హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం అసాధ్యం!!
కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.
కరోనా విషయంలో వాస్తవ పరిస్థితికి, మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఏమాత్రం పొంతన లేదని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి కరోనా పేషంట్లతో కిక్కిరిసిపోతున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. గాంధీ ఆసుపత్రిలో 2150 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో కేవలం 247 మంది కరోనా పేషంట్లు మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు.
కరోనా సోకిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. పేషంట్లు ఎక్కువైతే చికిత్స అందించే ఏర్పాట్లు లేవని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి సంసిద్ధంగా ఉంది. 9.61 లక్షల పీపీఈ కిట్లు, 14 లక్షల ఎన్-95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన బెడ్స్ 3600 సిద్ధంగా ఉన్నాయి. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతరత్రా పరికారలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎంతమందికైనా చికిత్స అందించడానికి వైద్యశాఖ పూర్తి సంసిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.
వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నదనే ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సోకివారికి వైద్య సేవలు అందించేవారికి కూడా వైరస్ సోకుతున్నది. ఇది కేవలం తెలంగాణలోనే జరగడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ లో కూడా 480 మందికి కరోనా వైరస్ సోకింది. ఐసిఎంఆర్ అంచనా ప్రకారమే భారత్ లో 10వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది. కేవలం తెలంగాణలో మాత్రమే వైద్య సిబ్బందికి కరోనా సోకుతున్నట్లు దుష్ప్రచారం చేయడం బాధాకరమని అధికారులు చెప్పారు.
ఏ కారణంతో చనిపోయినా సరే, మరణించిన ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం అసాధ్యమని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతీ రోజు సగటున 1000 మంది వరకు మరణిస్తుంటారు. వారందరికీ పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆసుపత్రుల్లో ఇతర వైద్య సేవలు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌లు మృతదేహలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదని అధికారులు గుర్తు చేశారు. కోర్టులో కొందరు కావాలనే పిల్స్ వేయడంవల్ల వైద్యాధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోందన్నారు. పిల్స్ వేసి వైద్యాధికారుల సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కాగా, కరోనావిషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.