నోముల భగత్ స్పెషాలిటీ ఏంటంటే!
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డితో పాటు స్థానిక నేతలు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్, ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో సుదీర్ఘ కసరత్తు చేశారు కేసీఆర్. సర్వే సంస్థలతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు. నామినేషన్ల గడువుకు ఒకరోజు ముందు అభ్యర్థిని ఖరారు చేశారు గులాబీ బాస్.
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ను ఎంపిక చేశారు. తెలంగాణ భవన్ లో నోముల భగత్ కు సీఎం కేసీఆర్ బీఫామ్ అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , తేరా చిన్నపరెడ్డి, నోముల లక్ష్మి ఉన్నారు . మంగళవారం నోముల భగత్ నామినేషన్ వేయనున్నారు. పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్ ను కూడా పార్టీ అధినేత కేసీఆర్ భగత్ కు అందించారు. టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ద్వారా హామీ ఇప్పించనున్నట్టు సమాచారం.
హైకోర్టు న్యాయవాదిగా ఉన్న నోముల భగత్ కొంత కాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన తండ్రిగా తోడుగా ఉంటూ వచ్చారు. 1984లో జన్మించిన భగత్..బీటెక్ చేశారు. తర్వాత ఎంబీఏ చేశారు. సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గా కొంత కాలం పని చేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ గా పని చేసిన అనుభవం కూడా భగత్ కు ఉంది. తన తండ్రి న్యాయవాది కావడంతో భగత్ కూడా అటువైపే దృష్టి సారించారు. L.L.B, L.L.M పూర్తి చేసి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.
నోముల ఎన్.ఎల్. ఫౌండేషన్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నోముల భగత్. పేద విద్యార్థలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆశావాదులకు ఉపాధి కల్పించడానికి కోచింగ్ క్లాసులు మరియు జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు భగత్. అభ్యర్థి ఎంపిక కోసం కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ భగత్ పై సానుకూలత వ్యక్తమైందని తెలుస్తోంది. నోముల నర్సింహయ్యపై సాగర్ జనాల్లో ఉన్న సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. భగత్ కు టికెట్ ఇస్తే ఈజీగా గెలవొచ్చని సర్వే సంస్థలు, నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే భగత్ పేరును కేసీఆర్ ప్రకటించారని చెబుతున్నారు.