కాళ్లు పట్టుకుంటేనే వైసీపీలో చేరా! రఘురామ రచ్చబండ
posted on Mar 12, 2021 7:21AM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అధికార పార్టీ నేతల మద్య మాటల యుద్ధం సాగుతోంది. సీఎం జగన్ పై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతుందని, జగన్ జైలుకు వెళ్తే ముఖ్యమంత్రి కావాలని మంత్రి పెద్దిరెడ్డి కోరుకుంటున్నారని రఘురామ కృష్ణం రాజు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. దీంతో రఘురామకు కౌంటరిచ్చిన మంత్రి పెద్ది రెడ్డి... తీవ్రంగా విరుచుకుపడ్డారు. రఘురామను దున్నపోతుతో పోల్చారు. చంద్రబాబుకు బంట్రోతులా వ్యవహరిస్తున్నారని పెద్ది రెడ్డి మండిపడ్డారు. కార్పొరేటర్ గా గెలవలేని వ్యక్తి.. జగన్ దయతో ఎంపీ అయ్యారని చెప్పారు. రఘురామకు సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు విసిరారు పెద్దిరెడ్డి.
మంత్రి పెద్దిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు రఘురామ కృష్ణం రాజు. తన కాళ్లు పట్టుకుని బతిమాలిడితేనే తాను వైసీపీలో చేరానని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిస్తే జగన్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ పోటీకి దిగాలని, తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అన్నారు. ఆయన సవాలును తాను స్వీరిస్తున్నానని, అయితే, తాను విసిరే ఈ సవాలును కూడా స్వీకరించాలని రఘురామ ప్రతి సవాల్ విసిరారు.
‘నేను కనుక సీఎం అయితే’ అన్న మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ సీఎం అసమర్థుడు, చేతకానివాడు అనేదే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమా? అని ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు బంట్రోతుగా ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని తెలుసుకోవాలని పెద్దిరెడ్డికి హితవు పలికారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను విమర్శించలేదని, ఆయన ప్రభుత్వ విధానాలను, తప్పు చేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని అన్నారు. ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావో అందరికీ తెలుసని పెద్దిరెడ్డిపై రఘురామ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.