పీఎం కేర్స్ కు నిధులను ఇచ్చిన టాప్ 10 వీళ్లే....

టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్... పిఎమ్ సహాయ నిధికి రూ.1500 కోట్లు ను ఇచ్చారు. ఈ నిధిని ప్రోటెక్టివ్ టెస్టింగ్ కిట్స్, రోగుల అవసరాలకు ఉపయోగించనున్నారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అండ్ విప్రో ఎంటర్ ప్రైజెస్ రూ.1,125 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ నిధిని మెడికల్ కిట్స్, సామాజిక అవసరాల కోసం ఉపయోగిస్తారు. రిలయన్స్ ఫౌండేషన్ రూ.510 కోట్లును విరాళంగా ఇచ్చింది. వీటిని లక్ష ఫేస్ మాస్కులను తయారు చేయటానికి ఉపయోగించనున్నారు. స్టేట్ ఆయిల్ కంపెనీలు మొత్తంగా రూ.1000 కోట్లు విరాళమిచ్చారు. ఈ నిధుల్లో, వంట గ్యాస్ సరఫరా చేసే ఎవరైనా కోవిడ్‌తో చనిపోతే, వాళ్ల కుటుంబానికి రూ.5లక్షలను ఇవ్వనున్నారు. పేటిఎం పిఎమ్ సహాయనిధికి రూ.500 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఐటిసి లిమిటెడ్ రూ.150 కోట్లు విరాళంగా ఇచ్చింది. అదాని ఫౌండేష‌న్ కోవిడ్ 19 సహాయనిదైన పిఎమ్ ఫండ్ కి రూ.100 కోట్లును విరాళంగా ఇచ్చింది. జఎస్ డబ్ల్యూ గ్రూప్స్ పిఎమ్ సహాయ నిథికి రూ.100 కోట్లు ను విరాళంగా ఇచ్చింది. వేదాంత్ లిమిటెడ్ పిఎమ్ సహాయ నిధికి రూ.100 కోట్లును విరాళంగా ఇచ్చింది. ఈ నిధులను నిత్యావసర సరుకుల కోసం పనిచేసే రోజువారి కూలీలకు, క్రాంటాక్ట్ ఉద్యోగుల కోసం ఉపయోగిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కూమార్ పిఎమ్ సహాయ నిధికి రూ.25 కోట్లును విరాళంగా ఇచ్చారు.

మత్తు యంత్రాల్నే వెంటిలేటర్లుగా వినియోగిస్తున్నారు!

అమెరికాలో కరోనా కాటుకు బుధ‌వారంనాడు 1973 మంది మృతి చెందారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,268. క‌రోనా కేసులు అంతకంతకు పెరిగిపోతుండటంతో అమెరికాలోని ఆస్పత్రుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ల కొరతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటిలేటర్లను సత్వరమే సమకూర్చుకొనే అవకాశం లేకపోవడంతో మత్తు ఇచ్చే (అనస్థీషియా) యంత్రాలనే శ్వాస యంత్రాలుగా మార్చడం ప్రారంభించారు. 'శస్త్రచికిత్సల సమయంలో మత్తు అందించే అనస్థీషియా యంత్రాల్లో ఫ్లోమీటర్లు, ఆవిరి కారకాలు, కార్బన్‌డయాక్సైడ్‌ శోషకాలు, సంపీడనం చేసిన వాయువు మూలకాలు, యాంత్రిక వెంటిలేటర్‌ ఉంటాయి. ఇందులో శ్వాస అందించే సర్క్యూట్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే వెంటిలేటర్లుగా మార్చవచ్చు. అయితే ఈ పని అనస్థీషియా నిపుణుడి ఆధ్వర్యంలోనే జరగాలి. దాని పనితీరును, రోగి భద్రతను ఎప్పుడూ దగ్గరుండి పరిశీలిస్తుండాలి. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ప్రాణాలు నిలబెట్టేందుకు ఈ పరికరాన్ని వెంటిలేటర్‌గా మార్చి వినియోగిస్తున్నారు.  

కోవిడ్ 19 టెస్టులు ఉచితంగా చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశం

కోవిడ్ 19 టెస్ట్ లు ప్రభుత్వం గుర్తించిన ప్రైవేట్ లేదా ప్రభుత్వ లాబొరేటరీలలో ఉచితంగా చేయాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శశాంక్ దేవ్ శుద్ధి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన సుప్రీమ్ ధర్మాసనం, కోవిడ్ 19 టెస్ట్ లు ప్రైవేట్ లేదా ప్రభుత్వ లాబొరేటరీలలో ఉచితంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ ఏ బీ ఎల్ అక్రెడిటేడ్ ల్యాబ్స్ లో కానీ, డబ్ల్యు హెచ్ ఓ లేదా ఐ సి ఎం ఆర్ ఆమోదించిన ల్యాబ్స్ లో కానీ కోవిడ్ 19 టెస్టులు చేయాలనీ సుప్రీమ్ ధర్మాసనం ఆదేశించింది.

తెలంగాణలో మ‌రో 49 మందికి పాజిటివ్‌! 453కు చేరిన క‌రోనా కేసులు!

బుధ‌వారంనాడు 49 మందికి పాజిటివ్ రావ‌డంతో తెలంగాణాలో పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య 453కు చేరింది.  రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే ఇప్ప‌ట్టి వ‌ర‌కు 45 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఢిల్లీ మ‌ర్క‌జ్‌కు వెళ్లి వచ్చిన 1,100 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. వారు సొంత ప్రాంతాలకు వచ్చాక, దగ్గరగా మెలిగిన 3,158 మందిని వివిధ ప్రాంతాల్లోని 167 క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని వెల్లడించారు. వీరిలోనూ కరోనా పరీక్షల కోసం తీసుకున్న 535 నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అత్య‌ధికంగా హైద‌రాబాద్‌లో 161 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే వీరిలో 21 మంది చికిత్స త‌రువాత కోలుకుని ఇళ్ల‌కు వెళ్లిపోయార‌ని మంత్రి తెలిపారు. నిజామాబాద్‌లో 39 మందికి, రంగారెడ్డిలో 27 మందికి. వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 23 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని మంత్రి ఈటెల తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం 80 వేల పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు ఉన్నాయని.. మరో 5 లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం లక్ష N-95 మాస్క్‌లు ఉంటే మరో 5 లక్ష మాస్క్‌లను తెప్పిస్తున్నామని చెప్పారు. 2 కోట్ల సర్జికల్ మాస్క్‌లు సహా, కోటి చేతి గ్లౌజులు, రక్షణ కోసం 5 లక్షల గాగుల్స్ సైతం ఆర్డర్ ఇచ్చినట్లు మంత్రి చెప్పారు.

ఇసుకేస్తే రాలని ఆసుపత్రులు కరోనా దెబ్బకు ఖాళీ అయిపోయాయి

రోజువారి జబ్బులన్ని ఏమైనాయో..? ఆసుపత్రులు, రక్త పరిక్ష కేంద్రాలకు ఇన్ని రోజులనుండి అనవసరంగా, అనుమానంతో డబ్బులు ఖర్చు చేసారా..? షుగర్,  బిపి , కన్ను ,పన్ను , నడుము ,మోకాలు, కిడ్నీ ,గుండె ,నరాల ప్రత్యేక ఆసుపత్రులు నిర్మానుష్యంగా ఉన్నాయి...! ఆసుపత్రులలో OP మూసివేయబడింది.. ఇది ఉన్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పటి రష్ లేదు.  కాబట్టి వ్యాధులు అంతగా ఎలా తగ్గాయి?  నిజమే, వీధుల్లో వాహనాలు లేవు కాబట్టి రోడ్డు ప్రమాదం లేదు.  కానీ గుండెపోటు, మెదడు రక్తస్రావం లేదా రక్తపోటు వంటి సమస్యలు కూడా లేవు.. ఎవరూ చికిత్స పొందుతున్నారని ఎవరి నుండి పెద్దగా ఫిర్యాదులు లేవు , ఇది ఎలా జరిగింది..?   దేశం మొత్తం మీద స్మశాన ఘాట్ కు రోజూ వచ్చే మృతదేహాల సంఖ్య 25-30 శాతం తగ్గిందట. ఢిల్లీ లోని హరిశ్చంద్ర ఘాట్కు సగటున 80 నుండి 100 మృతదేహాలు వచ్చేవట, కరోనా వాతావరణంలో 20 లేదా 25 మృతదేహాలు వస్తున్నాయి.. అంతేకాక ఇది వేసవి కాలం. ఈ సమయంలో ప్రతి సంవత్సరం మృతుల సంఖ్యలో  పెరుగుదల ఉండేదట కానీ ప్రస్తుత కరోనా పరిస్థితి లో మృతుల సంఖ్య బాగా తగ్గిందట..! కొత్త రోగుల సంఖ్య పెరగలేదు, కొత్తగా ఎవరికీ పెద్దగా ఎటువంటి రోగాలు రాలేదట, ఒకవేళ చిన్నా, చితకా వచ్చినా అవి మామూలుగానే తగ్గిపోయాయి అట..! ఇపుడు మనకు అర్థం కాని సమస్య ఏమిటంటే  కరోనా వైరస్ మిగిలిన అన్ని వ్యాధులను ప్రభావితం చేసిందా..? లేదా ఆ వ్యాధులన్నీ కరోనా వైరస్ ధాటికి పరారై పోయాయా..? లేకపోతే  ఇన్ని వ్యాధులు కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యమే...? ఇది వైద్య వృత్తి యొక్క వాణిజ్యీకరణ ప్రశ్నను లేవనెత్తుతుంది. వ్యాధి లేని చోట, వైద్యులు దాన్ని బ్రహ్మాండంగా చేస్తారు.  కార్పొరేట్ ఆసుపత్రుల ఆవిర్భావం తరువాత, సంక్షోభం తీవ్రమైంది. స్వల్పంగా జలుబు మరియు దగ్గు చేసినా వేలు, లక్షల బిల్లులు ఆశ్చర్యం కలిగించక మానవు. చాలా ఆసుపత్రులలో పడకలు ఖాళీగా ఉన్నాయి.వైద్యుల సేవ యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి నేను ప్రయత్నించడం లేదు.  కోవిడ్19కి  చేస్తున్న సేవలకు వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కాని భయం చాలా పెద్దరోగం, చాలా సమస్యలు దాని వల్లె వస్తాయి.  ఇది కాకుండా, ప్రజలు ఇంటి ఆహారం తింటున్నారు, రెస్టారెంట్లు మూసేసారు,ఇది కూడా ఒక తేడా. వ్యవస్థ తన పనిని సరిగ్గా చేస్తే,  ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు స్వచ్ఛమైన ఆహారం లభిస్తే, సగం వ్యాధులు ఇలా తొలగిపోతాయి.  చాలాకాలం క్రిందట ఒక దేశంలో వైద్యుల సమ్మె జరిగిందట,  ఈ కాలంలో మరణాల రేటు తగ్గినట్లు సర్వేలో తేలింది.  ఆరోగ్యం మన జీవనశైలిలో ఒక భాగం, ఇది వైద్యులపై మాత్రమే ఆధారపడి ఉండదు.  ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు ఎప్పటికీ కోరుకోరని మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్ లో రాశారు;  పరస్పర విబేధాలు ముగియాలని న్యాయవాది ఎప్పటికీ కోరుకోడు.. అయినప్పటికీ, లాక్‌డౌన్‌తో సమస్యలు తప్పవు, అయితే ఇది కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను కూడా ఇచ్చింది.ఆలోచిస్తే అలా అనిపించింది మరి! అయితే చదువరులు ఏమంటారో మరి....

జితేందర్ శర్మ మళ్ళీ ఏసేశాడు!

* ఏ ఎం టీ జెడ్ సి. ఈ. ఓ. కు సహకరిస్తున్న విజయవాడ మాజీ ఎం. పి . ఎవరు ? * బాబు థియరీ -సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవడమంటే ఇలాగేనని నిరూపించిన శర్మ  * ఏ ఎం టీ జెడ్ అవినీతి పాపాలపై టీ డీ పీ లో 'పిన్ డ్రాప్ సైలెన్స్ ' * ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ జితేందర్ శర్మ అత్యంత సన్నిహితుడు  ఏది ఏమైనా ఆయన మాయల మరాఠీ అని మరో సారి రుజువైంది. లేకపోతె, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో ఏ ఎం టీ జెడ్ కు జితేందర్ శర్మ, సి ఈ ఓ గా రాజ్యం చేసిన సమయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపైన వై ఎస్ ఆర్ సి పి సమరశంఖం పూరించడం ఏమిటీ, దరిమిలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించడం ఏమిటీ , ఇదంతా జరిగిన కొద్ది కాలానికే ఆయనకు మళ్ళీ సి ఈ ఓ పదవి కట్టపెట్టడం ఏమిటీ. ఇవన్నీ చూస్తుంటే ఆయన కన్ఫార్మ్డ్ గా మాయల మరాఠీ అని నిరూపణ అయినట్టే కదా.  ఆయన  నేర్పరి తనం, ఢిల్లీ లో ఆయనకున్న  లాబీయింగ్,నితిన్ గడ్కరీ ఆశీస్సులు, పూనమ్ మాలకొండయ్య సాంకేతిక సహకారం, ఇంకా విజయవాడ మాజీ ఎం. పి . లౌక్యం వెరసి- జితేందర్ శర్మ ను మళ్ళీ ఏ ఎం టీ జెడ్ పీఠంపై అధిష్టింప చేసిన తీరుకు కొనసాగింపు ఏమిటంటే, ఆయన ఈ రోజు మళ్ళీ తన మాయా దండాన్ని ఒక్క సారిగా ఝుళిపించి, ఏ ఎం టీ జెడ్ లో మే నెల మొదటి వారానికల్లా రోజుకు 25వేల కిట్లు తయారుచేసే సామర్థ్యాన్ని చేరుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని సమ్మోహితుడుని చేసేశారు. ఆ కథా క్రమాన్ని కళ్లారా చూసి, చదివి తరించిన వారికి ఫలశృతి ఏమిటంటే, ఆయన గారి మాయాజాలంలోకి మీరు కూడా ఉచితంగా ఎంట్రీ పాంసుడవచ్చునన్న మాట. ఇన్ఫ్రా వ్యవస్థ లేమీ లేకుండా, ఏ ఎం టీ జెడ్ లో రోజుకి పాతిక వేల కిట్ల తయారీ, దాంతో పాటు పాత అవినీతి కథలో భాగస్వామ్యులైన టీ డీ పీ కార్పొరేట్ గ్రూపులు, జితేందర్ శర్మ కు ఉన్న లింకులను పక్క పక్కన పెట్టి చూస్తుంటే, బహుశా అటు చంద్రబాబు నాయుడును, ఇటు జగన్ మోహన్ రెడ్డి ని కూడా బుట్టలో వేసుకున్న జితేందర్ శర్మ జాణ తనమేమిటో బయటపడుతుందని విజిల్ బ్లోయర్స్ అంటున్నారు. ఇంతకీ, ఆయన అవినీతి మీద అప్పటి అవినీతి నిరోధక శాఖ డి.జి.పి. ఆర్ పీ ఠాకూర్ జరిపిన దర్యాప్తు ఏమైనట్టు? విజిలెన్స్ చేసిన దర్యాప్తు కి ఏమి గతి పట్టినట్టు? ఇప్పుడు ఇవన్నీ శేష ప్రశ్నలే. దాని, కొనసాగింపుగా ఈ రోజు జితేందర్ శర్మ , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని సమ్మోహన పరిచిన తీరు ఒక్కసారి మీరే చదవండి.... చంద్రబాబు నాయుడు ఫార్ములా -అదేనండీ...సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకోవడమంటే ఎలాగో జితేందర్ శర్మ స్కూల్ లో చేరి తెలుసుకోవచ్చు. ఇహ, ఈ రోజు విశేషాలు చదవండి.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తయారైన కోవిడ్‌ –19 ర్యాపిడ్‌ టెస్టు కిట్లను సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  విశాఖపట్నంలోని మెడ్ టెక్‌ జోన్‌లో కోవిడ్‌–19 ర్యాపిడ్‌ టెస్ట్‌కిట్ల తయారీని నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పరిశీలించిన సీఎం.  టెస్ట్‌కిట్ల తయారీని, పనిచేసే విధానాలను వివరించిన మెడ్ టెక్‌ జోన్‌ సీఈఓ డాక్టర్  జితేంద్ర శర్మ, సిబ్బంది. దేశంలో మూడు కంపెనీలకు మాత్రమే కిట్ల తయారీకి సంబంధించి అనుమతులున్నాయని జితేంద్ర శర్మ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. మెడ్‌టెక్‌ జోన్‌లో మోల్‌బయో సంస్థ కిట్ల తయారీని ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు 2వేల కిట్లను తయారీ చేస్తామని, ఏప్రిల్‌ రెండోవారానికల్ల రోజుకు 10వేల కిట్లు, మే నెల మొదటి వారానికల్లా రోజుకు 25వేల కిట్లు తయారుచేసే సామర్థ్యాన్ని చేరుకుంటామని జితేందర్ శర్మ వెల్లడించారు. త్రీడీ ప్రింటింగ్‌ లేబొరొటరీలో వీటిని తయారుచేస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపిన సిబ్బంది. అలాగే కరోనా వైరస్‌ సోకడం వల్ల క్రిటికల్‌ సమస్యలు ఎదుర్కొన్నవారికి వైద్యం అందించడంలో అత్యంత కీలకమైన వెంటిలేటర్ల తయారీకూడా ప్రారంభించామని  సీఈఓ చెప్పారు. ఏప్రిల్‌లో 3వేల వెంటిలేటర్లను తయారుచేస్తున్నామని చెప్పారు. మే నుంచి ప్రతి నెలా 6వేల వెంటలేటర్లను తయారుచేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు.  ప్రచారం, ఆర్భాటం లేకుండా అత్యంత కీలక సమయంలో పనులు ముందుకు సాగడం మంచి పరిణామమన్న సీఎం. ర్యాండమ్‌ కిట్లు అందుబాటులోకి వచ్చినందున పరీక్షలు చేసే సామర్థ్యం పెరుగుతుందన్న సీఎం.  రోజుకు 10వేల పర్సనల్‌ ఎక్విప్‌మెంట్‌కిట్ల చొప్పున మూడురోజుల్లో మరో 30వేల పీపీఈలు అందుబాటులోకి రానున్నాయని సీఎంకు వెల్లడించిన అధికారులు.  ఇవికూడా రాష్ట్రంలోనే తయారవుతున్నాయన్న అధికారులు.

ప్రభుత్వ ఆంక్షలు వైసీపీ నేతలకు వర్తించవా?

ప్రభుత్వ డబ్బును వైసీపీ అభ్యర్థులు అందిస్తున్నారని, అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని మాజీ మంత్రి, టీ డీ పీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. పేదలకు కేటాయించిన రూ. 1,000 నగదును వైసీపీ నేతలు పంచుతున్నారని... అయినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థులు ప్రజల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ సాయాన్ని అందిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వందిలాది మంది కార్యకర్తలతో కలిసి... జాతరలా డబ్బు పంచుతున్నారని అన్నారు. ప్రజలకు వర్తిస్తున్న ఆంక్షలు వైసీపీ నేతలకు వర్తించవా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.

ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: ప్రధాని

కరోనా విజృంభణ, లాక్‌డౌన్ విషయంపై ప్రధాని మోడీ బుధవారం అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే సరైన పరిష్కారమని మోడీ తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు మునుపటిలాగా సాధారణంగా ఉండవు. కరోనా కు ముందు, కరోనా కు తరువాత అనే విధంగా పరిస్థితి ఉంటుందని మోడీ  అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. ఏ ఒక్కరూ కూడా లాక్‌డౌన్ ఎత్తివేయాలని అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతా. ఒకే సారి లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని ఫ్లోర్ లీడర్లతో మోడీ అన్నట్లు సమాచారం. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సానుకూలంగా ఉంటేనే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించగలమని మోడీ అన్నారు. ఈ కష్ట సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఐకమత్యంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. అలాగే, వైరస్ కట్టడికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వాలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ఏదైనా గౌతమ్ రెడ్డి సార్ టోన్, టెనార్ చాలా డిఫరెంట్ సిద్దప్పా...

* జగదేకవీరుడు చిత్రం లో ఎన్ టీ ఆర్ ఎలాగో, పరిశ్రమల శాఖ లో జితేందర్ శర్మ అలాగన్న మాట  * జితేందర్ శర్మ అవినీతిపై విచారణ ఇహ అటకెక్కినట్టేనా ? * చంద్రబాబు నాయుడు 'బ్లూ ఐడ్ బాయ్' శర్మ అంటే -గౌతమ్ రెడ్డి కి మక్కువ ఎక్కువ  * రెండు ప్రభుత్వాల్లోనూ చక్రం తిప్పుతూ, ఎందరినో అబ్బురపరిచిన శర్మ ఏది ఏమైనా గౌతమ్ రెడ్డి సార్ టోన్, టెనార్ చాలా డిఫెరెంట్ అని వెలగపూడి సచివాలయం ఐ ఏ ఎస్ లు చెవులు కొరుక్కుంటున్నారు. 'ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ', 'సాహసమే నా ఊపిరి ' లాంటి స్లోగన్లు మనం చిన్నప్పుడు లారీల వెనుక, బస్సుల వెనుక చూస్తూ చదువుతూ ఉండే వాళ్ళం కదా .. అందులో ఫస్ట్ స్లోగన్ అంటే మంత్రి గౌతమ్ రెడ్డి గారికి మహా ప్రీతి అనీ, అందుకనే రెండు ప్రభుత్వాలలో ( తెలుగు దేశం, వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వాలు ) ఒక వెలుగు వెలిగి, ఇంకా వెలుగుతూనే ఉన్న పూనమ్ మాలకొండయ్య, జితేందర్ శర్మ లాంటి వారిని ఆ స్లోగన్ కిందకు తీసుకువచ్చి వారికి పెద్ద పీట వేశారని కొందరు కిట్టని ఐ ఏ ఎస్ లు, మంత్రులు అనుకుంటున్నప్పటికీ, ధీశాలి గౌతమ్ రెడ్డి మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోకుండానే, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి-ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్ ( ఏ ఎం టీ జెడ్) అద్భుతాలను ప్రెజెంట్ చేసిన తీరు, ఆ నిమిత్తం జగదేకవీరుడు సినిమా లో ఎన్ టీ ఆర్ మాదిరి జితేందర్ శర్మ ఏ రకంగా అసాధ్యాలను సుసాధ్యం చేశారో వివరించుకుంటూ వచ్చిన తీరు చూపరులను, మీడియా ప్రతినిధులను ఆద్యంతం అబ్బురపరిచింది. ఆ విశేషాలేమిటో, మంత్రి గౌతమ్ రెడ్డి మాటల్లోనే వినండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. జితేందర్ శర్మ అనే అద్భుత వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కూడా. నాదస్వరానికి నాగుపాము ఎలా తల ఊపుతూ నాట్యం చేస్తుందో, సరిగ్గా అదే తీరున జితేందర్ శర్మ ప్రతిపాదనలను ఆద్యంతం ప్రోత్సహిస్తూ వచ్చి, ఏ ఎం టీ జెడ్ అవినీతి వివాదాల్లో చిక్కుకోవటానికి చంద్రబాబు నాయుడు కూడా శాయశక్తులా సాయపడ్డారు. అపుడు  ఏ ఎం టీ జెడ్ ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటె, ఈ ప్రభుత్వం లో మాత్రం గౌతమ్ రెడ్డి గారి పరిశ్రమల శాఖ పరిధిలోకి వచ్చింది. ఏ జితేందర్ శర్మ మీద అయితే, వై ఎస్ ఆర్ సి పి అలుపెరుగని పోరాటం చేసిందో, తాము అధికారం లోకి రాగానే, మళ్ళీ అదే శర్మ గారిని ఏ ఎం టీ జెడ్ కి సి ఈ ఓ గా నియమించింది. ఇక్కడ కూడా గిట్టనివారు, చంద్రబాబు నాయుడును, కీలక బీ జె పీ నేతలను, పూనమ్ మాలకొండయ్య నూ ఆడిపోసుకున్నా కూడా- గౌతమ్ రెడ్డి మాత్రం తన హృదయ వైశాల్యాన్ని చాటుకుని మరీ జితేందర్ శర్మ చేత కరోనా కిట్లు తయారు చేయిస్తున్నారు. అదీ పరిశ్రమల మంత్రి గొప్పతనం.  ఇహ, మిగిలిన కథా క్రమమెట్టిదో మీరే చదవండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 వైరస్ టెస్ట్ కిట్లు తయారు చేయడం గర్వించదగ్గ పరిణామమనీ, అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విప్లవాత్మక మార్పులకు విశాఖ మెడ్ టెక్ జోన్  శ్రీకారం చుట్టిందని ప్రెస్ మీట్ లో చెప్పిన గౌతమ్ రెడ్డి, ఏపీతో పాటు, దేశానికే మెడ్ టెక్ జోన్ కిట్ల తయారీలో కీలకంగా మారుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ మెడిటెక్ జోన్ లో కోవిడ్-19 టెస్టింగ్ కిట్ల తయారీకి ఐసీఎంఆర్ అనుమతి లభించిందని, వెంటిలేటర్ల తయారీకి అవసరమైన అన్ని అనుమతులకు  డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా  మినహాయింపు ఇచ్చారని, కరోనా వైరస్ ను ధృవీకరించడంలో ఈ కిట్లు చాలా అద్భుతంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు. రోజుకు 2000 కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ, రానున్న రోజుల్లో 25 వేల కిట్ల తయారే లక్ష్యం, ర్యాపిడ్ టెస్టింగ్ ద్వారా గంటలోనే ఫలితం, పాలిమరస్ చైన్ రియాక్షన్ (PCR)టెస్ట్ నిర్ధారణ ప్రక్రియకు  2-3 రోజుల సమయం అవసరమని చెప్పిన మంత్రి, కిట్లు తయారీతో పాటు, 6వేల మెషిన్లు నిల్వ సిద్ధంగా ఉందన్నారు. స్క్రీనింగ్ పరీక్షలకు కావలసిన సామాగ్రిని త్వరలోనే 60 శాతం సిద్ధంగా ఉంచుతామన్నారు. దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత ఉన్న నేపథ్యంలో త్వరలోనే కావల్సినన్ని సమకూరుస్తామన్నారు. N95 కన్నా సురక్షితమైన P 95 మాస్కుల తయారీ పనులను కూడా 4 పరిశ్రమలకు అప్పగించామన్నారు. వ్యక్తిగత రక్షణ సామాగ్రీ (PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కూడా  రాష్ట్రంలో అవసరాలకు లోటు లేకుండా తయారు చేస్తామని, డీఎన్ఏ , ఆర్ఎన్ఏ మోడల్ కాబట్టి కచ్చితమైన నిర్ధారణ జరుగుతుందని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అందుబాటులో ఉన్న వనరులతో  రోగుల ప్రాణ నష్టం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట. వైద్య పరికరాల కొరత, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికగా ముందుకు వెళుతున్నామని కూడా మంత్రి చెప్పారు. అత్యవసర వైద్య పరికరాలు, మాస్కులు, టెస్టింగ్ కిట్లు తయారు చేసే పరిశ్రమలకు కావలసిన కార్మికులు, సిబ్బందికి లోటు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.  అత్యవసర సేవలు, సామాగ్రి అందించే పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులకు పౌష్ఠికాహారం, వసతులు లోటు రానివ్వడం లేదని, కరోనా ఇబ్బందులలోనూ 25-30 శాతం పారిశ్రామిక ఉత్పత్తి చేస్తూ దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ ముందుంది. మిగతా రాష్ట్రాలలో  20 శాతం కన్నా తక్కువేనని చెప్పారు.  పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1000 టెస్టింగ్ కిట్లు, 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ అందజేస్తామన్నారు.  కోవిడ్-19 బాధితులకు వెంటిలేటర్ల సాయం అత్యవసరమని, అటువంటి వెంటిలేటర్ల తయారీకి కూడా రాష్ట్రంలో ప్రాధాన్యతనిస్తూ వాటిని కూడా విశాఖ మెడ్ టెక్ లో తయారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ క్రమంలో హిందుస్థాన్ లైఫ్ కేర్(హెచ్ఎల్ఎల్) సంస్థతో కలిసి ఏప్రిల్ 15 నుండి నెలకు 3000 వెంటిలేటర్లు మరియు మే చివరి నాటి 6 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేయనున్నామని మంత్రి తెలిపారు. కేంద్రం ఇప్పటికే 3500 వెంటిలేటర్లు కావాలని ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి తయారీకి తొలిదశలో 6 కంపెనీలను ఎంపిక చేయడం జరిగిందని, అవి ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ వాడటం ద్వారా ఒక్క వెంటిలేటర్ సహాయంతో ఐదు నుండి ఆరుగురుకి వినియోగించే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో పరిశ్రమల శాఖ తమ వంతు సహకారంగా 1000 టెస్టింగ్ కిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా రూ. 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం(5 లక్షల 4వేల 570 రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా  అందజేశారని వెల్లడించారు. అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విశాఖ మెడ్ టెక్ జోన్  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు.  పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ మాట్లాడుతూ, ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే మిషన్ లలో ఈ టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నామన్నారు. రాష్ట్రంలో 230 ఈ తరహా మిషన్లు ఉన్నాయని, వాటన్నింటిని వినియోగిస్తూ ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించి 55 నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

టీడీపీ గుట్టు విప్పిన 'సజ్జలోపాఖ్యానం'

* మాజీ సి ఎం దోస్తు శ్రీనివాసులు నాయుడి యవ్వారంపై నోరు మెదపరేమని సజ్జల ప్రశ్న  * మాజీ మంత్రి గంట ఆ విషయం లో హర్ట్ అయ్యారని సజ్జల వ్యాఖ్య ఇంతకీ సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పే ఆ శ్రీనివాసులు నాయుడు ఎవరు? ఆయన, అప్పటి హెచ్ ఆర్ డీ మంత్రి గంట శ్రీనివాసరావుని కూడా పక్కన పెట్టి మరీ, యూనివర్సిటీ పాలక మండళ్లను నియమించారా? ఈ విషయం లో అప్పటి సి ఎం చంద్రబాబు నాయుడు కు, గంటా శ్రీనివాసరావుకు మధ్య నిజంగానే గ్యాప్ పెరిగిందా? శ్రీనివాసులు నాయుడు నిజంగా అంత తురుమ్ ఖానా? అవుననే అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వివరాలన్నీ అయన మాటల్లోనే వినండి.  రాష్ట్రం లోని యూనివర్సిటీలను విద్యాపరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి పాలక మండళ్ళను నియమించినట్టు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం, అలాగే ఆ పార్టీ కి వంత పడుతున్న కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డ సజ్జల, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల పాలక మండలి నియామకం తొలిసారి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.  "దేశ చరిత్రలో తొలిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి 50 రిజర్వేషన్లతో యూనివర్సిటీ పాలక మండలి పోస్టులు భర్తీ చేశారు. బీసీ, ఎస్సి ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం మేరకు పాలక మండలిలో అవకాశం కల్పించారు.. పాలక మండలిలో  మహిళలకు సైతం 50 శాతం మేర అవకాశం కల్పించారు.సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశ్యం తో సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 యూనివర్సిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు దాటి బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. 116 మంది పాలకమండలి సభ్యులకు గాను 58 మంది మహిళలకు సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్దానం కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి ప్రజాస్వామ్యబద్దంగా,ఎవరైతే అప్లయ్ చేసుకున్నారో వారి అర్హతలను ఉన్నత విద్యకు సంబంధించి ప్రత్యేక కమిటి పరిశీలించింది. 390 మంది దరఖాస్తు చేసుకుంటే వారిని అన్ని విధాలా వడపోత పోసి యూనివర్శిటిల అభివృధ్దికి దోహదపడేవారిని 116 మందిని నియమించారు. మా నాయకులు సిఫార్స్ చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నియమితులైన సభ్యులలో అందరూ కూడా ఆయా రంగాలలో నిష్ణాతులే పైగా రిజర్వేషన్ లకు లోబడి నియమించబడ్డవారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో ఆయా రంగాలలో ఉన్నతమైన వ్యక్తులను పాలకమండలి పదవుల్లో నియమించారు.. పాలక మండలి సభ్యులు నియామకం పై టీడీపీ నేతలు తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు," అని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.  పాలకమండళ్ల నియామకాలలో సామాజిక న్యాయం పాటించడాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని, మూడు రోజుల నుంచి పసిరికా పాముల పచ్చ మీడియా తప్పుడు వార్తలు వండివారుస్తోందని, ప్రపంచ మంతా కరోనా వైరస్ గురించి ఆలోస్తుంటే పచ్చమీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని , లాక్ డౌన్ ఉందని రాజకీయ పాలక మండలి అంటూ మెడకాయమీద తలకాయలేని వార్తలు రాస్తున్నారని సజ్జల మండిపడ్డారు.  "కరోనా లాంటి మహమ్మారి  నేపథ్యంలో మేము మంచి పని చేసి కూడా చెప్పలేకపోయము. కరోనా ను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పని చేయడమే తప్ప ప్రచారం అలవాటు లేదు. పాలకమండలికి సంబంధించి అన్ని పదవులు అర్హులకే కట్టబెట్టారు.యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం ఆదేశించారు.మహిళ రిజర్వేషన్లు విషయంలో రెండు పోస్టులు తగ్గితే సీఎం వైయస్ జగన్ ఒప్పుకోలేదు.రిజర్వేషన్లు ప్రకారం మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు దక్కవలసిందేనని సీఎం స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారు.దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు.ఇప్పటి పాలకమండలి నియామకానికి ప్రత్యేకంగా ఓ కమిటిని మా ప్రభుత్వం నియమించింది.చంద్రబాబు హయాంలో అయితే  క్లాస్ మేట్ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యులు జాబితాను చంద్రబాబు ఆమోదించారు.శ్రీనివాసులు నాయుడు కు ఏ అర్హత ఉందని పాలకమండలి సభ్యులను నియమించారో కూడా తెలియదు.దీనిపై  ఎల్లో మీడియా అప్పడు  ఎందుకు వార్తలు రాయలేదు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారు.ఈ విషయం అప్పట్లో అందరికి తెలిసిందే.చంద్రబాబు హయాంలో పాలకమండలి సభ్యుల నియామకాల్లో తప్పులు జరిగితే ఎల్లో మీడియా గాడిదలు కాసిందా. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులుపై పచ్చమీడియా ఎందుకు నోరు మెదప లేదంటూ" సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.

సీఆర్డీఏ వర్సెస్ మందడం రైతులు

తుళ్ళూరు మండలం మందడం గ్రామ పంచాయతీ కార్యాలయంలో  సీఆర్డీఏ సిబ్బంది తో రైతుల వాగ్వివాదం కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ళు లేని నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సి ఆర్ డి ఏ అధికారులు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  గతంలోనే  పట్టాలు ఇవ్వటం కుదరదు అంటూ  కోర్టును ఆశ్రయించిన రైతులు. అభ్యంతరాలు తెలిపేందుకు కోర్టుకు రావాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చేందుకు మందడం పంచాయితీ కార్యాలయంలో కి వచ్చిన సీఆర్డీఏ సిబ్బంది. లాక్ డౌన్ ఉన్నపుడు రైతులు కోర్టుకు ఎలా వస్తారంటూ సీఆర్డీఏ సిబ్బందిని ప్రశ్నించిన రైతులు. సామాన్య ప్రజలు కూరకాయలు తెచుకోవటానికే బయటకు రానివ్వని పోలీసులు మీకు బయటకు రావటానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన రైతులు. దీంతో సీఆర్డీఏ సిబ్బంది అనివార్యంగా వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.

దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు! కిషన్‌రెడ్డి

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. ‘‘ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.  అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. తాజా కూరగాయలు అవసరంలేదు.  పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండని కిష‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు. ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడివారు అక్కడే ఉంటారు. విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుంది. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.