చబూత్రాకు పరిమితమైనారని అభిప్రాయపడింది. ఆనాటి నుంచి వారిలో ఆ విశ్వాసం వున్నదనే విషయాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు కూడా కాదనడం లేదని పేర్కొంది. మరో వంక ఆ స్థలంపై తమకు యాజమాన్యం వుందనే వక్ఫ్‌ బోర్డు వాదన కూడా రాముడు పుట్టాడన్న నమ్మకానికి ప్రతిబింబం వంటిదేనని రెంటినీ ఒకటిగా చెప్పింది. అయితే ఈ విషయంలో సమతుల్యతతో వ్యవహరించాలంటూ మరోవైపు నుంచి కూడా కొన్ని నిర్ధారణలు చేసింది. బాబర్‌ కాలంలో మసీదును ఖాళీ స్థలంలో కట్టలేదనీ, దాని కింద దొరికిన అవశేషాలు ఇస్లామేతర కట్టడానికి సంబంధించినవనీ సుప్రీం కోర్టు తీర్పులో చెప్పింది.అయితే అవతలి పక్షం వాదిస్తున్నట్టు అది రామాలయం అనడానికి గాని, దాన్ని కూల్చి ఇది కట్టారని చెప్పడానికి గాని ఆధారం లేదని పురావస్తు నివేదికల అధ్యయనంతో నిర్ణయానికి వచ్చింది. అలాగే అక్కడ మసీదు లేదనీ ప్రార్థనలు జరగడమేలేదని చెప్పడం కూడా వాస్తవం కాదని పేర్కొంది. అదే ప్రాంగణంలో గతం నుంచి ఇరు మతాల ప్రార్థనలు జరుగుతుండగా 1949లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెచ్చి పెట్టడం, 1992లో కూల్చివేత వారి విశ్వాసాలకు విఘాతమని కూడా స్పష్టీకరించింది. ఈ పూర్వ రంగంలో 2010న అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మొహి అఖాడా, రామ్‌లల్లా విరాజ్‌మాన్‌లకు సమానంగా కేటాయిస్తూ ఇచ్చిన తీర్పు తర్క విరుద్ధమన్నది ధర్మాసనం చేసిన కీలకమైన నిర్ధారణ. బహుశా ఇప్పటికే అక్కడ తాత్కాలిక ఆలయం వుండటం, ముగ్గురూ ఒకే చోట మనడం సాధ్యం కాదు గనక ఏదో విధంగా ముగింపు పలకాలన్న భావన కూడా దీని వెనక వుండొచ్చు. రామ్‌లల్లా తరపున రామజన్మభూమి న్యాస్‌ను న్యాయపరమైన కోణంలో పరిగణించవచ్చు గాని చట్టపరమైన ప్రతిపత్తితో చూడలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్నీ నిజమైనప్పటికీ వివాదానికి శాశ్వత పరిష్కారంగా వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను మొత్తంగా రామ మందిర న్యాస్‌కు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయిదు మాసాలలో అక్కడ మందిరం కట్టాలని, ఇందు కోసం ఒక ట్రస్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పింది. సున్నీ బోర్డుకు కేంద్రం లేదా రాష్ట్రం అయోధ్య లోనే ప్రముఖమైన చోట అయిదు ఎకరాలు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలన్నారు. ఇది మసీదు కూల్చివేతకు పరిహారంగా భావించాలన్నమాట. కేసులో మూడోవాదిగా వున్న 'నిర్మొహి అఖాడా' స్థూలంగా హిందూ పక్షమైనా ఆలయానికి అనుమతినిస్తే దానికి ఆధ్వర్యం వహించాల్సింది తామేనని చేసిన వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. అఖాడాకు నిర్వహణ పాత్ర మాత్రమే వుందని, వారికి రేపు ఏర్పాటు చేసే ట్రస్టులో ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్దేశించింది. 1045 పేజీలున్న ఈ తీర్పులో ధర్మాసనం విభిన్న కోణాలను సాక్ష్యాలనూ వాదోపవాదాలను తను పాటించిన నిబంధనలను సుదీర్ఘంగా పొందుపర్చింది.  అలాగే, అయోధ్య విషయం లో రాజీవ్ గాంధీ, పీ వీ నరసింహా రావు లు ప్రధానమంత్రుల హోదాలో పోషించిన పాత్ర, అలాగే- విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ హయాం లో పుట్టిన ఉద్యమ వేడి తీవ్రత లను కూడా ఈ రోజు అందరూ నెమరు వేసుకుంటున్నారు.

శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాల వెనుక రహస్యం...

తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు కూడా జరగడంలేదు.. శ్రీవారి అఖండ దీపం కొండెక్కిపోయింది..2 వేల అయిదు వందల ఏళ్ళ తర్వాత శ్రీవారి ఆలయం మూసివేశారు..వసంతోత్సవాల సందర్భంగా నైవేద్యాలు వెంటవెంటనే పెట్టి తీరని అపచారం చేశారు..కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి భక్తులకు దర్శనాలు నిలిపివేసిన నాటినుంచి ఇలాంటి ఎన్నో వదంతులు, దుష్ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి మనం చూస్తూనే, వింటూనే ఉన్నాం.  ఇవన్నీ కేవలం వదంతులేనని భక్తులెవరూ వీటిని నమ్మవద్దని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, పెదజీయర్ స్వామీజీలు కూడా ఎన్నడూ లేని విధంగా మీడియా ముఖంగా వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా తెలిసినవే. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామికి  అన్ని సేవలు జరుగుతున్నాయని, కొన్ని వేల సంవత్సరాల అనంతరం తిరుమల ఆలయాన్ని మూసివేశారంటూ వస్తున్న వదంతులను, జరుగుతున్న దుష్ప్రచారాన్నినమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని కైంకర్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయని, వసంతోత్సవాల సందర్భంగా మొదటి గంట నైవేద్యం, రెండో గంట నైవేద్యం వెంటవెంటనే పెట్టారని, ‘ఇది అపచారం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు సృష్టిస్తున్నారని, ఇలాంటివి నమ్మొద్దని సూచించారు. ఇలా దుష్ప్రచారం చేసే వారు చట్ట రీత్యా శిక్షార్హులు అని హెచ్చరించారు. శ్రీవారి ఆలయంలోని అఖండ దీపం కొండెక్కిపోయింది అని పుట్టిన వదంతులపై పెదజీయర్ స్వామీజీ కూడా స్వయంగా మీడియాలో వివరణ ఇచ్చారు. ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడే ప్రశ్న తలెత్తే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇన్ని వదంతులు, దుష్ప్రచారాలు జరుగుతున్నా, అందరికన్నా ముందుగా వీటిని అరికట్టాల్సిన  టీటీడీ అధికారిక చానల్ ఎస్వీబీసీ మాత్రం మొద్దు నిద్ర పోతోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. కొందరైతే అసలు ఈ వదంతుల వెనుక సదరు ఛానల్ ‘పెద్ద’ హస్తం కూడా లేకపోలేదనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి ఆలయంపై ఈ స్థాయిలో దుష్ప్రచారాలు  రావడం వెనుక ఎస్వీబీసీ సిఈఓ యలమంచలి వెంకట నగేష్ పాత్ర ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ సిఈఓగా నియమితులైన సదరు వ్యక్తికి గత ఏడాది మే నెలతోనే పదవీ కాలం ముగిసిందనీ తన పదవీ కాలాన్ని మరి కొంత కాలం పొడిగించాలని అయన చేసుకున్న విన్నపాలు, నడిపిన లాబీయింగ్ పని చెయ్యకపోవడం వల్ల జగన్ ప్రభుత్వాన్ని హిందూ వ్యతిరేకిగా చూపే ప్రయత్నం జరిగి ఉండవచ్చన్న అనుమానాలు కూడా తీసివేయలేమని అభిప్రాయపడుతున్నారు.

యు.ఎస్. కంపెనీలు ఖచ్చితంగా చైనాను వదిలివేస్తున్నాయి!

చైనా-అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న వాణిజ్య యుద్ధంలో యు.ఎస్ కంపెనీలు ఇక చైనాను వదిలివేయ‌నున్నాయి. గ‌త రెండేళ్లలో వందల బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై రెండు దేశాలు భారీ స్థాయిలో సుంకాలు విధించుకున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో అమెరికా అవుట్‌సోర్సింగ్ కోసం ఇత‌ర ప్రాంతాల‌పై దృష్టి పెట్టింది. చైనాలో వున్న అమెరిక‌న్ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు క‌రోనా  మహమ్మారికి మరింత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. గ‌త 30 ఏళ్ళ అమెరికా-చైనా వాణిజ్య బంధానికి ఇక తెర‌ప‌డ‌నుంద‌ని కెన్నెత్ రాపోజా విశ్లేషించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కన్సల్టింగ్ సంస్థ కిర్నీతన  వార్షిక రీషోరింగ్ ఇండెక్స్ను విడుదల చేసింది,  యు.ఎస్. దేశీయ తయారీ 2019 లో గణనీయంగా ఎక్కువ వాటాను సాధించింది, చైనా నుండి అవుట్‌సోర్సింగ్ దిగుమతులు త‌గ్గాయి. సౌత్ ఏషియా దేశాల ద్వారా అవుట్‌సోర్సింగ్ దిగుమ‌తులు పెంచుకోవ‌డానికి అమెరికా సిద్ధం అవుతోంది. చైనా-అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇత‌ర ఏషియ‌న్ దేశాలు లాభ‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌ట్టికే అమెరికా ప్ర‌త్యేమ్నాయంగా 14 మంది ఆసియా ఎగుమతిదారులు గుర్తించింది.   చైనాలో వున్న అమెరిక‌న్‌ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు తమ ఉత్ప‌త్తుల‌పై పునరాలోచనలో పడ్డాయి, సుంకాల నేప‌థ్యంలో ఇక ఆగ్నేయాసియాకు మకాం మార్చడానికి తమ చైనా భాగస్వాములను ఒప్పించాయి. "మూడు దశాబ్దాల క్రితం, యు.ఎస్. వ్యాపార‌సంస్థ‌లు చైనాలో ఉత్ప‌త్తి ప్రారంభించాయి. అవుట్ సోర్సింగ్ ద్వారా ఇక్క‌డ ఉత్ప‌త్తి వ్య‌యం త‌క్కువ‌గా ఉండ‌టం ఒక కారణం. వియత్నాం నేతృత్వంలోని చిన్న చిన్న‌ ఆగ్నేయాసియా దేశాలతో పాటు మెక్సికో ద్వారా అవుట్‌సోర్సింగ్‌ ఉత్ప‌త్తులు పెర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి మరియు మార్చి ప్రారంభంలో కంపెనీలు ఫ్యాక్టరీ మూసివేత కారణంగా ఆన్లైన్లో సరఫరాను పొందలేకపోయాయి, U.S. లో వ్యాపారాన్ని నిలిపివేసింది. చైనా కుదుట ప‌డితే  COVID-19 వ్యాధితో యు.ఎస్. ఘోరంగా దెబ్బతింది.  యు.ఎస్ అనారోగ్య బేలో చిక్కుకుంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల కలిగే సామాజిక మరియు ఆర్థిక న‌ష్టం తీవ్ర‌త పూర్తి స్థాయి ఇంకా తెలియదు, కిర్నీ నివేదిక ప్ర‌కారం  చైనా వాణిజ్యానికి పూర్వ ద‌శ వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. ఇబుప్రోఫెన్, హజ్మత్ సూట్లు, రబ్బరు చేతి తొడుగులు, సర్జికల్ మాస్క్లు, వెంటిలేటర్ల ను చైనా చైనా ఎగుమ‌తి చేస్తోంది.   యు.ఎస్. రీషోరింగ్ ఇండెక్స్ ను అంచనా వేయడానికి, చైనా, తైవాన్, మలేషియా, ఇండియా, వియత్నాం, థాయ్లాండ్, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, హాంకాంగ్, శ్రీలంక మరియు కంబోడియా నుండి తయారు చేసిన వస్తువుల దిగుమతి పెరుగుతోంది. 14 ఆసియా దేశాల నుండి తయారు చేయబడిన అన్ని దిగుమతుల విలువ 2018 లో 816 బిలియన్ డాలర్ల నుండి 2019 లో 757 బిలియన్ డాలర్లకు తగ్గింది.  కిర్నీ ప్రకారం, చైనా నుండి దిగుమతులు క్షీణించాయి.  ఇది సుంకం వ్యయాల కారణంగా అత్యధికంగా 17% వద్ద పడిపోయింది. కార్పొరేట్ పెట్టుబడులకు యు.ఎస్ ఆకర్షణీయంగా ఉండటానికి ఏకైక మార్గం చైనాతో సమానంగా దాని ఖర్చులను పొందడం. కార్మిక వ్యయాలపై చైనాతో పోటీ పడలేనప్పటికీ, యుఎస్ కార్పొరేట్ పన్నులపై, సమృద్ధిగా మరియు అర్హత కలిగిన బ్లూ కాలర్ శ్రమశక్తిపై పోటీ పడవచ్చు మరియు పర్యావరణ నిబంధనలను అమలు చేయడం ద్వారా కంపెనీలను సాంకేతిక పరిజ్ఞానం మరియు కన్సల్టెంట్లపై అధికంగా ఖర్చు చేయమని బలవంతం చేయదు. వారి బాటమ్ లైన్. అధ్యక్షుడు ట్రంప్ తన సుంకాలను చైనా వ‌స్తువుల‌పై విప‌రీతంగా పెంచారు. U.S. దిగుమతిదారు ఇప్పుడు మేడ్ ఇన్ చైనా కోసం ఎక్కువ చెల్లిస్తున్నందున U.S. కంపెనీ యొక్క చైనా భాగస్వాములు బాధపడుతున్నారు. ఇది చైనాను ఎగుమతి కేంద్రంగా ఉపయోగించడం వల్ల కలిగే ఖర్చు ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. కిర్నీ చైనా డైవర్సిఫికేషన్ ఇండెక్స్ (సిడిఐ) యుఎస్ తయారీ దిగుమతులు చైనా నుండి మరియు జాబితాలోని ఇతర ఆసియా దేశాలకు మారడాన్ని ట్రాక్ చేస్తుంది. చైనా ఇప్పటికీ ప్ర‌ధాన ఎగుమ‌తి భాగ‌స్వామి అయిన‌ప్ప‌ట్టికీ  ట్రంప్ నిర్ణ‌యాల‌వ‌ల్ల ఎగుమ‌తి వాటాను ఎక్కువగా కోల్పోతోంది. 2013 లో, సిడిఐ యొక్క బేస్ ఇయర్, చైనా అన్ని యు.ఎస్-బౌండ్ ఆసియా-ఆధారిత తయారీ వస్తువులలో 67% కలిగి ఉంది. 2019 రెండవ త్రైమాసికం నాటికి, దాని వాటా 56% కుప్పకూలింది, ఇది 1,000 బేసిస్ పాయింట్లకు పైగా తగ్గింది. చైనా నుండి మారిన యు.ఎస్. దిగుమతుల్లో 31 బిలియన్ డాలర్లలో, 46% వియత్నాం చేత గ్రహించబడింది, కొన్నిసార్లు అదే చైనా సరఫరాదారులు ప్రధాన భూభాగాన్ని విడిచిపెట్టారు. ఆ మార్పు ఫలితంగా వియత్నాం 2019 కు వ్యతిరేకంగా 2019 లో U.S. కు అదనంగా billion 14 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. కిర్నీ ఈ సంవత్సరం తన నియర్-టు-ఫార్ ట్రేడ్ రేషియో (ఎన్టిఎఫ్ఆర్) ను ప్రవేశపెట్టింది. ఇది మెక్సికోలో సమీప తీర ఉత్పత్తి వైపు యు.ఎస్. దిగుమతుల కదలికను ట్రాక్ చేస్తుంది. NTFR ను మెక్సికన్ తయారు చేసిన వస్తువుల వార్షిక మొత్తం డాలర్ విలువ యొక్క నిష్పత్తిగా లెక్కించారు, ఇది చైనాతో సహా ఆసియా 14 నుండి తయారు చేసిన దిగుమతుల డాలర్ విలువతో విభజించబడింది. 2013 నుండి, NTFR 36% మరియు 38% మధ్య స్థిరంగా ఉంది-ఆసియా నుండి యు.ఎస్. ఉత్పాదక వస్తువుల యొక్క ప్రతి డాలర్కు, మెక్సికో నుండి సుమారు 37 సెంట్ల ఉత్పాదక దిగుమతులు ఉన్నాయి. మెక్సికో 38% నుండి 42% కి చేరుకుంది. డాలర్-విలువ ప్రాతిపదికన, మెక్సికో నుండి యుఎస్ కు మొత్తం ఉత్పాదక దిగుమతులు 2017 మరియు 2018 మధ్య 10%, 278 బిలియన్ డాలర్ల నుండి 307 బిలియన్ డాలర్లకు, 2018 మరియు 2019 మధ్య మరో 4% పెరిగి, మొత్తం దిగుమతి విలువ 320 బిలియన్ డాలర్లకు పెరిగింద‌ని కిర్నీ నివేదిక తెలుపుతోంది.

తెలంగాణాలో 471కి పెరిగిన పాజిటివ్ కేసులు!

ఈ రోజు కొత్త‌గా మ‌రో 18 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరింది. ఇందులో మ‌ర్క‌జ్ నుంచి వ‌చ్చిన వారు 388 మంది వున్నారు. క‌రోనా బారిన ప‌డి  ఇప్ప‌ట్టి వ‌ర‌కు 12 మంది మృతి చెందారు. తెలంగాణాలో క‌రోనా క‌ట్ట‌డికీ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి ఈటెల తెలిపారు. ఏప్రిల్ 24 క‌ల్లా క‌రోనా బాధితులంతా కోలుకుంటార‌ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం అవ్వాల‌ని మంత్రి మ‌రోసారి పిలుపునిచ్చారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో 175 పాజిటివ్‌ కేసులు న‌మోదైయ్యాయి. అందుకే హైద‌రాబాద్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని మంత్రి తెలిపారు.  హైదరాబాద్‌లో వైరస్ వేగంగా ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు.  హాట్ స్పాట్స్ ప్రాంతాలను పూర్తిగా జీహెచ్ఎంసీ ఆధీనంలోకి తీసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.  జీహెచ్ఎంసీ సర్కిళ్ళ వారీగా అధికారులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను ఇష్యూ చేశారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించిన 15 ప్రాంతాలపై ఉత్తర్వులు జారీచేశారు జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు. రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ వంటి ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తలపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 89 మంది కంటైన్‌మెంట్ క్లస్టర్లు ప్రాంతాలలోనే నమోదవడంతో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

విపత్కర తరుణమిది.. అందుకే రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు

• సంయమనంతో వ్యవహరిద్దాం... లాక్ డౌన్ తరవాతే మాట్లాడదాం • రూ. వెయ్యి ఆర్థిక సాయాన్ని వైసీపీ అభ్యర్థులతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి • పేద ప్రజలకు అండగా నిలుద్దాం... కరోనా నియంత్రణలో ప్రధాని చెప్పిన సూచనలు పాటిద్దాం • రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అయింది. ఈ విపత్తులో పేద వర్గాలుపడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు మన పార్టీపరంగా అండగా నిలుద్దాం అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. లాక్ డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.. దాని ప్రకారం పేదలకు మనం ఏ విధంగా సహాయం చేయాలనే అంశంపై ఒక ప్రణాళిక అనుసరిద్దాం అన్నారు. ప్రధాన మంత్రి సూచనలను బాధ్యతాయుతంగా పాటించాల్సిన అవసరం అందరిపైనా ఉందని తెలిపారు.  గురువారం మధ్యాహ్నం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ విస్తృతి, లాక్ డౌన్ పరిణామాలపై పవన్ చర్చించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం, రోజువారీ కూలీలు, చిన్నపాటి వృత్తుల్లో ఉన్నవారు, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను, రైతుల సమస్యలను తెలియచేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేన కార్యకర్తలు చేస్తున్న సేవాకార్యక్రమాలను పార్టీ అధ్యక్షులకు తెలిపారు. చేతి వృత్తులవారు, ఆటో డ్రైవర్లు, హాకర్లు ఉపాధికి దూరమై ఆర్థికపరమైన ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనా వైరస్ విస్తృతి ఉన్న విపత్కర తరుణం ఇది. ఈ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారులనుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలి. లాక్ డౌన్ తరవాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదాం. పేద కుటుంబాలకు రూ.వెయ్యి పంపిణీ చేసిన తీరు, స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పంపిణీ చేయించడంపై  పీఏసీ సభ్యులు, నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు తమ పరిధిలో చోటుచేసుకున్న ఈ తరహా పంపిణీలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. అలాగే వైద్యులకు మాస్కులు, పి.పి.ఈ.లు తగిన విధంగా సమకూర్చని సమస్యపైనా స్పందించాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడంపై శ్రీ తోట చంద్రశేఖర్ గారు సూచనలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా, సోషల్ డిస్టెన్సింగ్, ఇతర నిబంధనలు పాటిస్తూ సేవాకార్యక్రమాల్లో పాల్గొందాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో నాయకులు, జనసైనికులు ఆహారం, కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తూ తమ వంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నారు” అన్నారు. పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “కరోనా వైరస్ వ్యాప్తి ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో కాదు అంతర్జాతీయంగా ఉత్పన్నమైన విపత్తు ఇది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నాన్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ప్రజలకు అవసరమైన భరోసా కల్పించలేకపోతోంది. మంత్రులు కూడా తగిన జాగ్రత్తలు పాటించకుండా పర్యటనలు చేస్తున్నారు. రైతుల సమస్యలు మన దృష్టికి వచ్చాయి. గౌరవనీయ ప్రధానమంత్రి గారు పేద కుటుంబాలకు అండగా ఉండాలి, కనీసం ఒక పేద కుటుంబానికి సాయం చేయండి అని చెప్పారు. మన పార్టీ నాయకులు పలు చోట్ల కూరగాయలు ఇస్తున్నారు. అలాగే విధుల్లో ఉన్న సిబ్బందికీ, పేదలకు ఆహారం అందిస్తున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎలా అండగా ఉండాలి అనే విషయంపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అని పార్టీ అధ్యక్షులు స్పష్టం చెప్పారు. వారు చేసే సూచనలకు అనుగుణంగా నిబంధనలు అనుసరిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలి” అన్నారు. పి.ఏ.సి. సభ్యులు నాగబాబు మాట్లాడుతూ “ఇది చాలా క్లిష్టమైన సమయం. పేద ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు ఇస్తూ జనసేన కార్యకర్తలు అభినందనీయమైన సేవలు చేస్తున్నారు. రిస్క్ తో కూడుకున్న సమయం ఇది. అయినప్పటికీ మన పార్టీ శ్రేణులు ముందుకు వెళ్తున్నారు. వీటిని మరింత పకడ్బందీగా చేయాలి” అన్నారు. వివిధ అంశాలను శ్రీ తోట చంద్రశేఖర్, శ్రీ టి. శివ శంకర్, శ్రీ బొలిశెట్టి సత్య, శ్రీ మధుసూదన్ రెడ్డి, డా. హరిప్రసాద్, శ్రీ బి.నాయకర్, శ్రీమతి పి.యశస్విని తదితరులు కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు.

'ఫేక్ న్యూస్'పై కార్యాచరణ ప్రారంభించాం: తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ

'ఫేక్ న్యూస్’ పై ఓ కార్యాచరణ ప్రారంభించామని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ‘కరోనా’ను ఓ మతానికి ఆపాదించవద్దని, పాత వీడియోలను ప్రస్తుతం జరిగిన ఘటనలుగా చూపిస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. పాత వీడియోలను గుర్తించేందుకు 10 మంది రీసెర్చర్స్ ఉన్నారని, ‘ఫ్యాక్ట్ చెక్’ యాప్ ద్వారా తప్పుడు వార్తలను గుర్తించ వచ్చని, ‘ఫ్యాక్ట్ లీ’ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీలో 95 శాతం మంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోం’ పద్ధతిలో పనిచేస్తున్నారని వివరించారు.

ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం

ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 14 కి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి కనిపించడం లేదు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా లాక్ డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. ప్రధాని మోడీ కూడా అఖిల పక్ష భేటీ లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయాలని ప్రధాని నిర్ణయించారు. అయితే అంతకంటే ముందే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రమేయం లేకుండా ఒడిశా లో లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. తమ రాష్ట్రానికి రైళ్లు, విమాన సర్వీసులు నెలాఖరు వరకూ నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. మరి మిగతా రాష్ట్రాలు కూడా నవీన్ పట్నాయక్ బాటలో పయనిస్తాయో లేక కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తాయో చూడాలి.

అనంతపురంలో విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు

ఏపీలో కరోనా పై పోరు కాస్తా.. డాక్టర్లు వర్సెస్ ప్రభుత్వం పోరులాగా మారేలా ఉంది. మాస్కులు, పీపీఈ కిట్స్ విషయంలో విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి ఘటనే అనంతపురంలో చోటు చేసుకుంది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వకుంటే వైద్యం చేయలేమంటూ జానియర్ డాక్టర్లు చెబుతుండగా.. ఐసోలేషన్ వార్డులో వైద్యం అందించే సిబ్బందికి మాత్రమే పీపీఈ కిట్స్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది వెనకంజ వేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.

నేత‌ల్లారా ఒక సంవ‌త్స‌ర జీత‌భ‌త్యాలు త్యాగం చేయండి!

కరోనా భూతంపై యుద్దం చేయ‌డానికి భార‌త‌మాత ముద్దు బిడ్డ‌లెంద‌రో ముందుకొచ్చి విరాళాలు ఇస్తూ సేవ చేస్తున్నారు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. వీరందరినీ మించి టాటా గ్రూపు అతి పెద్ద మనసుతో త‌మ‌కు సంబంధించి మొత్తం ఆస్థిని కూడా ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని ర‌త‌న్‌టాటా ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే దేశం కోసం మొత్తం ఆస్థిని ధార‌బోస్తానంటున్నాడు ఈ భార‌త మాత ముద్దు బిడ్డ‌.  టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ అయిన టాటా సన్స్‌ రూ.1,000 కోట్లు, టాటా ట్రస్టు రూ.500 కోట్లు మొత్తం 1500 కోట్ల విరాళం ప్రకటించాయి. దేశం వీరిని చేతులెత్తి మొక్కుతోంది. అయితే దేశానికి సేవ చేయ‌డానికే వ‌చ్చ‌మంటున్న మ‌న నేత గ‌ణం 545 ఎంపీ, 245 రాజ్యసభ స‌భ్యులు, 4120 ఎమ్మెల్యేలు మొత్తం 4910 మంది వున్నారుగా!  ఈ ఆప‌ద స‌మ‌యంలోనైనా,  మీరెందుకు విరాళాలు ఇవ్వ‌డం లేదు? మీరు దేశానికి సేవ చేయ‌డానికి రాలేదా?  నేత‌ల్లారా ఒక సంవ‌త్స‌రం జీత‌భ‌త్యాలు త్యాగం చేయండి! ఇప్ప‌ట్టికైనా మీరు స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌లు ఛీ కొడ‌తారు గుర్తుంచుకోండి. మ‌న నేత‌ల గురించి దేశం ఏంత‌ ఖ‌ర్చు పెడుతోంది. వీళ్ళు ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి పెట్టే ఖ‌ర్చు ఎంత‌? ఒక‌సారి ఆవివ‌రాల్లోకి వెళ్తే.... * ప్ర‌స్తుతం ఒక్కో శాస‌న‌స‌భ్యుడికి ఏడాదికి జీతం, అల‌వెన్సులు మొత్తం క‌లిపి 27 ల‌క్ష‌ల 60 వేల రూపాయ‌లు వ‌స్తున్నాయి. అలాగే జీతం, అలవెన్సులు కలిపి ముఖ్యమంత్రికి 50 ల‌క్ష‌ల 52 వేల రూపాయ‌లు, స్పీకర్, మండలి చైర్మన్‌కు 49 ల‌క్ష‌ల‌ 32 వేల రూపాయ‌లు, మంత్రులకు, చీఫ్ విప్, విప్‌లకు 48 ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుంటున్నారు. * ఒక్కో పార్ల‌మెంట్ స‌భ్యుడికి సంవ‌త్స‌రానికి వ‌చ్చే జీతం మొత్తం అల‌వెన్సుల‌తో క‌లుపుకొని 60 ల‌క్ష‌ల 95 వేల రూపాయ‌లు. ఎంపీల జీతభత్యాల చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 106 ప్రకారం దేశంలోని ఎంపీలకు జీతభత్యాలను నిర్ణయిస్తూ 1954లో చట్టం చేశారు. 1968లో రూ.400, 1985లో రూ.1000, 1996లో రూ.1500, 2001లో రూ.4000, 2005సంవత్సరంలో రూ.12,000, 2008లో రూ.16,000, 2010లో రూ.50వేలకు జీతాలు పెంచినారు. వీటితోపాటు ఆఫీసు, డైలీ, వైద్యం, ప్రయాణం, నియోజకవర్గాల ఆలవెన్సులు అదనంగా చెల్లిస్తున్నారు. అంతే కాదు వివిధ కార్పోరేష‌న్‌ల ఛైర్మ‌న్లు, కుప్ప‌లు తెప్ప‌లుగా వున్న రాజ‌కీయ స‌ల‌హాదారుల జీతాలు, అల‌వెన్సుల‌ను  ఒక్కో ప్ర‌భుత్వం ఒక్కోవిధంగా స‌మ‌ర్పించుకుంటోంది.  * క‌రోనా బాధితుల‌కు అవ‌స‌ర‌మైన వెంటిలేట‌ర్ల కొర‌త తీవ్రంగా వుంది. వీటిని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌జాప్ర‌తినిధులంతా త‌మ ఏడాది జీత‌భ‌త్యాల‌ను విరాళంగా ఇచ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ముందుకురావాలి.  అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం మన దేశంలో వీటి సంఖ్య 50 వేల లోపే ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల కోసం 14 వేల వెంటిలేటర్లను ఉపయోగిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో 10-12 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్ బారిన పడిన ప్రతి 100 మందిలో 10 మందికి శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటి వారినే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి తరలించి వెంటిలేటర్‌ను అమర్చుతారు.  శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతూ.. కరోనా వైరస్ బారిన పడిన వారికి మాత్రమే ఈ వెంటిలేటర్ అవసరం ఎక్కువగా ఉంటుంది.  ఒక్కో వెంటిలేటర్‌కు రూ.5-10 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.  * ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి కనిష్టంగా ఐదుకోట్ల రూపాయలతో మొదలుపెట్టి,  గరిష్టంగా పాతిక, ముప్పైకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  అదే ఎం.పి. ఎన్నిక‌ల‌కు ముప్పై కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. ఈ ఖ‌ర్చంతా కేవ‌లం త‌మ కోసమే పెట్టుకున్నారు మ‌న నేత‌లు. డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి గెలిచారు ఒక‌రు. డ‌బ్బు ఖ‌ర్చు చేసి అంత డ‌బ్బు పోగొట్టు కున్నా ఓడిపోయారు మ‌రొక‌రు. ఓడినా, గెలిచినా అంత డ‌బ్బు పోయినా వారి జీవ‌న‌శైలిలో ఎలాంటి మార్పు వుండ‌ద‌నేది మ‌నంద‌రం ప్ర‌తి ఎన్నిక‌ల్లో చూస్తూనే వున్నాం.  త‌మ కోసం అంతంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌డానికి వెన‌కాడ‌ని ఈ నేత‌గ‌ణం, ప్ర‌స్తుతం వున్న ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌మ జేబుల్లో ఎందుకు చెయ్యి పెట్ట‌డం లేదు. త‌మ ఖ‌జానాల్లోంచి డ‌బ్బును ఎందుకు బ‌య‌టికి తీయ‌డం లేదు? క‌నీస మాన‌వ‌త్వం నేత‌ల‌కు ఉండ‌దా? కేవ‌లం ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల కోసం ఖ‌ర్చు పెట్టి ఆ త‌రువాత రెండు చేతుల‌తో సంపాదించుకోవ‌చ్చ‌నే ఎన్నిక‌ల్లో ఇష్టంతో ఖ‌ర్చు పెడ‌తారా? ఇప్పుడు ఖ‌ర్చు చేస్తే ఆ డ‌బ్బు తిరిగిరాద‌నేగా ఆ దిశ‌గా నేత‌లు ఆలోచించ‌డం లేదా! నేత‌ల‌కు ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌త‌, జ‌వాబుదారీత‌నం లేదా? ఇంకెప్పుడు ప్ర‌జా సేవ చేస్తారు? * మీ డ‌బ్బు మీకు తోడుగా రాద‌ని క‌రోనా వైర‌స్ నిరూపించింది. ఈ వైర‌స్ నీడ‌లో మీరూ వున్నార‌న్న సంగ‌తి మ‌రువ‌వ‌ద్దు. ఒక వేళ మీకు క‌రోనా రాద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం మీకు ఉండ‌వ‌చ్చు. కానీ మీ చుట్టుప‌క్క‌ల ఎవ‌రికి వ‌చ్చినా మీకూ చావు త‌ప్ప‌దు జాగ్ర‌త్త‌...  క‌రోనా వైర‌స్ మంచి సందేశం ఇస్తోంది. అది ఏమిటంటే మీరే కాదు, మీ ప‌క్క‌నున్న‌వారు కూడా బాగా వుండాలి. లేక‌పోతే మీ ప‌ని గోవిందా! అది విష‌యం. కాబ‌ట్టి మీరు దాచి పెట్టిన సంప‌ద‌ను ఇప్ప‌ట్టికైనా తీయండి. మ‌హా అయితే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌చ్చాయ‌నుకోండి. క‌రోనాతో పోటీచేస్తున్నామ‌ని భావించి ఖ‌ర్చుపెట్టండి. ఒక్కో ఎమ్మెల్యే క‌నీసం ఐదు కోట్లు, ఎంపి ప‌ది కోట్ల రూపాయ‌లు బ‌య‌టికి తీయండి. లేదా భారీ ఎత్తున వెంటిలేట‌ర్లు కొని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు దానం చేయండి. రాజ‌కీయ నేత‌ల్లారా క‌ళ్లు తెర‌వండి. క‌రోనా భూతాన్ని చూసైనా భ‌య‌ప‌డండి. ప్ర‌పంచం మొత్తం వ‌ణికిపోతోంది. అయినా మ‌న నేత‌ల‌కు చ‌ల‌నం లేదు.  * మ‌న దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య త‌క్కువ వుంది అని అనుకుంటున్నారా? అందుకు కార‌ణం ఏమిటి? అస‌లు 130 కోట్ల జ‌నాభా వున్న మ‌న దేశంలో ఇంత వ‌ర‌కు కేవ‌లం 35 వేల మందికి మాత్ర‌మే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ట‌. ఇది వాస్త‌వ ప‌రిస్థితి. క‌నీసం ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకునే సామ‌ర్థ్యం కూడా మ‌న ద‌గ్గ‌ర లేదు. అందుకే నేత‌ల్లారా మీ ద‌గ్గ‌రున్న డ‌బ్బు తీయండి. దేశాన్ని ఆదుకునేందుకు ముందుకు రండి. కరోనా మహమ్మారితో పోరాడటానికి ఈ ప్రజా ప్రతినిధులందరూ కలిసి మీ ఏడాది జీత‌భ‌త్యాల్ని విరాళంగా ఇవ్వండి. అలా చేయ‌కుండా, సిగ్గు లేకుండా ప్రతిసారీ దేశంలోని మధ్యతరగతి ప్రజలను సహాయం చేయమని విజ్ఞప్తి చేయ‌డం మీ దివాళాకోరుత‌నానికి అద్దం ప‌డుతోంది. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఈ ఆప‌ద స‌మ‌యంలోనైనా క‌ళ్లు తెర‌వండి. ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుండి నిజ‌మైన ప్ర‌జా సేవ చేయండి. ప్ర‌జా సేవ అంటే కేవ‌లం ప‌ద‌వులు, హోదా అనుభ‌వించ‌డ‌మే కాదు అవ‌స‌రం అయిన‌ప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడ‌డానికి వారి ప‌క్షాన‌ నిల‌బ‌డాలి.