రిషీకేష్ లో విదేశీయుల నదీ తీరవిహారం

*వారిచేత క్షమాపణ చెప్పించిన ఉత్తరాఖండ్ పోలీసులు  కరోనా వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమ శక్తిమేరకు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ కూడా లాక్ డౌన్ విధించినా, కొంతమేర ఆంక్షలు సడలించింది. అయితే అది నిత్యావసరాల కొనుగోళ్లు, ఇతర అత్యవసర పనుల కోసం మాత్రమే. కారణం లేకుండా బయట కనిపిస్తే మాత్రం అక్కడి పోలీసులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, రిషికేశ్ లో గంగానది ఒడ్డున షికార్లు చేస్తున్న 10 మంది విదేశీయులు పోలీసుల కంటబడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా యధేచ్ఛగా విహరిస్తున్న వారిని పోలీసులు నిలువరించి, వారితో 500 సార్లు 'సారీ' అని రాయించారు. ఆ విదేశీయుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇజ్రాయెల్ దేశాలకు చెందినవారున్నారు. పోలీసులు ప్రశ్నించగా, సరైన కారణాలు చెప్పలేకపోవడంతో... "నేను లాక్ డౌన్ నిబంధన పాటించలేదు.... క్షమించండి" అనే వాక్యాలను కాగితంపై ఐదు వందల సార్లు రాయించారు. స్థానిక సహాయకులు తోడు లేకుండా విదేశీయులు సంచరిస్తే ఊరుకోబోమని, వారికి బస కల్పిస్తున్న హోటళ్లపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రిషికేశ్ విదేశీయులకు ఎంచక్కని పర్యాటక స్థలంగా పేరుగాంచింది. అయితే కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా దౌత్యకార్యాలయాలు తమ వారిని వెంటనే భారత్ నుంచి తరలించాయి. ఇంకా కొందరు విదేశీయులు రిషికేశ్ లోనే ఉన్నట్టు తాజా ఘటన ద్వారా తెలిసింది.

ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. సి-19 పేరుతో ఓపీ రూం ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రవేశ మార్గాన్నిఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.  కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకే ఉద్దేశించిన ఈ ప్రత్యేక ఓపీ ఉదయం 9నుండి మధ్యాహ్నం 2 వరకే పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.  ఆరోగ్య నిపుణులు, ఇతర పేషంట్లకు కొవిడ్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా పిపిఇలు, ఎన్95 మాస్కులు ధరించిపేషెంట్ల ను పరీక్షించాలని,  కొవిడ్  లక్షణాలతో  క్యాజువాలిటీలో అడ్మిట్ అయినా వారిని వెంటనే సెపరేట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ  స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్ కు క్వారంటైన్ వర్తించదా: సిపిఐ రామకృష్ణ 

సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నెర్ర చేశారు. నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్  క్వారంటైన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు,  75 ఏళ్ల వయస్సున్న జస్టిస్ కనగరాజ్ ను కరోనా ఏమీ చేయలేదా? ఆయనకు  లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా, అంటూ రామకృష్ణ, సి.ఎం. ను ప్రశ్నించారు.  "కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో గత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయగా వైసిపి రాద్దాంతం చేసింది. ఆయన్ను తొలగించే వరకు ముఖ్యమంత్రి జగన్ నిద్రపోలేదు.కరోనా పాజిటివ్ కేసులలో దేశంలో 2వ స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడు నుండి ఏపీ ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ కనకరాజ్ విజయవాడ ఎలా చేరుకో గలిగారు," అని కూడా రామకృష్ణ ప్రశ్నించారు. ఇది "లాక్ డౌన్" నిబంధనల ఉల్లంఘన కాదా, అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని చెబుతున్న వైసీపీ నేతలు, జస్టిస్ కనగరాజ్ ను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచకుండా ఎలా తిరగనిస్తున్నారని కూడా సి పి ఐ నేత అనుమానం వ్యక్తం చేశారు.

జాన్ బీ, జహాన్ భీ..... వీడియోకాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధాని

మార్చి 24 నాటి తన ప్రసంగంలో ప్ర‌ధాన మంత్రి మోది మాట్లాడుతూ,  జాన్ హైతో జహాన్ (బతికుంటే... ఆర్థికాన్ని చూసుకోవచ్చు) అన్నారు. అయితే ఈ రోజు ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధాని నినాదం మారింది. ప్ర‌ధాని మోదీ ఇపుడు జాన్ బీ, జహాన్ భీ, జీవితాలు ,ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమైనవే అన్నారు. అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోదీ చెప్పారు. దేశ ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.  ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్దిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.  దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాబోయే 15 రోజులు  చాలా కీలకమని పేర్కొన్నారు.

లాక్ డౌన్ పై సీఎం ది అవగాహనా రాహిత్యం: తెలుగుదేశం మండిపాటు

లాక్ డౌన్ ను ఎత్తివేసి కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని మోడీని జగన్ కోరడం అవగాహనారాహిత్యమని, కరోనా నియంత్రణకు జగన్ ఇప్పటికైనా సీరియస్ స్టెప్స్ తీసుకోవాలని,  రమేష్ కుమార్ పై జగన్ ది కక్ష సాధింపు చర్య అని శ్రీకాకుళం ఎం. పి. కింజారపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోడీ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని, అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అమెరికాలో 5 లక్షల పాజిటివ్ కేసులు దాటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.  ఇవాళ ప్రధాని మోడీ గారు సీఎంలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని రంగాల ప్రముఖలతో కూడా మోడీ గతంలో మాట్లాడటం జరిగింది. అయితే ఇవాళ మోడీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. లాక్ డౌన్ ఎత్తివేసి.. కొన్ని జోన్లకే పరిమితం చేయాలని జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. 4,5 నెలల పాటు లాక్ డౌన్ లో ఉంటేనే కరోనాను అరికట్టగలమని పలు దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరాయి. ఒడిశాలో 50 కేసులు మాత్రమే ఉన్నప్పటికీ లాక్ డౌన్ ను కొనసాగించాలని అక్కడి ముఖ్యమంత్రి మొట్టమొదటగా నిర్ణయించారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో 400కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. 6గురు మరణించారు. ఇలాంటి తరుణంలో జగన్ అవగాహనారాహిత్యంతో కొన్ని జోన్ లకే లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరారు.  కరోనాను జగన్ మొదటి నుంచీ సీరియస్ గా తీసుకోవడం లేదు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ఇవాల్టి వరకు తీసుకోలేదు. రాజకీయంగా మలుచుకోవాలనే చూస్తున్నారు. రహస్య జీవీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తప్పించారు. రమేష్ కుమార్  నెల రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా తీవ్రత నేపథ్యంలో బాధ్యత గల అధికారిగా వాయిదా వేశారు. ముందుజాగ్రత్త వహించారు. జగన్ కు ఇది నచ్చక నియంతృత్వ ధోరణితో ఆయనపై పలు విమర్శలు చేశారు. జగన్ తన కక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఒక ఐఏఎస్ అధికారి ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ పరిస్థితుల్లో జగన్ తన రాజకీయ కక్ష కోసం ఆయనను తొలగించారు. హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో సీఎంగా ఉన్న వ్యక్తి రాజకీయాలు చేయవచ్చా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండరు.  మరోవైపు తమకు రక్షణ పరికరాలు అందించాలని కోరిన డాక్టర్ ను సస్పెండ్ చేశారు. కమిషనర్ ను తప్పించారు. జగన్ ఎంత నియంతగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. కరోనాను కంట్రోల్ చేయడానికి జగన్ అసలు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా లేక రాజకీయాలే చేద్దామనుకున్నారా. ఒక ప్రెస్ మీట్ కూడా సరైనది పెట్టుకోలేని స్థితిలో జగన్ ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ప్రతిరోజు అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నారు. వైసీపీ మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తే.. జగన్ యాక్షన్ ప్లాన్ ఏమిటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.  ప్రజలకు ఏం భరోసా ఇస్తారో చెప్పాలి. ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. వలస కార్మికులను ఏవిధంగా ఆదుకుంటారని, ఇదంతా జగన్ వైఫల్యమే. మేం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. పరిస్థితి చేయిదాటితే దేశం నష్టపోతుందని జగన్ గ్రహించాలని కింజారపు రామ్మోహన్ నాయుడు సూచించారు.  " రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే ఏర్పాట్లు చేశారో సింగిల్ విండో కింద పోర్టల్ రిలీజ్ చేయాలి. డిజిటల్ గవర్నెన్స్ కు ఎందుకు వినియోగించుకోవడం లేదు. చంద్రబాబు హయాంలో సమర్థంగా రియల్ టైం గవర్నెన్స్ ను వినియోగించారు. పేదలు, కూలీలకు రూ.5వేలు సాయం అందజేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. రూ.వెయ్యి సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు," అని కింజారపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

లాక్‌డౌన్ రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయండి: ప్రధానితో సీఎం జగన్‌‌

*లాక్ డౌన్ కొనసాగింపు పై జగన్ భిన్నాభిప్రాయం  * రెడ్ జోన్ల కు మాత్రమే లాక్ డౌన్ ను పరిమితం చేయాలని ఏ.పి. సి.ఎం. సూచన  * సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిథిగా మూసేయాలన్న ముఖ్యమంత్రి  రెడ్‌ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జగన్‌.. రాష్ట్రంలో  676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని తెలిపారు. ఈ మండలాల్లోనే లాక్‌డౌన్‌ కొనసాగించాలని కోరారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిథిగా మూసివేయవచ్చని జగన్‌ అభిప్రాయపడ్డారు.

దేశంలో మరణాలు  239, పాజిటివ్ సంఖ్య 7 వేల 447

ప్ర‌ధాన మంత్రి మోదీ ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్ త‌రువాత కేంద్ర ఆరోగ్యశాఖ జాయంట్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించి క‌రోనాపై తాజా ప‌రిస్థితిని వివ‌రించారు. ప్రధాని మోదీ నుంచి ఎలాంటి ప్రసంగం లేకపోవడంతో...ఇక లాక్ డౌన్ విషయంపై ఏ రాష్ట్ర సీఎంలు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రకటించే అవకాశాం వుంది. తెలంగాణ సీఎం కూడా ప్రధానితో సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో రాష్ట్రమంత్రులతో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.    ప్రధాని మోదీ మాస్క్ ధరించి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎంలు కూడా మాస్కులు ధరించారు. ఇప్పటివరకు జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రధాని సామాజిక దూరం పాటించారు కానీ ఏ సందర్భంలో కూడా మాస్క్ మాత్రం ధరించలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ ఇలా మాస్క్ ధరించి కనపించారు.   ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య అమాంతం పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడువేలు దాటింది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించాలంటూ కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. లాక్ డౌన్ పొడిగింపుపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా తనకు వెంటనే ఫోన్ చేయాలని ప్ర‌ధాని ముఖ్య‌మంత్రుల‌కు సూచించారు.  మోదీ సమావేశం జరిగిన అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ జాయంట్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7447కు చేరాయన్నారు. మరణాల సంఖ్య 239కి చేరిందని ఆయన ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1035 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. 40 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

లక్ష కు పైగా ఐసోలేషన్ బెడ్స్ రెడీ: లవ్ అగర్వాల్

దేశవ్యాప్తంగా 7447 కేసులు నమోదయ్యాయని, 239 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  6,565 యాక్టివ్  కేసులకుగాను , 643 మంది కోలుకున్నారని చెప్పారు.  గడిచిన 24 గంటల్లో 1,035 కొత్త కరోనా కేసులు నమోద, 40 మంది మృతి చెందారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు.  లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారత్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవన్నారు.

నిమ్మగడ్డ కేసులో రిట్ పిటీషన్ దాఖలుకు రంగంలోకి దిగిన మాజీ అడ్వకేట్ జనరల్

తన పదవీ కాలం ఇంకా ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ తరఫున మాజీ అడ్వొకేట్ జనరల్ డి.వి. సీతారామ్మూర్తి రిట్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలిసింది. నేడు, రేపు కోర్టుకు సెలువులు రోజులు కావడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.  సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీ కాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించిన విషయం తెలిసిందే.

అమెరికాలో తెలుగువారు క్షేమం

అమెరికాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు క్షేమంగా వున్నారని తానా ఎక్జిక్యూటివ్ వై స్ ప్రెసిడెండ్ లావు అంజయ్య చౌదరి తెలిపారు. అమెరికాలో తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ క్షేమంగా ఉన్నారని, వారి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే తెలుగు వారందరినీ కోవిడ్-19 విషయంలో పూర్తిగా అలెర్ట్ చేశామని, కరోన రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలని భారత కాన్సులేట్లతో కలిసి వివరించి చెప్పామని అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 4 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు వున్నా కోవిడ్ -19 తీవ్రత న్యూ  జెర్సీ,న్యూ యార్క్ లలోనే అధికంగా ఉందని  పేర్కొన్నారు.  కరోనా విషయంలో తెలుగు వారు ఎవరికి వారు స్వీయ నిర్భందంలో ఉన్నారని అన్నారు. తెలుగు వారందరూ బయటకి రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారని అమెరికన్ ప్రభుత్వం సూచించిన ప్రతీ నిబంధనను తెలుగు వారు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నేరుగా లాక్డౌన్ప్రకటించనప్పటికీ.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయిందని పేర్కొన్నారు. అమెరికాలో కోవిడ్ 19   వైద్య సేవలు అందిస్తున్న వారిలో తెలుగు వైద్యులు ఎక్కువమంది వున్నారని ..తానా వీరితో నిరంతరం టచ్లో ఉండటంతో మిగిలిన తెలుగు వారికి ఎప్పటికప్పుడు కరోనా తీవ్రత పై అవగాహన కల్పించడం సులభమవుతుందన్నారు.అమెరికన్ యూనివర్సిటీలలో హాస్టల్స్ మూసివేయడంతో అక్కడ  చదువుకొంటున్నతెలుగు  విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో వున్నా తెలుగు వారి ఇళ్లల్లో  వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. విజిటర్ పేరెంట్స్ ఈ కోవిడ్-19 వళ్ళ తిరిగి వెళ్ళలేనివాళ్ళకి మెడిసన్ పరంగా కావల్సిన సహాయం చేస్తున్నాము అని తెలిపారు. ఇళ్లలోనే ఉండిపోతున్న తెలుగు వారికి ఆధ్యాత్మిక ,సామాజిక అంశాలపై అవగహన కల్పించడానికి ,మనో వికాసానికి ,మానసిక స్థైర్యం కోసం వివిధ రంగాల ప్రముఖులతో వెబ్ నైర్ ద్వారా వర్చువల్ గా  ప్రసంగాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదే సమయంలో హెచ్ వన్ బి జాబ్స్ విషయంలో భవిష్యత్ ఎలా వుంటుందనే దానిపై తెలుగు వారిలో ఆందోళన నెలకొందని చెప్పారు.అందుకే బఫర్ పీరియడ్ ని పస్తుతం వున్న 60 రోజుల నుండి 180 రోజుల వరకు పొడిగించాలని అమెరికన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.  గతంలో (1982,2008) వచ్చిన ఆర్థిక మాంద్యం  కన్నా తీవ్రతరమైన  ఆర్థిక సంక్షోభం మరోసారి  వస్తుందన్నఆందోళన నెలకొందన్నారు.కోవిడ్ నుంచి కోలుకొన్నా ఆర్థిక సంక్షోభం దాటడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికన్ ప్రభుత్వం ప్రకటించిన రెండు ట్రిలియన్ డాల్లర్ల ప్యాకేజ్ ఇక్కడి తెలుగు వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అందరికీ వివరిస్తున్నామన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాలలో కరోనా సహాయక చర్యలు కు తమ వంతు సాయం అందించేందుకు ఇప్పటికే పలు ప్రాంతాలలో మాస్క్లు లు ,శానిటైజెర్స్,పీ ఈ పీ కిట్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.కరోనా మహమ్మారిని అరికట్టడంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న డాక్టరు,హెల్త్ సిబ్బంది,పోలీస్,పారిశుధ్య సిబ్బందికి సహాయం చేసేందుకు తానా ఆధ్వర్యంలో  విరాళాలు సేకరిస్తున్నామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రభుత్వాలు సూచించిన నిభందనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దూరంగా ఈ మహమ్మారి వుంటుందనే విషయం గమనించాలని కోరారు.

ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలు తీసుకోండి: హైకోర్టు

కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. సంబంధిత వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం వివిధ అంశాలపై ఇటీవల విచారణ జరిపి ఉత్తర్వులిచ్చింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్‌ ఏర్పాటు చేసే అంశంపై వారంలో వివరాలు సమర్పించాలంది.బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో వ్యర్థాల్ని నిర్వీర్యం చేయాలని స్పష్టం చేసింది.  బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లవద్ద ప్రజలు సామాజిక దూరం పాటించే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. ఒకవేళ నిర్వహిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టంచేసింది.

గుంటూరు లో రేపు పూర్తి కర్ఫ్యూ

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నేడు గుంటూరులో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి అని, గుంటూరులో మొత్తం 71 కేసులు నమోదు కాగా, గుంటూరులో 12 రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించామాన్నారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు సమయం ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు మాత్రమేనన్నారు. బయటకు వచ్చే సమయంలో మాస్క్ లేకుంటే 1000 ఫైన్. పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేపు ఫుల్ కర్ఫ్యూ. మెడికల్ తప్ప... ఏ షాప్ మార్కెట్స్ వుండవన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజు మార్చి రోజు మాత్రమే ప్రజలు బయటకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రజలు హోం డెల్వరీ సద్వినియోగం చేసుకోవాలి. వారానికి సరి పడ సరుకులు కొనుక్కోవాలన్నరు. లాక్ డౌన్ వలన మాత్రమే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమాన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే 104 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలన్నారు. 350 కేసులు శాంపిల్ ఉన్నాయి.క్వారెంటైన్ లో ఉన్న వారికి 500 రూపాయలు ఇస్తున్నామన్నారు. ఢిల్లీ కాంటాక్ట్స్ వలనే కేసులు నమోదు.యువకుల్లో వారి శక్తి కొలది ఆలస్యంగా వైరస్ బయట పడుతుంది. ఇంట్లో ఉన్న పెద్ద వారు కోసం అయిన మాస్క్ ధరించాలి, దూరం పాటించాలన్నారు. ఏ ప్రార్థనలు మీటింగ్స్ అనుమతి లేదు నిర్వహించిన పక్షంలో అట్టి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్బన్ ఎస్సీ రామకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్ పాజిటివ్ చాలా వేగంగా పెరుగుతుంది. రెడ్ జోన్ ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు. రెడ్ జోన్ ప్రజల కోసం నిత్యావసర సరుకులను అందుబాటులోకి తెచ్చాము... వాకింగ్ కోసం కొంత మంది బయటకు వస్తున్నారు.వారికి బయటకు రాకుండా సూచనలు చేస్తున్నామ న్నారు. రూరల్ ఎస్పీ విజయ రావు మాట్లాడుతూ నరసరావుపేటలో  కేబుల్ కలెక్షన్ అతనికి కరోనా పాజిటివ్ అని తెలింది.ప్రజలు అందరు కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.

కల్లు కి వెసులుబాటు క‌ల్పించండి! ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కరోనా విషయంలో మనం మిగితా దేశాలతో పోలిస్తే మన దేశం మన రాష్ట్ర బెటర్ అండ్ సేఫ్ గా ఉందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతున్నారు. గ్రామీణా ప్రాంతాలు దేవునిదయ వల్ల అంత బనే ఉంది. పట్టణాల్లోనే అక్కడ అక్కడ కరోనా సంఘటనలు కనిపిస్తున్నాయ‌ట‌.  అయితే లాక్‌డౌన్ దెబ్బ‌తో వేరే జ‌బ్బుతో తెలంగాణా గ్రామీణ ప్ర‌జ‌లు కొంత మంది బాధ‌ప‌డుతున్న‌ర‌ని జ‌గ్గారెడ్డి అంటున్నారు. అదే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు కల్లు  తాగడం అలవాటు. కల్లు  ప్రస్తుతానికి లేకపోవడం వల్ల ఒక సెక్షన్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారట‌. అంతే కాదు హాస్పిటల్ చేరుతున్నారు. ఈ జ‌బ్బుకు మెడిసిన్ లేదు. ఇలాంటి వారికీ  కల్లే  మెడిసిన్ అని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఓ డాక్ట‌ర్‌లా అలాంటి రోగుల‌కు మెడిసిన్‌గా క‌ల్లు ప‌నిచేస్తుంద‌ని చెబుతున్నారు.  కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో  కల్లు కి వెసులుబాటు ఇచ్చే అంశం పై ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా అని ప్ర‌భుత్వానికి ప్ర‌శ్నిస్తున్నారు?

ఏపీ లో 402 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రవ్యాప్తంగా యాచకులు, నిరాశ్రయుల కోసం గాలింపు  ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు  402 కి చేరుకున్న దృష్ట్యా, ప్రభుత్వం నిబంధనలు తీవ్రతరం చేసింది.  యాచకులు, నిరాశ్రయులపై అధికారులు, పోలీసులు అన్ని చోట్ల ఫోకస్ మొదలెట్టారు.  బెజవాడలో  యాచకులు,  నిరాశ్రయుల కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు రోడ్లపై  జల్లెడ పడుతున్నారు. ఐదు బస్సుల ద్వారా 250  మందికి పైగా యాచకులను షెల్టర్ లకు తరలించిన పోలీసులు, విఎంసి అధికారులు. బస్సులు దూకి పారిపోతున్న యాచకులను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కిస్తున్న పోలీసులు. యాచకులు, నిరాశ్రయులకు  స్వచ్చంధ సంస్ధలు రోడ్లపైకి వస్తూ ఆహారం పంపిణీ చేస్తుండడంపై కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో బెజవాడ రోడ్లపై యాచకులను నిషేదించిన విఎమ్ సి. విజయవాడ పరిధిలో పది షెల్టర్ల లో యాచకులు, నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోజన వసతి తో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన విఎంసి అధికారులు. నగరంలో యాచకులు  కనబడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్న విఎమ్ సి అధికారులు.

ప్రపంచ పోలీస్ ప్యాంటు తడిపేసుకున్నాడు... చైనా చిన్నాన్న విషం చిమ్మాడు

అవును ఇది నిజం... అమెరికా నేడు ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం కాదు. అలాగే, ప్రపంచ సంక్షేమం గురించి చైనా ఎప్పుడూ ఆలోచించదు. యూరోపియన్లు ప్రపంచంలో అంతా అనుకునేంత విద్యావంతులు కారు. యూరప్ లేదా అమెరికా వెళ్ళకుండా కూడా ప్రపంచంలోని ప్రజలు తమ సెలవులను ఎంతో ఆనందంగా గడపగలరు. భారతీయుల రోగ నిరోధక శక్తి ప్రపంచంలో చాలా దేశాల ప్రజల కంటే ఎంతో శక్తివంతమైనది. ఏ స్వామీజీ, పీఠాధిపతి, మతాధికారి, సిద్ధాంతి, జ్యోతిష్కుడు, పూజారి, రచయిత లాంటి వాళ్ళెవరూ ఒక్క రోగిని కూడా రక్షించలేరని తేలిపోయింది. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మాత్రమే నిజమైన హీరోలు... క్రికెటర్లు, సినీ తారలు మరియు ఫుట్‌బాల్ ఆటగాళ్ళు కేవలం సాధారణ వ్యక్తులు. ప్రపంచంలో వినియోగం లేకపోతే బంగారం, వజ్రాలకు కూడా ప్రాముఖ్యత తగ్గిపోతుందని తెలిసింది. ఈ ప్రపంచంలో తమకు కూడా మనుషుల్లాగానే బ్రతికే హక్కు ఉందని జంతువులు మరియు పక్షులు మొదటిసారి సంతోషించాయి. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ పనిని ఇంటి నుండే చేయవచ్చని నిరూపించారు. మనం, మన పిల్లలు 'జంక్ ఫుడ్' లేకుండా జీవించగలం అనే నమ్మకం కలిగింది.పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం ఏ మాత్రం కష్టమైన పని కాదు అనేది అందరికీ బుర్రకెక్కింది. అన్నం, కూర వండటం మహిళలు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా నేర్చుకుంటే  బాగుంటుందన్న భావన అందరికీ కలిగింది. మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించే చెత్తా చెదారం ప్రసారం చేయకుండా, పనికొచ్చే విషయాలను కూడా ప్రసారం చేయగలదని ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. భారతీయ మహిళల కారణంగా ఇంటిని ఆలయంగా ఎలా ఉంచుకోవాలో పరాయి దేశం నేర్చుకునేటట్టు చేసింది. డబ్బుకు విలువ లేదు, ఎందుకంటే ఈరోజు మీరు పులుసుతో అన్నం తిని కూడా బతకొచ్చు అనేది తెలుసుకున్నారు. భారతీయులు కుల, మత, ధనిక, పేద భేదాలతో ఎక్కువగా కీచులాడుకుంటారన్న ఇతర దేశాల అపోహ పటాపంచలు అయ్యింది. భారతీయుడు మాత్రమే క్లిష్టమైన సమయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలడని ప్రపంచ దేశాలతో ఎలుగెత్తి చాటబడింది.

అచ్చెన్నాయుడి ఆవిష్కరణ... కనగరాజ్ వయసు 84 ఏళ్ళు!

అచ్చెన్నాయుడు గారూ..మీరు సూపర్ సార్. అందరూ, కరోనా కి భయపడి చస్తుంటే, మీరు మాత్రం కనగరాజ్ గారి వయసు 84 ఏళ్ళు అనే నిజాన్ని ట్విట్టర్ ద్వారా ఆవిష్కరించి, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యచకితం చేశారు. " సీఎం గారూ, అత్యధిక కరోనా కేసులున్న తమిళనాడు నుంచి  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ ఏపీకి ఎలా వచ్చారు? తెలంగాణ బోర్డ‌ర్‌లో వేలాదిమంది ఏపీవాళ్ల‌ు క్వారంటైన్‌కి వెళ్తామంటేనే రానిస్తామ‌న్న మీరు దీనికేమి స‌మాధానం చెబుతారు?," అంటూ మీరు ట్విట్టర్ లో విరుచుకుపడిన తీరును చూస్తే ముచ్చటేస్తోంది.  " కరోనాకోరల్లో చిక్కి రాష్ట్రం విలవిల్లాడుతోంది. పనుల్లేక కూలీలు, పంటలు అమ్మలేక రైతులు, స‌క‌ల‌వ‌ర్గాలు త‌మ‌ను ఆదుకోవాలంటూ చేస్తున్న ఆక్రందనలు మీకు వినపడవు. కరోనా వ్యాప్తి జరగకుండా ఎన్నికలు వాయిదావేసిన కమిషనర్ ని తొలగించేందుకు అత్యవసర ఆర్డినెన్స్, సెలవురోజుల్లో రహస్యజీవోలిచ్చారు. క‌రోనా ప్ర‌భావం వృద్ధుల‌పై ఎక్కువ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నా 84 ఏ‌ళ్ల కనగ‌రాజ్‌ని తీసుకొచ్చారు. ఆయ‌నేమైనా క‌రోనా క‌ట్ట‌డి చేసే శాస్త్ర వేత్తా? వైద్యుడా? బాధ్య‌త‌లు స్వీక‌రించేట‌ప్పుడు మాస్క్ కూడా పెట్టుకోని ఆయన రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాల‌తోనూ చెల‌గాటమాడుతున్నారు. స్వార్థయోజ‌నాల కోసం లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న మీరు, మీ మంత్రులు క్వారంటైన్ పాటిస్తున్న చంద్ర‌బాబును ద‌మ్ముంటే హైద‌రాబాద్ నుంచి ర‌మ్మంటున్నారు. పాలన చేతకాదని భేషరతుగా ఒప్పుకోండి. చంద్రబాబు వచ్చి పాలనంటే ఏంటో చూపిస్తారు," అంటూ మీరు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెడుగుడాడిన వైనం అయితే చూసే వాళ్లకి భలే కిక్కిచ్చింది.  మొన్నొక రోజు మీకు మల్లె, మీ సీనియర్ సహచరుడు యనమల రామకృష్ణుడు చెరిగిన నిప్పులతో పాటు, ఈ రోజు మీరు ట్విట్టర్ ద్వారా చేసిన నూతన ఆవిష్కరణలు కూడా -(అదేనండీ కనగరాజ్ వయసు 84 ఏళ్ళనీ, అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాస్క్ కట్టుకోలేదనీ ట్వీటారు గదా.. అ వన్న మాట..) టీ డీ పీ కార్యకర్తలతో పాటు, కరోనా కారణంగా ఖాళీగా ఉన్న బోలెడంత మంది ఔత్సాహికుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. మరిన్ని కొత్త ఆవిష్కరణలతో మీరు రోజూ ఇలానే ట్వీటాలని కోరుకుంటున్నారు జనం. వాళ్ళ ముచ్చట తీర్చడం మానకండి అచ్చెన్నాయుడు గారూ.

నిర్బంధ కాలాన్ని నమోదు చేసిన పదమూడేళ్ళ అమ్మాయి కధ

దాదాపుగా అందరమూ ఒక గూటిలో ఉండగలుగుతున్నాం. తింటూ, కాసేపు కునుకు తీస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, కరోన భయంలో మరింత దైవ చింతనలో ఉంటూ, రేపటి గురించిన చింతతో మొత్తానికి గడిపేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి, చవకగా డేటా కూడా దొరికింది కాబట్టి ఏదో ఆసక్తి కలిగించేదో చూసే/చేసే అవకాశం దొరికింది.  కానీ కాలం గడిచే కొద్దీ ఒక విసుగు... ఎప్పుడు బయటపడతామా అని ఆలోచనలు. కానీ ఒక అనివార్యమైన సుదీర్ఘ కాలం ఇప్పటిలా 6 గంటల నుంచి 9 గంటల వరకు మనకు కావలసినవి దొరికేల కాకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని ఉహించండి. భయమేస్తోంది కదా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దాదాపుగా యూరోప్  అంతటా హిట్లర్ నాజీ సైన్యం యూదులపై జరిపిన జాతి హననము ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక విషాద ఘట్టం.  ఈ నేపద్యంలో ఒక పదమూడేళ్ల అమ్మాయి తన కుటుంబంతో సహా దాదాపుగా రెండేళ్ల పైబడి హిట్లర్ రహస్య సైనిక విభాగం గెస్తపో నుండి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లడాన్ని నమోదు చేసుకున్న ఒక సాక్ష్యం "the diary of Anne frank".   రెండేళ్లపాటు కుటుంబమంతా ఒక చీకటి గుహ లాంటి ఆఫీస్ క్రింద భాగాన్ని మరో కుటుంబంతో కలిసి జీవించడాన్ని ఉహించండి. విభిన్న మనస్తత్వాలు కల్గిన వ్యక్తులు, అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుందన్న స్పృహతో సేకరించి పెట్టుకున్న అతి తక్కువ ఆహార పదార్ధాలు తో చీమ చిటుక్కుమంటే భయం, లోగొంతుకతో తప్ప మాట్లాడుకోలేని పరిస్థితుల్లో అజ్ఞాతంలో గడపడాన్ని ఉహించండి. ఇంత దుర్భర పరిస్థితుల్లో తమకు తాము మంచే జరుగుతుందన్న ఆశను కోల్పోకుండా రోజులను గడపడాన్ని పదమూడేళ్ళ అమ్మాయి తన డైరీ "kitty" తో చెప్పుకుంటూ రాసుకుంది.  రెండేళ్ళ తర్వాత అందరూ పట్టుబడేంతవరకు అన్నే ఫ్రాంక్ రాసుకున్న డైరీ అప్పటి జాతి హనన పరిస్థితులకు సాక్ష్యంగా నిలిచింది.  దురదృష్టవశాత్తు అన్నే ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మినహా మరెవ్వరూ హిట్లర్ నుంచి తప్పించుకోలేక పోయారు. అజ్ఞాతంలో ఉన్న వీళ్ళను నిర్బంధంలోకి తీసుకునేప్పుడు ఏదో పనికిమాలిన పేపర్లుగా భావించి అదొక సాక్ష్యమే కాదన్నట్లుగా వదిలేసిన డైరీ ఒక గొప్ప సాక్ష్యంగా చరిత్రలో మిగిలింది. అన్నే ఫ్రాంక్ తండ్రి విడుదలైన తర్వాత ఈ డైరీ ని ప్రచురించడం జరిగింది. తర్వాత అనేక ప్రచురణలు పొందడం, ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువాదం పొందడం, సినిమాలుగానూ, టెలిఫిల్మ్స్ గానూ రావడం జరిగింది.  ఈ స్వీయ నిర్బంధ కాలంలో ఈ పుస్తకాన్ని చదవడం ఒక ఓదార్పు మనకు. ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకోవడం లాంటిది. ముఖ్యంగా పడమూడేళ్ళ అమ్మాయి ఆలోచనల్లోంచి ఒక సంక్షోభ కాలాన్ని చూడడం, వాళ్ల కలలు, సమస్యలు, పరిణితి అర్ధం చేసుకోడం నిజంగా బాగుంటుంది.