4 రోజులు వైన్స్ క్లోజ్.. బార్లు బంద్
posted on Mar 12, 2021 @ 11:05AM
అవును. మీరు చదివింది నిజమే. తెలంగాణలో మద్యం షాపులు బంద్. ఒకటి, రెండు కాదు.. వరుసగా మూడు రోజులు వైన్స్ క్లోజ్. ఆ తర్వాత మరో రోజు కూడా బంద్. అంటే, మొత్తం నాలుగు రోజులు వైన్స్ ఓపెన్ కావు. ఆరు జిల్లాల్లో లిక్కర్ షాపులన్నీ మూసివేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపులు బంద్ చేస్తుండటం మద్యం ప్రియులకు షాకింగ్ న్యూసే.
ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసివేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్‌లు మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశాలు వచ్చాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఈ ఆరు జిల్లాల్లో మద్యం దుఖాణాలు బంద్ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మద్యం షాపులు మూతపడనున్నాయి. మళ్లీ మార్చి 14 ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాతే తెరుచుకుంటాయి. ఇక, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఈనెల 17, బుధవారం రోజున కూడా వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో, మందు బాబులు ముందే మద్యం కొనుగోలుకు ఆరాటపడుతున్నారు.