మన ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..
posted on Sep 3, 2020 @ 7:13PM
కరోనా లాక్ డౌన్ ప్రారంభం కాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం తగ్గిపోయింది అంటూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించారు. అన్నిశాఖల్లో పనిచేసేవారి వేతనాల్లో కట్టింగ్స్ ఉంటాయన్నారు. కరోనా ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల్లో మాత్రం కోతలు లేవంటూ ఆ తర్వాత ప్రకటించారు. గత రెండు నెలల నుంచి కొన్ని శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇస్తున్నా చాలా వరకు కోతలే. మరి దేశానికి, రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా పడిపోయిన ఈ కరోన కష్టకాలంలో అధికారంలో ఉన్నవారి జీతాల్లో కోతలు విధించారా లేదా అన్న విషయం పక్కన పెడదాం. ముందు మన ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసుకుందాం.
ఒక వ్యక్తి వేతనాన్ని ఆ వ్యక్తి పనిచేసే సంస్థ నిర్ణయిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం పాలకులు తమ జీతభత్యాలను తామే నిర్ణయించుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రుల జీతాభత్యాలను క్యాబినేట్ లో నిర్ణయిస్తారు. ఇక క్యాబినేట్ లో ఉండేది వారే కాబట్టి వారికి నచ్చిన అంకె ప్రకారమే శాలరీలు ఉంటాయి అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు ముఖ్యమంత్రుల, మంత్రుల జీతాలపై ఎవరి నియంత్రణ కూడా ఉండదు. వారు చెప్పిందే ఫైనల్. మరి ఇంతకు రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రుల జీతాల అంకెలను చూసి ఇయర్లీ ప్యాకెజ్ అనుకునేరు. నెలకు మాత్రమే. అలవెన్సులు అదనం..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న వేతనం నెలకు అక్షరాల నాలుగు లక్షల పదివేల రూపాయలు. ఇక దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జీతం రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఓ పదివేలు పెంచి నాలుగు లక్షల రౌండ్ ఫిగర్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగి జీతం 365,000 రూపాయలు మాత్రమే. ఆయన యోగి కదా మరి జీతం ఎందుకు అని మాత్రం అనకండి. ప్రజా సేవకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నెల జీతం మూడు లక్షల నలభైవేలు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన జీతం 335,000 రూపాయలు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నెలకు ఒక రూపాయే వేతనంగా తీసుకుంటాను అని ప్రకటించారు. మరి మిగతా డబ్బులు ఏం ఫండ్ కు కేటాయిస్తున్నాయో ఆయనే చెప్పాలి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని జీతం 321,000రూపాయలు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయ్ రామ్ థాకర్ నెల జీతం 310,000 రూపాయలు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జీతం రెండు లక్షల 88వేల రూపాయలు మాత్రమే. ఆయన ఇటీవల కరోనావైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందన్న విషయాన్ని సీఎం స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరేన్ కుమారుడు హేమంత్ సోరెన్ జీతం 272,000 రూపాయలు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ - 255,000, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జీతం 230,000 రూపాయలు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీతం 220,000, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెల జీతం 215,000, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ రెండు లక్షల పదివేల రూపాయలు. అయితే ఆమె ఒక రూపాయి మాత్రమే నెల జీతంగా తీసుకుంటూ మిగతా మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి జీతం 205,000, కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప జీతం నెలకు రెండు లక్షల రూపాయలు. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేం సింగ్ తామంగ్ నెలకు తీసుకుంటున్న మొత్తం 190,000 రూపాయలు. ఇక త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ జీతం 185,500,
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్ నెలకు 175,000, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 165,000, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా 150,000, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హేమా ఖాండు , అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ 1,33,000 రూపాయలు తీసుకుంటున్నారు.
మణిపూర్ , పుదుచ్చేరి ముఖ్యమంత్రులు 120,000 తీసుకుంటున్నారు. అయితే అతి తక్కువ నెల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి నాగాలాండ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నైపిహు రియో. ఆయన నెల జీతం 110,000 రూపాయలు మాత్రమే.
ఇవి కేవలం నెలకు వారు తీసుకునే జీతాలు మాత్రమే . అధికారంలో ఉన్నన్ని రోజులు వసతి, ప్రయాణ ఖర్చులు అన్ని ఉచితమే. అలవెన్సులు కూడా ఇస్తారు. ప్రజా సేవ చేస్తున్నందుకు ఈ మాత్రం వేతనాలు ఇవ్వాల్సిందే మరి..