తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. అసలీ 'జీవో 111' అంటే ఏంటి?
ప్రస్తుతం తెలంగాణలో 'జీవో 111' చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ 'జీవో 111' కు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించడంతో ఈ మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద అనుమతి లేకుండా డ్రోన్లు తిప్పడంతో రేవంత్ అరెస్ట్ కూడా అయ్యారు. తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే, తాజాగా ఫామ్ హౌస్ వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో.. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ నేతలకే చాలామందికి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, సామాన్యులు మాత్రం అసలు ఈ 'జీవో 111' అంటే ఏంటి?.. 'జీవో 111' కి విరుద్ధంగా నిర్మాణాలు ఏంటి? అంటూ చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్ కు వరదలు రాకుండా దాదాపు వందేళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ అని రెండు రిజర్వాయర్లు కట్టారు. ఈ రిజర్వాయర్లు అప్పట్లో సుమారు పది లక్షల మంది దాహాన్ని తీర్చేవి. అయితే, నగరం నానాటికీ విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. వీటి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించి.. ఎన్నో నిర్మాణాలు వెలిశాయి. దీంతో, సహజ సిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రెండు రిజర్వాయర్లు కనుమరుగైపోతాయనే ఆందోళన నుంచే 'జీవో 111' పుట్టింది.
ఆ రెండు రిజర్వాయర్లను కాపాడే చర్యలు చేపట్టమని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. 1996లో నాటి ప్రభుత్వం జీవో 111ని జారీ చేసింది. దీని ప్రకారం ఆ రెండు రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ లెవల్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదు. ఒక స్థలంలో పది శాతం మేరకు, కేవలం నివాసం కోసం మాత్రమే.. అది కూడా జీ ప్లస్ 2(మొత్తంగా మూడంతస్తులు)కి మించకుండా నిర్మాణం చేపట్టాలి.
ఆ రెండు రిజర్వాయర్ల పరిధిలోని ఆరు మండలాలు శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకరపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్ల కు 'జీవో 111' వర్తిస్తుంది. ఈ మండలాల పరిధిలో మొత్తం 84 గ్రామాలు ఉన్నాయి. ఈ 84 గ్రామాలలో జీవో 111 కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ, బడా బాబులు మాత్రం జీవో 111 నిబంధనలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం జీవో 111 పరిధిలో 13 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని అంచనా. 4,000 వరకు ఫామ్‌హౌస్‌లు, 50 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండొచ్చని తెలుస్తోంది. జీ ప్లస్ టూ నిబంధనకు తూట్లు పొడుస్తూ ఐదు, ఆపై అంతస్తులతో కట్టిన అక్రమ నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తాయి. మరి ఇప్పుడు అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల పని పడతారేమో చూడాలి.