కృష్ణా జిల్లాలో దారుణం.. దళిత యువతి ఇంటిని తగులబెట్టిన వైసీపీ వర్గీయులు!!
posted on Sep 4, 2020 @ 3:40PM
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఆగ్రకులానికి చెందిన యువకుడిపై ఓ దళిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ యువకుడికి సంబంధించిన వ్యక్తులు.. ఆ యువతి ఇంటిపై దాడి చేసి ఇంటిని తగులబెట్టారు.
వడాలికి చెందిన సాయిరెడ్డి అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అయినంపూడికి చెందిన దళిత యువతి మచ్చా ధనలక్ష్మి ఇటీవల ముదినేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ప్రస్తుతం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
ఈ క్రమంలో అధికార పార్టీకి చెందినవారమంటూ కొందరు బాధితురాలి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగారు. కేసును విరమించుకుని రాజీకి రాకపోతే ప్రాణాలకు సైతం ముప్పు ఉంటుందని హెచ్చరించడమే కాకుండా.. కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో.. తమ ఇంటిపై దాడి చేసి, తమపై దౌర్జన్యం చేశారని వారం క్రితం బాధితురాలి సోదరుడు మచ్చ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయినా అధికార పార్టీకి చెందిన వారు ఆ కుటుంబంపై ఒత్తిళ్లు కొనసాగించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాధితురాలి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా, ఆ కుటుంబం మాత్రం ప్రాణాలతో బయటపడింది. తాము రాజీకి రాలేదన్న కక్షతోనే సాయిరెడ్డి తన వర్గంతో కలిసి తమ కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ.. దీనిపై సుబ్రహ్మణ్యం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన పాపానికి ఆ కుటుంబానికి నిలువనీడ లేకుండా చేశారంటూ అధికార పార్టీకి చెందిన వారిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది భయానకమైన ఘటన అని అన్నారు. మచ్చా ధనలక్ష్మి అనే దళిత మహిళకు చెందిన ఇంటిని వైసీపీ వర్గీయులు తగలబెట్టారని, వైసీపీ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. గత 15 నెలలుగా ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.