ఓటేసిన సెలబ్రెటీలు ..
posted on Apr 6, 2021 @ 10:19AM
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీల పరిధిలో మంగళవారం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా ఓటర్లందరూ తమ ఓటు వేసి బాధ్యతను నిర్వర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ తౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తమిళనాడులో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆయన భార్య, కుమారుడు ఉదయనిధితో కలిసి తేనంపేటలోని సైట్ కళాశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ప్రజలందర్నీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా సూచించారు.
మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్, తన ఇద్దరు కుమర్తెలు శృతి హాసన్, అక్షరతో కలిసి తేనంపేటలోని చెన్నై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇంఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విరుకాంబక్కంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తమిళిసై క్యూ లైన్‌లో వేచి ఉండి ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
కేరళలో భాజపా నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ తన సతీమణితో కలిసి వెల్లేరి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివగంగ జిల్లా కందనూర్‌లోని ఓ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చిదంబరం ఓటు వేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఎన్నికల్లో తమ కూటమి విన్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళ సినీ నటులు విజయ్, సూర్య, కార్తి తదితరులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వచ్చి ఓటు వేయడం విశేషం. అజిత్ తన సతీమణి షాలినీతో కలిసి ఓటు వేశారు.