ఉక్కుపై ఉగ్రరూపం.. కేటీఆర్‌తో రేవంత్, రాములమ్మ చెడుగుడు
posted on Mar 12, 2021 @ 11:30AM
విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు. అవసరమైతే తాను విశాఖ వెళ్లి ఉద్యమంలో పాల్గొంటానంటూ కేటీఆర్ స్టేట్‌మెంట్. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కేటీఆర్ ఫోటోకు విశాఖలో ఉక్కు కార్మికులు పాలాభిషేకం చేస్తే.. తెలంగాణ నేతలు కేటీఆర్ కామెంట్స్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే దురుద్దేశంతో కేటీఆర్ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారని ఎద్దేవా చేశారు. తాజాగా, బీజేపీ నేత విజయశాంతి సైతం కేటీఆర్ కామెంట్లపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కాస్త సాఫ్ట్ గా విమర్శిస్తే.. రాములమ్మ మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆమె విసిరిన ఒక్కో బాణం.. కేటీఆర్ ఇమేజ్ ను ఫుల్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయి.
అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ కేటీఆర్‌పై ఫేస్‌బుక్‌లో సెటైర్లు వేశారు విజయశాంతి. తెలంగాణలోని మూతపడిన నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ కోసం ఉద్యమం చేయడం లేదేంటని నిగ్గదీసి అడిగారు. పనిలో పనిగా.. గతాన్ని కూడా తవ్విపోశారు రాములమ్మ.
‘‘అమ్మకు అన్నం పెట్టనోడు... పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని.. తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదు. ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది’’ అంటూ రాములమ్మ కామెంట్లు చేశారు.
ఇటు కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి.. అటు బీజేపీ నుంచి విజయశాంతి.. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లు.. కేటీఆర్ ను విశాఖ ఉక్కుపై నిలదీయడంతో.. కేటీఆర్ స్టేట్‌మెంట్ వెనుక అసలు మతలబు ఏముంటుందనే అనుమానం పెరుగుతోంది.