ఆంధ్ర ప్రదేశ్ లో 10,000 రూపాయలకే జానీ వాకర్ బాటిల్

* ఎక్సయిజ్ శాఖ లో ఇంటి దొంగలు  * తూర్పు గోదావరి లో కళకళ లాడుతున్న బ్లాక్ మార్కెట్  ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ప్రియులకు శుభవార్త. జానీ వాకర్ బాటిల్ 10,000 రూపాయలకే అక్కడ బ్లాక్ మార్కెట్ లో దొరుకుతోంది. అసలు ఏ ఇబ్బంది లేకుండా దొరకాలంటే, తూర్పు గోదావరి జిల్లా రాజోలు వెళితే చాలు, ఎక్సయిజ్ సిబ్బంది తో కుమ్మక్కయిన కొందరు ఔత్సాహికులు 2,300 రూపాయలకే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికే జానీ వాకర్ బాటిల్ ను 10,000 రూపాయల చౌక బేరానికే విక్రయిస్తున్నారు. అయితే, మద్య విమోచన ప్రచార కమిటీ వర్షన్ మాత్రం మరోలా ఉంది... అదేదో వారి మాటల్లోనే చదివి ఆనందించండి.  మార్చి 22 నుండి సీలు వేసి మూసివేసిన 3500 ప్రభుత్వ మద్యం షాపులను, 800లకు పైగా వున్న బార్ మరియు రెస్టారెంట్ లను తనిఖీలు చేసి అక్రమంగా మద్యం తరలించి వుంటే సంబంధిత సూపర్ వైజర్, సేల్స్ మెన్ లతో పాటు బార్ యజమానులు,  సంబంధిత అధికారులపై సత్వర చర్యలు చేపడుతామని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వాళ్ళంరెడ్డి లక్ష్మణ రెడ్డి చెపుతున్నారు. జాన్ వాకర్ 10,000 రూపాయలకే దొరుకుతున్న విషయం వారిదాకా ఇంకా వచ్చి ఉండకపోవచ్చు.  మార్చి 22న సీలు వేసిన సమయానికి వున్న మద్యం నిల్వలు తనిఖీలు చేసిన సందర్భంగా వున్న మద్యం నిల్వలలో ఏమాత్రం తేడా వచ్చినా కఠినంగా శిక్షిస్తాం.ఈ తనిఖీల నిర్వహణ కోసం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్,  పోలీస్,  మద్యం డిపోల సిబ్బందితో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్టు-ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరిండెంట్స్ ఎన్.బాలకృష్ణన్, ఎస్. రవికుమార్, సి. హెచ్. వి మహేష్ కుమార్ మీడియా ప్రతినిధులకు వివరించారు.  కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడా మద్యం షాపులు, బార్ మరియు రెస్టారెంట్ ల  నుండి అక్రమంగా మద్యం తరలించినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ అక్రమ మద్యం కార్యకలాపాలను ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి అయినా  అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్  రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తాం. ముఖ్యమంత్రి దృఢసంకల్పమైన  దశలవారీ మద్య నిషేధానికి ఎవ్వరూ తూట్లు పొడవాలని చూసినా సహించేది లేదు. రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండరాదని కోరుతున్నామని కూడా వారు చెప్పుకొచ్చారు.   లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 22 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ లో ని 13 జిల్లాలలో 2178 అక్రమ మద్యం కేసులు నమోదు కాగా 22 13 మందిని అరెస్టు చేశామంన్నారు. 16,405 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. 3,61,500 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.  మన రాష్ట్రానికి సంబంధించిన 1976 లీటర్ల మధ్యనని,   1500 లీటర్ల బీర్ బాటిల్స్ ల ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న 1420 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 3000 లీటర్ల కల్లును పట్టుకున్నారు. అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న 464 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు అత్యధికంగా వినియోగించడం వలన ప్రస్తుతం విత్ డ్రాయల్ లక్షణాలు ఎక్కువగా వచ్చి  వందలాదిమంది ఆస్పత్రుల పాలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీకల్లు లేనందున ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా వ్యసనపరులకు విత్ డ్రాయల్ లక్షణాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీ-అడిక్షన్ కేంద్రాలను సంప్రదించాలని, గుంటూరులోని న్యూ లైఫ్ డి- అడిక్షన్ కేంద్రం వారు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారనీ,  9849347500 నెంబరును  సంప్రదించాలని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వాళ్ళంరెడ్డి లక్ష్మణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రజల బాధలు పట్టించుకోకుండా.. స్వప్రయోజనాల కోసం వెంపర్లాట

-జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజం  -తెదేపా నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్  కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తుంటే ప్రజల బాధలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని తన నివాసం నుండి  చంద్రబాబు నాయుడు సోమవారం నాడు  టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడితే ఆయనను పదవి నుంచి తొలగించడం దుర్మార్గ చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.  ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, రాజకీయ లాభాలే తనకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎపిలో క్వారంటైన్ ను ఒక ఫార్స్ గా మార్చారని, తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని విమర్శించారు. కనగరాజ్ చెన్నై నుంచి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలకు, వలస కార్మికులకు రాష్ట్రాల సరిహద్దులు దాటడానికి ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసిని తొలగించడం, మాస్కులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం, నిధులు అడిగిన మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయడం, ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పిపిఈలు) ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు. మీతో పాటు ఐదుగురికి భోజనం పెట్టాలని ప్రధాని నరేంద్రమోడి ప్రజలందరికీ పిలుపిస్తే, మన రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే కేంటిన్లు మూసేసిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఆయన వ్యాఖ్యానించారు.  పనులు కోల్పోయిన పేదలకు కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో వైసిపి మినహా అన్ని పార్టీలు కోరినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని, అన్నా కేంటిన్లు తెరవాలని, చంద్రన్న బీమా పునరుద్దరించాలని  12గంటలు దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గద్దె అనురాధలను చంద్రబాబు అభినందించారు.  రాజధాని రైతులు, మహిళలపై అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా నందిగామలో దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా ఆయన  అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి జిల్లాలో పేదలకు, రైతులకు, కార్మికులకు సంఘీభావంగా టిడిపి నాయకులు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతం గుంటూరు-కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆయన ఆరోపించారు.  కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్లుతోందని ఆయన విమర్శించారు. కరోనా మరణం దాచిపెడితే వాటిల్లే దుష్ఫలితాలకు విజయవాడ ఉదంతమే రుజువు అని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప, మండల ప్రాతిపదికన తక్కువగా చూపించడం దురుద్దేశ పూర్వకంగా పేర్కొన్నారు. ఏపిలో కరోనా కేసులపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్  కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు.  చెప్పారు. లాక్ డౌన్ లో కూడా అనేక జిల్లాలలో వైసిపి నేతలు అక్రమ మైనింగ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలలో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకున్న వారు లేరని విమర్శించారు. గ్రావెల్ అక్రమ తరలింపు ట్రాక్టర్లను సీజ్ చేయకుండా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే ట్రాక్టర్లను సీజ్ చేయడం హేయమని వ్యాఖ్యానించారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పారిశుద్యం యుద్దప్రాతిపదికన మెరుగుపర్చాలని, జనావాసాల మధ్య మురుగు, చెత్తకుప్పలు తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్య కార్మికులకు ప్రోత్సాహకాలతో పాటు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలని సూచించారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని చెప్పారు. గత 10రోజుల్లోనే పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, దళారులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. రెండు, మూడెకరాల భూమి ఉందనే నెపంతో తెల్లకార్డుదారులకు రూ 1,000 ఆర్ధిక సాయం, రేషన్ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం శోచనీయమని అన్నారు.  140లక్షల కార్డుదారులకు రూ. 1000 ఇవ్వాల్సివుండగా 123లక్షల కార్డుదారులకు మాత్రమే ఇవ్వడం శోచనీయమన్నారు. ఇటీవల తొలగించిన 18లక్షల రేషన్ కార్డుదారులకు కూడా రూ 1,000 ఆర్ధికసాయం, రేషన్ సరుకులు అందజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ముస్లింలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. నారాయణ స్వామిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  ‘‘ఎంగిలి ప్లేట్లు, స్పూన్లు ముస్లింలు నాకడం వల్లే కరోనా వ్యాపిస్తోందని’’ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి వ్యాఖ్యానించడం గర్హనీయమని అన్నారు. ‘ఢిల్లీ జమాత్ వల్లే ఏపిలో కరోనా వ్యాపించిందని’’ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదికి ఫిర్యాదు చేశారని, ‘‘ముస్లింలు ప్లేట్లు, స్పూన్లు నాకడం వల్లే కరోనా వస్తోందని’’ డిప్యూటి సీఎం అన్నారని, ముస్లింల పట్ల వైసిపి నేతల దుర్మార్గ వైఖరికి ఈ వ్యాఖ్యలే రుజువని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని ఏదో ఒక మతానికి అంటగట్టాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.  ముస్లింలపై వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 14వ తేదీన  అంబేద్కర్ జయంతిని ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.  అంబేద్కర్ చిత్రపటాలకు ఇళ్లలోనే దండలేసి నివాళులు అర్పించాలని చెప్పారు. వైసిపి ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలను గర్హించాలని, గత ఏడాదిగా దళితులపై దాడులు పెచ్చుమీరడం, అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడం, దళిత డాక్టర్ ను సస్పెండ్ చేయడం, ఎస్సీ నిధులు దారిమళ్లించి స్వాహా చేయడం, తదితర దళిత వ్యతిరేక చర్యలను నిరసించాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పీరియడ్ లో పేద కుటుంబాలకు అండగా ఉంటూ బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులను అభినందించారు. విపత్తులలో బాధితులను ఆదుకోవడం మానవ ధర్మంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విపత్తు బాధితులను ఆదుకోవడానికి టిడిపి చేసిన కృషిని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న చార్ థామ్ యాత్రీకులను, కృష్ణా వరద బీభత్సంలో కర్నూలు, మహబూబ్ నగర్ తదితర 5 జిల్లాల బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడాన్ని ప్రస్తావించారు. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటిస్తూ, స్థానిక అధికారుల సహకారంతో పంపిణీ జరిగేలా చూడాలని కోరారు.   ‘‘గత 10రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా వైరస్ 182% పెరిగింది. కర్నూలులో 8300% పెరగ్గా, అనంతపురం 650%, గుంటూరులో 310%, నెల్లూరులో 116%, ప్రకాశంలో 141%, చిత్తూరులో 133%, తూర్పుగోదావరిలో 89%, విశాఖలో 82%, కడపలో 72% పెరగడం ఆందోళనకరం. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చూస్తే, గత 10రోజుల్లో మహారాష్ట్రలో 382%, ఢిల్లీ 301%, తమిళనాడు 228%, రాజస్థాన్ 516%, గుజరాత్ 486%, మధ్యప్రదేశ్ 425% పెరిగింది. కేరళ, కర్ణాటక మాత్రమే 100% కన్నా తక్కువ నమోదు అయ్యాయి.  కేరళలో ప్రతి మిలియన్ మందికి 428పరీక్షలు చేయగా, ఢిల్లీలో 582పరీక్షలు, మహారాష్ట్రలో 360మందికి, రాజస్తాన్ లో 413మందికి టెస్టింగ్ లు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి 10లక్షల మందికి కేవలం 161పరీక్షలే చేస్తున్నారని’’ నిపుణుల వ్యాఖ్యలను చంద్రబాబు ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  ఎంత ఎక్కువగా టెస్ట్ లు చేస్తే అంతగా కరోనా వైరస్ ను కట్టడి చేయగలం అనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశంగా పేర్కొన్నారు. టెస్టింగ్ లు అధికంగా చేసి, పాజిటివ్ కేసులను ఐసొలేషన్ చేసి, వారికి ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా, వారి ప్రాణాలను కాపాడటమే కాకుండా, వాళ్ల కుటుంబాలను, తద్వారా సమాజంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు అన్నారు.

అన్ని రకాల గూడ్స్ వాహనాలకు అనుమతి!

రవాణా లారీలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తమ ఉత్పత్తులను రవాణా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి. దీంతో క్రమేణా లోడింగ్‌లు, అన్‌లోడింగ్‌లు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్‌లు చేసుకోవటానికి ఆలోచిస్తున్నారు. దీంతో ఆశించినంతగా బుకింగ్‌లు జరగటం లేదని తెలుస్తోంది.  పాస్‌ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు. ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.

కరోనాపై జగన్ సంధించిన బ్రహ్మాస్త్రమిది.. తక్కువ కేసులతో బయటపడతాం: విజయసాయి

*ఒక్కొక్కరికీ మూడేసి మాస్క్ లు ఇవ్వాలని జగన్ నిర్ణయం *మొత్తం 16 కోట్ల మాస్క్ ల పంపిణీకి రంగం సిద్ధం *ఏపీ సురక్షిత రాష్ట్రమవుతుందన్న విజయసాయి ఆంధ్రప్రదేశ్ లో నివశిస్తున్న ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్క్ ల చొప్పున అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఓ బ్రహ్మాస్త్రం వంటిదని, దీంతో కరోనాపై పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ప్రస్తుతం దేశమంతా జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నదని అన్నారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రం అత్యంత సురక్షిత రాష్ట్రంగా నిలుస్తుందని విజయసాయి వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ గారు చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది" అని విజయసాయి అభిప్రాయపడ్డారు.

కరోనా బాధితుల్లో అత్యధికులు పొగతాగేవారే! డబ్ల్యూహెచ్‌వో

శ్వాసకోశ,, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారిపైనా కరోనా దాడి చేస్తోంద‌ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. పొగతాగేవారిపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో తేల్చిచెప్పింది. పొగ పీల్చినప్పుడు ఏస్‌–2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, వైరస్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని పేర్కొంది. ప్రపంచంలో కోవిడ్‌–19 వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్‌ అధ్యయనం చేశారు. పొగతాగే వారే అత్యధిక శాతం కరోనా బారిన పడినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది.  చైనాలో కరోన బారిన పడిన 82,052 మందిలో 95 % మంది పొగతాగే అలవాటున్న వారేనని అధ్యయనంలో తేలింది.  ఇటలీ లోనూ సింహభాగం కరోనా రోగులకు పొగతాగే  అలవాటున్నట్టు గుర్తించారు.   కరోనా బారిన పడిన వారిలో పొగతాగేవారి తర్వాతి స్థానం తీవ్ర శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారిదేనని వెల్లడైంది. పొగ తాగడం మానేసేందుకు ఇంతకంటే మంచి సమయం రాదని జానీస్ లీంగ్‌ చెప్పారు.

'దగ్గుబాటీ'స్ కర్రీ పాయింట్!

*చెఫ్‌గా మారిన ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు *నాటుకోడి పులుసు, బిర్యానీ రెడీ... లాక్‌డౌన్ దెబ్బ‌తో గల్లీలో కూలీ పనిచేసే కార్మికుడి దగ్గరి నుంచి దేశ అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోని వారి పరిస్థితి ఇంతే. నిత్యం బిజీగా ఉండే క్రికెటర్లు, సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం దగ్గరి నుంచి బాత్ రూమ్స్ క్లీన్ చేసే వరకు అంతా వాళ్లే చేసుకుంటున్నారు. ఇంటి పనులు చేస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, వంట పనుల్లో భార్యకు సాయం చేస్తోన్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.  కిచెన్‌లో ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎలా చెఫ్‌గా మారి.. వంట‌ పనుల్లో తన భార్యకు సాయమందిస్తూ బిజీగా వున్నారు. సండే స్పెష‌ల్‌గా  నాటుకోడి పులుసు, బిర్యానీ రెడీ చేసారు...

ఫాల్‌–2020 అకడమిక్‌ ఇయర్‌ స్ప్రింగ్‌ 2021కి వాయిదా?

కరోనా ఎఫెక్ట్ తో అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు వాయిదా వేసే యోచనలో వున్నాయి. అమెరికాలో విశ్వవిద్యాలయాలు  ఎప్పుడు పని చేస్తాయన్నది చెప్పడం కష్టమేనని, ఒకవేళ ఆగస్టు నాటికి మామూలు పరిస్థితులు నెలకొన్నా ఫాల్‌–2020 తరగతులు సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం గగనమేనని యూనివర్సిటీ అఫ్‌ ఫ్లోరిడా గ్యాన్‌విల్లే అకడమిక్‌ విభాగం పేర్కొంది.  ‘మీకు ఇచ్చిన అడ్మిషన్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. మీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయి మార్కుల జాబితా రాగానే మాకు పంపండి. ఫాల్‌ వీలు కాకపోతే స్ప్రింగ్‌–2021కి మీ అడ్మిషన్‌ను వాయిదా వేస్తాం’అని విద్యార్థులకు పంపిన కమ్యూనికేషన్‌లో స్పష్టం చేసింది. ‘యూనివర్సిటీ అఫ్‌ ఆరిజోనా.  ఈ ఏడాది ఫాల్‌–2020 అకడమిక్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన అడ్మిషన్లు రద్దు కావు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆందోళన అవసరం లేదు. కచ్చితంగా వారికి తదుపరి అకడమిక్‌ సెమిస్టర్‌లలో అవకాశాలు ఇస్తారని  యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్, షికాగో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రణవ్‌ బోన్సులే అన్నారు.  ఇప్పటికే ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన నాలుగో ఏడాదిలో ఉన్న విద్యార్థులు దాదాపు 40 వేల మంది ఫాల్‌–2020కి అడ్మిషన్లు పొందారు. షెడ్యూల్‌ ప్రకారం మరో 30 నుంచి 40 వేల మందికి ఈ నెలాఖరుకు అడ్మిషన్లు రావాలి. కానీ, అక్కడ 90 శాతం విశ్వవిద్యాలయాలు కరోనా వైరస్‌ కారణంగా పని చేయడం లేదు. ఈ వర్సిటీలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో, అడ్మిషన్లు ఎప్పుడు ఇస్తారో అనే దానిపై స్పష్టత లేదు.  ‘జూన్‌ నాటికి మామూలు పరిస్థితులు నెలకొని జూలైలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినా వారు ఫాల్‌ –2020కి హాజరు కావడం గగనం. ఒకసారి విద్యార్థి ఐ20 అందుకున్న తరువాత వీసా అపాయింట్‌మెంట్‌కు ఆరు వారాలు పడుతుంది. ప్రస్తుత తరుణంలో అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మంది మే మొదటి వారంలోగా వీసా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఉండాల్సింది. కాన్సులేట్లు మూసి ఉన్న కారణంగా అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల ఫాల్‌–2020 అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగే’ అవ‌కాశం లేదు. మే 15 దాకా కాన్సులేట్‌లు తెరుచుకోవడం అనుమానమే..  ‘కచ్చితంగా ఫలానా సమయంలో పని చేస్తాయని చెప్పలేం. కానీ, మాకు అందుతున్న సమాచారం ప్రకారం మే 15 దాకా పని చేయవు’అని కాన్సులేట్‌ వర్గాలు అంటున్నాయి.  ఇదే జరిగితే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మందికి జూలై, ఆగస్టులో గానీ అపాయింట్‌మెంట్లు పొందే అవకాశం లేదు. ఒక సారి కాన్సులేట్‌ పని చేయడం మొదలుపెడితే ఏప్రిల్‌ 15 నాటికి వీసా అపాయింట్‌మెంట్‌ కలిగి ఉన్న వారికే (ప్రస్తుతం రద్దయ్యాయి) జూన్‌ చివరి దాకా రీషెడ్యూల్‌ అవుతాయి. అందువల్ల కొత్త అపాయింట్‌మెంట్లకు అవకాశం ఉండకపోవచ్చు.

14 రోజుల క్వారంటైన్ నిబంధ‌న కనగరాజ్, గవర్నర్‌కు వ‌ర్తించ‌దా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్పై  తెలుగుదేశం పార్టీ స్వరం పెంచి ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ప్రభుత్వం తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్ను నియమించాక కనగరాజ్ గవర్నరును కలిసి బాధ్యతలు స్వీకరించడం లాక్డౌన్ నేపథ్యంలో ఎలా సాధ్యం అయిందని ప్రశ్నిస్తోంది.  కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతూ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిపివేయగా చెన్నై నుంచి కనగరాజ్ వచ్చి నేరుగా బాధ్యతలు తీసుకోవడం, గవర్నరును కలవడం ఏమిటని, వీరికి రూల్స్ వర్తించవా అని టిడిపి నిలదీస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చిన హాస్టల్ విద్యార్థులు, వలస కార్మికులకు ఒక రూల్, కనగరాజ్మరోక రూలా?  14 రోజులు క్వారంటీన్లో ఉండాల్సిన నిబంధన ఇప్పడు కనగరాజ్, గవర్నరు పాటిస్తారా? అని టిడిపి ప్రశ్నిస్తోంది.

ఆమె ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవచ్చు, కానీ ఎందుకు చేయలేదో తెలుసా...

క్వీన్ ఎలిజిబెత్, బ్రిటన్ దేశపు పట్టపురాణి. ఆమెకేపాటి విస్తృతాధికారాలు ఉన్నాయో తెలుసా ? ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విస్టీర్ణంలో భూములకు ఆమె సర్వాధికారిని, అంటే అతి పెద్ద ఎస్టేట్స్ కలిగిన మహా జమీందారిణి అన్న మాట. ఆమె పేరిట మొత్తం 6.6 బిలియన్ ఎకరాల భూమి ఉంది. మొత్తం 16 దేశాలకు ఆమె మహారాణి అన్నమాట. వాస్తవానికి ఆమె ఏ మేరకు అధికారం చెలాయిస్తున్నట్టు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే రండి..వివరాల్లోకి వెళదాం.. యునైటెడ్ కింగ్డమ్ తీరం నుంచి మూడు మైళ్ళ పరిధిలోని జలాల్లోని వేల్స్, డాల్ఫిన్స్ అంతా కూడా క్వీన్ ఎలిజిబెత్ సంపదే సుమండీ. రివర్ థేమ్స్ లోని బాతులన్నీ ఆమె సంపద కిందకే వస్తాయి.  అంతే కాదు, ఆమె లైసెన్స్ లేకుండా కూడా కార్ డ్రైవ్ చేయవచ్చును. ఎందుకంటే, ఇప్పటికీ లైసెన్సులన్నీ బ్రిటన్ లో ఆ మహారాణి పేరు మీదే జారే అవుతాయి కాబట్టి. అందువల్ల, ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం పడదని విజ్ఞులు గుర్తించాలి. ఆమె విదేశీ ప్రయాణానికి పాస్ పోర్ట్ కూడా అక్కర్లేదు. ఇంతేకాదు, ఆమె ఏటా రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. బ్రిటన్ పట్టపు రాణి కి ఒక పుట్టినరోజు సరిపోదు కదా మరి. క్వీన్ ఎలిజిబెత్ అధికారిక జన్మదినాన్ని ఏటా జూన్ రెండో శనివారం ఒక పండుగ లా జరుపుకోవటం ఒక ఆనవాయితీ ల వస్తోంది. వాస్తవానికి ఆమె పుట్టినరోజు ఏప్రిల్ 21. అంతేకాదు క్వీన్ కుటుంబం కోసమే అచ్చంగా బకింగ్ హాం ప్యాలెస్ లో ఒక ATM ఉంది. అయితే, అంత లావు పట్టపురాణి కి కూడా అప్పుడప్పుడూ ఆ హోదా బోర్ కొడుతూ ఉంటుందని లోక నానుడి. అందుకోసం ఆమెకు ప్రత్యేకంగా ఒక పర్సనల్ పోయెట్ కూడా ఉన్నారన్నమాట, ఆమెను తన కవితా మాధుర్యంలో ఓలలాడించటానికి .... ఇక రాచరిక వ్యవహారాల్లోకి వస్తే, బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించిన అన్గాన్ని చట్టాలు కూడా చుట్టాలు చుట్టుకుని రాణివాసం గుమ్మం తట్టాల్సిందే, ఆమె సంతకం పొందాలసిందే, ఆనక వాటిమీద రాచముద్ర....సారీ రాచముద్ర అనకూడదేమో, రాణిముద్ర పొందాల్సిందేనన్నమాట. నిజానికి, క్వీన్ ఎలిజిబెత్ ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం లేనప్పటికీ, 1992 నుంచీ కూడా ఆమె పన్ను కడుతూనే ఉన్నారు.  ఇంతేకాదు..క్వీన్ ఎలిజిబెత్ II, ఆస్ట్రేలియా కు కూడా మహారాణే సుమండీ.. చెప్పొద్దూ...ఆమెకున్న ఇన్నిభోగాలు చూస్తుంటే, కన్ను కుడుతోంది కదా.. నిజానికి ఆస్ట్రేలియన్ ప్రభుత్వాన్ని తొలగించేంతటి విశేష అధికారాలు ఆమెకున్నాయి. ఇహ, క్వీన్ మరో కోణమేమిటంటే, ఆమె చర్చ్ అఫ్ ఇంగ్లాండ్ ధర్మాధికారి కూడా.. అంతేకాదు ఆమెను ఏ సందర్భంలోనూ ఎవరూ ప్రాసిక్యూట్ చేయలేరు, అరెస్ట్ చేయలేరు కూడా! ఇంగ్లాండ్ దేశపు సాయుధ దళాలకు ఆమె కమాండర్ ఇన్ చీఫ్ కూడా..అంటే, సర్వ సైన్యాధ్యక్షురాలన్న మాట. ఆ దేశ క్యాబినెట్ లో మంత్రులను నియమించటంతో పాటు, తొలగించే అధికారం కూడా క్వీన్ కు ఉంటుంది. ఆమెకు తిక్కరేగితే, ప్రైమ్ మినిష్టర్ ను కూడా డిస్మిస్ చేయవచ్చు, అన్ని విశేషాధికారాలు ఆమెకు ఉన్నాయన్న మాట! ఏ దేశం మీదైనా అధికారికంగా వార్ డిక్లేర్ చేసే విశేష అధికారం ఉన్న ఏకైక వ్యవ్యక్తి-ఇంగ్లాండ్ లో కేవలం క్వీన్ మాత్రమే. స్పైడర్ మ్యాన్ అంకుల్ బెన్ చెప్పినట్టు -- " విశేషమైన అధికారాన్ని అంటిపెట్టుకుని విస్తృతమైన బాధ్యత కూడా ఉంటుందని మనం ఇక్కడ ఒకసారి గుర్తుచేసుకోవాలి." ఆ సూత్రం స్ఫూర్తి ఆమెకు తెలుసు కాబట్టి, ఆమె తన విశేషాధికారాల మీద స్వీయ నియంత్రణ పాటిస్తూ వస్తున్నారు. అందులో యావత్ ప్రపంచం ఆమెను  ఇంకా గౌరవిస్తూనే ఉంది..

డాక్టర్ మీద ఉమ్మేసిన కరోనా పేషేంట్, హత్యాయత్నం కేసు నమోదు

తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే ఓ రోగి ఉమ్మివేశాడు. కరోనా లక్షణాలతో 40 ఏళ్ల వ్యక్తి ఒకరు తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అతడు చేరినప్పటి నుంచి చికిత్సకు సహకరించకపోగా, ముఖానికున్న మాస్కును తొలగించి వైద్యులపై విసురుతూ వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా, తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. వైద్యుల ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

తెలంగాణలో 531కి చేరిన పాజిటివ్ కేసులు! ఇప్ప‌ట్టి వ‌ర‌కు 16 మంది మృతి!

తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూనే వుంది. నిన్న మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో పాజిటివ్ మృతుల సంఖ్య 16కు పెరిగింది. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొని ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణలో కొత్తగా మ‌రో 28కి పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో క‌రోనా బాధితులు 531కి పెరిగారు. చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఏడుగురు పూర్తిగా కోలుకుకోవ‌డంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ చేసిన వారి సంఖ్య 103కి చేరిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 412 మంది చికిత్స పొందుతున్నారు.

నిర్మ‌ల్‌లో మర్కజ్ ప్రకంపనలు...

ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన మహిళ భర్త నుంచి ఆమెతో పాటు ఏడాది కుమారుడికి  వైరస్ సోకింది. వీరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో కేసుల సంఖ్య 19కి పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మరణించారు.  కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటంతో పల్లె వాసుల్లో ఆందోళన ఎక్కువైంది.  వైరస్ తమను చేరకుండా ఉండాలని నిర్ణయించుకొని వారు ఊర్లకు సైతం దూరంగా వెళ్లిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొంత మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. మ‌రొ కొంత మంది తమ పంట పొలాల్లో తాత్కాలికంగా టెంట్లు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.

రోడ్డుపై భ‌య‌పెట్టిన 500 రూపాయ‌ల నోట్లు!

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ ప్రజలు రోడ్డు మీద ప‌డి వున్న 500 రూపాయ‌ల నోట్ల‌ను చూసి తెగ హైరానా ప‌డిపోయార‌ట‌.  ప‌క్కాగా ఈ  నోటుపై క‌రోనా వైరస్ ఉంద‌నేది వారి అనుమానం. స్థానిక పేపర్‌ మిల్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఇక్కడి రోడ్డుపై  రెండు 500 రూపాయ‌ల‌ నోట్లు రోడ్డుపై ప‌డివుండ‌టాన్ని చూసిన స్థానిక వ్య‌క్తి హ‌డావిడి చేసేశాడ‌ట‌.  కరోనా వ్యాప్తికై ఎవరో చేసిన కుట్రగా  భావించి వెంటనే  పోలీసుల‌కు సమాచారం ఇచ్చాడ‌ట‌. పోలీసులు, ఆ నోట్లను స్వాధీనపరచుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. రోడ్డు మీద డ‌బ్బు దొరికినా జ‌నానికి క‌రోనానే గుర్తుకు రావడాన్నిస్థానికులు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.

జలియన్‌వాలా దురంతానికి వందేళ్లు...

నేడు జలియన్ వాలభాగ్ ఉచ కోత కోసిన రోజు ఆ సంఘటనలో చనిపోయిన వీరులను స్మరించుకుంటు.. జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట పేరు. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 20 వేల మంది ప్రజలు ఆ తోటలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.    1919 రౌలట్ చట్టం భారత పౌరులను ఎటువంటి విచారణ జరపకుండా శిక్షించే అధికారం అధికారులకు సంక్రమింపజేసింది. ఆనాడు ఆ చట్టాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో హర్తాళ్ జరిగినప్పుడు ఉద్యమకారులు సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. అందుకు నిరసనగా జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా 20 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల సంస్మరణార్థం, పోలీసుల చర్యలకు నిరసనగా అమృతసర్‌ స్వర్ణ దేవాలయం దగ్గర గల జలియన్‌వాలా బాగ్‌లో 1919 ఏప్రిల్ 13 న ప్రజలు పెద్దయెత్తున సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని నిషేధిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన ప్రకటన తగినంతగా ప్రచారం కాలేదు. అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు శాంతియుతంగా జరుపుకుంటున్న సమావేశంపై ఒక్కసారిగా బ్రిటీష్ సైనికులు కాల్పుల దాడి చేశారు.    1920లో గాంధీజీ పిలుపు మేరకు ‘సహాయ నిరాకరణ ఉద్యమం’ ప్రారంభమయింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారేందుకు ఈ ఘటనే ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. దీనికి నిరసననగా బ్రిటిష్ వారు తనకు ఇచ్చిన ‘సర్’ బిరుదును రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తిరిగి ఇచ్చేశారు.

ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించిన డాక్ట‌ర్‌!

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని రణంపల్లికి చెందిన నిమ్మగడ్డ శేషగిరిరావు కాకినాడలో వైద్యవిద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. అక్కడి రాయల్ కాలేజ్ ఆప్ సైకియాట్రిస్ట్స్ లో మానసిక వైద్య విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడే మానసిక వైద్యుడిగా స్థిరపడ్డారు. 25 ఏళ్లుగా అక్కడే సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ... లండన్ సమీపంలోని న్యూబెర్రీలో మానసిక వైద్యశాలకు సంచాలకుడిగా పనిచేస్తున్నారు. నిమ్మగడ్డ శేషగిరిరావు - హేమ దంపతులకు 12 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కవల కూతుళ్లున్నారు. అంతా బాగుందనుకున్న తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గత నెల మార్చి 13న హేమకు అంటేసుకుంది.  స్కూలుకెళ్లిన పిల్లలను తీసుకొచ్చేందుకు బయటకెళ్లిన హేమకు బయటే వైరస్ సోకింది. అయితే స్వతహాగా వైద్యుడైన నిమ్మగడ్డ... రెండు రోజుల్లోనే తన సతీమణికి కరోనా సోకిందని నిర్ధారించేసుకున్నారు. అయితే కరోనా అంటేనే హడలిపోకుండా ఇంటిలోనే హేమకు చికిత్స మొదలెట్టేశారు. ఈ క్రమంలో తనకూ వైరస్ సోకిందని నిమ్మగడ్డ గ్రహించారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పిల్లలిద్దరినీ ఓ గదిలో ఉంచేసిన నిమ్మగడ్డ... తను తన సతీమణి ఇద్దరూ కలిసి మరో గదిలో దాదాపు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏమాత్రం బెదిరిపోని నిమ్మగడ్డ.. కరోనాపై పోరు ప్రారంభించేశారు.  కరోనా కారణంగా ఇద్దరికీ రోజూ జ్వరం వచ్చేది. అంతేకాకుండా దగ్గు కూడా వచ్చేది. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వేసుకోవడం స్టార్ట్ చేసిన నిమ్మగడ్డ... దగ్గు తగ్గేందుకు సిరప్ తాగేవారు. ఈ క్రమంలో కరోనా సోకిందన్న ఆందోళనను పక్కనపెట్టేసిన నిమ్మగడ్డ దంపతులు... పారాసిటమాల్ తో పాటు రోజూ ఉప్పు నీళ్లు వీలయినంత ఎక్కువ తాగడం - పసుపు - అల్లం - మిరియాల పొడి వేసిన నీటిని మరిగించుకుని తాగడం నిమ్మరసం తాగడం.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఏదో ఒకటి తినడం... ఇలా కరోనాపై పోరు సాగించారు. చివరకు వారిద్దరి శరీరాల్లో నుంచి కరోనా పారిపోయింది.      ఈ క్రమంలో చిన్నపిల్లలైన తన ఇద్దరు కూతుళ్లు తమకు వంట చేసిపెట్టడం - తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకినా.. పేరెంట్స్ తో పాటు వారు కూడా నిబ్బరంగా ఉండటంతో.. ఆ కుటుంబం మొక్కవోని ధైర్యం ముందు కరోనా తల వంచేసింది.  ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించి... వైరస్ ను తమ శరీరాల్లో నుంచి తరిమేశారు. గుండె నిబ్బరం కోల్పోకుండా పోరు సాగిస్తే.. కరోనా మహమ్మారి మనల్నేమీ చేయలేదని చెబుతున్న ఈ కుటుంబం విజయగాథ ఇప్పుడు యావత్తు ప్రపంచ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.

ఏపీలో తాజాగా 15 పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తాజా హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఏపి లో 420 కి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఆదివారం 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 7, నెల్లూరు 4, కర్నూల్ 2,చిత్తూరు1,కడప1 పాజీటీవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరొకరు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారి సంఖ్య 7 కు చేరుకుంది.  కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12 కాగా, ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401 అని హెల్త్ బులెటిన్ పేర్కొంది.

భారత్ లో చైనా ఆర్ధిక దురాక్రమణ షురూ...

*ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ లకు అప్పులిచ్చి, ఆ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా  * కమ్యూనిజం నుంచి ఇంపీరియలిజం వైపు సాగుతున్న చైనా ప్రయాణం  అంతా అనుకున్నట్టే అయింది. ఏది జరుగుతుందో అని భయపడ్డామో, అదే జరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే దిశగా, ప్రపంచ ఆర్థిక రంగంలో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఓవైపు కరోనా రక్కసి ఆర్థిక వ్యవస్థలను సైతం కూలదోస్తున్న తరుణంలో, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక ముందడుగు వేసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. మార్చి త్రైమాసికంలో ఈ కొనుగోలు ప్రక్రియ జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ల విలువ క్రమంగా పతనమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు 41 శాతం క్షీణత చవిచూసింది. అంతకుముందు జనవరి 14న 52 వారాల గరిష్ట పతనంతో హెచ్ డీఎఫ్ సీ షేర్ రూ.2,499.65 వద్ద ట్రేడయింది. ఏప్రిల్ 10 నాటికి హెచ్ డీఎఫ్ సీ షేర్ వాల్యూ రూ.1,710కి పడిపోయింది. అదే సమయంలో భారత సూచీల్లో సెన్సెక్స్ 25 శాతం నష్టపోగా, నిఫ్టీ 26 శాతం నష్టాలు చవిచూసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా వాటాదారు కాగా, డిసెంబరు త్రైమాసికంలో తన వాటాను 4.21 శాతం నుంచి 4.67 శాతానికి పెంచుకుంది. ఇక, తాజా లావాదేవీపై హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వైస్ చైర్మన్, సీఈఓ కెకీ మిస్త్రీ మాట్లాడుతూ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు తమ కంపెనీలో 2019 మార్చి నాటికే 0.8 శాతం వాటాలున్నాయని వెల్లడించారు. ఇప్పుడా వాటాలు ఒక్క శాతాన్ని దాటాయని, ప్రస్తుతానికి హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా 1.1 శాతం అని వివరించారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చైనా ప్రపంచ ప్రధాన ఆర్థిక సంస్థల్లో భారీగా వాటాలు దక్కించుకుంటోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాగిస్తున్న చైనా ఇతర ఆసియా దేశాల్లో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ, టెక్నాలజీ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది.