జగన్, షర్మిల అభిప్రాయాలు వేరు! విజయమ్మ సంచలనం
posted on Apr 6, 2021 @ 10:27AM
తెలంగాణలో కొత్త పార్టీ పెడుతోంది వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, దివంగత వైఎస్సార్ కూతురు తెలంగాణలో సొంతంగా పార్టీ పెడుతుండటం సంచలనంగా మారింది .వైసీపీ ఉండగానే తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ వస్తుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జగన్ తో షర్మిలకు విభేదాలున్నాయనే, అన్నపై కోపంతోనే షర్మిల సొంతంగా పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరిగింది. రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చి షర్మిలకు జగన్ మోసం చేశారని కొందరు నేతలు ఆరోపించారు. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్న గోనే ప్రకాశ్ రావు వంటి నేతలు కూడా షర్మిలకు జగన్ అన్యాయం చేశారని చెప్పారు.
షర్మిల పార్టీపై జోరుగా చర్చలు సాగుతుండగానే వైఎస్ విజయమ్మ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల అభిప్రాయాలు వేరుగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇద్దరి అభిప్రాయాలు వేరు అయినా... భేదాప్రాయాలు మాత్రం లేవని చెప్పారు విజయమ్మ. షర్మిల పార్టీకి తన సపోర్ట్ ఉందనే సంకేతమిచ్చారు విజయమ్మ. షర్మిల పార్టీపై విజయమ్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జగన్, షర్మిల అభిప్రాయాలు వేరు అని విజయమ్మే స్పష్టం చేయడంతో... ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం నిజమేనని తెలుస్తోంది.
వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసులో కొన్ని రోజులుగా వస్తున్న కథనాలపై స్పందించారు వైఎస్ విజయమ్మ. ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. తన లేఖలో సంచలన విషయాలు చెప్పారు విజయమ్మ. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియదా? సీబీఐ దర్యాప్తు కేంద్రం చేతిలో ఉంటుందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా? లేక హత్యా? అని తమకు అనుమానం వచ్చినా, ఏంచేయలేకపోయామంటూ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకులను గుర్తించి చట్టప్రకారం శిక్షించాల్సిందేనన్న విజయమ్మ, ఈ విషయంలో ఆయన కుమార్తె సునీతకు తమ అందరి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.