చంద్రబాబు గుట్టంతా రట్టైంది.. పీఎస్ పాస్ వర్డ్ లీక్!!
posted on Feb 17, 2020 @ 2:22PM
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వద్ద పీఎస్ గా చేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ రైడ్స్ తాలూకూ ప్రకంపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుంటే.. లేదు, లేదు రూ.2లక్షల 63 వేలే దొరికాయని టీడీపీ వెల్లడిస్తుంది. ఇదే అసలు నిజం అంటూ.. ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్ట్ ను కూడా బయటపెట్టారు తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్‌సీపీ తమ అధినేతపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు పీఎస్.. శ్రీనివాస్ ఎపిసోడ్‌పై ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంత బతుకు బతికి ఇంటెనక.. అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్లు.. ఐటీ దాడుల తర్వాత క్లియర్‌గా అర్థమైందని.. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశారు అని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా విజయసాయిరెడ్డి చేసిన మరో ట్వీట్ లో... 'చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ కమిట్మెంట్‌ని మెచ్చుకోవాలి.. యజమాని ప్రతిలావాదేవీనీ డైరీలో రాసుకున్నాను అని చెప్పాడు. కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసాడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసాడు. మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విజయసాయిరెడ్డి ట్వీట్స్ పై టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. సెర్బియాలో ఉన్న నిమ్మగడ్డ కేసుని కప్పిపుచ్చడం కోసమే ఇలా ఐటీ రైడ్స్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు.