యుకె ప్రధాని బోరిస్ ఆరోగ్యం మెరుగుపడింది!

కరోనా రాకాసి బారిన పడిన యుకె ప్రధాని బోరిస్ జాన్సన్ కోలుకుంటున్నారు. ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, మ‌రి కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని డాక్ట‌ర్లు వెల్లడించారు. ప్ర‌ధాని ఆరోగ్యం మెరుగుప‌డ‌టంతో ప్ర‌స్తుతం ఐసీయూ నుంచి సాధార‌ణ వార్డుకు త‌ర‌లించారు. ప్రధాని బోరిస్ ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధాని పూర్తిగా కోలుకునే వరకూ ఫస్ట్ సెక్రటరీగా ఉన్న Dominic Raab బ్రిటన్ ప్రభుత్వ బాధ్యతల భుజాన వేసుకుని నిర్వ‌హిస్తున్నారు.

'ఉత్తరకుమారుడు' గా సి.పి.ఐ రామకృష్ణ రూపాంతరం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సి పి ఐ కార్యదర్శి కె రామకృష్ణ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యువకుడు, ఉత్సాహవంతుడు, కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఆరితేరిన వాడు... అలాగే లేఖాస్త్రాలు సంధించటం లో నిష్ణాతుడిగా ఇటీవలి కాలంలో విపరీతంగా పాపులారిటీ కూడా సంపాదించేసి, సొంత పార్టీ వారే అసూయపడే స్థాయికి ఎదిగారు. ఆయన తాజాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు లేఖ రాసి, మరో సరి వార్తల్లోకి ఎక్కారు.  కరోనా కారణంగా చేయటానికి చేతిలో ఉద్యమాలు లేకపోవటం తో, ఆయన ప్రస్తుతానికి తన పెన్నుకి పదును పెట్టి , 'ఉత్తర కుమారుడి ' గా రూపాంతరం చెందారు. నిన్న సాయంత్రం వర్షం పడిందో లేదో, వెంటనే రామకృష్ణ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు లేఖ రాసేశారు. అకాల వర్షం బీభత్సంతో మరణించిన వారిక కుటుంబాలకు రు.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వరి, పెసర, మిర్చి, మొక్కజొన్న, అరటి, మామిడి తదితర పంటలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని గణాంకాలతో సహా ఆ లేఖలో వివరించారు.  14 మంది మృత్యువాత పడిన విషయాన్ని కూడా, ఆయన మంత్రి బోస్ కు గుర్తు చేశారు. (మరేమి కాదు, కరోనా హడావుడి లో పడి, ప్రభుత్వం ఎక్కడ ఈ విషయం మర్చిపోతుందోననే అనుమానంతోనే రామకృష్ణ ఆ విషయం గుర్తు చేశారు సుమీ).  కరోనా విపత్తుకు తోడు వర్ష బీభత్సం రైతులకు శాపంగా పరిణమించిందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు రామకృష్ణ.  పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అంచనావేసి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనసేన తో కాపురం చట్టబండలు అయిపోయిన తర్వాత, ఒంటరిగా మిగిలిపోయిన కమ్యూనిస్టు పార్టీకి ఎదో రకంగా ఆక్సిజన్ అందించేందుకు రామకృష్ణ పడుతున్న ఈ 'ఉత్తర ' శ్రమ వృధా పోకూడదని మనమందరమూ కూడా కోరుకుందాం.

ఉద్యోగుల జీతాల కోతపై వివ‌ర‌ణ ఇవ్వండి హైకోర్టుఆదేశం!

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. సీనియర్ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్ ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఏప్రిల్ 17 లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

డ్రాగన్ నెక్స్ట్ గన్ మన వైపే గురి...

* కరోనా కారణంగా షార్ట్ బ్రేక్ తీసుకున్న చైనా.. * అప్పిచ్చిన దేశాల పీక ఇప్పటికే నొక్కేసిన చైనా ... * ఆర్ధిక గుత్తాధిపత్యం కోసం చైనా వికృత జూద క్రీడ ... * ఇండియా తన విదేశాంగ విధానాన్ని పునస్సమీక్షించుకోవాలి ... * ప్రపంచాన్ని చాప కింద చుట్టేసిన చైనా ... * డ్రాగన్ నెక్స్ట్ గన్ మన వైపే గురి ... * ఇప్పటికైనా , మన దేశం చైనా వస్తు బహిష్కరణ దిశగా అడుగులు వేయాలి * నాసిరకం వస్తువులతో మన ఆర్ధిక వ్యవస్థ మీద దాడి చేస్తున్న చైనా పై తిరుగుబాటుకు మనం మరొక 'స్వదేశీ' ఉద్యమాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకువెళ్ళాలి * కరోనా పై సమష్టి గా చేస్తున్న ఈ యుద్ధం, మరొక స్వతంత్ర సంగ్రామం కావాలి ఇది ఒక ప్రపంచ పర్యాటకుడి పరిశోధన.. నిశిత పరిశీలన మూడేళ్ళ పాటు ప్రపంచమంతా పర్యటించి వచ్చిన తర్వాత, తన కళ్ళ ముందు కనపడుతున్న కఠోర వాస్తవాలను ఆయన సాంతం షేర్ చేసుకున్నారు.. ఈ కథనం అంతా చైనా ఆర్ధిక దుర్నీతికి బలైపోయిన చిన్ని చిన్ని బడుగు దేశాల నుంచి ఓ మోస్తరు ఆర్ధికంగా బలపడుతున్న దేశాలు కూడా ఇందులో ఉన్నాయి. మన భారత దేశం దిగివన్ ఉన్న ద్వీప దేశం శ్రీలంకను చూశారు గదా... ఆ దేశం అభివృద్హికి చాలా డబ్బు అవసరం... ఆ డబ్బు చైనా దగ్గర ఉంది... ఇంకేం... శ్రీలంక చైనా దగ్గర 2. 8 బిలియన్ డాలర్ల అఫీషియల్ డెవెలప్మెంట్ అసిస్టెన్స్ ( ఓ డీ ఏ ) తీసుకుంది. ఈ ఓ. డి. ఏ. కింద సాధారణంగా అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ఋణం మంజూరు చేయటం జరుగుతుంది. అంతా బానే ఉంది....శ్రీలంక ఆ చైనా చేసిన సాయంతో ఆకాశ హర్మ్యాలు నిర్మించింది... హై వేస్ , ఎయిర్ పోర్ట్స్, షిప్పింగ్ పోర్ట్స్ నిర్మించింది.. దేశ ప్రగతిని ఉర్రూతలూగుతూ పరుగెత్తించింది.. కానీ,కొన్నేళ్ల తర్వాత ఏం జరిగింది.. వడ్డీ రేట్ల తో సహా ఆ డబ్బుని చైనా ముక్కు పిండి మరీ వసూలు చేయటం మొదలెట్టింది. శ్రీలంక ప్రగతి, సంక్షేమం సరే... ఆ దేశ సామాన్యుడి జేబుకి , దేశ ఖజానాకు భారీగా చిల్లు పడిందనే విషయం తెలిసొచ్చేప్పటికీ శ్రీలంక శోష వచ్చి పడిపోయినంత పరిస్థితి ఏర్పడింది. అప్పు తీర్చలేని దుస్థితిలోకి శ్రీలంక పూర్తిగా కూరుకుపోయింది. ఫలితంగా తమ దేశం నిర్మించిన అన్నింటి మీదా శ్రీలంక కంట్రోల్ తప్పిపోయి, అవి పూర్తిగా చైనా స్వాధీనం లోకి వెళ్లిపోయాయి. నీతి ఏమిటంటే- ఊరక ఇస్తున్నాడు కదా అని అప్పు తీసుకుంటే, చైనా లాంటి డ్రాగన్ ఇలాంటి ఆర్ధిక దురాక్రమణ లకు పాల్పడి, అలాంటి చిన్ని దేశాలను పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకుంటుందన్న మాట. ఇది శ్రీలంక కు దెబ్బనుకుంటే, మనం భారతీయులుగా పప్పులో కాలేసినట్టే. మన చుట్టూ ఉన్న ఇలాంటి దేశాలను ఆర్ధికంగా తన కంట్రోల్ లోకి తీసుకోవటం ద్వారా , చైనా భారత్ మీద ముప్పేట దాడికి సిద్ధమవుతోందనేది దీని భావం అని అర్ధం చేసుకోవాలి. దీన్నే అంతర్జాతీయ భాష లో చైనీస్ మనీ ట్రాప్ అంటారు. కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టె ఇలాంటి ట్రాప్ టెక్నాలజీ లో ఆరి తేరిన చైనా చేతికి చిక్కిన శ్రీలంక, చివరకు తాము నిర్మించిన షిప్పింగ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఆకాశ హర్మ్యాలు, హై వే లన్నిటి మీద చైనా కు అధికారాన్ని ధారాదత్తం చేసి, ఇప్పుడు ఆడియెన్స్ గ్యాలరీకి పరిమితమైపోయింది. తమ ఆర్ధిక ఉద్దీపన కేంద్రాలన్నీ అలా చైనా హస్తగతమవటం, శ్రీలంకకు పెను విషాదం. కానీ, చైనా దగ్గర తీసుకున్న చెల్లించలేని భారీ రుణానికి, అంతకు మించిన మూల్యమే శ్రీలంక ఇప్పటికీ చెల్లించుకుంటోంది. ఇక, పపువా న్యూ గినియా అయితే, చైనా నుంచి రెండు బిలియన్ డాలర్ల ఋణం తీసుకుంది.. ఎందుకంటే...శ్రీలంక మాదిరే ఇన్ఫ్రా అభివృద్ధి కోసం, ప్రత్యేకించి ఆకాశ హర్మ్యాలు, సీ పోర్టుల నిర్మాణం కోసం... ఈ నిధులు ఖర్చు పెట్టింది.. ఆ నిరుపేద దేశం.. అయితే, ఇపుడు అసలు కాదు కదా, కనీసం వడ్డీ కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ దేశం.. ఇక ఆ దేశం ముందు మిగిలిన ఏకైక మార్గం..తమ దేశం మీద చైనా కి ఆధిపత్యాన్ని ధార పోయటం.. ఎంత దుర్మార్గం, అన్నం పెట్టిన చేత్తోనే, కంచం లాగేయటం.... కానీ, చైనా వ్యవహారమే అది... తాను తప్పించి, మిగిలిన ప్రపంచాన్ని , మనుషులను తమ ఆర్ధిక కేంద్రాలకు పునాదులుగా చేసుకునే ఒక వికృత క్రీడా చైనీయుల రక్తంలోనే ఉండిపోయిందనేది కఠోర వాస్తవం. మాల్దీవ్స్, పాకిస్తాన్, మలేషియా, లావోస్, కజకిస్తాన్, మంగోలియా, ఈజిప్టు, కెన్యా, సౌత్ ఆఫ్రికా లలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇవే కాదు, ఇంకా చాలా దేశాలు చైనా నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేని స్థితిలోకి అనివార్యంగా నెట్టబడ్డాయి. ఆయా దేశాలు నిర్మించుకున్న ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, బ్రిడ్జి లు అన్నీ కూడా -చైనా దేశానికి సముద్ర మార్గం ద్వారా కానీ, రోడ్డు మార్గం ద్వారా కానీ కనెక్ట్ అవుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హ మైన విషయం. వీటన్నింటినీ కూడా బ్రిడ్జిల అనుసంధానం గానో, పోర్టుల అనుసంధానం గానో కాదు చూడాల్సింది. చైనా దగ్గర అంతకు మించిన ఆర్ధిక దురాక్రమణ తాలూకు విస్తృతి, ఇందులో నిగూఢంగా దాగి ఉన్న అంశం.. ఇప్పటికే ఒక విషయం అర్ధం అయ్యుండాలి.. ప్రపంచాన్ని చైనా నిర్మిస్తోంది నెమ్మది నెమ్మదిగా... ఆ తర్వాత జరిగేది, మిగిలింది కూడా చైనా ప్రపంచాన్ని తన గుప్పిట లోకి తెచ్చుకోవటమే. షిప్పింగ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇన్ఫ్రా, హై వేస్, బ్రిడ్జిలు, ఇవన్నీ ఒక దేశ ప్రగతికి సూచికలు కావచ్చు కాక... కానీ, వాటన్నింటి తాలూకు అప్పులు చెల్లించలేని స్థితి లో ఆ దేశాలు నిలువ గూడు లేని దుస్థితి లోకి నెట్టబడుతాయి. ఇది చైనా జూద క్రీడ. మన పెద్దలు చెప్పే మాట ఇక్కడ ఓ సారి గుర్తు చేసుకోవాలి.... ఎక్కడా కూడా, ఎపుడూ కూడా ఫ్రీ లంచ్, ఫ్రీ రైడ్ ఉండవు.. మనం డబ్బు దగ్గర జాగ్రత్త గా లేకపోతె, అది ప్రజల డబ్బు, లేదా జాతి సంపద కూడా కావచ్చు.. చైనీస్ ఆర్ధిక జూద క్రీడ లో శలభాల్లా మాడి మసైపోవటం ఖాయం.. చైనా ప్రస్తుతం ఈ క్రీడకు 'కరోనా వైరస్' తో విరామం ప్రకటించి ఉండవచ్చు కానీ, షార్ట్ బ్రేక్ తర్వాత, ఆ డ్రాగన్ మళ్ళీ మనమీదే , అంటే నేరుగా భారత దేశం మీదే విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇది భయపెట్టడం కాదు... జాగ్రత్త పడమని చెప్పడం.. మన విదేశాంగ విధానాన్ని పునస్సమీక్షించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పటం.. అంతే కాదు.. ఇపుడు మనం సీరియస్ గా చైనా వస్తు బహిష్కరణ కు నడుం బిగించాలి. దేశం మొత్తాన్ని సంఘటితం చేయాలి. సెకండ్ గ్రేడ్ వస్తువులను మన దేశం లోకి డంప్ చేస్తున్న థర్డ్ గ్రేడ్ కంట్రీ చైనా పై మనం సమర శంఖం పూరించాలి. బాబా రామ్ దేవ్ చెప్పినట్టు-ఇది యుద్ధ సమయం, చైనా ను, చైనా వస్తువులను మనం బహిష్కరిద్దాం. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. చైనా కు రుణ పడి ఉన్న దేశాల వివరాలు పట్టిక రూపం లో ఈ దిగువన ఇస్తున్నాం: చైనా అధికారిక ఆర్ధిక సహాయ కార్యక్రమం ఒక సారి చూస్తే, ఈ రంగం లో ఉన్న పేరు గడించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కన్నా కూడా, చైనా అతి తక్కువ రాయితీలతో కూడిన ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయం మనకు బోధపడుతుంది. Official Development Assistance (ODA) కింద ఈ కింది దేశాలు చైనా ఋణం తీసుకున్నాయి. Cuba ($6.7 billion) Cote d'Ivoire ($4.0 billion) Ethiopia ($3.7 billion) Zimbabwe ($3.6 billion) Cameroon ($3.4 billion) Nigeria ($3.1 billion) Tanzania ($3.0 billion) Cambodia ($3.0 billion) Sri Lanka ($2.8 billion) Ghana ($2.5 billion) Other Official Flows (OOF) స్కీం కింద, ఈ కింది దేశాలు చైనా నుంచి ఆర్ధిక సాయం పొందాయి. Russia ($36.6 billion) Pakistan ($16.3 billion) Angola ($13.4 billion) Laos ($11.0 billion) Venezuela ($10.8 billion) Turkmenistan ($10.1 billion) Ecuador ($9.7 billion) Brazil ($8.5 billion) Sri Lanka ($8.2 billion) Kazakstan ($6.7 billion)

మంత్రి ఆదిమూలపు సురేష్ ను క్వారంటైన్‌కు పంపిస్తారా?

అప్ప‌ట్లో ‘హైదరాబాద్ నుండి పర్మిషన్ లెటర్ తీసుకోని వచ్చిన ఆంధ్ర ప్రజలను బోర్డర్ లో ఆపేసారు. క్వారెంటైన్‌కు వెళ్ళాల్సిందేన‌ని అన్నారు. ఇప్ప‌డు మంత్రిని ఎలా రానిస్తార‌ని అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు? లాక్‌డౌన్ రూల్స్ వైసీపీ నేతలకు వర్తించవా అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్లడంపై అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. లాక్ డౌన్ ఆంక్షల సమయంలో మంత్రి ఏపీ నుంచి తెలంగాణకు ఎలా వెళ్లారని అచ్చెన్నాయుడు ట్వీట్ లో ప్ర‌శ్నించారు. గ‌తంలో లాక్ డౌన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలను బోర్డర్‌లో ఆపేసిన విష‌యాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. గంటల తరబడి గర్భిణీలు, విద్యార్థులను రోడ్లపై కూర్చోబెట్టారు. చంద్రబాబు వచ్చినా క్వారంటైన్ కు వెళ్లాల్సిందే అని అన్నారు. ప్రజా ఆరోగ్యం విషయంలో మంచిదే కానీ.. ఇదేమిట‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంటామంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్టనిస్తామని తేల్చి చెప్పిన వైసిపి ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌మ విష‌యం వ‌చ్చేస‌రికి మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇటీవలే ఓ పెద్దాయన సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వడం కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రా వచ్చారు. ముందు రోజు కేసీఆర్‌కు చెక్ అందజేసిన ఆయన.. తర్వాతి రోజు జగన్‌కు చెక్ ఇచ్చి ఫొటో దిగారు. ఇప్పుడేమో మంత్రి ఆదిమూలపు సురేష్ లాక్‌‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి హైదరాబాద్ వెళ్లాడు. మంత్రి తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయన్ను క్వారంటైన్‌కు పంపిస్తుందా? అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

103 ఏళ్ల బామ్మ కరోనాను ఓడించింది!

ఇటలీకి చెందిన ఈ బామ్మ ఆత్మ విశ్వాసంతో కోలుకుంది. ధైర్యం, విశ్వాసంతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధ్యమని 103 ఏళ్ల బామ్మ నిరూపించింది. కొవిడ్‌-19 కారణంగా మృత్యు ముఖం దాకా వెళ్లిన జ్వరంతో వారం రోజుల పాటు మంచానికే పరిమితమైన అడా జానుస్సో అనే వృద్ధురాలు మృత్యువుతో పోరాడి గెలిచింది. క‌రోనాను ఓడించింది. జ్వ‌రంతో తీవ్ర‌త కార‌ణంగా ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేకపోయింది. దీంతో డాక్టర్లు ఆమెకు ద్రవాహారం అందించారు. తరచూ మగతలోకి వెళ్లిపోయే ఆమె ద్రవాహారాన్ని సైతం సరిగ్గా తీసుకోలేకపోవడంతో ఆమెకు చికిత్స అందించే డాక్ట‌ర్లు కూడా ఆశలు వదులుకున్నార‌ట‌. అయితే వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా బామ్మ కళ్లు తెరిచి యాక్టివ్ అయిపోయింది. జానుస్సో బెడ్‌పై కూర్చోవ‌డం, ఆ త‌రువాత కిందికి దిగి నడవడంతో వైద్య సిబ్బంది సంతోషంతో ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘నీవు ఎలా కోలుకున్నావు’ అని వైద్యుడు ప్రశ్నించగా, ధైర్యం, బలం, విశ్వాసం వల్లేనని వృద్ధురాలు సమాధానమిచ్చిందట‌!

నిబంధనలు కఠినతరం చేయండి! మంత్రి శ్రీనివాస్ గౌడ్

కరోనా నివారణ చర్యలు కఠినతరంగ ఉండేలా అమలు చేయాలని మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరం నందు వ్యాపారస్తుల తో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఇప్పటికే పలుమార్లు వ్యాపారస్తులకు నిర్ణిత దూరంగా ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. వివిధ షాపులను పరిశీలించగా వారు నిబంధనలు పాటించడం లేదన్నారు. ముందు ఒకటి కీ రెండు మార్లు వారికీ చెప్పి నిబంధనలు పాటించని షాప్ లను 6మాసాలు సీజ్ చేయాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ మరొక్కరికి వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారికీ కరోనా పాజిటివ్ రావడం జరుగుతుందన్నారు. పట్టణ కేంద్రంలోని మంచినూనె కంపెనీ లు మరింత గా తయారు చేయాలని చెప్పారు. పని చేసే వారికీ అధనంగా వేతనం ఇవ్వాలని కంపెనీల యాజమాన్యం ను ఆదేశించారు. అధికారులు మరింత కఠినంగా వ్యహరించి కరోనా ను మన నుంచి దూరం చెందామని పిలుపునిచ్చారు.     అనుమానం వచ్చిన వారికీ ముద్ర వేసి క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని వారికే కరోనా పాజిటివ్ వస్తున్నాయన్నారు. పక్క ప్రణాళికలతో ముందుకు సాగుతున్నందుకు కరోనా ను నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. ప్రజలు మరింతగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే పరిస్కారిస్తామని వ్యాపారస్తులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ సీతారామారావు, dso వనజాత, వ్యాపారస్తులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాలలో సామాజిక దూరం పాటించాల్సిందే!

హాకాభవన్ లో ధాన్యం కొనుగోళ్లు, భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బి.సి. సంక్షేమం, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష చేశారు. పరిశుభ్రత విషయంలో, వసతుల కల్పనలో రాజీపడొద్దని మంత్రులు ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 713 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. వారం రోజులలో వరికోతలు ఊపందుకుంటాయి ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేసి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కొనుగోలు కేంద్రాల సక్రమ పనితీరుకు చర్యలు తీసుకుంటున్నారు. రైస్ మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం మరియు నిల్వ సామర్థ్యం పెరగడం మరియు బియ్యం మిల్లింగ్ పరిశ్రమకు ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.     ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు విషయంలో నిపుణుల సేవలను వినియోగించుకుని బియ్యం మిల్లింగ్ పరిశ్రమ మరియు రాష్ట్రంలో ఆహార ప్రక్రియ పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స‌మావేశంలో చ‌ర్చించారు.

సిఎం‌ కేసీఆర్ మాటలకే పరిమితం అవుతున్నారు!

ఓ వైపు కరోనా ప్రభావం, మరోవైపు వడగళ్ళ వానతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. యాదాద్రి జిల్లాలో వడగళ్ల వానతో తీవ్ర నష్టం జరిగినా ఏ ఓక్క అధికార పార్టీ ఎమ్మెల్యే రైతులను పరామర్శించలేదు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు 20 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఎంపి డిమాండ్ చేశారు. బత్తాయి నిమ్మ రైతులతో రైతులకు తీవ్ర నష్టాలు తెస్తున్నాయి.అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా సిఎం‌ కేసీఆర్ మాటలకే పరిమితం అవుతున్నారు. ప్రశ్నిస్తే ,లోపాలు బయటకు తీసుకువస్తే మీడియాను బెదిరిస్తున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సి.ఎం. ఫామ్ హౌజ్ చుట్టూ డబుల్ రోడ్లు ,ఫామ్‌హౌజ్ లో కొత్త ఇళ్లు, ప్రగతి భవన్ లో ఇళ్లు కట్టుకోవడానికే సిఎం బిజీగా వున్నార‌ని ఎంపి విమ‌ర్శించారు.

హైద‌రాబాద్‌లో 12 కంటైన్మెంట్ క్లస్టర్ లు...

కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సహకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు మిరాజ్ హుస్సేన్, డి జి పి మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతమహంతి, సి పి.అంజనీ కుమార్ లతో కలిసి ఖైరతాబాద్ జోన్లోని మల్లేపల్లి ( నాంపల్లి )లో పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కోవిద్ -19 నియంత్రణకు నగరంలో 12 కంటైన్మెంట్ క్లస్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లస్టర్ల పరిధి లోని ప్రజలు బయటకు రాకూడదని కోరారు. అలాగే బయటి వ్యక్తులు కూడా కంటైన్మెంట్ ప్రాంతంలోకి వెళ్లకూడదని సూచించారు. ఈ నిబంధనల అమలుకు పూర్తిగా బారికేడింగ్ చేసి, వైరస్ ను ఎక్కడ కక్కడ కట్టడి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లోపల వున్న వారి సమస్యలను తెలియజేయుటకు ప్రత్యేక నెంబర్ ను కేటాయించ నున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు 12 కంటైన్మెంట్స్ ప్రకటించినట్లు తెలిపారు.కంటైన్మెంట్ నిబంధనల అమలును మానిటరింగ్ చేయుటకు ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని జి హెచ్ ఎం సి కమీషనర్ కు సూచించారు.ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను అమలు చేయాలని జోనల్, డిప్యూటీ కమీషనర్లు ఆదేశించారు కోవిద్ -19 వ్యాప్తిని అరికట్టుటలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలందరూ పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇదేవిదంగా ఇకముందు కూడ వ్యవహరించాలని కోరారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ డాక్టర్ ప్రాణం తీసిన బ్రిటన్ లాక్ డౌన్

డాక్టర్ గోవర్ధనరెడ్డి. లండన్ వెళ్ళే చాలామంది తెలుగువాళ్ళకు ఆయన అక్కడ కేరాఫ్ అడ్రస్. నల్గొండ జిల్లా వాసి. వైద్యవిద్యలో పై చదువుల కోసం లండన్ వెళ్లి స్థిరపడి అక్కడే యాభయ్ ఏళ్ళకుపైగా వుంటున్నారు. లంకంత ఇల్లు. పెళ్లి చేసుకోలేదు. ఏడాదికోమారు హైదరాబాదు వచ్చి స్నేహితులను కలిసి తిరిగి వెళ్ళడం ఆనవాయితీ. ఫిబ్రవరి చివరివారంలో డాక్టర్ వెంకటరెడ్డి (మిర్యాలగూడ డాక్టరు గారు) ఇంట్లో ఓ సాయంత్రం అయన తన మిత్రులను కలుసుకున్నారు . ఒకళ్ళా ఇద్దరా దాదాపు పదిహేను ఇరవై మందిమి. డాక్టర్ గోవర్ధన రెడ్డిని చివరిసారి చూసింది అప్పుడే, అంటూ సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.    తరువాత వారానికే ఆయన లండన్ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు తలలో ఒక బొడిప లాంటిది వచ్చింది. పోయేది ఇంగ్లాండ్. అక్కడ వైద్యానికి కరువా అంటూ ధీమా. పైగా స్వయంగా ఆయనే డాక్టరు. లండన్ లో చూపించుకుంటే అన్ని పరీక్షలు చేసి కేన్సర్ అని తేల్చారు. వెంటనే కీమో తెరపి మొదలు పెట్టారు. కిందటి వారం కీమో రెండో సెషన్. ఒక రోజు ముందు హాస్పిటల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోను చేస్తారు. దానికోసం రెండు ఫోను నెంబర్లు ఇవ్వాలి. ఈలోగా దురదృష్టం కరోనా కమ్మేసింది. ఎక్కడ చూసినా లాక్ డౌన్. స్నేహితులు చాలామంది వున్నా ఎవ్వరూ ఇళ్లు వదిలి బయటకు కదలలేని పరిస్తితి. అంచేత తన పొరుగు ఇంటివాళ్ళ నెంబరు ఇచ్చారు. కీమో సెషన్ నాడు గుర్తు చేయడానికి ఆస్పత్రి వాళ్ళు ఫోన్ చేసారు. ఒకటికి పదిసార్లు ప్రయత్నించినా ఇటునుంచి జవాబు లేదు. దాంతో వాళ్ళు ఆయన పొరుగింటి వారికి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి చూసారు. లోపల నుంచి అలికిడిలేదు. పోలీసులకు తెలియపరిచారు. వాళ్ళు వచ్చి తలుపులు తెరిపించి చూస్తే లోపల డాక్టర్ గోవర్ధన్ రెడ్డి అచేతనంగా పడివున్నారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. మరునాడు ప్రాణం పోయిందని నిర్ధారించారు. హైదరాబాదుకు కబురు అందింది, కరోనా కారణంగా ఇక్కడి వాళ్ళు కదలలేని పరిస్తితి. ఇక్కడికి తీసుకురాలేని పరిస్తితి. చివరికి అలా ముగిసిపోయింది డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి జీవితం అంటూ, ఆయన సన్నిహితులు వాపోయారు. డాక్టర్ గోవర్ధన రెడ్డి వస్తుతః సౌమ్యులు. ఆ రోజు వారితో గడిపింది కొద్ది గంటలే అయినా త్వరగా మరచిపోలేని వ్యక్తిత్వమని భండారు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ( ఫోటో లో తెల్ల లాల్చీ తో ఉన్నది డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, లండన్ లో ఆయన ఇంటి బయట, తన మిత్రులతో తీయించుకున్న ఫోటో )  

సింగరేణి కార్మికుడికి కరోనా పాజిటివ్!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దనే ఉద్దేశంతో బొగ్గు తవ్వకాలను మాత్రం కొనసాగిస్తున్నారు. కానీ ఏప్రిల్ 1 నుంచి భూగర్భ గనుల్లో బొగ్గు తవ్వకాలను నిషేధించారు. ఓపెన్ కాస్ట్ గనులు మాత్రం యధావిధిగా పని చేస్తున్నాయి. అయితే కరోనా భూతం ఇప్పుడు సింగరేణిలోనూ కల్లోలం రేపుతోంది. సింగరేణిలో పని చేసే ఓ కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో గని కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి నుంచి సింగరేణిలో పనిచేసే ఓ కార్మికుడు ఇటీవల మర్కజ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అతడి ద్వారా తన కుమార్తెకు కరోనా సోకింది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే, వైరస్ బాధితుడు ఢిల్లీ ప్రార్థనల నుంచి వచ్చిన తర్వాత కూడా విధులకు హాజరైనట్లుగా చెబుతున్నారు. దీంతో అతడితో కలిసి పనిచేసిన కార్మికులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సింగరేణిలో పని చేసే కార్మికుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో యాజ‌మాన్యం అప్రమత్తమైంది. అతడితో ఎవరెవరు కలిసి పని చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని సింగరేణి యాజమాన్యం ఎప్పటికప్పుడు స‌మీక్ష చేస్తోంది.

నర్సరావుపేట లో రెండు రెడ్ జోన్లు

గుంటూరు జిల్లా నర్సరావు పేట లో నిన్న మృతి చెందిన మల్లెల శ్రీనివాసరావుకి కరోనా పాజిటీవ్ గా నిర్దారణ అయినట్టు ఆర్ డీ ఓ, అలాగే డి ఎస్ పి ప్రకటించారు. శ్రీనివాసరావు నివాసం ఉండే వరవకట్ట, అలాగే అతను పని చేస్తున్న రామిరెడ్డిపేటని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. రెండు ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయబడుతుందని,  ఇక నుండి రెడ్ జోన్ ప్రాంతంలో ఎవ్వరూ కూడా బయటికి రావడానికి వీలులేదు. ప్రత్యేక వైద్య బృందాలతో ప్రతి ఇంటిని సర్వే చేపించడం జరుగుతుందని పోలీసు, రెవిన్యూ అధికారులు చెప్పారు. ప్రజలు కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలకు ముప్పు అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరించారు.  

ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా కోటి పనిదినాలు

* ఉపాధి హామీ కూలీల వేతనాల కోసం రూ.2149.78 కోట్లు * ఇప్పటికే కేంద్రం నుంచి రూ.460.81 కోట్లు  విడుదల. * జూన్ మాసాంతం వరకు చెల్లించేందుకు అందుబాటులో మరో రూ.1688.97 కోట్లు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లించే వేతనాల కోసం 2020-21 ఆర్ధిక సంవత్సరంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.2149.78 కోట్లు మంజూరయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్ తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వ కార్యాచరణ వివరాలను మీడియాకు వెల్లడించారు.  ఉపాధి హామీ కోసం ఇప్పటికే రూ. 460.81 కోట్ల నిధులను  కేంద్రం విడుదల చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ జూన్ మాసాంతం వరకూ వేతన దారులకు చెల్లించటానికి మరో రూ.1688.97 కోట్ల నిధులు మనకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.  2019-2020 లో రూ. 211 గా ఉన్న దినసరి వేతనాన్ని 2020-21 లో  అదనంగా రూ. 26 లు పెంచి  రోజుకి  రూ. 237 లు   చొప్పున చెల్లించటం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. తద్వారా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రూ. 546 కోట్లు అదనంగా రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతన రూపంలో చెల్లింపులు జరుగుతాయని అన్నారు.    గత ఆర్దిక సంవత్సరంలో వేతన దారులకు రూ. 20.08 కోట్ల పనిదినాలు కల్పించి రూ 4084.86 కోట్లు వేతన రూపంలో చెల్లించటం జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పధకం క్రింద గత ఆర్దిక సంవత్సరంలో మెటీరియల్ రూపంలో రూ  2624.18 లు, వేతన రూపంలో 4084.86 కోట్లు కలిపి మొత్తం రూ 6709.04 లు వ్యయం చేయటం జరిగిందని తెలిపారు. అయితే 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మన రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాధాన్యతను ఇస్తూ 21 కోట్ల పనిదినాలను లక్ష్యంగా కేటాయించిందని తెలిపారు. ఇది గత సంవత్సరం కేటాయింపు కన్నా కోటి పనిదినాలు ఎక్కువని వెల్లడించారు.  రాష్ట్రానికి కేటాయించిన పనిదినాలను జిల్లా, ఇంకా నెలల వారీ లక్ష్యాలుగా విభజించి జిల్లా కలక్టర్లకు  పంపటం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ నిబంధననల ప్రకారం 2020-21 ఆర్ధిక సంవత్సరంలో  జరిగే మొత్తం వ్యయంలో కనీసం 65% వ్యయం సహజ వనరుల యాజమాన్య పనులపై జరిగేలా కలక్టర్లు తగు జాగ్రత్త్తలు తీసుకోవలసినదిగా ఆదేశించటమైనది.    కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల గ్రామీణ ప్రాంత పేదలు పనులు లేక ఆర్థికంగా ఇబ్బందుల పాలుకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వారిని ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, భూగర్భగనుల శాఖామంత్రి వెల్లడించారు. ఉపాధి హామీ కింద వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, వేతనాల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ప్రధానంగా ఉద్యాన పంటలు, మల్బరీ తోటల పెంపకం, పశు గ్రాస పెంపకం వంటి వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇస్తూ, కూలీలు భౌతిక దూరంను పాటిస్తూ వాటిని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే కాలువలు, చెరువుల తవ్వకం వంటి  ఇతర పనులను స్థానిక డిమాండ్ ఆధారంగా చేపట్టడం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

కరోనా రోగుల ట్రీట్మెంట్ కోసం ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూషన్

* కేరళ ప్రభుత్వానికి ఐ సి ఎం ఆర్ అనుమతి కోవిడ్ -19 వ్యాధికి సంబంధించి సౌత్ కొరియా అవలంబించిన ప్లాస్మా ట్రాన్స్ ఫ్యూషన్  విధానాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయదలచింది. ఇందుకు  అవసరమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐ సి ఎం ఆర్ ఆమోదం కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది.  బ్లడ్ లోని ద్రవపదార్థ మైన ఈ ప్లాస్మా ను, వ్యాధి బారిన పడి దాని నుంచి బయటపడిన రోగుల నుంచి సేకరిస్తారు, అటువంటి రోగుల ప్లాస్మాలో ఈ వ్యాధికి సంబంధించిన యాంటీ బాడీస్ ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల,  ఈ వ్యాధిని అరికట్టేందుకు సహకరిస్తుంది సౌత్ కొరియా లో ఈ పద్ధతి ద్వారా వారు క్రిటికల్ కేసెస్ లో వైద్యాన్ని అందించే ఆ రోగులను కాపాడగలిగారు ఇదే పద్ధతిని ఇప్పుడు కేరళ ప్రభుత్వం అవలంబించేందుకు కావలసిన అనుమతులను ఐ సి ఎం ఆర్ ఇవ్వడం జరిగింది. మల్టీ సెంటర్ ట్రయల్స్ కు ఇంకా అనుమతులు రావాల్సి ఉన్నది. ఒక రికవర్ ఆయన రోగి నుంచి సుమారుగా 800 ఎం.ఎల్ ప్లాస్మాను తీసుకునే అవకాశం ఉంటుంది , ఒక్కొక్క రోగికి 200 ఎం.ఎల్ ప్లాస్మా ట్రీట్ మెంట్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది.  ఈ పద్ధతిలో ఫలితాలు సాధించినట్లు అయితే చాలా వరకు COVID-19 వలన సంభవించే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని విజయవాడ కు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ సూచించారు.