ఇంకా తెలియని బీటెక్ స్టూడెంట్ జీవన్ ఆచూకీ
posted on Feb 17, 2020 @ 2:36PM
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ నెల 11వ తేదీన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని హాస్టల్ నుంచి వెళ్లిన జీవన్ అనే విద్యార్థి తిరిగి రాలేదు. దీంతో అదేరోజు కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా జీవన్ ఆచూకీ లభ్యం కాకపోవడంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అయితే.. స్టూడెంట్ తల్లిదండ్రులు.. పోలీసులు జీవన్ తిరిగి వస్తాడని భావించినప్పటికీ.. ఆరు రోజులు దాటి పోవడంతో ఇప్పుడు ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అలాగే పోలీసులు కూడా ఒక్కసారిగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అతను 11వ తేదీన హాస్టల్ లోపలికి వస్తున్నట్టు హరిహరా బాయ్స్ హాస్టల్ లోని సీసీ కెమెరాలో రికార్డు కావటం జరిగింది. ఆ తర్వాత మాత్రం అతను బయటకు వెళ్లే సమయంలో అక్కడ పవర్ కట్ ఉండటంతోటి అతను బయటకు వెళ్లే విజువల్స్ మాత్రం రికార్డు కాలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్న పలు సీసీకెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అతన్ని క్షేమంగా పట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతని వాష్ రూమ్ లో బ్లేడ్ తో పాటు రక్తపు మరకలు ఉన్నాయి. అది కూడా గోడకి మొత్తం రుద్దినట్టుగా చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఏమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడా జీవన్? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా జీవన్ అప్పు చేయటం జరిగిందని.. తోటి విద్యార్థులతో కలిసి బయట లోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ లోన్ కి సంబంధించి వాళ్లు అతన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయడంతో పాటు వెంటనే చెల్లించాలంటూ కూడా అతని పైన ప్రెజర్ తీసుకురావటం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ తల్లితండ్రులకు ఆ విషయాన్ని చెప్పలేక హాస్టల్ నుంచి వెళ్లి పోయినట్లు కూడా అతని రూమ్ మేట్స్ చెప్తున్నారు. కాగా పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.