చిన్నమ్మ ఓటు గల్లంతు
posted on Apr 6, 2021 @ 10:27AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. అయితే తమిళనాడు ఓటర్ లిస్టులో సంచలనం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయింది. మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మరోవైపు, శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు 3,998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తమిళనాడులో ఈ ఎన్నికల కోసం 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో అధికార ఏఐఏడీఎంకే, బీజేపీ, పీఎంకే, తమిళ మానిల కట్చి ఓ కూటమి కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే మరో కూటమిగా పోటీ పడ్డాయి.