నవంబర్ 2 నుంచి ఏపీలో స్కూళ్లు.. ఒక పూటే
posted on Oct 20, 2020 @ 7:34PM
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2,4,6,8 తరగతులకు మరో రోజున తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒక పూటే తరగతులు ఉంటాయని సీఎం వెల్లడించారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని పేర్కొన్నారు. నవంబర్ నెలలో ఇది అమలవుతుందని, డిసెంబర్ లో పరిస్థితిని మరోసారి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఇష్టపడకపోతే.. వారి కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు.