మహా రాష్ట్రలో రాష్టపతి పాలన?
మహా రాష్ట్రలో వేగంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పతి పాలన దిశగా అడుగులు వేస్తున్నాయా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, మూడు (కాంగ్రెస్, ఎన్సీపీ,శివ సేన) పార్టీల ‘మహా వికాస్ అగాఢీ’ ప్రభుత్వాన్ని,ఆది నుంచి అంతర్గత విబేధాలు వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే మూడు పార్టీల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. శాఖల విషయంలో శిఖపట్లు తప్పలేదు. అయినా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం రోజులు నెట్టుకొస్తోంది. మరోవంక రాజకీయ అనివార్యత దృష్ట్యా కాంగ్రెస్, ఎన్సీపీలు సయోధ్య నటిస్తున్నాయి. ఇవ్వన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలే, అయినా, అగాఢీ’ కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా, ఎవరూ చూడడం లేదన్న భ్రమల్లో ఉంటూ వస్తోంది. అయితే అంతర్గత విబేధాలు ముదిరి పాకాన పడడంతో, మత్రివర్గంలోనే ముసలం పుట్టింది. ఇటీవలనే, సెక్స్, మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వివాదం పూర్తిగా సర్దుమణగక ముందే రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబయి నగర మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన సంచలన ఆరోపణలు, ‘మహా వికాస్ అగాఢీ’ ప్రభుత్వం మహా సంక్షోభంలో కూరుకు పోయింది. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నెలకు వంద కోట్ల ‘వసూల్’ ఫిక్స్ చేశారని కమిషనర్ ఆరోపించడంతో మొదలైన వివాదం, ప్రభుత్వ ప్రతిష్టను మరింతగ దిగజార్చి వేసింది. చివరకు శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ కమిషనర్ చేసిన ఆరోపణ మహా మచ్చగా పేర్కొంది. ఇంతవరకు సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభాలను, శరద్ పవార్ ఎదో విధంగా పరిష్కరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న హోం మంత్రి దేశ్ ముఖ్ సొంత పార్టీ మనిషి కావడంతో, పవార్ పరిస్థితి ‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది’ అన్నట్లుగా మారింది. మరో వంక ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో నిలిపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో పోలీస్ ఉన్నతాధికారి సంబంధం ఉందన్న ఆరోపణలు, ఆయనపై సస్పెన్షన్ వేటు విషయంలోనూ సంకీర్ణ భాగస్వామ్య పార్టీలు ఎన్సీపీ, శివసేన మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.
ఈ నేపధ్యంలో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్’ కు బలంగా వినిపిస్తోంది.
తాజాగా, రిపబ్లికన్ పార్టీ నేత, కేంద్రమంత్రి రాందాస్ అఠవాలే కూడా అదే డిమాండ్ చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు. ముకేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో పోలీస్ ఉన్నతాధికారి సంబంధం ఉండడం, నెలకు వంద కోట్ల రూపాయల వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పోలీసులకు టార్గెట్ పెట్టడం వంటి విషయాలు చాలా తీవ్రమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే విషయంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున రాష్ట్రపతిని కోరానని రాందాస్ అఠవాలే పేర్కొన్నారు. ఇక మహా రాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సారథ్యంలో బీజేపీ ప్రతినిధివర్గం ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలన విదిస్తుందా, లేక ఇంకొంత కాలం వేచి చూస్తుందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి కిప్పుడు మహా రాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే, ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది,మరో వంక మరి కొంత కాలం వేచి చూస్తే రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్న అగాఢీ’రగడ మరింతగా ముదిరి ప్రభుత్వం తనంతట తానే కూలిపోవచ్చని బీజీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే, చివరకు ఏమి జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్సు గానే వుంది.