రాజన్న రాజ్యమంటే ?
ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ రాజకీయ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల, ఇప్పుడు రాజన్న రాజ్యం అంటూ కొత్త జెండా పట్టుకుని తెలంగాణలో రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు.రాజకీయాలలోకి ఎవరైనా రావచ్చును, అలాగే ఎవరైనా ఇంటికో పార్టీ,కాదంటే రెండు, మూడు పార్టీలు పెట్టుకోవచ్చును.అన్న జగన్’లానే సోదరి షర్మిల, బ్రదర్ అనీల్ కూడా ఎవరి పార్టీ వారు పెట్టుకుంటే పెట్టుకోవచ్చును. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఉండవలసిన అవసరమూ లేదు. అయితే, ఆమె చెపుతున్న రాజన్న రాజ్యం అంటే ఏమిటి?
ఇదీ ఇప్పుడు తెలంగాణ ముందున్న ప్రశ్న. షర్మిల సమాధానం చెప్పవలసిన ప్రశ్న. బ్రాడ్’గా రామన్న రాజ్యం అంటే, దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరేడేళ్ళ పాలన కావచ్చును. వైఎస్స్ పాలనలో, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎవరైనా గొప్పగా చెప్పుకునే విశేషాలు, ఆయన పాలనలో ప్రజలకు జరిగిన మేళ్ళు ఏవైనా ఉన్నాయంటే, అందులో మొదటిది జలయజ్ఞం, రెండవది ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.జలయజ్ఞం విషయమే తీసుకుంటే, అందులో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎంతెంత అవినీతి చోటు చేసుకుందో వేరే చెప్పనక్కర లేదు. జలయజ్ఞంలో మొదలైన అవినీతి ఆ తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి, క్విట్ ప్రో కో (నీకింత నాకింత)గా విశ్వవ్యాపితం అయింది. ఈ ‘క్విట్ ప్రో కో’ మొత్తం విలువ వందల కోట్లా, వేల కోట్లా అన్నది పక్కన పెడితే, ఇందుకు సంబదించి ఇంచుమించుగా ఓ డజను వరకు క్రిమినల్ కేసులు, సిబిఐ, ఈడీ విచారణలో ఉన్నాయి. ఈ అన్ని కేసుల్లోను, ‘జగనన్న’ ముద్దాయిగా ఉన్నారు. చాలావరకు కేసుల్లో ‘ఏ వన్’ ముద్దాయిగానూ ఉన్నారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా వారం వారం,ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారు, కానీ, ఆయన అక్రమాస్తుల కేసుల విచారణ ఆగలేదు. అంతే కాదు, ఆయన 16 నెలలు జైలు జీవితం అనుభవించారు.ఆయన అక్రమ సంపదగా గుర్తించిన కోట్ల రూపాయల ఆస్తులను విచారణ సంస్థలు జప్తు చేయడం జరిగింది. ఇప్పుడు షర్మిల తెస్తానంటోంది, ఆ రాజన్నరాజ్యమేనా? క్విట్ ప్రో కో, సూట్ కేసు’కంపెనీలు వంటి అపరిచిత నేర పదకోశాన్ని సామాన్య ప్రజలకు కూడా చేరువ చేసిన రాజన్నరాజ్యమేనా, షర్మిల మళ్ళీ తెస్తానంటోంది? నిజం అవునో కాదో, కానీ, క్విట్ ప్రో కో’ వాటాల పంపకంలో వచ్చిన తకరారు కారణంగానే, షర్మిల ఇటు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న మాట కూడా లేక పోలేదు. తెలంగాణలో కుంపటి రాజేసి, ఏపీ సర్కార్ ‘కు సెగ పెట్టె ఆలోచన తోనే ఆమె ఇక్కడ ఇటు నుంచి ఆట మొదలు పెట్టారని, అక్కడ, ఇక్కడ కూడా వినవస్తోంది.
అదలా ఉంటే వైఎస్సార్ గొప్పల ఖాతాలో మరీ గొప్పగా పేర్కొనే జలయజ్ఞం, తెలంగాణకు చేసిన మేలేంటి? తెలంగాణ ఉద్యమం మూడు మూల మంత్రాలు (నీళ్ళు, నిధులు, నియామకాలు) నుంచి మొదటి మంత్రం నీళ్ళు’ తొలిగి లేదు.నిజానికి, వైఎస్సార్ ఆరేడేళ్ళ పాలనలో కంటే, రాష్ట్ర విభజన అనంతరం గడచిన ఆరేడేళ్ళ కేసీఆర్ పాలనలో, కాళేశ్వరం సహా అనేక సాగు నీటి ప్రాజక్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. అంతే కాదు,ఇప్పటికే కోటి ఎకరాలు కాకపోయినా ఎంతో కొంత మేరకు, ఎన్నోకొన్ని ఎకరాలకు నీరు అందుతోంది. కోనసీమ కళ కొంచెంగా అయినా, అక్కడక్కడా కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు, ‘రాజన్న రాజ్యం’ పేరిట షర్మిలమ్మ తెచ్చేదేమిటి? క్విట్ ప్రో కో, పాలననా,లేక బ్రదర్ అనీల్ ప్రవచించే క్రైస్తవ రాజ్యమా? ఇక వైఎస్సార్ జనాలకు చేసిన మేళ్ళు, సంక్షేమ పథకాల విషయానికి వస్తే, ఆయన ప్రవేశ పెట్టిన పథకాలలో కొన్ని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికే, జగనన్న పాలిస్తున్న పొరుగు రాష్ట్రం ఎపీలోనూ ప్రభుత్వాలకు గుడి బండగా మారాయి. చివరకు, జగనన్న తెచ్చిన రాజన్న రాజ్యంలో, బొక్కలు బయట పడతాయనే భయంతో బడ్జెట్’ ప్రవేశ పెట్టలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం పాత పథకాలను అంతగా పక్కన పెట్టలేదు. అంతే కాకుండా, రైతు బంధు,కళ్యాణ లక్ష్మీ, వంటి కొన్ని కొత్త పథకాల తెరాస ప్రభుత్వం అమలు చేస్తోంది. గీత దాటిన సంక్షేమం ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరం కాదు,ఇప్పుడు ఏపీ ఎదుర్కుంటున్న సంక్షేమ సంక్షోభం రేపు, తెలగానా తలుపు తట్టవచ్చును. అయినా ఆ విషయాన్నిఅలా ఉంచితే,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణా నెంబర్ వన్’ అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అందులో కొంత నిజం, కొంచెం అబద్ధం అయితే కావచ్చును కానీ, సంక్షేమ రంగంలో ఇప్పుడు షర్మిల వచ్చి కొత్తగా చేసేది, ఏదీ లేదు. ఈ ప్రభుత్వం అని కాదు, అని ప్రభుత్వాలు సంక్షేమం పేరిట పేదల పేదరికాన్ని పెంచి పోషించి, ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకుంటున్నాయి. సో, ఇప్పుడు షర్మిల వచ్చిన జనాలకు చేసే మేళ్ళు ఏమున్నాయి. అందుకే షర్మిల చెపుతున్న రాజన్న రాజ్యంఅంటే ఏమిటి? ఇది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న, షర్మిల సమాధానం చెప్పవలసిన ప్రశ్న.