విశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మాఫియా.. స్టీల్ ప్లాంట్ లో కొలువుల పేరుతో ఘరానా మోసాలు...
posted on Feb 17, 2020 @ 11:12AM
విశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల మాఫియా చెలరేగిపోతుంది. స్టీల్ ప్లాంట్ లో కొలువులు ఎరవేసి లక్షలకు లక్షలు నొక్కేస్తోంది. నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుతున్న ఈ దందాలపై సీబీఐ కన్నేసింది. మరోవైపు ఉద్యోగం కోసం ఆస్తులమ్మి బ్రోకర్ల చేతుల్లో డబ్బులు పోసిన బాధితులు కక్కలేక మింగలేక విలవిల్లాడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దళారుల రాజ్యం నడుస్తోంది. తాత్కాలిక ఉద్యోగాల పేరుతో యువకుల నుంచి ఈ ముఠాలు లక్షలు గుంజేస్తున్నాయి. ఇటీవల ఓ నిరుద్యోగి దగ్గర నుంచి పది వేలు అడ్వాన్స్ రూపంలో తీసుకుంటూ కార్మిక సంఘం నాయకుడు మంత్రి సత్యనారాయణమూర్తి సీబీఐకి చిక్కాడు. పక్కా ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా మూర్తిని పట్టుకున్న సిబిఐ కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. మూర్తిని సస్పెండ్ చేసిన ఉక్కు యాజమాన్యం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కార్మిక నాయకుడు మూర్తి వ్యవహారం స్టీల్ ప్లాంట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది, తీగ లాగితే ఏకంగా డొంకలు కదులుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా ఓపెన్ నోటిఫికేషన్ లేకుండా అడ్డగోలు నియామకాలు జరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలన్నీ కాంట్రాక్టర్ లు కొంతమంది కార్మిక సంఘాల నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, దళారుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది చిన్న చిన్న కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ను రాజస్థాన్ కు చెందిన కంపెనీకి అప్పగించారు. సంస్కరణలలో భాగంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో కొన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. పరిశ్రమను దశల వారీగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు బయటపడిన కాంట్రాక్టు ఉద్యోగాల అమ్మకాల వ్యవహారం చూస్తే ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగాల దందాను గమనించి చర్యలు ప్రారంభించిందని అర్థమవుతోంది. మరోవైపు ఆస్తులు అమ్ముకొని లక్షలాది రుపాయలు దళారుల చేతుల్లో పోసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు. బ్యాక్ డోర్ వ్యవహారం బయటకు వస్తే కట్టిన డబ్బులతో పాటు పరువు పోతుందన్న భయంతో ముందుకు రావడం లేదు. బ్యాక్ డోర్ వ్యవహారాలకు చెక్ పడాలంటే ఉక్కు యాజమాన్యం, నిఘా విభాగం, కేంద్ర కార్మిక విభాగం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. సీబీఐ కూడా రంగంలోకి దిగినందున స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసుకునేలా వెసులుబాటు కల్పించాలి, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్న భరోసా ఇస్తే మోసపోయిన వందలాది మంది బయటకు వచ్చే అవకాశముంది.