చంద్రబాబు పెద్ద భిక్షగాడు.. అచ్చెన్నాయుడు అడ్డగాడిద.. మంత్రి భాష!!
posted on Sep 4, 2020 @ 1:54PM
ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎవరేమనుకున్నా.. తన మాట తీరు ఇంతేనని ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి రుజువు చేశారు. తాజాగా ఆయన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను బూతుల మంత్రి అని అంటున్నారని, తాను బూతులు తిడితే అసలు దేవినేని ఉమా, చంద్రబాబు బతికి ఉంటారా? అని వ్యాఖ్యానించారు.
నేను లారీ డ్రైవర్ అయితే.. నువ్వేమైనా మైసూర్ మహారాజువా?. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు.. వాటిని ఈయన కడిగేవాడు అంటూ దేవినేని ఉమాపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడని.. తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ కుటుంబం అని నాని చెప్పుకొచ్చారు.
అంతేకాదు, ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టై.. చాలారోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై కూడా నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిలా 70 రోజుల పాటు..ఆస్పత్రిలో పడుకున్న అడ్డగాడిద ఎవరూ లేరని విమర్శించారు.
రైతులకు 'ఉచిత విద్యుత్- నగదు బదిలీ' పథకంపై మీడియాలో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సన్న బియ్యం విషయంలో 'నీ అమ్మ మొగుడు చెప్పాడా' అంటూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో ఆయన భాష తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయినా ఆయన తీరు మారలేదు. తాజాగా భిక్షగాడు, అడ్డగాడిద అంటూ మరోసారి విపక్ష నేతలపై వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీస్తోంది.