సెంచరీ వైపు ఉల్లి పరుగు... ఇక సామాన్యులకు చుక్కలే
posted on Oct 20, 2020 @ 7:26PM
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని తెలుగులో సామెత. ఉల్లి లేకుండా తెలుగింటి ఇల్లాలి వంట ను ఊహించడం కూడా కష్టమే. అటువంటిది కోయకుండానే ఇల్లాలి కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లిపాయ. దీనికి కారణం మొన్నటి వరకు రూ 20 నుండి రూ 30 అమ్మిన కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ 65 నుండి రూ 70 పలుకుతోంది. త్వరలో ఇది సెంచురీ మార్క్ కూడా దాటవచ్చని మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో సామాన్య ప్రజల వంటకాల్లో ఉల్లిపాయ మాయం కానుంది. వచ్చే దీపావళి నాటికి బహుశా ఉల్లి సామాన్యులకు అందనంత ఖరీదుగా మారవచ్చు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఐన నాసిక్‌లో ఉన్న లాసల్‌గావ్‌లో సోమవారం ఉల్లిపాయ మార్కెట్ ధర క్వింటాల్‌కు 6802 రూపాయలు పలికింది. ఈ ధర ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు అత్యధికం.
తాజాగా వ్యాపార వర్గాలు చెపుతున్న వివరాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా ఉల్లి పంట పండే మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉల్లి పంట పొలాలలోనే పాడైయిపోయింది. దీంతో ఉల్లి ధర ఆకాశాన్నీ తాకుతోంది. అంతేకాకుండా మహారాష్ట్ర తో పాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటకలలో కూడా ఉల్లి పంటకు భారీ నష్టం జరగడంతో ధరలు సామాన్యులకు అందని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. దీనికి తోడు కొందరు వ్యాపారులు ఇప్పటి నుంచే ఉల్లికి కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభించారు. అయితే ఫిబ్రవరిలో కొత్త పంట వచ్చేవరకు ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం కూడా లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.