గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ల ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సిఎంకు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు.  ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్ కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకో డిఎం అండ్ హెచ్ఓ ఉన్నారు. 17 సర్కిళ్లకు వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారిని నియమించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  ‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్ లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగీ ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో మ‌రొక‌రు మృతి, 592కి చేరిన కరోనా కేసులు!

సోమ‌వారం ఒక రోజే తెలంగాణ వ్యాప్తంగా 61 నూత‌న కరోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 592కి చేరింద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  మ‌రొక‌రు మృతి చెంద‌డంతో ఇప్ప‌ట్టి వ‌ర‌కు  కరోనాతో మృతి చెందిన వారిక సంఖ్య 17కు పెరిగింది.  క‌రోనా నుంచి కోలుకుని, డిశ్చార్జ్‌ చేసిన అయిన వారి సంఖ్య 103కాగా వారు పూర్తిగా కోలుకున్నారు. మిగిలిన 472 మంది చికిత్స పొందుతున్నారు.  ఎక్కువ కేసులు హైద‌రాబాద్ జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే న‌మోదువుతున్నాయని ప్ర‌భుత్వం తెలిపింది.  

ముఖ్యమంత్రికి అండగా నిలుద్దాం..ఒక్క పత్రికలోనే ప్రకటనలు

కరోనా సమయంలో ప్రకటనలు లేక తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ పత్రికలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని చిన్న పత్రికలు మూతపడుతున్నాయి కూడా.. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి సంబంధించిన పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా ఆ పత్రికను ఏం చేయలేవు. నిజం.. ప్రస్తుతం ప్రభుత్వ ప్రకటనల సాక్షిగా ఆ పత్రికకు ఉన్న అనుకూలాంశం అది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్లు పేజీ యాడ్లు వచ్చేస్తుంటే దాని స్టామినా పెరగక తగ్గుతుందా? కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే ఆ పత్రిక మాత్రం ప్రకటనల పండగ జరుపుకుంటున్నది. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అంటూ ఇప్పటికే నాలుగు ఫుల్ పేజీ యాడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో యాడ్ ఖరీదు అక్షరాలా కోటీ 36 లక్షల రూపాయలు. ముఖ్యమంత్రి ఫొటో ప్రముఖంగా సంబంధిత శాఖ మంత్రి ఫొటో కింద వచ్చే ఈ ప్రకటనలో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రికి అండగా ఉండటం ఏమిటో అర్ధం కాదు కానీ మరెన్నో యాడ్లు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఏ శాఖలో డబ్బులు ఉంటే ఆ శాఖ లోని ఆ విభాగానికి ఆ పత్రిక బిల్లు పంపుతుంది. దాన్ని అక్కడ నుంచి చెల్లించే ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనా పై జరుపుతున్న పోరాటానికి ఇన్ చార్జి అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ పర్యవేక్షించే ఆళ్ల నాని ఫొటో మాత్రం ఉండదు. ఎవరి ఫోటో ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చేది మన పత్రికకే కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలకు పైబడి ఆ పత్రిక ఖజానాలో జమ అయ్యాయి. ప్రభుత్వం ప్రకటన ఇస్తే డబ్బులు వచ్చేసినట్లే కదా. 8వ తేదీన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో యాడ్ వచ్చింది. రేపో ఎల్లుండో కోటీ 36 లక్షల రూపాయలు చెల్లించేస్తారు. పాపం ఆ శాఖకు చెందిన కొన్ని విభాగాల్లో పని చేసే వారికి రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. పని చేసేవారికి జీతాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు కానీ పత్రికలకు మాత్రం యాడ్లు వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అని లలితా జువెలర్స్ వారు మొదట సదరు పత్రికకు ప్రకటన ఇచ్చారు. డబ్బులు ఊరికే రావు అన్న గుండు బాస్ కాన్సెప్టు బాగుందని అన్ని ప్రభుత్వ శాఖలూ ముఖ్యమంత్రికి అండగా నిలవడానికి పాపం ఆ పత్రికకు ప్రకటనలు ఇవ్వడానికి క్యూ కట్టేశాయి. అసలు కరోనా బారిన పడ్డవారికి అండగా నిలవాలి లేదా దాని బారిన పడకుండా ప్రజలకు అండగా నిలవాలి కానీ ముఖ్యమంత్రికి అండగా దేనికి? కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు గుప్పిస్తే అండగా ఉన్నట్టు ఎలా అవుతుంది? ఈ ప్రకటనలకయ్యే ఖర్చు ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చినా కొంత మేలు జరుగుతుంది కదా అంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఈ వార్త చూసిన వైసీపీ అభిమానులు ఏమంటారో తెలుసా? చంద్రబాబునాయుడు అయన అనుకూల  మీడియాకు వందల కోట్లు దోచి పెట్టినప్పుడు కనిపించలేదా? మీరు కూడా అయన భజన మీడియా లాగా వార్తలు రాస్తున్నారు అని విమర్శలకు దిగే ప్రమాదం కూడా లేకపోలేదు.. దిగుతారు కూడా. వాటి పర్యవసానమే చంద్రబాబుకు 23 సీట్లు. మరి మనకూ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లే కావాలా? అన్నియ్యా..

లాక్ డౌన్ తో దేశానికి 7. 5 లక్షల కోట్ల నష్టం

* కోలుకోవడానికి ఉద్దీపనలు కావలసిందే  * లెక్కల్లో మునిగి తేలుతున్న ఎకనామిస్టులు  130 కోట్లకు పైగా జనాభాతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలందుకుంటున్న భారత్ కరోనా ప్రభావంతో దాదాపు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ప్రజారవాణా వ్యవస్థ స్థంభించిపోవడమే కాదు, జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మార్చి 25 నుంచి అమల్లోకి వచ్చిన 21 రోజుల లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థికరంగ నిపుణులు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో 70 శాతం ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు నిలిచిపోయాయని, పెట్టుబడులు, ఎగుమతులు, వస్తు వినిమయం ఎక్కడివక్కడే ఆగిపోయాయని పేర్కొన్నారు. భారత్ లో ఆర్థిక సంస్కరణలు, కేంద్రం ఉద్ధీపనలు, ద్రవ్య నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్న తరుణంలో కరోనా ప్రవేశించిందని, తద్వారా దేశ అభివృద్ధికి విఘాతం ఏర్పడిందని తెలిపారు. అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ అంచనా ప్రకారం లాక్ డౌన్ కారణంగా రోజుకు రూ.35 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందట. ఆ లెక్కన 21 రోజుల లాక్ డౌన్ మొత్తానికి రూ.7.5 లక్షల కోట్ల మేర నష్టపోతుంది. లాక్ డౌన్ తొలి 15 రోజులకు గాను సరుకు రవాణా రంగం (లారీలు మాత్రమే) రూ.35,200 కోట్లు నష్టపోయిందని, ఓ లారీ సగటున రోజుకు రూ.2,200 నష్టపోయిందని ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) సెక్రటరీ జనరల్ నవీన్ గుప్తా వెల్లడించారు. ఇక లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. కొనుగోళ్లు, విక్రయాలు నిలిచిపోవడంతో ఈ రంగానికి లక్ష కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. రిటైల్ వాణిజ్యం కూడా కనీవినీ ఎరుగని స్థాయిలో క్షీణత చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్రం కావడంతో మార్చి ద్వితీయార్థం నాటికి దాదాపుగా రూ.2.2 లక్షల కోట్ల మేర రిటైల్ వాణిజ్యం నష్టపోయినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. భారత్ లో రిటైల్ అమ్మకాల రంగంలో 7 కోట్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులుండగా, వారి పరిధిలో 45 కోట్ల మంది పనిచేస్తున్నారు. దేశంలో ఈ రిటైల్ వ్యాపారమే నెలకు రూ. 6.5 లక్షల కోట్ల మేర జరుగుతుంది. లాక్ డౌన్ కారణంగా ఆయా రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లాక్ డౌన్ అనంతరం కేంద్రం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవం ఆధారపడి ఉంటుంది.

ఉచిత కరోనా టెస్టులు పేదవాళ్లకు మాత్రమే: సుప్రీం స్పష్టీకరణ

కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టం చేసింది. ఎవరెవరికి ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలో ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. కొన్నిరోజుల కిందట అందరికీ ఉచితంగా కరోనా టెస్టులు అందుబాటులోకి తేవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనగా, తాము ఉచితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేమని ప్రైవేటు ల్యాబ్ లు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం తన నిర్ణయాన్ని సవరించుకుంది. "ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్దిపొందుతున్నవారు, బలహీన వర్గాల కేటగిరీలో ప్రభుత్వ గుర్తింపు పొందినవారు  అర్హులుగా భావించి వారికి ఉచిత కరోనా నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలి" అని వివరించింది. అయితే బలహీన వర్గాల్లో ఎవరెవరు ఈ వెసులుబాటుకు అర్హులో కేంద్రం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించుకోవచ్చని తెలిపింది.

రేపు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ప్రధాని క్లారిటీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో తాజా పరిస్దితులపై సమీక్ష నిర్వహించిన ప్రధని మోడీ... రేపు మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో తన అభిప్రాయాన్ని మోడీ వెల్లడించనున్నారు.  రేపు ఉదయం 10 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ఇవాళ ట్వీట్ చేసింది. వాస్తవానికి రెండురోజులుగా మంత్రి వర్గ బృందంతో పాటు అధికారులతో కీలక చర్చలు జరిపిన ప్రధాని, ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే పరిమిత లాక్ డౌన్ పై చర్చ జరుగుతున్న వేళ... మోడీ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో మోదీ పొడిగింపుకు మొగ్గు చూపుతారా లేక ఏపీ సీఎం జగన్ సూచించిన తరహాలో రెడ్ జోన్లకే దీన్ని పరిమితం చేస్తారో తేలాల్సి ఉంది.

లాక్ డౌన్ ఎఫెక్ట్: కన్న కొడుకు రాలేక భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య..

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో బాధపడుతోంది. మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ తరుణంలో చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు వారు ఎక్కడికక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ స్వంత వూళ్ళకు వెళ్లాలన్నా కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇటువంటి తరుణంలో కన్న కొడుకు ఉండి కూడా భర్త చితికి భార్య తల కొరివి పెట్టాల్సిన సంధర్భం వచ్చింది.  వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా పందిళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. ఈ గ్రామానికి చెందిన రాములు అర్ధరాత్రి మరణించాడు. అయితే తన కుమారుడు గుజరాత్ లో ఉద్యోగం చేయడం వల్ల తన స్వగ్రామానికి రాలేకపోయాడు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల తన తండ్రి అంత్యక్రియలు చేయడానికి రాలేకపోయాడు. దీనితో తన భర్త రాములు కి తన భార్య అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దృశ్యాన్ని అంతా తన కుమారుడు వీడియోలో చూస్తూ భోరున విలపిస్తున్నాడు. ఇలాంటి విపత్కర సమయాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం.

ఆ రెండు ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తారా ? అధికారుల సంకేతాలు...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేసులు నమోదువుతున్నా ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని ఉత్తరాంధ్ర జిల్లాల విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెడ్ జోన్లు లేకపోవడం, ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం వంటి కారణాలతో లాక్ డౌన్ ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్ధితిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో వివరాలు తెప్పించుకుంటోంది. వీటి ఆధారంగా ఉత్తరాంధ్రలో లాక్ డౌన్ ను సడలిస్తేనే మేలనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ ఎత్తేసినా షాపింగ్ మాల్క్, గుళ్లు, విద్యాసంస్ధలు, మార్కెట్లు వంటి ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఉత్తరాంధ్రకూ ఇవే నిబంధనలు వర్తింపజేయనున్నారు. వీటిని మినహాయించి మిగిలిన లాక్ డౌన్ నిబంధనలను సడలిచేందుకే ప్రభుత్వం మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తేసేందుకు కసరత్తు చేస్తున్న అధికారులు ముందు  జాగ్రత్త చర్యల్లో భాగంగా మొబైల్ టెస్టింగ్ సెంటర్లు, ప్రత్యేక కియోస్క్ లను ఏర్పాటు చేస్తున్నారు. అప్పటికప్పుడు పరిస్ధితులు తారుమారైతే ఈ మొబైల్ కియోస్క్ ల ద్వారా పరీక్షలు నిర్వహిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు రాకపోకలను కూడా నియంత్రించే అవకాశముంది.

ఏపీలో స్ధానిక పోరుకు ఈసీ సమాయత్తం... సిద్ధంగా ఉండాలన్న కనగరాజ్...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ఆరు వారాలు వాయిదా వేశారు. ఈ గడువు నెలాఖరుతో ముగియబోతోంది. దీంతో కొత్త ఈసీ జస్టిస్ కనగరాజ్ ఇవాళ విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెలాఖరులోపు ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తాజా పరిస్ధితిపై ఆయన వివరాలు తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎప్పటికల్లా పరిస్ధితి అనువుగా ఉండొచ్చన్న అంశాలపై ఆయన అధికారులను ఆరా తీశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్వసన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆయన కోరారు. స్ధానిక ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులు ఎంత మేరకు సహకరించేలా ఉన్నాయి, కరోనా ప్రభావం ఏ మేరకు ఉందన్న అంశాలపై అధికారుల నుంచి కనగరాజ్ వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ పరిస్ధితులపై అధికారులతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితి నెలకొందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని, స్థానిక సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మునిసిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా అందుకు అధికారులు, సిబ్బంది  సిద్దంగా ఉండాలని తెలిపారు. సమయానికి అనుగుణంగా కార్యచరణ ప్రణాళికలు ఉండాలన్నారు.  అలాగే ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని కమిషనర్ కనగరాజ్ తెలిపారు. చక్కటి అవగాహన తో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పేరు ను తీసుకుని రావడంలో  అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యదార్ధ స్థితిని అధికారులు కమిషనర్ కి వివరించారు.  ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఏస్.రామసుందర రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ వి సత్య రమేష్ , జెడి సాయి ప్రసాద్, ఎ ఎస్ సాంబ మూర్తి , పీఎస్ రామారావు పాల్గొన్నారు.

'డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌' ఎలా పనిచేస్తుందంటే...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌ అమలు కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబరు: 14410 కేటాయింపు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు, ఈనెల 11వ తేదీ నాటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్‌ పేర్లు నమోదు. డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు.  టెలి మెడిసిన్‌ ఉద్దేశం:   కోవిడ్‌–19 కేసులను గుర్తించడం, ఐసొలేట్‌ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం, ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు అందుకోవచ్చు.  డాక్టర్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటుంది. టెక్నికల్‌ అసిస్టెన్స్‌ టెక్నాలజీ టీం నుంచి లభిస్తుంది.  మూడంచెలుగా ‘డాక్టర్‌ వైయస్సార్‌ టెలి మెడిసిన్‌’ స్టెప్‌–1: 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది.ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్‌∙రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు. స్టెప్‌–2: రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ను స్వీకరించి, కాల్‌చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్‌–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.ఆ తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి. అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్‌కూడా ఉంటుంది. అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం  తీసుకుని ఆమేరకు వారిని తరలిస్తారు.  స్టెప్‌–3: కోవిడ్‌–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన. ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్‌తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు. ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.  వైద్యాధికారి–పీహెచ్‌సీ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు.ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషథాలను ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.  నాన్‌ కోవిడ్‌ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో 10,000 రూపాయలకే జానీ వాకర్ బాటిల్

* ఎక్సయిజ్ శాఖ లో ఇంటి దొంగలు  * తూర్పు గోదావరి లో కళకళ లాడుతున్న బ్లాక్ మార్కెట్  ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ప్రియులకు శుభవార్త. జానీ వాకర్ బాటిల్ 10,000 రూపాయలకే అక్కడ బ్లాక్ మార్కెట్ లో దొరుకుతోంది. అసలు ఏ ఇబ్బంది లేకుండా దొరకాలంటే, తూర్పు గోదావరి జిల్లా రాజోలు వెళితే చాలు, ఎక్సయిజ్ సిబ్బంది తో కుమ్మక్కయిన కొందరు ఔత్సాహికులు 2,300 రూపాయలకే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికే జానీ వాకర్ బాటిల్ ను 10,000 రూపాయల చౌక బేరానికే విక్రయిస్తున్నారు. అయితే, మద్య విమోచన ప్రచార కమిటీ వర్షన్ మాత్రం మరోలా ఉంది... అదేదో వారి మాటల్లోనే చదివి ఆనందించండి.  మార్చి 22 నుండి సీలు వేసి మూసివేసిన 3500 ప్రభుత్వ మద్యం షాపులను, 800లకు పైగా వున్న బార్ మరియు రెస్టారెంట్ లను తనిఖీలు చేసి అక్రమంగా మద్యం తరలించి వుంటే సంబంధిత సూపర్ వైజర్, సేల్స్ మెన్ లతో పాటు బార్ యజమానులు,  సంబంధిత అధికారులపై సత్వర చర్యలు చేపడుతామని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వాళ్ళంరెడ్డి లక్ష్మణ రెడ్డి చెపుతున్నారు. జాన్ వాకర్ 10,000 రూపాయలకే దొరుకుతున్న విషయం వారిదాకా ఇంకా వచ్చి ఉండకపోవచ్చు.  మార్చి 22న సీలు వేసిన సమయానికి వున్న మద్యం నిల్వలు తనిఖీలు చేసిన సందర్భంగా వున్న మద్యం నిల్వలలో ఏమాత్రం తేడా వచ్చినా కఠినంగా శిక్షిస్తాం.ఈ తనిఖీల నిర్వహణ కోసం ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్,  పోలీస్,  మద్యం డిపోల సిబ్బందితో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్టు-ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరిండెంట్స్ ఎన్.బాలకృష్ణన్, ఎస్. రవికుమార్, సి. హెచ్. వి మహేష్ కుమార్ మీడియా ప్రతినిధులకు వివరించారు.  కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడా మద్యం షాపులు, బార్ మరియు రెస్టారెంట్ ల  నుండి అక్రమంగా మద్యం తరలించినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ అక్రమ మద్యం కార్యకలాపాలను ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధి అయినా  అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్  రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తాం. ముఖ్యమంత్రి దృఢసంకల్పమైన  దశలవారీ మద్య నిషేధానికి ఎవ్వరూ తూట్లు పొడవాలని చూసినా సహించేది లేదు. రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండరాదని కోరుతున్నామని కూడా వారు చెప్పుకొచ్చారు.   లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 22 నుండి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్ లో ని 13 జిల్లాలలో 2178 అక్రమ మద్యం కేసులు నమోదు కాగా 22 13 మందిని అరెస్టు చేశామంన్నారు. 16,405 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. 3,61,500 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు.  మన రాష్ట్రానికి సంబంధించిన 1976 లీటర్ల మధ్యనని,   1500 లీటర్ల బీర్ బాటిల్స్ ల ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న 1420 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నారు. 3000 లీటర్ల కల్లును పట్టుకున్నారు. అక్రమ మద్యాన్ని రవాణా చేస్తున్న 464 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని కూడా చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు అత్యధికంగా వినియోగించడం వలన ప్రస్తుతం విత్ డ్రాయల్ లక్షణాలు ఎక్కువగా వచ్చి  వందలాదిమంది ఆస్పత్రుల పాలౌతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కల్తీకల్లు లేనందున ఆ పరిస్థితి లేదు. ఎవరికైనా వ్యసనపరులకు విత్ డ్రాయల్ లక్షణాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీ-అడిక్షన్ కేంద్రాలను సంప్రదించాలని, గుంటూరులోని న్యూ లైఫ్ డి- అడిక్షన్ కేంద్రం వారు ఉచితంగా వైద్యాన్ని అందిస్తారనీ,  9849347500 నెంబరును  సంప్రదించాలని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వాళ్ళంరెడ్డి లక్ష్మణ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రజల బాధలు పట్టించుకోకుండా.. స్వప్రయోజనాల కోసం వెంపర్లాట

-జగన్ తీరుపై చంద్రబాబు ధ్వజం  -తెదేపా నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్  కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తుంటే ప్రజల బాధలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని తన నివాసం నుండి  చంద్రబాబు నాయుడు సోమవారం నాడు  టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడితే ఆయనను పదవి నుంచి తొలగించడం దుర్మార్గ చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు.  ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, రాజకీయ లాభాలే తనకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎపిలో క్వారంటైన్ ను ఒక ఫార్స్ గా మార్చారని, తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని విమర్శించారు. కనగరాజ్ చెన్నై నుంచి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలకు, వలస కార్మికులకు రాష్ట్రాల సరిహద్దులు దాటడానికి ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసిని తొలగించడం, మాస్కులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం, నిధులు అడిగిన మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయడం, ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు(పిపిఈలు) ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు. మీతో పాటు ఐదుగురికి భోజనం పెట్టాలని ప్రధాని నరేంద్రమోడి ప్రజలందరికీ పిలుపిస్తే, మన రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టే కేంటిన్లు మూసేసిన చరిత్ర సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఆయన వ్యాఖ్యానించారు.  పనులు కోల్పోయిన పేదలకు కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో వైసిపి మినహా అన్ని పార్టీలు కోరినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలు ఇవ్వాలని, అన్నా కేంటిన్లు తెరవాలని, చంద్రన్న బీమా పునరుద్దరించాలని  12గంటలు దీక్ష చేస్తున్న టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గద్దె అనురాధలను చంద్రబాబు అభినందించారు.  రాజధాని రైతులు, మహిళలపై అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా నందిగామలో దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కూడా ఆయన  అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి జిల్లాలో పేదలకు, రైతులకు, కార్మికులకు సంఘీభావంగా టిడిపి నాయకులు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని ప్రాంతం గుంటూరు-కృష్ణా జిల్లాలు రెడ్ జోన్ లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా ఆయన ఆరోపించారు.  కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్లుతోందని ఆయన విమర్శించారు. కరోనా మరణం దాచిపెడితే వాటిల్లే దుష్ఫలితాలకు విజయవాడ ఉదంతమే రుజువు అని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప, మండల ప్రాతిపదికన తక్కువగా చూపించడం దురుద్దేశ పూర్వకంగా పేర్కొన్నారు. ఏపిలో కరోనా కేసులపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్  కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు.  చెప్పారు. లాక్ డౌన్ లో కూడా అనేక జిల్లాలలో వైసిపి నేతలు అక్రమ మైనింగ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలలో వందల ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా పట్టించుకున్న వారు లేరని విమర్శించారు. గ్రావెల్ అక్రమ తరలింపు ట్రాక్టర్లను సీజ్ చేయకుండా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేసే ట్రాక్టర్లను సీజ్ చేయడం హేయమని వ్యాఖ్యానించారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పారిశుద్యం యుద్దప్రాతిపదికన మెరుగుపర్చాలని, జనావాసాల మధ్య మురుగు, చెత్తకుప్పలు తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్య కార్మికులకు ప్రోత్సాహకాలతో పాటు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలని సూచించారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని చెప్పారు. గత 10రోజుల్లోనే పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, దళారులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. రెండు, మూడెకరాల భూమి ఉందనే నెపంతో తెల్లకార్డుదారులకు రూ 1,000 ఆర్ధిక సాయం, రేషన్ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం శోచనీయమని అన్నారు.  140లక్షల కార్డుదారులకు రూ. 1000 ఇవ్వాల్సివుండగా 123లక్షల కార్డుదారులకు మాత్రమే ఇవ్వడం శోచనీయమన్నారు. ఇటీవల తొలగించిన 18లక్షల రేషన్ కార్డుదారులకు కూడా రూ 1,000 ఆర్ధికసాయం, రేషన్ సరుకులు అందజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ముస్లింలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. నారాయణ స్వామిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  ‘‘ఎంగిలి ప్లేట్లు, స్పూన్లు ముస్లింలు నాకడం వల్లే కరోనా వ్యాపిస్తోందని’’ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి వ్యాఖ్యానించడం గర్హనీయమని అన్నారు. ‘ఢిల్లీ జమాత్ వల్లే ఏపిలో కరోనా వ్యాపించిందని’’ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదికి ఫిర్యాదు చేశారని, ‘‘ముస్లింలు ప్లేట్లు, స్పూన్లు నాకడం వల్లే కరోనా వస్తోందని’’ డిప్యూటి సీఎం అన్నారని, ముస్లింల పట్ల వైసిపి నేతల దుర్మార్గ వైఖరికి ఈ వ్యాఖ్యలే రుజువని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని ఏదో ఒక మతానికి అంటగట్టాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.  ముస్లింలపై వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 14వ తేదీన  అంబేద్కర్ జయంతిని ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.  అంబేద్కర్ చిత్రపటాలకు ఇళ్లలోనే దండలేసి నివాళులు అర్పించాలని చెప్పారు. వైసిపి ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలను గర్హించాలని, గత ఏడాదిగా దళితులపై దాడులు పెచ్చుమీరడం, అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడం, దళిత డాక్టర్ ను సస్పెండ్ చేయడం, ఎస్సీ నిధులు దారిమళ్లించి స్వాహా చేయడం, తదితర దళిత వ్యతిరేక చర్యలను నిరసించాలని తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ పీరియడ్ లో పేద కుటుంబాలకు అండగా ఉంటూ బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులను అభినందించారు. విపత్తులలో బాధితులను ఆదుకోవడం మానవ ధర్మంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విపత్తు బాధితులను ఆదుకోవడానికి టిడిపి చేసిన కృషిని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న చార్ థామ్ యాత్రీకులను, కృష్ణా వరద బీభత్సంలో కర్నూలు, మహబూబ్ నగర్ తదితర 5 జిల్లాల బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడాన్ని ప్రస్తావించారు. ఎక్కడికక్కడ భౌతిక దూరం పాటిస్తూ, స్థానిక అధికారుల సహకారంతో పంపిణీ జరిగేలా చూడాలని కోరారు.   ‘‘గత 10రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా వైరస్ 182% పెరిగింది. కర్నూలులో 8300% పెరగ్గా, అనంతపురం 650%, గుంటూరులో 310%, నెల్లూరులో 116%, ప్రకాశంలో 141%, చిత్తూరులో 133%, తూర్పుగోదావరిలో 89%, విశాఖలో 82%, కడపలో 72% పెరగడం ఆందోళనకరం. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చూస్తే, గత 10రోజుల్లో మహారాష్ట్రలో 382%, ఢిల్లీ 301%, తమిళనాడు 228%, రాజస్థాన్ 516%, గుజరాత్ 486%, మధ్యప్రదేశ్ 425% పెరిగింది. కేరళ, కర్ణాటక మాత్రమే 100% కన్నా తక్కువ నమోదు అయ్యాయి.  కేరళలో ప్రతి మిలియన్ మందికి 428పరీక్షలు చేయగా, ఢిల్లీలో 582పరీక్షలు, మహారాష్ట్రలో 360మందికి, రాజస్తాన్ లో 413మందికి టెస్టింగ్ లు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి 10లక్షల మందికి కేవలం 161పరీక్షలే చేస్తున్నారని’’ నిపుణుల వ్యాఖ్యలను చంద్రబాబు ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  ఎంత ఎక్కువగా టెస్ట్ లు చేస్తే అంతగా కరోనా వైరస్ ను కట్టడి చేయగలం అనేది ప్రపంచవ్యాప్తంగా రుజువైన అంశంగా పేర్కొన్నారు. టెస్టింగ్ లు అధికంగా చేసి, పాజిటివ్ కేసులను ఐసొలేషన్ చేసి, వారికి ప్రత్యేక చికిత్స అందించడం ద్వారా, వారి ప్రాణాలను కాపాడటమే కాకుండా, వాళ్ల కుటుంబాలను, తద్వారా సమాజంలో అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి మార్గం సుగమం అవుతుందని చంద్రబాబు అన్నారు.

అన్ని రకాల గూడ్స్ వాహనాలకు అనుమతి!

రవాణా లారీలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని రకాల రవాణా వాహనాలకు కూడా అనుమతులు ఇవ్వటంతో లారీలు రోడ్లపైకి ప్రవేశిస్తున్నాయి. దీంతో తమ ఉత్పత్తులను రవాణా చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలు లారీ సప్లై ఆఫీసులకు ఫోన్లు చేసి బుకింగ్‌ చేసుకుంటున్నాయి. దీంతో క్రమేణా లోడింగ్‌లు, అన్‌లోడింగ్‌లు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూర్తి నిర్మానుష్యంగా కనిపించిన జాతీయ రహదారులపై లారీలు పరుగులు పెట్టనున్నాయి. పాసులు ఇస్తే తప్ప రవాణా వాహనాలకు అనుమతి ఉండదన్న అపోహల కారణంతో చాలామంది బుకింగ్‌లు చేసుకోవటానికి ఆలోచిస్తున్నారు. దీంతో ఆశించినంతగా బుకింగ్‌లు జరగటం లేదని తెలుస్తోంది.  పాస్‌ల అనుమానాలపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెరదించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులకు రవాణా వాహనాల అనుమతులకు సంబంధించి ఫ్యాక్స్‌/రేడియో మెసేజ్‌ను పంపారు. అన్ని రకాల గూడ్స్‌ వాహనాలను, ఖాళీగా ఉన్నవి అయినా సరే రోడ్ల మీద తిరిగేటపుడు పోలీసులు అడ్డుకోవద్దని సూచించారు. అలాగే, పాస్‌లు చూపించమని కూడా వాహనదారులను డిమాండ్‌ చేయొద్దని ఆదేశించారు. ఏ రకమైన గూడ్స్‌ రవాణా వాహనాల్లో అయినా కేవలం డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండాలని, ప్రయాణికులను తరలించటాన్ని మాత్రం అనుమతించవద్దని పేర్కొన్నారు.

కరోనాపై జగన్ సంధించిన బ్రహ్మాస్త్రమిది.. తక్కువ కేసులతో బయటపడతాం: విజయసాయి

*ఒక్కొక్కరికీ మూడేసి మాస్క్ లు ఇవ్వాలని జగన్ నిర్ణయం *మొత్తం 16 కోట్ల మాస్క్ ల పంపిణీకి రంగం సిద్ధం *ఏపీ సురక్షిత రాష్ట్రమవుతుందన్న విజయసాయి ఆంధ్రప్రదేశ్ లో నివశిస్తున్న ప్రతి ఒక్కరికీ మూడేసి మాస్క్ ల చొప్పున అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఓ బ్రహ్మాస్త్రం వంటిదని, దీంతో కరోనాపై పోరులో అతి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడగలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ప్రస్తుతం దేశమంతా జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నదని అన్నారు. సమీప భవిష్యత్తులో రాష్ట్రం అత్యంత సురక్షిత రాష్ట్రంగా నిలుస్తుందని విజయసాయి వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ గారు చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మస్త్రం ఇది. అతితక్కువ ప్రాణ నష్టంతో ఏపీ సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది" అని విజయసాయి అభిప్రాయపడ్డారు.

కరోనా బాధితుల్లో అత్యధికులు పొగతాగేవారే! డబ్ల్యూహెచ్‌వో

శ్వాసకోశ,, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారిపైనా కరోనా దాడి చేస్తోంద‌ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. పొగతాగేవారిపై కరోనా అధికంగా ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో తేల్చిచెప్పింది. పొగ పీల్చినప్పుడు ఏస్‌–2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, వైరస్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని పేర్కొంది. ప్రపంచంలో కోవిడ్‌–19 వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్‌ అధ్యయనం చేశారు. పొగతాగే వారే అత్యధిక శాతం కరోనా బారిన పడినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది.  చైనాలో కరోన బారిన పడిన 82,052 మందిలో 95 % మంది పొగతాగే అలవాటున్న వారేనని అధ్యయనంలో తేలింది.  ఇటలీ లోనూ సింహభాగం కరోనా రోగులకు పొగతాగే  అలవాటున్నట్టు గుర్తించారు.   కరోనా బారిన పడిన వారిలో పొగతాగేవారి తర్వాతి స్థానం తీవ్ర శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారిదేనని వెల్లడైంది. పొగ తాగడం మానేసేందుకు ఇంతకంటే మంచి సమయం రాదని జానీస్ లీంగ్‌ చెప్పారు.

'దగ్గుబాటీ'స్ కర్రీ పాయింట్!

*చెఫ్‌గా మారిన ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు *నాటుకోడి పులుసు, బిర్యానీ రెడీ... లాక్‌డౌన్ దెబ్బ‌తో గల్లీలో కూలీ పనిచేసే కార్మికుడి దగ్గరి నుంచి దేశ అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోని వారి పరిస్థితి ఇంతే. నిత్యం బిజీగా ఉండే క్రికెటర్లు, సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం దగ్గరి నుంచి బాత్ రూమ్స్ క్లీన్ చేసే వరకు అంతా వాళ్లే చేసుకుంటున్నారు. ఇంటి పనులు చేస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, వంట పనుల్లో భార్యకు సాయం చేస్తోన్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.  కిచెన్‌లో ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎలా చెఫ్‌గా మారి.. వంట‌ పనుల్లో తన భార్యకు సాయమందిస్తూ బిజీగా వున్నారు. సండే స్పెష‌ల్‌గా  నాటుకోడి పులుసు, బిర్యానీ రెడీ చేసారు...

ఫాల్‌–2020 అకడమిక్‌ ఇయర్‌ స్ప్రింగ్‌ 2021కి వాయిదా?

కరోనా ఎఫెక్ట్ తో అమెరికన్‌ విశ్వవిద్యాలయాలు అడ్మిషన్లు వాయిదా వేసే యోచనలో వున్నాయి. అమెరికాలో విశ్వవిద్యాలయాలు  ఎప్పుడు పని చేస్తాయన్నది చెప్పడం కష్టమేనని, ఒకవేళ ఆగస్టు నాటికి మామూలు పరిస్థితులు నెలకొన్నా ఫాల్‌–2020 తరగతులు సెప్టెంబర్‌లో ప్రారంభం కావడం గగనమేనని యూనివర్సిటీ అఫ్‌ ఫ్లోరిడా గ్యాన్‌విల్లే అకడమిక్‌ విభాగం పేర్కొంది.  ‘మీకు ఇచ్చిన అడ్మిషన్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. మీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయి మార్కుల జాబితా రాగానే మాకు పంపండి. ఫాల్‌ వీలు కాకపోతే స్ప్రింగ్‌–2021కి మీ అడ్మిషన్‌ను వాయిదా వేస్తాం’అని విద్యార్థులకు పంపిన కమ్యూనికేషన్‌లో స్పష్టం చేసింది. ‘యూనివర్సిటీ అఫ్‌ ఆరిజోనా.  ఈ ఏడాది ఫాల్‌–2020 అకడమిక్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన అడ్మిషన్లు రద్దు కావు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఆందోళన అవసరం లేదు. కచ్చితంగా వారికి తదుపరి అకడమిక్‌ సెమిస్టర్‌లలో అవకాశాలు ఇస్తారని  యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్, షికాగో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రణవ్‌ బోన్సులే అన్నారు.  ఇప్పటికే ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన నాలుగో ఏడాదిలో ఉన్న విద్యార్థులు దాదాపు 40 వేల మంది ఫాల్‌–2020కి అడ్మిషన్లు పొందారు. షెడ్యూల్‌ ప్రకారం మరో 30 నుంచి 40 వేల మందికి ఈ నెలాఖరుకు అడ్మిషన్లు రావాలి. కానీ, అక్కడ 90 శాతం విశ్వవిద్యాలయాలు కరోనా వైరస్‌ కారణంగా పని చేయడం లేదు. ఈ వర్సిటీలు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో, అడ్మిషన్లు ఎప్పుడు ఇస్తారో అనే దానిపై స్పష్టత లేదు.  ‘జూన్‌ నాటికి మామూలు పరిస్థితులు నెలకొని జూలైలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినా వారు ఫాల్‌ –2020కి హాజరు కావడం గగనం. ఒకసారి విద్యార్థి ఐ20 అందుకున్న తరువాత వీసా అపాయింట్‌మెంట్‌కు ఆరు వారాలు పడుతుంది. ప్రస్తుత తరుణంలో అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మంది మే మొదటి వారంలోగా వీసా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఉండాల్సింది. కాన్సులేట్లు మూసి ఉన్న కారణంగా అది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందువల్ల ఫాల్‌–2020 అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగే’ అవ‌కాశం లేదు. మే 15 దాకా కాన్సులేట్‌లు తెరుచుకోవడం అనుమానమే..  ‘కచ్చితంగా ఫలానా సమయంలో పని చేస్తాయని చెప్పలేం. కానీ, మాకు అందుతున్న సమాచారం ప్రకారం మే 15 దాకా పని చేయవు’అని కాన్సులేట్‌ వర్గాలు అంటున్నాయి.  ఇదే జరిగితే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన 40 వేల మందికి జూలై, ఆగస్టులో గానీ అపాయింట్‌మెంట్లు పొందే అవకాశం లేదు. ఒక సారి కాన్సులేట్‌ పని చేయడం మొదలుపెడితే ఏప్రిల్‌ 15 నాటికి వీసా అపాయింట్‌మెంట్‌ కలిగి ఉన్న వారికే (ప్రస్తుతం రద్దయ్యాయి) జూన్‌ చివరి దాకా రీషెడ్యూల్‌ అవుతాయి. అందువల్ల కొత్త అపాయింట్‌మెంట్లకు అవకాశం ఉండకపోవచ్చు.