t congress leader khuntia missing

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా కనిపించడం లేదు... కారణం ఏంటి..?

    తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా చాలా రోజులుగా కనిపించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన ఆయన కొంతకాలంగా గాంధీ భవన్ లో కనిపించడం మానేశారు. ఢిల్లీకే పరిమితమయ్యారో లేదంటే తెలంగాణలో ఏముందిలే అనుకున్నారో ఏమో తెలియదు కానీ కుంతియా చాలా కాలంగా రాష్ట్రంలో కనిపించటం లేదు. గడిచిన ఆరు నెలల క్రితం వరకు వారంలో రెండు మూడు రోజులు ఇక్కడే ఉండేవారు. అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో సమావేశమయ్యేవారు. ఏఐసీసీ కార్యాచరణ ఇచ్చిందంటే ఆయన హోటల్లో ఉండి సమీక్షలు చేసేవారు. కానీ, కొంత కాలంగా కనిపించడం మానేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో బిజీగా కనిపించిన ఆయన ఇప్పుడు అస్సలు కనిపించకపోవడంతో కుంతియా ఎక్కడ అని కామెంట్ లు గాంధీ భవన్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పెర్ఫామెన్స్ చేయలేకపోయింది, పధ్ధెనిమిది మునిసిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ వాటిని కైవసం చేసుకోలేకపోయింది. ఫలితాలపై సమీక్ష నిర్వహించాల్సిన కుంతియా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్రంలో కీలకమైన నాయకులంతా తమ పరిధిలోని మునిసిపాలిటీలను గెలిపించుకోలేకపోయారు. కానీ, వీటిని విశ్లేషించేవారే లేకుండా పోయారు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఇలాంటి సమీక్షలు చేస్తుంటారు కానీ, కుంతియానే కనిపించకపోవటంతో సమీక్షలు కూడా అటకెక్కాయి. సమీక్షల సంగతి ఎలా ఉన్నా కుంతియా కనిపించకపోవటంతో అది కాస్త వేరే చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా నాయకత్వ మార్పు ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐసీసీ లో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. కుంతియా కొంత కాలంగా రాకపోవడంతో ఆయనను కూడా మార్చుతారేమోననే టాక్ మొదలైంది. నాయకత్వ మార్పుపై ఎప్పటికప్పుడు అంతో ఇంతో స్పష్టత ఇచ్చే కుంతియానే ఇప్పుడు కనిపించకపోవడంతో పార్టీలో పరిణామాలపై చర్చలు తీవ్రమయ్యాయి.

ap govt hikes electricity charges

మొన్న మద్యం... నిన్న ఆర్టీసీ... ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు... జనంపై జగన్ సర్కారు వాతలు...

  ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వాత మోత మొదలైంది. ఓటు బ్యాంకే లక్ష్యంగా హద్దూపద్దూ ఎన్నికల్లో హామీలిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వాటిని అమలు చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు కోసం అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే సుమారు 60వేల కోట్ల అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... ప్రజలపై పరోక్షంగా భారం మోపుతూనే ఉంది. దశల వారీ మద్యం నిషేధమంటూ లిక్కర్ ధరలను భారీగా పెంచేసి మద్యం ప్రియులపై పెనుభారం మోపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... ఆ తర్వాత ఆర్టీసీ ఛార్జీలపై మోత మోగించింది. ఇక, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల వంతు వచ్చింది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులపై జగన్ ప్రభుత్వం భారం మోపింది. యూనిట్ కు 90 పైసలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే పెంచిన ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అంటే, ఐదొందల యూనిట్లు పైబడినవారికి యూనిట్ ధర 9 రూపాయల 95 పైసలు వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపైనే భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్నా.... 500 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించుకునే ప్రజలు లక్షల్లోనే ఉన్నారు. సుమారు కోటిన్నర మంది గృహ వినియోగదారుల్లో కోటీ 30లక్షల మందిపై పెనుభారం పడనుంది. అలాగే, పెంచిన ఛార్జీల కారణంగా ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై 13వందల కోట్ల రూపాయల భారం పడనుంది. మరోవైపు, ప్రభుత్వ సబ్సిడీ భారీ పెరిగిపోయిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని అధికారులు బాంబు పేల్చారు.

CM KCR meeting with collectors

దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు...

  రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇకపై దృష్టంతా పాలనపైనే పెట్టాలని కలెక్టర్ లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వబోతున్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించటమే లక్ష్యంగా పని చేయాలని సూచించనున్నారు. పల్లె ప్రగతిని సమీక్షించి పట్టణ ప్రగతి, వివిధ చట్టాల అమలుపై ఈరోజు ముఖ్యమంత్రి చర్చించనున్నారు. గత ఏడాది అక్టోబరు పదిన (అక్టోబర్ 10) జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన మీటింగ్ కు ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. 20 కి పైగా జిల్లాలకు కలెక్టర్ లు మారగా కొత్తగా పన్నెండు మంది కలెక్టర్లయ్యారు. జాయింట్ కలెక్టర్ల స్థానంలో ఎడిషనల్ కలెక్టర్ల వ్యవస్థ వచ్చింది. ఒక్కో జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్ లు ఉండనున్నారు, దీంతో సీఎం చేయనున్న మార్గ నిర్దేశనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పల్లెప్రగతి లాగే త్వరలోనే పట్టణ ప్రగతి చేపడుతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది, తేదీలను కూడా ఖరారు చేసే అవకాశముంది. హరితహారం పైనా రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాల అమలుపై కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడబోతున్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా కలెక్టర్ల అభిప్రాయం తీసుకోనున్నారు. ఎడిషనల్ కలెక్టర్ల బాధ్యతలపై సీఎం స్పష్టత ఇవ్వనున్నారు. రాష్ట్రంలో దాదాపుగా అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని కలెక్టర్ లకు  కెసిఆర్ సూచించనున్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకు కేసీఆర్ గతంలో ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ పథకం పైన సమావేశంలో చర్చ జరగనున్నట్టు సమాచారం. 

2020 Delhi legislative assembly election results

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల..గెలుపెవరిది..?

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం ప్రారంభం కానుంది. మొత్తం డెబ్బై శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. హస్తిన ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శనివారం ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది, ఈరోజు మొత్తం ఇరవై ఒక్క కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించేందుకు ఈ సీ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేసింది, మొదట బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్ లు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతిస్తారు. కౌంటింగ్ కు ఒక గంట ముందు అభ్యర్థి, పోలింగ్ ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించటానికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 672 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. 58 జనరల్, 12 ఎస్సీ అభ్యర్థులకు కేటాయించారు, సీఎం కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ప్రధానంగా అధికార ఆమాద్మీ పార్టీ, బీజేపీ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. 2015 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది. బిజెపి మూడు సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.2015 లో 67శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 62శాతానికి తగ్గింది. అత్యల్పంగా ఢిల్లీ కంటోన్మెంట్ లో 45.4శాతం పోలింగ్ నమోదు కాగా అత్యధికంగా బల్లిమారం నియోజకవర్గంలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం లోగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జెండా ఎగరేసింది ఎవరనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విజేత ఎవరో అంచనా వేసినా అధికారిక ఫలితాలొచ్చే వరకూ ఆగాల్సిందే. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారని ఆప్ ధీమా వ్యక్తం చేస్తుంటే సంచలనాలు నమోదవుతాయని బీజేపీ ఆశలు పెట్టుకొంది.

electricity charges to rise in ap

ఏపీలో పెరగనున్న విద్యుత్ చార్జీలు..!!

  ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి, నెలలో 500 యూనిట్ లకు మించి విద్యుత్తును వినియోగించే వారికి యూనిట్ కు 90 పైసలు చొప్పున పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఈ ధర రూ 9.05 ఉండగా ఇప్పుడు రూ 9.95 గా ట్యారిఫ్ నిర్ణయించింది. ఈ భారం కార్పొరేట్ సంస్థలతో పాటు రాష్ట్రంలోని 1,00,035 గృహ వినియోగదారులపై కూడా పడనుంది. విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల నుంచి బయట పడేసేందుకు ఆంధ్రపదేశ్ లో కరెంటు చార్జీలు పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు 2020-21 సంవత్సరానికి గాను 14,349 కోట్ల ఆదాయం అవసరమవుతుందని అంచనా వేసినట్టు ఏపీఈఆర్ సీ చైర్మన్ సివి నాగార్జునరెడ్డి చెప్పారు. ఈ లోటును భర్తీ చేసేందుకే చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. పెంచిన విద్యుత్ చార్జీల కారణంగా ప్రభుత్వ సంస్థలు కార్పొరేట్ సంస్థలపై పదమూడు వందలు కోట్ల భారం పడనుందని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి 2893.48 కోట్ల ఆర్థిక భారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థల నికర లోటును 10,060.63 కోట్లుగా నిర్ధారించారు. రైతులు వినియోగించే విద్యుత్ కోసం 8358.58 కోట్లు సబ్సిడీ రూపంలో చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని అందుకే ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి వ్యవసాయ విద్యుత్ కోసం పక్కా ప్రణాళిక రూపొందించామని రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ పెరిగిందని, క్రమంగా సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. 

bjp bahiranga sabha in hyderabad

బిజెపి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ అందుకే నిర్వహించనుందా..?

  పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు బిజెపి ప్లాన్ చేస్తోంది. మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలనుకుంటోంది. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా బీజేపీ సంఘ్ పరివార్ క్షేత్రాలు, కార్యక్రమాలు చేస్తున్నాయి. చిన్న చిన్న సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ సభలు కూడా జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించింది బీజేపీ. మేథావుల సమావేశాలను ఏర్పాటు చేసింది, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నగరాల్లో సభలు జరిగాయి. హైదరాబాద్ లో కూడా కార్యక్రమాలు చేసింది, ఇందిరాపార్కులో ఒక కార్యక్రమం తప్ప ఎక్కువగా హాల్ మీటింగ్ లకే పరిమితమైంది. మొక్కుబడి కార్యక్రమాలు కాకుండా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాధులు భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా టైమిస్తే మార్చి మూడవ(మార్చి 3) తేదీన ఈ సభ వుండే అవకాశముంది. ఈ సభకు బిజెపితో మళ్లీ దోస్తీ కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం, గ్రేటర్ మునిసిపల్ కౌన్సిల్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయటంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని బీజేపీ భావిస్తోంది. ఈ సభను తనకు అనుగుణంగా మార్చుకోవాలని బిజెపి నేతలు అనుకుంటున్నారు.

Select Committee Issue in AP

ఏపీలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వివాదం మరల మొదలైందా..!!

ఏపీలో మళ్లీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వివాదం ప్రారంభమైంది, సెలెక్టు కమిటీలను ఏర్పాటు చేయలేమంటూ చైర్మన్ కు మండలి కార్యదర్శి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుంటోంది, చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ ఎలా బేఖాతరు చేస్తారంటూ మండిపడుతోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలకు పోతుండడంతో సెలక్ట్ కమిటీల ఏర్పాటు అంశం మరింత జఠిలం కానుంది. వికేంద్రీకరణ బిల్లులు ఇంకా గాలిలోనే ఉన్నాయి, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. వికేంద్రీకరణ బిల్లు సి ఆర్ డి ఏ చట్ట ఉపసంహరణ బిల్లులపై మండలిలో చర్చ జరిగి గందరగోళం మధ్య సెలెక్ట్ కమిటీకి పంపుతున్నారనే విషయాన్ని ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. అప్పట్నుంచీ రోజులు గడుస్తున్నా సెలెక్ట్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశం మాత్రం కొలిక్కి రావడం లేదు. సెలెక్టు కమిటీలను ఏర్పాటు చేయాలంటూ మండలి చైర్మన్, కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు ఫైల్ పంపారు. అలాగే తన వద్దకు వచ్చిన సభ్యుల పేర్లతో సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తూ బులెటెన్ జారీ చేయాలని సూచించారు.  అయితే ఇక్కడో ట్విస్ట్ ఇచ్చారు మండలి సెక్రెటరీ, సెక్షన్ 154 ప్రకారం సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేసే అధికారం లేదని, అలాగే తనకున్న నిబంధనలు, పరిమితులను కూడా ప్రస్తావిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ కు మండలి సెక్రటరీ నోట్ రాసినట్టు సమాచారం. మండలి కార్యదర్శి ఈ విధంగా వ్యవహరించడాన్ని ఇటు మండలి ఛైర్మన్ తో పాటు టిడిపి కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను తిప్పి పంపే అధికారం సెక్రటరీకి ఎంత మాత్రం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు టిడిపి నేతలు. ఇదే అంశంపై మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులతో భేటీ అయ్యారు టిడిపి ఎమ్మెల్సీలు. ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తూ కార్యదర్శిపై ఒత్తడి పెంచితే తాము కూడా సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఇష్యూను రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని హెచ్చరించారు. అయితే మధ్యే మార్గంగా సంప్రదింపులు జరుపుకునే సెలక్ట్ కమిటీల ఏర్పాటు విషయంలో ఓ అభిప్రాయానికి వస్తే బెటరనే భావనను మండలి కార్యదర్శి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు చైర్మన్ ఆదేశాలను పాటించకుండా సెక్రటరీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామంటూ టిడిపి స్పష్టం చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ కూడా అప్రమత్తమయింది. టిడిపి ఎమ్మెల్సీలు సెక్రటరీతో భేటీ అయ్యారనే సమాచారం తెలుసుకున్న వెంటనే వారి భేటీ అనంతరం మండలి సెక్రెటరీతో డిప్యుటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు భేటీ అయ్యారు. కౌన్సిల్ ఛైర్మన్ సెలక్ట్ కమిటీ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపే అంశమే ఉత్పన్నం కాదనేది వైసిపి వాదన. ఈ క్రమంలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు అంశం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.

malladi vishnu sensational comments on ab venkateswara rao

ఒకరికి పోస్టింగ్... మరొకరిపై వేటు... జగన్ కసి తీర్చుకున్నారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఏబీవీదే ప్రధాన పాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడం... లొంగకపోతే బెదిరింపులకు దిగడం... చివరికి, వాళ్లను తెలుగుదేశం పార్టీలో చేర్చడమే పనిగా ఏబీ వెంకటేశ్వర్రావు పని చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి మొదలుకొని విజయసాయిరెడ్డి, ఇతర ముఖ్యనేతలంతా ఈ ఆరోపణలు చేశారు. అయితే, ఏబీ వెంకటేశ్వర్రావుతోపాటు అప్పటి సీఎంవో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రపైనా ఇలాంటి ఆరోపణలే చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వర్రావు, సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారనేది ఆనాడు వైసీపీ ప్రధాన ఆరోపణ. చివరికి వీళ్లిద్దరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దాంతో, ఆనాటి సీఎస్ పునేఠాతోపాటు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఈసీ బదిలీ వేటేసింది. అయితే, తనపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వర్రావు పరువునష్టం దావా వేస్తానని ఆనాడు ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఏబీ వెంకటేశ్వర్రావు, సతీష్ చంద్ర కీలక పాత్ర పోషించారంటూ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు చేసిన వైసీపీ.... అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా వ్యవహరించింది. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావుకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఎనిమిది నెలలుగా వెయిటింగ్ లో పెట్టిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేసింది. అయితే, అలాంటి ఆరోపణలనే వైసీపీ నుంచి ఎదుర్కొన్న సతీష్ చంద్రకు మాత్రం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేకాదు, త్వరలో సతీష్ చంద్ర.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదంటున్నారు.  అయితే, ఉత్తరాది వాసైన సతీష్ చంద్రకు పోస్టింగ్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.... కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర్రావుపై మాత్రం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఇది మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర్రావే కాదు... కమ్మ సామాజికవర్గానికి చెందిన సీఐలు, అడిషనల్ ఎస్పీలు, ఎస్పీలకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీరు చూస్తుంటే కావాలనే కమ్మ వర్గాన్ని అణచాలని చూస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

Chandrababu Meets ANU Students in Help Hospital at Vijayawada

వైస్ ఛాన్సలర్ సమక్షంలో నే దాడులు.. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు!

విజయవాడ హెల్ప్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏఎన్‌యూ విద్యార్థులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తే దాడులకు పాల్పడుతారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీలను స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటోందని విమర్శలు గుప్పించారు. వైస్ ఛాన్సలర్ ప్రవర్తన దారుణంగా ఉందని, ఆయన సమక్షంలోనే విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ ఒక పార్టీకి ఎలా వత్తాసు పలుకుతారు అని ప్రశ్నించారు. సీఎం ఆలోచలను ప్రజలపై రుద్దే అధికారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఎవరు ఇచ్చారని నిలదీశారు. వైస్ ఛాన్సలర్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ లో జగన్ ఫొటోతో ఊరేగింపు నిర్వహించారు, యూనివర్సిటీని స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ సైకో ...ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు అని చంద్రబాబు విమర్శించారు. చంద్రబాబుతో పాటు సిపిఐ నేత రామకృష్ణ కూడా విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్ ఛాన్సలర్ సమక్షంలో నే దాడులు జరిగాయని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ అక్రమాల చిట్టా మావద్ద ఉంది, యూనివర్సిటీ లో జరిగిన ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు.  

chevireddy bhaskar reddy shocking comments ab venkateswara rao

ఏబీ వెంకటేశ్వరరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ!!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుకు బెంగళూరులో వెయ్యి కోట్ల ప్రాపర్టీ ఉందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. బెంగళూరులో వ్యవసాయం చేస్తానని చెబుతున్న వెంకటేశ్వరరావుకు, అక్కడ వంద ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ఆ భూముల మొత్తం విలువ వెయ్యికోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి ఆస్తులు సంపాదించారని, వాటిని చూసుకునే తీరిక కూడా ఆయనకు లేదని అన్నారు. ఇలాంటి వ్యక్తి తనను సస్పెండ్ చేయడాన్ని అదృష్టంగా భావిస్తారే తప్ప పనిష్ మెంట్ గా భావించరని సెటైర్లు వేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహశక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై, కేంద్రం సీరియస్ గా స్పందించి సమగ్ర విచారణ జరిపితే, ఆయనపై 124 A సెక్షన్ కింద కేసు నమోదు చేసి తీరుతుందని, దేశ ద్రోహిగా ఆయన ప్రజల ముందు నిలబడతారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. వెంకటేశ్వరరావుతో పాటు భాగస్వామి అయిన ఘట్టమనేని శ్రీనివాస్ పైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు. చిత్తూరు జిల్లాలో డీఎస్పీ స్థాయి అధికారిగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు శిష్యుడు రామ్ కుమార్ కు రెండు వందల కోట్లు ఆస్తులు ఉన్న విషయం ఈ మధ్యనే బయటపడిందని అన్నారు. వెంకటేశ్వరరావు ఈ దేశం వదిలి పారిపోయే ప్రమాదం ఉందని, ఆయనకు లుక్ ఔట్ నోటీసు జారీ చేయాలని కేంద్రానికి చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

another amaravati farmer died

రాజధాని కోసం ఆగిన మరో గుండె.. ఉద్యమించిన గొంతు మూగబోయింది!

ఏపీ రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే మనస్థాపంతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన కంచర్ల చంద్రం(43) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. రాజధాని కోసం 31 సెంట్ల భూమి ఇచ్చిన చంద్రం.. రాజధాని ఉద్యమంలో తొలి నుంచీ చురుగ్గా పాల్గొన్నారు. రాజధాని తరలిపోతోందని పదే పదే ఆలోచించి తల నరాలు చిట్లి చంద్రం చనిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని ప్రచారం మొదలైన నాటి నుండి రాజధానిలో రైతులు తీవ్ర మానసిక వేదనతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక నేడు రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న మరొక రైతు చంద్రం ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కోసం పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోవడం సామాన్యులని సైతం కలచివేస్తోంది.

First meeting of Ram temple trust likely on Feb 19

ఫిబ్రవరి 19న అయోద్య ట్రస్టు తొలి సమావేశం...

అయోధ్య రామమందిర నిర్మాణానికి తొలి అడుగు త్వరలోనే పడనుంది. కేంద్రం ఏర్పాటు చేసిన ట్రస్టు తొలి సమావేశానికి సిద్ధమవుతోంది. ఈ నెల 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రస్ట్ లో నామినేటెడ్ సభ్యుల ఎంపికతో పాటు కీలక నిర్ణయాలను ఈ మీటింగ్ లో తీసుకోబోతున్నారు.  అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు తొలి సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 న ఢిల్లీ లోని ట్రస్టు శాశ్వత కార్యాలయంలో సమావేశం జరగనుంది. ట్రస్టు శాశ్వత కార్యాలయంగా గ్రేటర్ కైలాష్ లోని, ఆర్-20 భవంతిని ఎంపిక చేశారు. ఈ కార్యాలయం ట్రస్టు చైర్మన్ పరాశరన్ కు చెందినది.  కేంద్రం ఇది వరకే జారీ చేసిన నోటిఫికేషన్ లోని అంశాల మేరకు తొలిసారి భేటీ కానున్న అయోధ్య టెంపుల్ ట్రస్టు ఆ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరుగురు నామినేటెడ్ సభ్యుల ఎంపిక కూడా అదే రోజున జరగనుంది. రామజన్మభూమి ట్రస్టులో మొత్తం పదిహేను మంది సభ్యులు ఉంటారని ప్రకటించిన కేంద్రం వారిలో తొమ్మిది మంది శాశ్వత, ఆరుగురు తాత్కాలిక సభ్యులు ఉంటారని తెలిపింది. చైర్మన్ పరాశరంతోపాటు వాసుదేవానంద్, మాధవాచార్య స్వామి, యుగపురుషు పరమానంద, స్వామి గోవిందదేవ్, విమలేంద్ మోహన ప్రతాప్ మిశ్రా, డాక్టర్ అనిల్ మిశ్రా, పాట్నాకు చెందిన కమలేశ్వర్ చోపాల్, నిర్మోహి అఖాడా చీఫ్, మహంత ధీరేంద్ర దాస్ శాశ్వత సభ్యులుగా ఉన్నారు.  రామజన్మభూమి ట్రస్టు తొలి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాత్కాలిక సభ్యులుగా ఎవరిని ఎన్నుకుంటారు, ఎలాంటి విధి విధానాలను ప్రకటిస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకొనే పూర్తి స్వేచ్ఛ శ్రీరామజన్మభూమి ట్రస్టుకు ఉంటుందని, విరాళాల సేకరణ, పెట్టుబడుల వంటి వ్యవహరాలు అదే చూసుకుంటుందని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. అయోధ్య టెంపుల్ ట్రస్టు ఎప్పటికప్పుడు లెక్కలు పక్కాగా రాయాలని నిర్ణీత కాలవ్యవధిలో ట్రస్టు ఖాతాలను ఆడిట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.  

Reuters Tweet On Shifting Kia Motors

కియా కథ మళ్ళీ మొదటికి వచ్చిందా..?

కియా కార్ల పరిశ్రమ తమిళనాడుకు తరలిపోనుందని రాయిటర్స్ వార్తా సంస్థ ఇచ్చిన కథనంపై ఏర్పడిన గందరగోళం మరింత తీవ్రమైంది. తమ కథనానికి కట్టుబడి ఉన్నామని, కథనాన్ని తొలగించటం అవాస్తవమని రాయిటర్స్ సంస్థ స్పష్టం చేసింది. కొన్ని సవరణలతో పాత కథనాన్ని తాజాగా రీట్వీట్ చేసింది. దీనిపై ప్రభుత్వ స్పందన తెలియరాలేదు.  ఈ నెల ఐదున రాయిటర్స్ తొలిసారి కియా తరలింపుపై కథనం ఇచ్చింది. 1.1 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తరలిపోనుందని చెప్పుకొచ్చింది. ఆంధ్ర ప్రభుత్వ విధానాలు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్న కియా మోటార్స్.. తరలింపుపై తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని అందులో పేర్కొనడం.. రాష్ట్రం లోనే కాక దేశమంతటా కలకలం రేగింది. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రం నుంచి ఢిల్లీలో పార్లమెంటు దాకా విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిశ్రమల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి హడావుడిగా కియా యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం కియా ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఆ సంస్థను కూడా ఆ మేరకు ప్రకటన ఇవ్వాలి అని అడిగినట్టు తెలిసింది, దాంతో ఆ సంస్థ కూడా ప్లాంట్ ను తరలించే ఆలోచనేదీ లేదని వెళ్ళడించింది. మరుసటి రోజు కూడా మేకపాటి ఢిల్లీలో ఆటో ఎక్స్ పో లో పాల్గొని కియా ప్రతినిధులతో మాట్లాడారు. అప్పుడు రాయిటర్స్ కథనాన్ని కియా ఖండించింది. ఇదే సమయంలో వైసీపీ నేతలు టిడిపి అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వెల్లడంలేదని కియా స్వయంగా చెపుతున్నా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయనను విమర్శించారు.  ఈలోపు శనివారం రాత్రి తన కథనాన్ని రాయిటర్స్ ఉపసంహరించుకుందని, ట్విట్టర్ నుంచి తొలగించిందని ప్రభుత్వం పేర్కొంది. దానిని రాయిటర్స్ తాజాగా తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మారిన విధానాలూ, అదే విధంగా తమకిచ్చిన రాయితీలపై ప్రభుత్వ పునరాలోచన, స్థానికులకే డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనడం, ఇతరత్రా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కియా యాజమాన్యం తమిళనాడుకు తరలిపోయే ఆలోచన చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయని తన కథనంలో పేర్కొంది. ఆ సంస్థకు భూమి ఇచ్చినప్పుడు వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించే అవకాశమిచ్చారని, అదే విధంగా విద్యుత్ విషయం లోనూ రాయితీలు ఇచ్చారని ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని పునస్సమీక్ష చేస్తుండటం కియాకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని పేర్కొంది.  మరోవైపు నైపుణ్య ఉద్యోగాలు కాకుండా ఇతర వాటిల్లో స్థానికులకే ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడు నైపుణ్య ఉద్యోగాలలోను డెబ్బై ఐదు శాతం కోటా ఇవ్వాలంటే అవసరమైన నైపుణ్య మానవ వనరుల లభ్యత ఇక్కడ లేదని కియా అంటున్నట్లు తెలిసింది అని వెల్లడించింది. కాగా 1.1 డాలర్ ల వ్యయంతో నెలకొల్పిన ఇంత భారీ ప్లాంట్ ను తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్నదే. నష్టం కూడా భారీగానే ఉంటుంది, అందుకే తరలింపు ఖర్చు కూడా తమిళనాడు ప్రభుత్వం ఇస్తామంటోందని ఒక రహస్య వ్యక్తి తమకు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ పోలో కియా ప్రతినిధులు వారితో కలిసి ఉండేవారితో మాట్లాడాకే ఆ వార్తా సంస్థ తాజా ట్వీట్ చేసిందని సమాచారం. దీంతో కియా మన రాష్ట్రంలో ఖాయంగానే ఉంటుందా, ఈ ప్రచారానికి ముగింపు ఎప్పుడు అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.  

ycp flexes at srisailam temple

పవిత్ర క్షేత్రంలో రాజకీయాలు.. వివాదాస్పదంగా మారిన వైసీపీ ఫ్లెక్సీలు!

శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు వివాదాస్పదమయ్యాయి. అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి దంపతులు ఆదివారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనానికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ కర్నూలు కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం పేరుతో నాలుగు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ లో శ్రీశైల దేవస్థానం లోగో, సీఎం జగన్, వైసిపి ఎమ్మెల్యేలు సాయి ప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వై వెంకట్రామిరెడ్డి, వైసీపీ నాయకులు శివరామిరెడ్డి, సీతారామిరెడ్డి, ఫోటోలు ఉన్నాయి. సాక్షి గణపతి ఆలయం వద్ద రెండు, మల్లికార్జున సదన్ ఎదురుగా రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సిబ్బంది వీటి గురించి పట్టించుకోక పోగా సమాచారం అందుకున్న ఈవో అధికారుల దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఫ్లెక్సీలను తొలగించారు, అయితే శ్రీశైలం లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర క్షేత్రంలో రాజకీయాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Rs 2000 notes to be banned

త్వరలో 2,000 నోట్ల రద్దు...బ్యాంకులకు వర్తమానం...అలెర్ట్ అయిన రాష్ట్రాలు!!

త్వరలో రెండువేల రూపాయల నోట్ల రద్దు...ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జాతీయ బ్యాంకులు తమ శాఖలకు ఈ మేరకు వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లను స్వీకరించటం వరకూ మాత్రమే చేయాలనీ, వాటిని తిరిగి సర్క్యులేట్ చేయవద్దని జాతీయ బ్యాంకుల హెడ్ క్వార్ట్రర్స్ సందేశం అందినట్టు కొందరు బ్యాంకుల అధికారులు అంగీకరిస్తున్నారు. డీ మోనిటైజేషన్ తర్వాత కేంద్రం తీసుకోబోతున్న ఈ సంచలన నిర్ణయం వెనుక , బిజెపి  విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది.  వాస్తవానికి అప్పటికే  చలామణీలో ఉన్న 500, 1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు 2016 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్రకటిత ఆస్తులు, నల్లధనాన్ని అరికట్టడానికి అదే సరైన పద్ధతని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేయడానికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పింది. అయితే ఈ చర్యతో మిశ్రమ ఫలితాలు లభించాయి. దీనివల్ల పన్నుల వసూళ్లలో గణనీయమైన వృద్ధి సాధించినప్పటికీ, అక్రమాస్తులను బయటకు తీయడానికి ఈ నోట్ల రద్దు ఎంతవరకూ ఉపయోగపడిందనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం లేదు. అలాగే, డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నా నగదు వాడకం కూడా ఏమీ తగ్గలేదు. ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికే ఈ కొత్త ఎత్తుగడకు కేంద్రం వ్యూహం పన్నినట్టు విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

పాలమూరు డిసిసిబి ఛైర్మన్ పదవి రేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే!!

పాలమూరు జిల్లాలో సహకార రాజకీయం రసవత్తరంగా మారింది. డీసీసీబి చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ లో రేస్ మొదలైంది. కుర్చీ దక్కించుకోవడానికి అన్ని స్థాయిల్లోని నేతలు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు. హైకమాండ్ ప్రసన్నం చేసుకోడానికి ఆశావహులంతా తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు నేతలు.  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహకార ఎన్నికల సమరం మొదలైంది. జిల్లాలో పీఏసీఎస్ లను దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. డిసిసిబి పై జెండా ఎగరేసేందుకు గులాబీ పార్టీ తహతహలాడుతోంది. చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ లు లాబీయింగ్ మొదలుపెట్టారు. చోటా మోటా లీడర్ లు సైతం తమదైన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ లు, మునిసిపల్ చైర్మన్ లుగా అవకాశాలు రాని నాయకులు డిసిసిబి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సహకార ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది.  నిజానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి సహకార శాఖలో చాలా కీలకమైంది. ఈ పదవి పాలమూరులో ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల విభజన జరిగినా డిసిసిబి మాత్రం పాత జిల్లాల పరిధిలోనే కొనసాగుతోంది. ఫలితంగా ఈ పదవికి ప్రాధాన్యం గతంలో కంటే కూడా పెరిగింది, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పద్నాలుగు నియోజక వర్గాల్లో ఎనభై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇక్కడ డిసిసిబి పదవికి తీవ్ర పోటీ నెలకొంది, పదవి ప్రాధాన్యత దృష్ట్యా అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉన్న వ్యక్తినే ఈ చైర్మన్ పదవికి ఎంపిక చెయ్యాలని అధిష్టానం భావిస్తోంది. ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు జిల్లాకు చెందిన మంత్రులతో పాటు కేటీఆర్ ఆశీస్సుల కోసం హైదరాబాద్ కు క్యూ కడుతున్నారు.  ఇక పాలమూరు డీసీసీబీ అధ్యక్ష పదవికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన హుస్నాబాద్ పీఏసీఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ సమయంలోనే గుర్నాథరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన కూడా డీసీసీబీ చైర్మన్ పదవిపైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలుకు చెందిన టీ ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్క రఘునందన్ రెడ్డి కూడా డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి కేటీఆర్ వద్ద ఈయన లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు జూపల్లి భాస్కరరావు, కొల్లాపురి నియోజకవర్గానికి చెందిన మామిళ్ళపల్లి విష్ణువర్దన్ రెడ్డి, మహబూబునగర్ నియోజవర్గం నుంచి కొరమాని వెంకటయ్య, బాలనగర్ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డిలు డిసిసిబి చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పాలమూరు డిసిసిబి ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోనని ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొంది. అయితే అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది మాత్రం ఇప్పటికైతే అంతుబట్టడం లేదు.

ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య వార్...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ చర్యను ఎదుర్కోవడానికి చట్ట పరంగా ముందుకు వెళతానని వెంకటేశ్వర రావు చెబుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాక రేపుతోంది. ప్రభుత్వం తప్పుచేసి ఆ తప్పుకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా అని చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు ధోరణి రానురాను పరాకాష్టకు చేరుతుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదన్నారు. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించబోమనటం వైసీపీ ఉన్మాదానికి నిదర్శనం అని, అధికారులను భయబ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని చంద్రబాబు ట్వీట్ చేశారు.  అటు టిడిపి సీనియర్ నేతలు యనమల, వర్ల రామయ్యలు కూడా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులకు రాజకీయాలు ఆపాదించవద్దని హితవు పలికారు. వైసీపీ దుర్మార్గాలను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏ తప్పూ చేయకున్నా ఏడు నెలలుగా పోలీసులను వీఆర్ లో ఉంచారని మూడు నెలలు విఆర్ లో ఉంటే జీతాలు ఇవ్వబోమని వేధిస్తున్నారని మండిపడ్డారు.  ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఓడిపోవడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని సన్మానిస్తారు అనుకుంటే సస్పెండ్ చేశారు ఏమిటి అంటూ ట్వీట్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి వైసిపి గెలవటానికి టిడిపి ఓడిపోవడానికి ఏబీ వెంకటేశ్వరరావే కారణం అని అర్థం వచ్చేలా కేశినేని నాని ట్వీట్ చేశారు. కేశినేని నాని ట్వీట్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏబివి అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారు అని సజ్జల ట్వీట్ చేశారు. ఏబివి ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని వైసీపీని దెబ్బ తీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని ఆరోపించారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పని చేశారని తనతో సహా వైసీపీ నేతల ఫోన్లన్నింటిని అక్రమంగా ట్యాప్ చేసి ఓ మాఫియా నడిపారని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు.  సస్పెన్షన్ పై ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. బంధుమిత్రులను హితులను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. ఆరోపణలు అవాస్తవమని సస్పెన్షన్ వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్ట పరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని ఏబీ వెంకటేశ్వర రావు ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. ప్రాథమిక విచారణలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించినట్టుగా గుర్తించిన ప్రభుత్వం దీనిపై సీఐడీ చేత విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. అంతర్గత పరికరాలతో పాటు కొనుగోళ్ళ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తుకు సన్నాహాలు చేస్తోంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలనే ప్లాన్ లో ఉంది, ఇప్పటికే ఏడు అభియోగాలపై ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది ఏపీ సర్కార్.

కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇకపై తెలంగాణలో జాయింట్ కలెక్టర్లు ఉండరు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ పోస్టులను రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తగా అదనపు కలెక్టర్ పోస్టును క్రియేట్ చేశారు. అంతేకాదు కలెక్టర్ల సదస్సుకు రెండు రోజుల ముందు భారీగా ఐఏఎస్ లను బదిలీ చేశారు.  తెలంగాణ లో ఇక జాయింట్ కలెక్టర్ పోస్టు ఉండదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోస్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల సదస్సుకు రెండు రోజుల ముందు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసి ఆ స్థానంలో అదనపు కలెక్టర్ పోస్టును సృష్టించింది. ఐఏఎస్ లతో పాటు నాన్ కేడర్ అధికారులను అదనపు కలెక్టర్ పోస్టుల్లో నియమిస్తూ ఆదివారం రాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక నుంచి జిల్లాల్లో జేసీలు ఉండరు, ఆ స్థానంలో అదనపు కలెక్టర్ లు పనిచేయబోతున్నారు. స్థానిక సంస్థలకు ఒకరు, రెవిన్యూ పాలనకు మరొకరు పని చేయనున్నారు. ఆదివారం రాత్రి భారీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లను బదిలీ చేసి, వారికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. నాన్ కేడర్ అధికారులైనా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లను అదనపు కలెక్టర్ లుగా నియమించగా ఐ ఏ ఎస్ అధికారులకు అదనపు కలెక్టర్ లుగా పోస్టింగ్ లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.  కలెక్టర్ల సదస్సు జరగడానికి రెండు రోజుల ముందు హఠాత్తుగా నలభై తొమ్మిది మంది అధికారులను బదిలీ చేయడంతో పాటు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇటీవలె ఇరవై ఒక్క జిల్లాలకు కొత్త కలెక్టర్ లను నియమించిన ప్రభుత్వం తాజాగా అదనపు కలెక్టర్లనూ నియమించింది.

పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు... జగన్ తీరుపై మరో పత్రిక సంచలన కథనం...

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపైనా, ప్రభుత్వ విధానాలపైనా విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కియా తరలిపోతోందంటూ కియాపై రాయిటర్స్ రాసిన కథనంతో రాష్ట్రంలో కల్లోలం చెలరేగగా, ఇఫ్పుడు మరో ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించిన ఆర్టికల్ మరింత కలవరం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ది ఎకనమిక్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. జగన్ విధానాలను ఒక రేంజులో ఏకిపారేసింది. జగన్ తీరుతో కొత్తగా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ మెంట్స్ పెట్టేందుకు జంకుతుండగా... ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోతున్నారంటూ డేరింగ్ కథనం ప్రచురించింది. రివర్స్ స్వింగ్ పేరుతో రాసిన ఆర్టికల్లో జగన్ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది. కేంద్ర వాణిజ్యశాఖ, ప్రపంచబ్యాంక్, సింగపూర్ నేషనల్ యూనివర్శిటీ సర్వేల ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు వాణిజ్యానికి అనుకూలందని, అయితే... జగన్మోహన్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టాక... వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న రివర్స్ నిర్ణయాలతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని కథనంలో తెలిపింది. జగన్ నిర్ణయాలతో ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడుదారులకు ముప్పు ఏర్పడిందంటూ విశ్లేషించింది. విండ్ అండ్ సోలార్ పవర్ టారిఫ్ ల పునసమీక్ష... పలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల రద్దు... ఆయా కంపెనీలకు కేటాయించిన భూములను వాపస్ తీసుకోవడంలాంటి నిర్ణయాలతో ప్రమాదకర సంప్రదాయానికి జగన్ శ్రీకారం చుట్టారని కథనంలో రాసుకొచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నందుకు చాలా పశ్చాత్తాపడుతున్నామని అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తి సంస్థ అక్మె సోలార్ హోల్డింగ్స్ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించింది.  ఇక, కియా తరలిపోతోందంటూ రాయిటర్స్ రాసిన కథనం తర్వాత అలాంటిదేమీ లేదంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం.... అటు కియా యాజమాన్యం ఖండించినా... జగన్ ప్రభుత్వానికి-కియా కంపెనీకి మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నమాట మాత్రం వాస్తవమని... అయినా నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటూ అభిప్రాయపడింది. మరోవైపు, పీపీఏల రద్దు దిశగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర డిస్కములపై పెద్దఎత్తున రుణభారం పడుతుందని విశ్లేషించింది. ఆయా విద్యుదుత్పత్తి సంస్థలకున్న బకాయిలతో కలిపి 21వేల కోట్ల రూపాయల రుణభారం డిస్కములపై పడుతుందని తెలిపింది. అయితే, ఇలా ఒప్పందాలను రద్దు చేసుకుంటూపోతే పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని... ఇప్పుడు పీపీఏలపై పునసమీక్షించిన ప్రభుత్వం... ముందుముందు మిగతా రంగాల్లో జరగొచ్చని, ఇది ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదంటూ అభిప్రాయపడింది. మొత్తానికి జగన్ ప్రభుత్వంపై జాతీయ అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రచురిస్తోన్న కథనాలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును... అలాగే, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కథనాలు ప్రచురించడం కలకలం రేపుతున్నాయి.