సోషల్ మీడియాతో కారు షేక్! హరీష్ కు టెన్షన్
posted on Oct 21, 2020 @ 10:43AM
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. 10 రోజుల్లో ప్రచారం ముగియనుండటంటతో పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో అభ్యర్థులే ఎక్కువ ఇంటింటి ప్రచారం చేసేవారు. ముఖ్యనేతలు సభలు, ర్యాలీల్లో పాల్గొనేవారు. కాని దుబ్బాకలో మాత్రం అన్ని పార్టీల ముఖ్యనేతలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. నేతల ప్రచారం కంటే సోషల్ మీడియా క్యాంపెయిన్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఇంటిలో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో డిజిటల్ ప్రచారం కీలకంగా మారింది. వాట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్ బుక్ ద్వారా సమాచారం నిమిషాల్లోనే జనాలకు చేరుతుండటంతో పార్టీలు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయి. ఆన్ లైన్ ప్రచారం కోసం సిబ్బందిని కూడా నియమించుకున్నాయి. కొన్ని పార్టీలు సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారం ప్రజల్లోకి ఈజీగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ తరహా ప్రచారంలో బీజేపీ ముందు నుంచి యాక్టివ్ గా ఉంది. రోజురోజుకు అది మరింత బలపడుతోంది. దుబ్బాక నియోజకవర్గ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, గత అరేండ్లలో జరిగిన అభివృద్ధి పనులు, నిధులపై బీజేపీ చేస్తున్న ప్రచారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియా ద్వారా చేస్తున్న అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళుతుందని, అది తమకు నష్టం కల్గించే అవకాశం ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే మంత్రి హరీష్ రావే ప్రెస్ మీట్ పెట్టి మరీ సోషల్ మీడియాలో తమ పార్టీ, ప్రభుత్వంపై ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదంటూ మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతామని హరీష్ రావు హెచ్చరించారంటే.. దుబ్బాక ఉప ఎన్నికలో సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ఊహించవచ్చు.
సోషల్ మీడియాలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించడమే కాదు తమ పార్టీ డిజిటల్ వింగ్ ను బలపేతం చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని టీఆర్ఎస్ ఆన్ లైన్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలింగ్ తేదీ వరకు యాక్టివ్ గా ఉండాలని, ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని జనాలకు చేరవేయాలని సూచించారు. అంతేకాదు టీఆర్ఎస్, కేసీఆర్ సర్కార్ పై ఇతర పార్టీలు చేస్తున్న అసత్య వార్తలకు ఎప్పటికప్పుడు కౌంటరివ్వాలని దిశానిర్దేశం చేశారు హరీష్ రావు. అయితే దుబ్బాక నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్ లేరని గ్రహించిన హరీష్ రావు.. దిద్దుబాట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే హరీష్ రావు ప్రత్యేకంగా కొందరిని నియమించినట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో జోరుగానే ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఐటీ సెల్ తో పాటు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ గ్రూపులు యాక్టివ్ గా పని చేస్తున్నాయి. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా టీమ్ టీఆర్ఎస్ టార్గెట్ గా పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. పార్టీ ఇంచార్జ్ డైరెక్షన్ లో కొన్ని సోషల్ మీడియా గ్రూపులను కూడా దుబ్బాక కోసం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికలో సోషల్ మీడియా ప్రచారం కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఎక్కువ ప్రచారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా ప్రచారం పోలింగ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఫలితాల్లోనే తేలనుంది.