మంచినీళ్లు అనుకొని శానిటైజర్ తాగాడట ఆ డాక్టర్!
posted on Apr 10, 2020 @ 1:03PM
ఎవరో కాదు ప్రభుత్వ వైద్యాధికారి. అనంతపురం జిల్లాలో చిన్న పొరపాటుతో ప్రభుత్వ వైద్యాధికారి ఆస్పత్రి పాలయ్యారు. జిల్లాకు చెందిన వైద్యాధికారి అనిల్ కుమార్ ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దాహం వేయడంతో ఆయన మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్ తాగేశారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
అనిల్‌కుమార్‌కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని.. చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.
అనిల్‌కుమార్ శానిటైజర్ తాగడం కలకలంరేపింది. ఆయన పొరపాటున శానిటైజర్ తాగారా.. కావాలనుకునే తాగారా అన్న సందేహాలు వినిపించాయి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం పొరపాటున తాగారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.