టీఆర్ఎస్‌కు మజ్లిస్ షాక్! గులాబీ పార్టీలో గుబులు

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి మజ్లిస్ గుబులు పట్టుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కూతురు వాణీదేవిపై ఆ వర్గం ఓటర్లు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌తో ఎంతగా దోస్తీ ఉన్నా.. ఈసారి మాత్రం కారు గుర్తుకు ఓటేసేది లేదంటున్నారు. అందుకు కారణం పీవీపై ఉన్న ధ్వేషమే. ఆయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు.. అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న పీవీ నరసింహరావే బాధ్యుడని మజ్లిస్‌ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. అందుకే, పీవీ కూతురి అభ్యర్థిత్వాన్ని సమర్థించే ప్రసక్తే లేదనే అభిప్రాయానికి ఎంఐఎం మద్దతుదారులు వచ్చారని చెబుతున్నారు. పీవీపై మైనార్టీ వర్గంలో ఉన్న వ్యతిరేకత.. పీవీ కూతురు వాణీదేవిపై కనిపిస్తోంది. ఈ విషయం తెలిసిన గులాబీ బాస్ మదిలో కలవరం మొదలైందని అంటున్నారు. 

అధికార టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ పార్టీకి మొదటి నుంచి బలమైన మిత్రబంధం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ బరిలో దిగని స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు  సహకరించింది. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీలో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ..  మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం.. అభ్యర్థి కారణంగా అధికార పక్షానికి సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎంఐఎం తీరుతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, మరోరకం ప్లాన్-బి అప్లై చేస్తున్నారట గులాబీ శ్రేణులు. 

వేస్తే మొదటి ప్రాధాన్యత ఓటు టీఆర్ఎస్‌కే వేయండి. అంతే. ఇక 2, 3 లాంటి ప్రాధాన్యతా ఓట్లు ఎవరికీ వేయకండి అని వేడుకుంటున్నారట. ఒకవేళ కాదూ కూడదంటే.. రెండో ప్రాధాన్యతా ఓటు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మాత్రం వేయకండి అని చెబుతున్నారట. తప్పనిసరిగా వేస్తామంటే.. తాము సూచించిన కేండిడేట్స్‌కు మాత్రమే ఓటేయమని రిక్వెస్ట్ చేస్తున్నారట. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు.. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో ప్రొఫెసర్ కోదండరాంకు 2వ ప్రాధాన్యత ఓటు వేయండని చెబుతున్నారట. ఇలా.. బీజేపీ నుంచి కాచుకోడానికి.. ఎమ్ఐఎమ్‌తో కలిగే నష్టాన్ని పూరించుకోడానికి.. రెండో ప్రాధాన్యత ఓటుతో ప్లాన్-బి అమలు చేస్తున్నారట టీఆర్ఎస్ శ్రేణులు. మరి, ఈ స్ట్రాటజీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో..?

రెండు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమాలు ఎక్కువవుతున్నాయి. ఓటరు లిస్టు ప్రకారం డబ్బు పంపిణీ కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 30 మంది ఓటర్లుకు.. ఒక టీఆర్ఎస్ నేత చొప్పున బాధ్యతలు అప్పగించి వారిని మచ్చిన చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నాయి. టీఆర్ఎస్ ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేల్చి చెబుతున్నాయి విపక్షాలు.