సెర్బియా లో 'నిమ్మ' కాయని నొక్కితే ఏపీలో 'జాం' కాయ అదిరింది!!
posted on Feb 17, 2020 @ 2:04PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మరియు కొందరు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఢిల్లీ టూర్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దల్ని కలిశారని వైసీపీ చెప్తుంటే.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం తనపై ఉన్న కేసులకు భయపడి ఎన్డీయేలో చేరటానికి జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించింది. ఇలా జగన్ ఢిల్లీ టూర్ గురించి రకరకాల చర్చలు జరుగుతున్న వేళ.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ తెరమీదకు వచ్చింది. జగన్ ఢిల్లీ టూర్ వెనుక నిమ్మగడ్డ ప్రసాద్ కేసు ఉందని ప్రచారం జరుగుతోంది.
ఎనిమిది నెలల క్రితం రస్ అల్ ఖైమా అనే దేశం జారీ చేసిన ఇంటర్‌పోల్ నోటీసుతో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల్లో పెట్టుబడులంటూ.. దాదాపుగా ఎడెనిమిది వందల కోట్ల రూపాయలను రస్ అల్ ఖైమా నుంచి నిమ్మగడ్డ సేకరించారు. అయితే తరువాత ఆ ఒప్పందాలు రద్దు అయ్యాయి. అయినా, రస్ అల్ ఖైమా పెట్టిన వందల కోట్లు పెట్టుబడిని మాత్రం నిమ్మగడ్డ తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆయన మీద కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు రస్ అల్ ఖైమా కీలకమైన చర్యలు దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయమై రస్ అల్ ఖైమా దేశం కేంద్రాన్ని సంప్రదించిందని కూడా సమాచారం.
రస్ అల్ ఖైమా చెరసాలలో ఉన్న నిమ్మగడ్డ.. అప్రూవర్ గా మారిపోయారని అంటున్నారు. తాను పాల్పడిన కుంభకోణంలో అంతిమ లబ్దిదారుడు పేరు విడమరిచి చెప్పేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో రస్ అల్ ఖైమా దేశం ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని భారత్ ప్రభుత్వాన్ని కోరిందని సమాచారం. నిమ్మగడ్డ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో అందరికి తెలుసునని, ఇప్పుడు ఆ వ్యక్తే కేంద్రం దగ్గరకు వెళ్లి తనని కాపాడాలని బ్రతిమాలుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మీడియాకు, ఏపీ ప్రజలకు ఈ సెర్బియా కేసు తెలియకుండా చేయాలనే ఉద్దేశంతోనే.. ఐటీ రైడ్స్, 2000 కోట్లు అంటూ ప్రచారం మొదలుపెట్టారని అంటున్నారు. అక్కడ సెర్బియాలో నిమ్మగడ్డ తీగని పట్టుకుంటే, ఇక్కడ ఏపీలో పెద్ద తలకాయ డొంక కదులుతుందని.. ఆ భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఈ విషయంపై టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. "నీరసం గా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే అదో ఆనందం.. కానీ ఏపీ లో ఇప్పుడు బలం గా ఉన్నవాళ్ళు.. నిమ్మ దెబ్బకి రసం కార్చుకుంటున్నారు. రస్ అల్ ఖైమా లో ఉన్న 'నిమ్మ' కాయని నొక్కితే ఆంధ్ర లో ఉన్న 'జాం'కాయ ఖైమా అయిపోతుంది. అక్కడ ప్రతీ శుక్రవారం మనకి లాగా తప్పించు కోవడం కుదరదు. ఖైమా చేసేస్తారు. అబబ్బా దీన్ని కప్పిపుచ్చడం కోసం ఢిల్లీ టూర్ లో ఆంధ్ర అభివృద్ధి, నిధులు కోసం అంటూ ఏం చెప్తిరీ. మళ్ళా దీన్ని కప్పిపుచ్చడం కోసం IT రైడ్స్ తెర పైకి తీసుకొచ్చారు. అన్నట్టు.. 'నిమ్మ' కాయ నిజమైన రసాన్ని అధికారుల ముందు కక్కేసాడు అంట కదా!.. అంతా మీరే చేశారు అనే డైలాగ్ లాగా అంతా A1 చేసాడు అన్నాడు అంట. అది తెలిసే చలి కోటు కప్పుకుని ఢిల్లీ బాట పట్టారు అంట. వామ్మో ఎన్ని చావు తెలివితేటలు రా నాయనా..! సర్లే మొత్తానికి దొరికేశారు." అంటూ బుచ్చయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.