దువ్వాడ దూకుడుకు సీనియర్ల బెంబేలు..! జగన్ కు మొరపెట్టుకున్న నేతలు..!
posted on Feb 17, 2020 @ 12:55PM
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రమవుతోందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ తీరు మిగతా నేతలకు తీవ్ర తలనొప్పిగా మారిందని అంటున్నారు. జిల్లాలో సీనియర్లను కూడా దువ్వాడ లెక్కచేయడం లేదని చెబుతున్నారు. తనను తాను సీఎం జగన్ ప్రతినిధిగా చెప్పుకునే దువ్వాడ... శ్రీకాకుళం జిల్లా వైసీపీలో తాను చెప్పిందే జరగాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. తాను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడునని, అపాయింట్ మెంట్ లేకపోయినా నేరుగా జగన్‌ను కలిసే చనువు, తనకు ఉందని చెప్పుకునే దువ్వాడ... జిల్లాలో తాను ఎవరి మాట విననని, తనకు నచ్చిందే చేస్తానని మొండిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దువ్వాడ అనుచరుల తీరు కూడా ఇలాగే ఉందని అంటున్నారు. జిల్లాలో ఎవరికీ ఇవ్వనంత ప్రాధాన్యత దువ్వాడకు జగన్ ఇస్తున్నారని, అదీ తమ లీడర్ సత్తా అంటూ ఫాలోవర్స్ గొప్పగా చెబుతున్నారు. అయితే, జిల్లాలో సీనియర్ నాయకులను సైతం పట్టించుకోకుండా దువ్వాడ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోందని అంటున్నారు.
ముఖ్యంగా టెక్కలిలో ఎవరు కొలువు చేయాలన్నా దువ్వాడ శ్రీనివాస్ అనుగ్రహం కావాల్సిందేనన్న హుకుం జారీ చేస్తున్నారట. అందుకు, టెక్కలి పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి విషయంలో దువ్వాడ చేసిన హంగామాయే రుజువు అంటున్నారు. వైసీపీ నేతలందరికీ నచ్చినా, కేవలం తనకు నచ్చలేదన్న కారణంతోనే టెక్కలి పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఉద్వాసన పలకాల్సిందేనని దువ్వాడ రచ్చ చేశారట. ఇదిలాగుంటే, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో సైతం దువ్వాడ జోక్యం శ్రుతి మించిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్ పలాసలో వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారు. దాంతో, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకి... దువ్వాడ సోదరులకు మధ్య అంతగా పొసగాడంలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో దువ్వాడ సోదరుల జోక్యాన్ని ఎమ్మెల్యే అప్పలరాజు వ్యతిరేకిస్తున్నారు. అయితే, తమకు జగన్ అండ ఉందంటూ దువ్వాడ సోదరులు దూకుడుగా వెళ్తున్నారని అంటున్నారు. ఇక, ఇచ్చాపురం విషయానికి వస్తే ఇప్పటికే ఆరు గ్రూపులు ఉన్నాయని, అందులో కొందరు ధర్మాన ప్రసాదరావును ప్రసన్నం చేసుకునే పనిలో పడగా, మరికొందరు ధర్మాన కృష్ణదాస్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారని, మరికొందరు దువ్వాడ శ్రీనివాస్ దగ్గరకు చేరి మరో వర్గంగా వ్యవహరిస్తున్నారట.
మరోవైపు, పార్టీ సీనియర్ నాయకులైన ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావుతో... దువ్వాడ శ్రీనివాస్‌కు సత్సంబంధాలు లేవంటున్నారు. దాంతో, దువ్వాడ దుందుడుకు విధానాన్ని పార్టీ ముఖ్య నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. దువ్వాడ శ్రీనివాస్‌తో వేగలేకపోతున్నామంటూ ఏకంగా జగన్ కే ఫిర్యాదు చేశారట. ఎక్కువ చనువు ఇవ్వడం వల్ల దువ్వాడకు అడ్డుకట్ట వేయడం ఇబ్బందిగా మారుతోందని సీనియర్లంతా వాపోయారని తెలుస్తోంది. దువ్వాడ వ్యవహారంతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశమూ లేకపోలేదని అధినేత వద్ద ప్రస్తావించారట. దువ్వాడ చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే భావనను, జగన్ వద్ద వ్యక్తపరిచారట. మరి, శ్రీకాకుళం వైసీపీ సీనియర్ల వినతులపై అధినేత జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.