SC to hear contempt petition against CM Jagan on Nov 16

సీఎం జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఈనెల 16న విచారణ

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాసి ఉద్దేశపూర్వకంగా దాన్ని బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్ పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ జరపనుంది. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని.. సుప్రీంకోర్టు లాయర్లు జీఎస్ మణి, సునీల్ కుమార్ సింగ్, ప్రదీప్ కుమార్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ వేగవంతం అవుతున్న ప్రస్తుత దశలో.. న్యాయమూర్తుల్ని బెదిరించేందుకు ఇలా చేశారని.. అనేక మంది న్యాయనిపుణులు, న్యాయకోవిదులు సీఎం జగన్ తీరు కోర్టు ధిక్కరణగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరగనుంది.   సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో జగన్ కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై కొన్ని ఆరోపణలు చేశారు. అయితే న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడానికి ఓ పద్దతి ఉంటుంది. కానీ సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. దాడికి పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telangana minister koppula eshwar gets stuck in lift

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి.. అరగంట పాటు టెన్షన్!

తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. 30 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. దీంతో ఆయన భద్రతా సిబ్బందితో పాటు అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు అరగంట సేపు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆయనను సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు లిఫ్ట్ లాక్ తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.    మంత్రి కొప్పుల ఈశ్వర్ సైఫాబాద్ లోని సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లో బుడగ జంగాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్టులో కిందికి వస్తుండగా అది సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది.తిరిగి రీస్టార్ట్ చేసినా పైకి, కిందికీ తిరిగిందే తప్ప ఆ లిఫ్టు గ్రిల్స్ తెరుచుకోలేదు. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. సామ్రాట్ అపార్ట్ మెంట్స్ లోని లిఫ్టు చాలా పాతది కావడం, మంత్రిపాటు అనేకమంది ఎక్కడంతో ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయినట్టు భావిస్తున్నారు.

Mamata govt appoints tribal woman as home guard who offered lunch to Amit Shah

అమిత్‌షా‌కు భోజనం పెట్టిన గిరిజన మహిళకు హోంగార్డు ఉద్యోగం!   

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. బెంగాల్ పై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. అయితే బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అమిత్‌షా పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే బీజేపీకి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. గతంలో అమిత్ షాకు భోజనం వడ్డించిన గిరిజన మహిళకు హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది మమతా సర్కార్.    2017లో అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్‌షా సిలిగురిలోని ఒక గిరిజన మహిళ ఇంటికి వచ్చారు. తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు భోజనం పెట్టింది ఆ గిరిజన మహిళ గీతా మహిలి. ఇప్పుడా మహిళకే మమత  సర్కార్ హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగ నియామక పత్రాలను స్థానిక టీఎంసీ నాయకులు నేరుగా మహలి ఇంటికి వెళ్లి అందజేశారు. నక్సల్‌బరి పోలీస్ స్టేషన్‌లో హోం గార్డుగా ఆమెను ప్రభుత్వం నియమించింది. బీజేపీ కేవలం గిరిజనులకు తప్పుడు హామీలివ్వడానికే పరిమితమైందని, మూడేళ్ల క్రితం మహలి ఇంట్లో లంచ్ చేసిన సమయంలో ఆ పార్టీ చాలా హామీలే ఇచ్చిందని, ఆ తర్వాత మళ్లీ ఆమె ముఖం చూడనేలేది స్థానిక టీఎంసీ నేతలు ఆరోపించారు. మమతా బెనర్జీ స్వయంగా ఆమె యోగక్షేమాలు చూసుకున్నారని, ఉద్యోగం కూడా కల్పించారని  చెప్పారు.    తనకు మమత సర్కార్ హోంగార్డు ఉద్యోగం ఇవ్వడంపై గిరిజన మహిళ సంతోషం వ్యక్తం చేసింది. టీఎంసీ ఇప్పటికే నాకు ఇల్లు కట్టించి ఇచ్చింది..గ్యాస్ సిలెండర్ ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగావకాశం కల్పించింది. చాలా సంతృప్తిగా ఉంది. ఉద్యోగం రావడంతో నా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పోషించుకోగలుగుతానని  మహిలి సంతోషం వ్యక్తం చేసింది. అమిత్‌షా మూడేళ్ల క్రితం మహలి ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఆమె, ఆమె భర్త రాజు మహలి టీఎంసీలో చేరారు.   అయితే గీతా మహలికి టీఎంసీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించిన సమయంపై బీజేపీ ప్రశ్నలు గుప్పించింది. గిరిజనుల అభివృద్ధిని కాంక్షించే ఉద్దేశం ఇందులో ఎంతమాత్రం లేదని, అమిత్‌షా బెంగాల్‌కు వచ్చిన సమయం చూసుకుని మరీ రాజకీయాలకు టీఎంసీ పాల్పడుతోందని ఆరోపించింది. టీఎంసీ ఉద్యోగాలు ఇస్తామంటే తమ మంత్రులంతా పేదలకు ఇండ్లకు వెళ్లి భోజనాలు చేస్తారని బెంగాల్ బీజేపీ నేతలు చెప్పారు.

mla muthireddy yadagiri reddy fires on official before minister errabelli

ఇరిగేషన్ అధికారిపై గరంగరం! మంత్రి వారించినా వినని ఎమ్మెల్యే 

ఇరిగేషన్ అధికారులపై అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సమీక్షా సమావేశంలోనే ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి వారిస్తున్నా వినలేదు ఆ ఎమ్మెల్యే. అధికారులపై ఆయన ఆగ్రహంగా ఊగిపోయారు.    ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హన్మకొండ హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన దేవాదుల ఎత్తిపోతల పథకంపై రివ్యూ  సమావేశానికి హాజరయ్యారు. రివ్యూ మీటింగ్‌లో ఇరిగేషన్ అధికారులపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలో కలెక్టర్ తో కలిసి నీళ్లు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తుంటే అధికారులు సహకరించడం లేదంటూ బిగ్గరగా అరిచారు. పక్కనే కూర్చున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూల్ చేయాలని చూసినా శాంతించలేదు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.   దేవాదుల ప్రాజెక్టు ఎస్ఈ బంగారయ్య పనులను కనీసం పరిశీలించకుండా సమస్యను జఠిలం చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు కూడా ఈ విషయంలో ఆందోళన చేస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఎమ్మెల్యేల మధ్య గొడవలు అవుతున్నాయని.. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.    అయితే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. సమావేశంలో అసలు విషయం చర్చించడానికి కూడా అధికారులకు సమయం ఇవ్వకుండా అలా అరవడమేంటనీ వారు మంత్రికి చెప్పారని తెలుస్తోంది. గతంలోనూ ముత్తిరెడ్డి అధికారుల విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. చెరువు భూమి విషయంలో గత కలెక్టర్ తోనూ ఓసారి ఆయన గొడవ పడ్డారు. తాజా ఘటనపైనా అధికారులు ఆగ్రహంగా ఉండటంతో .. ఇది ఎంత వరకు  వెళుతోందని జనగామ జిల్లాలో చర్చ జరుగుతోంది.

Pawan Kalyan travels in Hyderabad Metro

పంచె పోయి.. ఫ్యాంటు వచ్చె!

మెట్రోరైల్‌లో పవన్   పవన్ కల్యాణ్ తెలుసుకదా?.. బారెడు నల్లగడ్డం.. తెల్లచొక్కా, రెడీమేడ్ పంచెతో కనిపించే కల్యాణ్‌బాబు.. సడన్‌గా పంచె తీసేసి, ఫ్యాంటు, కోటుతో ప్రత్యక్షమయ్యారు. అదేమిటబ్బా.. ఎప్పుడూ తెల్ల చొక్కా, పంచె, గడ్డంతో ఏ పుస్తకం చదువుకుంటూనో, ఏ ఆవులకు గడ్డివేస్తూనో ఫొటోల్లో కనిపించే పవనన్నయ్య.. ఇలా హటాత్తుగా గెటప్ మార్చి, కొత్త లుక్‌తో ఎంట్రీ ఇచ్చేశారేమిటని ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. అవును మరి. జనసేనాధిపతి పవన్.. తాజాగా పాత కాస్ట్యూమ్స్ స్థానంలో, కొత్త లుక్‌తో దర్శనమివ్వడం అభిమానులను అలరించింది.   పవన్ సరదాగా తన పటాలంతో, హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కారు. ‘వకీల్‌సాబ్’ మెట్రో ఎక్కడంతో, ప్రయాణికులు కూడా సంబరపడ్డారట. మన హీరో సహజమైన అలవాటు ప్రకారం.. ప్రయాణీకుల గ్రామాల్లో సమస్యలను వాకబు చేశారట. ఎంతయినా పార్టీ అధ్యక్షుడు కదా మరి? ఆ విధంగా పవన్ మెట్రో రైలులో ముందుకువెళ్లారన్నమాట. దుబ్బాక ఉప ఎన్నికలో పవన్ ప్రచారం చేస్తే, ‘గుర్రం ఎగురావచ్చని’ కమలనాధులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నా, ఎందుకో అది వర్కవుట్ కాలేదు.   ఇక ఎలాగూ ఏపీలో పెద్దగా పనేమీ లేదు. బీజేపీతో జత కట్టిన తర్వాత పవన్ ప్రవచిత ‘అమరావతి పోరాటం’ అటకెక్కింది. పవనన్నయ్య అమరావతి కోసమే బీజేపీతో జతకట్టానని చెబుతుంటే.. బీజేపీ నేతలు మాత్రం, అసలు అమరావతి మాటే ఎత్తరు. దానితో పాపం.. పవనన్నయ్య కష్టపడి సంపాదించుకున్న ఇమేజీకి, బోలెడంత డ్యామేజీ జరిగింది. ఎలాగూ కరోనా కాలం. ఏపీకి వచ్చి చేసేదేమీ లేదు. అందుకే రోజుకు ఒకటో-రెండో ప్రెస్‌నోట్లు, సందర్భానుసారంగా ఖండనలు, హర్షం, అభినందనల స్టేట్‌మెంట్లు. మధ్యలో ఎలాగూ షూటింగులు ఉండనే ఉంటాయి. కాబట్టి.. కాస్త గాలి మార్పు కోసం,  పవనన్నయ్య మెట్రో రైలెక్కినట్లున్నారు.   అన్నట్లు.. చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో.. జూమ్ యాప్‌లో కూర్చుని మాట్లాడుతున్నారని, బీజేపీ నేతలు తెగ విసుర్లు విసురుతున్నారు. జనంలోకి రాకుండా, ప్రెస్‌నోట్లతో కాలక్షేపం చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజమే. కమలదళాల కస్సుబుస్సులు కరక్టే. మరి  తన కొత్త మిత్రుడు పవనన్నయ్య కూడా, ఇప్పుడు అదే పనిచేస్తున్నారు కదా? ఆ ప్రకారంగా.. కమలదళాలు విసిరే వ్యంగ్యాస్ర్తాలు కల్యాణ్‌బాబుకూ తగులుతున్నట్లే కదా? కొంపదీసి బీజేపీ నేతలు, యాక్టివ్‌గా లేని పవన్‌ను ఏమీ అనలేక.. చంద్రబాబు భుజంపై నుంచి, హైదరాబాద్‌లో ఉన్న కల్యాణ్‌బాబుపై గురి పెట్టలేదు కదా? జాతీయ పార్టీ కదా.. ఏం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు మరి! -మార్తి సుబ్రహ్మణ్యం

why media silent on arnab goswami arrest

అర్నబ్ అరెస్టు.. అల్లరి!

రాష్ట్రానికో విధంగా వర్ధిల్లుతున్న పత్రికాస్వామ్యం   ఆర్నబ్ గోస్వామి పేరు తెలుసు కదా? అదేనండీ.. రిపబ్లిక్ టీవీ డిబేట్లలో అవతలివారిపై పెద్దగొంతేసుకుని, కన్నెర్ర చేస్తూ ఏకవచనంతో పిలిచి, గాయి గత్తర చేసే పేరు మోసిన జర్నలిస్టు ఆసామి. వీటికి మించి.. భారతీయ జనతా పార్టీకి విశేష సేవలందిస్తున్న రిపబ్లిక్ టీవీకి చీఫ్ ఎడిటర్. ఇప్పుడా కరసేవకుడినికి, మహారాష్ర్ట పోలీసులు అరెస్టు చేశారు. కారణం ఏమిటంటే.. ఆయన ఒకరి  ఆత్మహత్యకు ప్రేరేపితులయ్యారట. అదికూడా 2018 నాటి కథ. సరే.. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్ సర్కారు ఉన్నందున, వారికి ఆ పాత కేసు అర్జెంటుగా గుర్తుకొచ్చింది. ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటే.. మరి మన పెద్ద గొంతు గోస్వామి అనే జర్నలిస్టు ఆసామి, బీజేపీ వ్యతిరేక పాలిత రాష్ర్టాలపై ఒంటికాలితో లేస్తున్నారు కాబట్టి! కాంగ్రెస్ అండ్ కోను దూదేకినట్లు ఏకుతున్నారు కాబట్టి!! ఆ ప్రకారంగా ఆర్నబ్‌ను ఎందుకు అరెస్టు చేశారో సింపుల్‌గా అర్ధం చేసుకోవాలన్న మాట!!!   ఆర్నబ్ అరెస్టుపై సహజంగా భాజపేయులు అగ్గిరాముళ్లలయ్యారు. పత్రికాస్వేచ్ఛ మంటకలసిపోతోందని బాధపడుతున్నారు. రైటిస్టులయిన జర్నలిస్టు లోకం కూడా ఆయన అరెస్టును ఖండించింది. అంతే సహజంగా. వామపక్ష భావ జాల జర్నలిస్టు సంఘాలు మాత్రం, అసలు మాకు సంబంధం లేదన్నట్లు మౌనంగా ఉన్నాయి. సహజంగా ఇలాంటి ‘అప్రజాస్వామ్య’ విధానాలను.. కత్తి-డాలు పుచ్చుకుని ఖండించే వీరుల్లో, మొదటి వరసలో ఉండే వామపక్ష జర్నలిస్టు సంఘాలు, మౌనంగా ఉండటానికి కారణం లేకపోలేదు. ఆర్నబ్ గోస్వామి అనే జర్నలిస్టు ఆసామి, బీజేపీ పనుపున పనిచేస్తున్నారని గట్టిగా నమ్మడమే.   సరే.. ఆర్నబ్ సారు జీతం కోసం పనిచేశారనే అనుకుందాం. మరి ఒక జర్నలిస్టుపై దాడి జరిగినప్పుడు, సాటి జర్నలిస్టు సంఘాలు ఖండించాలి కదా? అన్నది ప్రశ్న. అయితే, పాపం వామపక్ష పార్టీలకు, భావజాలానికి అనుబంధంగా ఉండే, సదరు జర్నలిస్టు సంఘాలకు కేరళ పితలాటకం ఉంది. అందుకే అవి మౌనరాజ్యంలో ఉన్నాయి. కమ్యూనిస్టులు ఏలుతున్న కేరళలో కూడా, మీడియాను అణచివేసే చట్టం తీసుకువచ్చారు కాబట్టే, మన జర్నలిస్టు కామ్రేడ్లు తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నట్లున్నారు. పైగా గోస్వామి రైటిస్టు. ఈ ఆసాములేమో లెఫ్టిస్టులాయె! అసలు ఏ ఇష్టులూ కాని జర్నలిస్టు సంఘాలు కూడా మౌనంగానే ఉన్నాయి. అదీ ఆశ్చర్యం!   మరి ఏపీలో కూడా, కొమ్ములు తిరిగిన జర్నలిస్టు సంఘాల నాయకులున్నారు. పాలకుల పక్కనే కూర్చుని సలహాలిచ్చే, మాజీ జర్నలిస్టునేతలకూ కొదవలేదు. ఎటొచ్చీ, ఆర్నబ్ అరెస్టుపై వారి నోళ్లే మూతపడ్డాయి. బహుశా.. వేరు కేసులో అరెస్టయినందుకు, మనకేం సంబంధం అనుకున్నారేమో మరి? ఆ ప్రకారం ఆలోచించినా, ఏపీ జర్నలిస్టు నేతల మౌనం తప్పే. ఎందుకంటే, జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ సాక్షి ఆఫీసులో తనిఖీలు చేసింది. అది పత్రికాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అరుస్తూ, జర్నలిస్టు నేతలు అర్ధరాత్రి కొవ్వొత్తులతో రోడ్డెక్కారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగనన్న.. సదరు నాయకుడికి మంచి పదవే ఇచ్చి, ఆయన శ్రమదానానికి తగిన గుర్తింపే ఇచ్చారనుకోండి. అది వేరే విషయం. నిజానికి పత్రికాస్వేచ్ఛకు- జగన్‌పై ఈడీ కేసు తనిఖీలకు సంబంధం లేదు. కాకపోతే, జగన్ అనేవ్యక్తి ఆ మీడియా సంస్థకు ఓనరు మాత్రమే.   ‘నేటి దినపత్రిక సూర్య’ పత్రిక  అధిపతి,  నూకారపు సూర్యప్రకాశరావు కేసూ అంతే. జగన్‌తోపాటు 16 నెలలు చంచల్‌గూడ జైలు శిక్ష అనుభవించిన నూకారపును, బ్యాంకు మోసం చేసిన కేసులో అరెస్టు చేశారు. అయితే, అది బీసీలపై జరిగిన దాడి, బీసీలను అణచివేయడానికి జరిగిన అరెస్టుగా,  కొందరు నాయకులు గాయి గత్తర చేశారు. మరి ఆ లెక్కన, బ్యాంకు మోసానికి-బీసీ కార్డుకూ సంబంధం ఏమిటి? ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి కేసుల విషయంలోనూ, టీడీపీ నాయకులు పత్రికాస్వేచ్ఛపై దాడిగానే గావుకేకలు పెట్టారు. అది ఆర్ధికపరమైన కేసు అని తెలిసినా, టీడీపీ నేతలు దానిని పతిక్రాస్వేచ్ఛకు ముడిపెట్టడమే, అప్పట్లో విమర్శలకు దారితీసింది. టీవీ9 సీఈఓ రవిప్రకాష్ అరెస్టు సందర్భంలో.. కొన్ని సంఘాలు ఖండించగా, మరికొన్ని సంఘాలు మౌనం వహించాయి. ఆయన కూడా ఆర్ధికపరమైన ఆరోపణలతోనే అరెస్టయ్యారు.   నిజంగా.. మీడియాలో వృత్తిపరంగా రాసిన కథనాలపై అరెస్టు జరిగినా, వేధింపులకు పాల్పడితే మాత్రం అంతా ఖండించాల్సిందే. పాపం ఎటొచ్చీ.. బ్యాంకు మోసాలకు పాల్పడిన ఆరోపణపై అరెస్టయి, జైలుకు వెళ్లిన ‘డెక్కన్‌క్రానికల్ ’ అధిపతులు మాత్రమే.. కులం కార్డు గానీ, పత్రికాస్వేచ్ఛ కార్డుగానీ వాడుకోకుండా, బుద్ధిగా జైలుకెళ్లి బెయిలుపై బయటకొచ్చారు. జగన్ ఆస్తుల తనిఖీలో భాగంగా సాక్షి ఆఫీసుకు వెళ్లినందుకు, భూమ్యాకాశాలను ఏకం చేసిన జర్నలిస్టు నేతలు... అలాంటి కేసులోనే అరెస్టయిన వెంకట్రామిరెడ్డి సోదరుల విషయంలో మాత్రం నోరెత్తిన పాపాన పోలేదు.   సర్కారీ విధానాలకు వ్యతిరేకంగా.. గళం విప్పుతున్న వారి గొంతులకు చోటిచ్చిన కారణంగానే, టీవీ 5, తెలుగువన్ అధిపతులపై పోలీసులు కేసులు బనాయించారు. ఆ రెండింటినీ వృత్తిపరమైన కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలూ కనిపించవు. పక్కా ప్రొఫెషనల్ వ్యవహారం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే అదీ! ఇప్పుడిక ఆర్నాబ్ గోస్వామి అరెస్టును, ఏ కోణంలో.. ఏ కళ్లతో  చూడాలన్నది మీరే అర్ధం చేసుకోవచ్చు.     ఆర్నబ్‌పై కేసు న్యాయమా? అన్యాయమా? అన్నది ఎలాగూ కోర్టు తేలుస్తుంది. కానీ, అరెస్టు వారెంటుతో వచ్చిన పోలీసులపై టీవీలో మాదిరిగానే నోరు పారేసుకోవడం తప్పు కదా? వారెంటు ఏదీ అని ప్రశ్నించిన వారే, అదే వారెంటును చించేయడం కచ్చితంగా అహంకారమే. నిజానికి దేశంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా చట్టాలు, మినహాయింపులేమీ ఉండవు. ఉన్నాయనుకోవడం-ఉండాలనుకోవడం కేవలం భ్రమ. ఎవరైనా చట్టాన్ని గౌరవించాల్సిందే. పాలకులు చట్టాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, దానిని రక్షించేందుకు ఎలాగూ కోర్టులున్నాయి.   అన్నట్లు.. మన తెలుగు మీడియాలో కూడా, ఈ మధ్య కాలంలో ఆర్నబ్ గోస్వాముల సంఖ్య పెరుగుతుందండోయ్! టీవీ డిబేట్లలో పెద్ద గొంతులతో రంకెలేయడం, ఏకవచనంతో సంబోధించి, చేతులు ఊపుతూ హడావిడి చేస్తున్న జర్నలిస్టు యాంకర్లు పుట్టుకొస్తున్నారు. ఆ చర్చలు చూస్తే స్వకుచమర్దనమే ఎక్కువగా దర్శనిమిస్తోంది. అంటే యాంకర్లు తమను తాము ప్రమోట్ చేసుకోవడం, సొంతగా ఫేసుబుక్, ట్విట్టర్లు, వాట్సాప్ గ్రూపుల హడావిడి లాంటివన్నమాట. ఈమధ్య హైదరాబాద్‌కు వస్తున్న కొందరు ఉత్సాహవంతులు, టీవీ స్టుడియోలకు వెళ్లి సాయంత్రం వేళ డిబేట్లు చేసే యాంకర్లతో,  ఫొటోలు తీయించుకుంటున్న ముచ్చట్లు కూడా చూస్తున్నాం. ఫర్వాలేదు.. ఆర్నాబ్ గోస్వామి ప్రభావం, మన తెలుగు మీడియా ఆసాములకూ బాగానే వంటబట్టినట్లుంది! -మార్తి సుబ్రహ్మణ్యం

real estate in hyderabad

ఎక్కడ చూసినా ఫర్ సేల్ బోర్డులే! హైదరాబాద్ లో రియల్ ఢమాలేనా? 

వర్క్ ఫ్రం హోంతో అఫీస్ స్పేస్ కు డిమాండ్ బాగా తగ్గిందా? భవంతుల ముందు ఇకపై ఫర్ సేల్ బోర్డులే కనిపిస్తాయా? కరోనా దెబ్బ నుంచి రియల్ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?. హైదరాబాద్ లో భాగా డిమాండున్న ఏరియాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయినట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. రియల్ ఎస్టేట్ రంగమైతే తీవ్ర సంక్షోభంలో పడింది. కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, నిధుల కొరత, కూలీల కొరత.. ఇలా అన్నింటా ప్రతికూల పరిస్థితులే ఉండటంతో గతంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన రియల్ దందా.. ఇప్పుడు మూడు టూలెట్ బోర్డులు... ఆరు ఫర్ సేల్ బోర్డులుగా తయారైందని చెబుతున్నారు.             కరోనా భయంతో ఐటీ, బీపీవో కంపెనీలన్ని తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత తమకు తొలి ప్రాధాన్యమని చెబుతున్నాయి. దీంతో హైదరాబాద్ లోని మెజార్టీ ఐటీ, బీపీవో కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆరు నెలలు కావడం, కరోనా భయం ఇంకా ఉండటంతో కంపెనీలన్ని అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో కొన్ని చిన్న కంపెనీల యాజమాన్యాలు ఇప్పటివరకు నడిపించిన ఆఫీసులను మూసి వేస్తున్నాయి. గతంలో పెద్దపెద్ద భవంతుల్లో  అద్దాల మేడల్లాంటి కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్న సంస్థలు.. ఇప్పుడు చిన్న భవంతులు తీసుకుంటున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుండటంతో  ఉన్న కొ్ది మంది ఉద్యోగుల కోసం రెండు, మూడు రూముల్లో అఫీస్ ను కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మొత్తంగానే మూతపడ్డాయి. కొన్ని రోజులుగా హైదరాబాద్ లో   రోజూ  ఏదో ఒక కంపెనీ క్లోజ్ అవుతూనే ఉంది.   కరోనాతో మారిన అఫీస్ కల్చర్ తో హైదరాబాద్ లో కొత్త సీన్ కనిపిస్తోంది. కమర్షియల్ స్పేస్ కు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కమర్షియల్ స్పేస్ అంతా ఖాళీగా మారుతోంది. ఇప్పటికే వందలాది భవనాల ముందు టులెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, మెయిస్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే టులెట్ బోర్డు పెట్టినా ఎవరూ రాకపోతుండటంతో ఏకంగా అమ్మెందుకు సిద్ధమవుతున్నారు భవనాల యజమానులు. దీంతో సిటీలో రోజురోజుకు ఫర్ సేల్ బోర్డులు పెరిగిపోతున్నాయి. గతంలో ఆఫీస్ స్పేస్ కోసం ఎంతగా ప్రయత్నించినా మాదాపూర్ ఏరియాలో దొరికేది కాదని.. ఇప్పుడు ఎక్కడ చూసినా టులెట్ బోర్డులో ఉన్నాయని ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు చెబుతున్నారు.    దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇంటి నుండి పనిని పొడిగిస్తున్నాయి. తాజాగా కేంద్రం కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఊతమిచ్చేలా పలు సంస్కరణలు చేపట్టింది. ఐటీ, బీపీవో కంపెనీలకు పలు సడలింపులు ఇచ్చింది.  దీంతో ఇకపై వర్క్ ఫ్రం హోం ఎక్కువగా అమలు కావొచ్చని అంచనా వేస్తున్నారు. వర్క్ కల్చర్‌లో మార్పు కరోనా కారణంగా పనితీరు పూర్తిగా మారిపోయిందని, భవిష్యత్తులో ఉద్యోగులందరూ కూడా కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా చెబుతున్నారు.                  కమర్షియల్ స్పేస్ లోనే కాదు గృహనిర్మాణ రంగం తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. కరోనా దెబ్బకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దాదాపు పదేళ్లు వెనక్కు వెళ్లిందని చెబుతున్నారు. అన్ని చోట్ల డిమాండ్ బాగా పడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. గతేడాది మొదటి ఆరు నెలల్లో 8వేల334 యూనిట్లు అమ్ముడుపోతే.. ఈ ఏడాది అదే సమయానికి 43శాతం అమ్మకాలు పడిపోయాయి.అంటే దాదాపు సగానికి సగం అన్నమాట. కేవలం  4వేల782 యూనిట్లే విక్రయాలు జరిగాయి. మాదాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్, గచ్చిబౌలి, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో అఫీస్ స్పేస్ తో ఇండ్లకు డిమాండ్ భారీగా పడిపోయింది.   కరోనాకు ముందు వరకు హైదరాబాద్ లో రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలో చదరపు అడుగుకు ఏకంగా రూ.3వేల నుంచి అత్యధికంగా గచ్చిబౌలిలో రూ.7వేల ధర పలికింది. డబుల్ బెడ్ రూం కు కనీసం రూ.75 లక్షల నుంచి రూ.1కోటి వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో మధ్యతరగతి జనాలు అపార్ట్ మెంట్ ఆశలను వదిలేసుకునేవారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో  రియల్ వ్యాపారులు బిల్డర్లు నిలువునా మునిగిపోయారు. ఇప్పుడు బతకడానికే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అద్దెకు ఉండడమే ఈ టైంలో మేలని భావిస్తున్నారు. దీంతో బిల్డర్లు రియల్ వ్యాపారులు కూడా ధరలను భారీగా తగ్గించేస్తున్నారు. తక్కువ ధరకే ఇప్పుడు హైదరాబాద్ లో అపార్ట్ మెంట్లు లభిస్తున్నాయి. అలా అయినా రియల్ రంగాన్ని బతికించడానికి సిద్దమయ్యారు. ధరలు తగ్గించకపోతే రియల్ రంగం కుప్పకూలడం ఖాయమని.. ఢిల్లీలోలాగానే ఇక్కడే రియల్ ఢమాల్ అంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.     కరోనా మహమ్మారి నేపథ్యంలో స్థిరాస్తి రంగం కష్టాల్లో కూరుకుపోయిందని, నగదు కొరత ఏర్పడి ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయని క్రెడాయ్  ఆందోళన వ్యక్తం చేసింది. నగదు కొరత వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుండి ఆర్థికంగా ప్రోత్సాహకం అవసరమని తెలిపింది. రియల్టీ రంగానికి మారటోరియం కాలాన్ని 31 మార్చి 2021 వరకు పొడిగించాలని క్రెడాయ్ కోరుతోంది. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందకుంటే ఉద్యోగాలు మరిన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.  తీవ్ర సంక్షోభంలో.. రియాల్టీ రంగానికి ఆర్థిక సాయానికి సంబంధించి ఆలస్యం చేయవద్దని ఈ రంగం నిపుణులు కోరుతున్నారు. నిధుల లేమి సహా వివిధ సమస్యలతో తీవ్ర సంక్షోభం ఉన్న రియాల్టీ రంగానికి కొంత సహకారం అవసరమని చెబుతున్నారు.గతంలో దేశ రాజధాని ఢిల్లీలో రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున ఎగిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.

All India Lawyers Union writes to CJI for probe into letter by Jagan

సీఎం జగన్ లేఖపై విచారణ జరపాలి: అఖిల భారత న్యాయవాదుల సంఘం

న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన సీఎం జగన్ పై సత్వరం విచారణ చేయించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అఖిల భారత న్యాయవాదుల సంఘం ప్రతినిధులు లేఖ రాశారు. సీఎం జగన్ లేఖలో న్యాయమూర్తులపై ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని న్యాయమూర్తులను తూలనాడుతున్నారని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మండిపడ్డారు.   బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థను,..న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థను దూషించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ రాసిన లేఖపై సత్వరం విచారణ చేయించాలన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అఖిల భారత న్యాయవాదుల సంఘం తన లేఖలో వెల్లడించింది.

Permanent Work From Home for IT employees now possible

శాశ్వతంగా వర్క్‌ ఫ్రమ్ హోమ్! నిబంధనలు తొలగించిన కేంద్రం  

కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఐటీ, బీపీవో రంగంలో మరీ ఎక్కువగా ఉంది. కరోనా  ప్రభావంతో ఇంటి నుంచి పనిచేసే విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి కంపెనీలు. గత మార్చిలో ప్రారంభమైన వర్క్ ఫ్రమ్ హోంను కొన్ని సంస్థలు ఇంకా కొనసాగిస్తున్నాయి. కరోనా ప్రభావం ఎప్పటివరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితుల్లో..వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఐటీ, టెక్ కంపెనీలు కొన్ని సడలింపులు కోరాయి. దీంతో ఐటీ, బీపీఓ పరిశ్రమలకు ఊరట కలిగించే కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ, బీపీఓ కంపెనీలు కార్యాలయ సముదాయాల్లోనే కాకుండా ఇంటి నుంచి పనిని నిర్వహించడానికి వీలు కల్పించేలా కీలక నిబంధనలను తొలగించింది. తాజా నిర్ణయంతో ఐటీ సంస్థల్లోని ఉద్యోగులు ఏ ప్రదేశం నుంచైనా శాశ్వతంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది.     ఇతర సర్వీస్ ప్రొవైడర్‌ల కోసం టెలికాం విభాగం అతి పెద్ద సంస్కరణ చేపట్టి నిబంధనలు సరళీకృతం చేసింది. ఇది దేశంలో ఎక్కడ నుంచి అయిన శాశ్వతంగా పనిచేసే విధానాన్ని ప్రోత్సహిస్తుంది.. ఐటీ, టెక్, బీపీఓ పరిశ్రమకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందని టెలికం శాఖ తెలిపింది. టెలికమ్ విభాగం మార్గదర్శకాల ప్రకారం.. ‘ఓఎస్పీలకు రిజిస్ట్రేషన్ అవసరం పూర్తిగా తొలగించాం. డేటా సంబంధిత పనిలో నిమగ్నమైన బీపీఓ పరిశ్రమను నిబంధనల పరిధి నుంచి తొలగించాం.. ఐపీ అడ్రస్‌ల కోసం చెల్లించే బ్యాంక్ గ్యారెంటీ, తరుచూ నివేదికలు, నెట్‌వర్క్ విధానం మొదలైన నిబంధనలను ఎత్తివేశాం... అదేవిధంగా, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ విధానాలను అవలంబించకుండా నిరోధించే అనేక ఇతర నిబంధనలను కూడా రద్దుచేసినట్టు టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.   టెలికం శాఖ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను మరింతగా పెంచడానికి, భారతదేశాన్ని టెక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నాం.. టెలికాం విభాగం ఓఎస్పీ మార్గదర్శకాలను ప్రభుత్వం గణనీయంగా సరళీకృతం చేసింది. ఈ కారణంగా బీపీఓ పరిశ్రమకు భారం తగ్గుతుంది.. ఐటీ పరిశ్రమకు కూడా ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘భారత ఐటీ రంగం మాకెంతో గర్వకారణం. ఈ రంగం శక్తి సామర్ధ్యాలను ప్రపంచం మొత్తం గుర్తించింది.. దేశంలో వృద్ధి, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి సాధ్యమైన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము.  కేంద్ర టెలికం శాఖ తాజా నిర్ణయాలు  ఈ రంగంలోని యువ ప్రతిభను ప్రోత్సహిస్తాయి అని మోడీ ట్వీట్ లో వెల్లడించారు.    వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఊతమిచ్చేలా   కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఐటీ పరిశ్రమ స్వాగతించింది. ‘ఇది నిజంగా దీర్ఘకాలిక, ప్రగతిశీల ఆలోచన, మన పరిశ్రమను మరింత పోటీలో నిలుపుతుంది.. ఎక్కడి నుంచైనా పనిచేయడం కొత్త రియాలిటీగా మారింది.. దీనిని అమలు చేసినందుకు ధన్యవాదాలు’ అని విప్రో ఛైర్మన్  ప్రేమ్ జీ అన్నారు.   మరోవైపు  ఇటీవలే  వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి ఐటీ దిగ్గజం విప్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, అమెరికాల్లో పని చేస్తున్న ఉద్యోగులు జనవర 18 వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. విప్రోలో 1.85 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇందులో ఎక్కువ మంది భారత దేశంలో పనిచేస్తుండగా, కొంతమంది ఉద్యోగులు విదేశాల్లో ఉన్నారు.గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అవకాశాన్నిచ్చింది.

political meetings in vijayawada kanakadurga temple

కనకదుర్గమ్మ ఆలయ ఆవరణలో వైసీపీ సమావేశాలు.. మండిపడుతున్న భక్తులు, ప్రతిపక్షాలు 

పవిత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆవరణను అధికార వైసీపీ నాయకులు తమ పార్టీ రాజకీయ సమావేశాలకు వాడుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా వైసీపీ నాయకులు నియోజకవర్గాల వారీగా ర్యాలీల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. వారు ఈ సమావేశాన్ని కనకదుర్గ గుడి పరిపాలనా కార్యాలయ భవనంలో జరపడంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. సాక్షాత్తు దుర్గగుడి బోర్డు ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఇతర పార్టీ నేతలు కొండపల్లి బుజ్జి, కొనకళ్ల విద్యాధరరావులు కలిసి ఈ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అయితే దీనికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతు కూడా ఉండడంతోనే వారు ఇలాంటిపని చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మంత్రి ఆదేశాలు, అనుమతి లేకుండా సోమినాయుడు ఈ సమావేశం నిర్వహించలేరని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. గతంలో మంత్రి కూడా కార్పొరేషన్ వార్డుల అభ్యర్థులతో సమావేశాన్ని ఇదే కార్యాలయంలో పెట్టారు. అప్పుడు ఆ సమావేశానికి ఈవో, ఇతర అధికారులు కూడా హాజరవ్వడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా మళ్లీ తాజాగా అదేపని సోమినాయుడు చేయడంతో భక్తులంతా మండిపడుతున్నారు.   తాజాగా ఈ విషయం పై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ గుడిని వైసీపీ పార్టీ కార్యాలయంగా వాడుకోవటం దుర్మార్గమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలో వైసీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో మీటింగ్ పెట్టిన దేవాదాయ మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని అయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయలంటే వైసీపీ ప్రభుత్వం ఏంటో చులకనగా చూస్తోందని అయన మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 17నెలల్లోఅనేక దేవాలయాలను ద్వంసం చేశారన్నారు. దేవాలయాలపై జరిగిన దాడిలో ఇంతవరకు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదని అయన అన్నారు. అంతర్వేది రథం తగలబెట్టిన కేసు సీబీఐకి ఇచ్చామన్నారని...కానీ ఇంత వరకు ఆ కేసు అతీ గతీ లేదని విమర్శించారు. అసలు ఆ కేసు సీబీఐకి ఇచ్చారా లేదా అన్నది కూడా తమకు అనుమానమే అని బొండా ఉమా వ్యాఖ్యానించారు.   ఇది ఇలా ఉండగా దుర్గమ్మ ఆలయంలో అవినీతి జరుగుతోందంటూ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది అమ్మవారి ఆలయమా?... లేక వైసీపీ పార్టీ కార్యాలయమా? అని అయన ప్రశ్నించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో రాజకీయ సమావేశాలా? అని అయన నిలదీశారు. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అయన హితవు పలికారు. ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని... ఆలయ ప్రతిష్టను పెంచడానికా లేక దిగజార్చడానికా చైర్మన్ పదవి సోమినాయుడు గారు? అని అయన ప్రశ్నించారు. అక్కడ జరిగే అవినీతి మీద ఎలాగో స్పందించరని.. కనీసం ఆలయ సాంప్రదాయాలను తమ పార్టీ నేతలు మంటగలుపుతున్నా స్పందించరా సీఎం గారు? అని మహేష్ ప్రశ్నించారు.

double promotion to paritala sriram

పరిటాల శ్రీరామ్ కు ఒకే రోజు డబుల్ ప్రమోషన్ 

మాజీ మంత్రులు పరిటాల రవీంద్ర, సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ కు ఒకే రోజు డబుల్ ప్రమోషన్ లభించింది. పరిటాల శ్రీరామ్ సతీమణి శుక్రవారం నాడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రావడంతో పరిటాల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తమకు కొడుకు పుట్టాడనే విషయాన్ని పరిటాల శ్రీరామ్ కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో పార్టీ నేతలు, అభిమానుల నుంచి వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పరిటాల కుటుంబ అభిమానులు అయితే పరిటాల రవి మళ్లీ పుట్టాడని శ్రీరామ్ ను అభినందిస్తున్నారు.    ఈ వార్త విన్న కొద్దిసేపటికే టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీరామ్ ను టీడీపీ నియమించింది. ఒకే రోజు రెండు శుభవార్తలు వినడం పట్ల పరిటాల అభిమానులు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో... ఈ నియోజకవర్గ బాధ్యతలను ఇప్పటికే పరిటాల శ్రీరామ్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అప్పగించారు.

teegala krishna reddy to join bjp

బీజేపీలోకి తీగల కృష్ణారెడ్డి? గులాబీకి గ్రేటర్  షాక్! 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు  అధికార టీఆర్ఎస్ కు భారీ షాక్ తలగబోతున్నట్లు కనిపిస్తోంది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న తీగల... పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనడం లేదు. దీంతో తీగలను తమ పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు రాయబారాలు చేశారని తెలుస్తోంది. తీగలతో కమలం నేతల చర్చలు ఫలించాయని.. ఈ రెండు ,మూడు రోజుల్లోనే తీగల కృష్ణారెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు.     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  సీఎంగా  చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ మేయర్ గా పని చేశారు తీగల కృష్ణా రెడ్డి.  2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ  ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కారు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. తీగలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ పార్టీలో చేరారు. తర్వాత ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్. సబిత టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి తీగల అసంతృప్తిగానే ఉన్నారు. సబితకు మంత్రి పదవి ఇచ్చాక ఆయన రాజకీయాల్లో సైలెంట్ గా మారిపోయారని చెబుతున్నారు    సబితకు మంత్రి పదవి వచ్చాకా మహేశ్వరం నియోజకవర్గంలో తీగల హవా పూర్తిగా తగ్గిందని చెబుతున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ పెత్తనమంతా సబిత చేతిలోకి వెళ్లడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా అంటిముట్టనట్లుగానే హాజరవుతున్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన యాక్టివ్ గా పని చేయలేదు.తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  సంగతి తెలిసిందే. మహేశ్వరం టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీగా ఉన్న తీగల అనితారెడ్డి.. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి గట్టి పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. మహేశ్వరం నియోజరవర్గం పరిధిలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లన్ని సబిత సూచించిన వారికే వచ్చాయని తెలుస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాలను  పట్టించుకోవడం తీగల కృష్ణా రెడ్డి పూర్తిగా మానేశారని చెబుతున్నారు.    గ్రేటర్ ఎన్నికలు డిసెంబర్ లోనే జరిగే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. గెలుపే లక్ష్యంగా పోటాపోటీ ఎత్తులు వేస్తున్నాయి. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ స్కెచ్ లో భాగంగా ఇటీవలే జూబ్లీహిల్స్  నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గ్రేటర్ లోని మరికొందరు కమలం నేతలపై  కారు పార్టీ నేతలపై ఆకర్ష్ వల వేసినట్లు చెబుతున్నారు. దీంతో అప్రత్తమైన కమలం నేతలు.. అధికార పార్టీకి కౌంటర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే  టీఆర్ఎస్ లో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న తీగలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది  తీగల కృష్ణారెడ్డితో సంజయ్ టీమ్ జరిపిన చర్చలు ఫలించాయని, త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారని చెబుతున్నారు.    గతంలో హైదరాబాద్ మేయర్ గా పనిచేసిన తీగలకు నగర వ్యాప్తంగా కేడర్ ఉంది. మహేశ్వరంతో పాటు శివారు నియోజకవర్గాల్లోనూ ఆయన భారీగా అనుచరులు ఉన్నారు.  తీగలతో పాటు వారంతా బీజేపీ లో చేరుతారని తెలుస్తోంది.తీగల కృష్ణారెడ్డి చేరికతో గ్రేటర్ లో తమకు భారీగా ప్రయోజనం కల్గుతుందని కమలం నేతలు ఆశిస్తున్నారు.

Facebook and Twitter Big Shock to Trump over US Elections

ట్రంప్ కు ట్విట్టర్, ఫేస్ బుక్ షాక్! యూ ఆర్ ఫైర్డ్ అంటూ నెటిజన్ల సెటైర్లు 

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు అధికారం దూరమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్న వేళ ఆయనకు సోషల్ మీడియా సంస్థలు షాకుల మీద షాకులిచ్చాయి. తన ప్రత్యర్థి బైడెన్ టీమ్, తన విజయాన్ని దొంగిలించాలని చూస్తోందని ట్రంప్ చేసిన ట్వీట్ ను  ట్విట్టర్ తొలగించింది."మనమే ముందున్నాం. అయితే, వారు ఈ ఎన్నికలను చోరీ చేయాలని చూస్తున్నారు. దాన్ని జరుగనివ్వబోము. ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్లను వేయనిచ్చేది లేదు" అని  ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వివాదాస్పదమైనదని, పౌర సమాజంలో జరుగుతున్న ఎన్నికల విధానంపై తప్పుడు సంకేతాలు పంపించేలా ఉందని అభిప్రాయపడ్డ ట్విట్టర్ దాన్ని తొలగించింది.    ఇక ట్రంప్ తాజా ట్వీట్ ను ఫేస్ బుక్ ఖాతాలో సైతం పెట్టగా..  ఫేస్ బుక్ యాజమాన్యం సైతం దాన్ని తొలగించింది.  "తొలి దశ ఓట్ల లెక్కింపుతో పోలిస్తే, తుది ఫలితం వేరుగా ఉండవచ్చు. ఓట్ల లెక్కింపుకు రోజులు, వారాల సమయం కూడా పడుతుంది. ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని  ఫేస్ బుక్ వ్యాఖ్యానించింది. ఆ తరువాత విజయం తనదేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సైతం ఫేస్ బుక్ ఫ్లాగ్ చేసింది.   నెటిజన్లు కూడా ట్రంప్ పై బోలేడు సెటైర్లు వేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం #YouAreFired అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. యూ ఆర్ ఫైర్డ్ అంటే.. నిన్ను ఉద్యోగం నుంచి తొలగించారు అని అర్థం వస్తుంది. ‘ట్రంప్ ఇక నువ్వు బట్టలు సర్దుకుని సిద్దంగా ఉండు.. నీ ఉద్యోగం పోయింది’ అంటూ నెటిజన్లు ట్విటర్‌లో చెలరేగిపోతున్నారు. ట్రంప్‌పై ఒక రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. డెమొక్రాట్లు మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటున్న ట్రంప్ .. సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా బెదిరిస్తున్నారు. దీంతో పూర్తి ఫలితాలు వచ్చి ఒకవేళ ట్రంప్ ఓడిపోతే ఏం చేస్తారన్నదానిపైనా సోషల్ మీడియాలో జోరుగా  చర్చ జరుగుతోంది.   ఓట్ల లెక్కింపును ఆపండి  అంటూ  ట్రంప్ చేసిన ట్వీట్ పై  పర్యావరణ ప్రేమికులు గ్రెటా థన్‌బర్గ్  కూడా విమర్శలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. అనంతరం ఓ స్నేహితుడితో కలిసి మంచి సినిమాకు వెళ్లాలి. చిల్ డొనాల్డ్, చిల్’ అని ఆమె  రాసుకొచ్చారు. గ్రెటా థన్‌బర్గ్ గతంలోనూ ట్రంప్‌పై అనేక విమర్శలు చేశారు. అమెరికన్లు జో బైడెన్‌కే ఓటేయాలంటూ కొద్ది రోజుల కిందట అమెరికన్లను కోరారు  థన్‌బర్గ్.    మరోవైపు మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ అంటూ అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా  వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ట్రంప్.. ఎన్నికల్లో డెమొక్రాట్లు మోసానికి పాల్పడుతున్నారని మరోసారి ఆరోపించారు. మీడియా, టెక్ జోక్యం ఉన్నప్పటికి నేను ఇప్పటికే అనేక నిర్ణయాత్మక రాష్ట్రాలను గెలుచుకున్నాను. వారంతా ఊహించినట్టు ఎక్కడా బ్లూ వేవ్ లేదు, దానికి బదులుగా రెడ్ వేవ్ ఉంది. సెనేట్‌ విషయంలో అద్భుతమైన పనితీరు కనబర్చాం. మరింత మంది రిపబ్లికన్ మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు’ అని చెప్పారు.  మెయిల్-ఇన్ బ్యాలెట్లను అవినీతి వ్యవస్థగా అభివర్ణించారు. ‘మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ. వారికి ఎన్ని ఓట్లు అవసరమో తెలుసుకుని.. ఆగి.. ఆ ఓట్లను కనుగొంటున్నారు. వారు అకస్మాత్తుగా బ్యాలెట్లను కనుగొంటున్నారు.. అవన్నీ ఏకపక్షంగా ఉన్నాయి’ అని అన్నారు. పెన్సిల్‌వేనియాలోని మెషీన్లు డెమొక్రాట్ల అవినీతి రాజకీయ వ్యవస్థలో భాగమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Major Networks Cut Away From Trumps Baseless Fraud Claims

ట్రంప్ లైవ్ కట్ చేసిన టీవీ చానెళ్లు! పదేపదే అబద్ధాలు చెబుతున్నారని ఫైర్  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెనుకంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో డెమాక్రాట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, న్యాయ పోరాటం చేస్తానని చెబుతున్న ట్రంప్ కు.. సోషల్ మీడియా సంస్థలు, అమెరికా టీవీ చానెళ్లు కూడా దిమ్మతిరిగే షాకులిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతుండగా, పలు టీవీ చానెళ్లు, ఆ ప్రసారాన్ని మధ్యలోనే నిలిపివేశాయి.   ట్రంప్ ప్రసంగాన్ని 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం ఎంఎస్ఎన్బీసీ చానెల్ అర్ధాంతరంగా కట్ చేసింది. ట్రంప్ మాట్లాడుతుండగానే... అ టీవీ చానెల్ యాంకర్ బ్రియాన్ విలియమ్స్ కల్పించుకుని, "సరే... మనం ఇప్పుడు అధ్యక్షుడి ప్రసంగానికి అంతరాయం కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నాం" అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన ప్రసంగాన్ని టీవీ చానెల్ నిలిపివేసింది. ఎన్బీసీ, ఏబీసీ న్యూస్ టీవీ చానెళ్లు కూడా ట్రంప్ లైవ్ కవరేజ్ ని నిలిపివేశాయి. "ఎంత దురదృష్టకరమైన రాత్రి? అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రజలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు" అని సీఎన్ఎన్ యాంకర్ జేక్ టాపర్ వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణలకు ఒక్క సాక్ష్యం కూడా లేదని ఆయన అన్నారు.                   మరోవైపు వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో ఎన్నికల్లో డెమొక్రాట్లు మోసానికి పాల్పడుతున్నారని మరోసారి ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్. మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ అన్నారు.  మీడియా, టెక్ జోక్యం ఉన్నప్పటికి నేను ఇప్పటికే అనేక నిర్ణయాత్మక రాష్ట్రాలను గెలుచుకున్నాను. వారంతా ఊహించినట్టు ఎక్కడా బ్లూ వేవ్ లేదు, దానికి బదులుగా రెడ్ వేవ్ ఉంది. సెనేట్‌ విషయంలో అద్భుతమైన పనితీరు కనబర్చాం. మరింత మంది రిపబ్లికన్ మహిళలు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు’ అని ట్రంప్ కామెంట్ చేశారు.  మెయిల్-ఇన్ బ్యాలెట్లను అవినీతి వ్యవస్థగా అభివర్ణించారు. ‘మెయిల్-ఇన్ ఓటింగ్ ఒక అవినీతి వ్యవస్థ. వారికి ఎన్ని ఓట్లు అవసరమో తెలుసుకుని.. ఆగి.. ఆ ఓట్లను కనుగొంటున్నారు. వారు అకస్మాత్తుగా బ్యాలెట్లను కనుగొంటున్నారు.. అవన్నీ ఏకపక్షంగా ఉన్నాయి’ అని అన్నారు. పెన్సిల్‌వేనియాలోని మెషీన్లు డెమొక్రాట్ల అవినీతి రాజకీయ వ్యవస్థలో భాగమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amazon Web Services to invest Rs 20761 crore in data centres in Telangana

తెలంగాణలో 20 వేల కోట్ల పెట్టుబడి! అమెజాన్ మూడు అవైలబిలిటీ జోన్లు

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఐటీ కంపెనీ అమెజాన్ తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్లో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. ఈ  అవైలబిలిటీ జోన్లలో పెద్ద ఎత్తున డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపిన కంపెనీ, ఇవన్నీ ఒకటే రీజియన్ లో ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రతీ డేటా సెంటర్ దేనికదే స్వతంత్రంగా పని చేస్తుందని తెలిపింది. దీంతో  విద్యుత్ సరఫరా, వరదలు, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు నుంచి రక్షణ ఉంటుందని వెల్లడించింది. అమెజాన్ ఏర్పాటు చేయబోతున్న ఏషియా పసిఫిక్ హైదరాబాద్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజియన్ 2022 ప్రథమార్థంలో  తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.    అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు అంటే 2.77 బిలియన్ డాలర్లతో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి డేటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ మరియు ఐటీ రంగం అనేక రెట్లు వృద్ధి సాధించే అవకాశం ఉంది. ఏషియా పసిఫిక్ రీజియన్ వెబ్ సర్వీసెస్ వలన వేలాది మంది డెవలపర్లకు, స్టార్ట్ అప్ లకి, ఇతర ఐటీ కంపెనీలకు మరియు విద్య మరియు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఎన్జీవోలు, అనేక ఇతర కంపెనీలకు తమ వెబ్ ఆధారిత సర్వీసులను నడుపుకునెందుకు వీలు కలుగుతుంది. భారీ ఎత్తున డేటా సెంటర్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ కామర్స్ ,పబ్లిక్ సెక్టార్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి మరియు ఇతర అనేక రంగాల్లో తమ కార్యకలాపాల విస్తృతి పెరిగేందుకు అవకాశం కలుగుతుంది.    అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20 వేల 761 కోట్ల రూపాయలు పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్రం లోకి రావడం పట్ల పరిశ్రమలు మరియు ఐటీశాఖ మంత్రి కేటీఆర్   హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటన లో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. దావోస్ పర్యటన లో అమెజాన్ సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ఇందుకు సంబంధించి చేసిన చర్చలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.  అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డాటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్  చెప్పారు.    అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక మరియు వేగవంతమైన పరిపాలనకు నిదర్శనమన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఆదర్శవంతమైన ప్రభుత్వ విధానాలు మరియు పాలసీల ద్వారా ఐటి మరియు ఐటీ ఆధారిత రంగం పెద్ద ఎత్తున వృద్ధి చెందుతూ వస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ విధానాల ద్వారా ఐటీ రంగంలో అనేక కంపెనీలు రావడంతో పాటు ఇన్నోవేటివ్ స్టార్టప్లకు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కేంద్రం గా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అమెజాన్ కి మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్ తన అతిపెద్ద కార్యాలయానికి హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

కరోనా కట్టడికి క్రూరమైన చట్టాలు! కేరళ సర్కార్ పై విమర్శలు

కేరళలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. దీంతో కరోనా మహమ్మారి నియంత్రణకు కఠిన చట్టాలను ప్రయోగిస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. అందులో కొన్ని క్రూరమైన చట్టాలు కూడా ఉన్నాయి. కరోనా కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144తో పాటు, సెక్షన్ 151, 149 తదితరాలను విధించింది. ప్రజలు గుమికూడటాన్ని, ఏదైనా కార్యక్రమాలకు పెద్దఎత్తున హాజరు కావడాన్ని అడ్డుకునేందుకే ఈ చట్టాలను ప్రయోగిస్తున్నట్టు కేరళ  ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కట్టడి కోసమే ఈ చట్టాలను అమలు చేయాల్సి వస్తోందని సీఎం విజయన్ ప్రకటించారు.    సెక్షన్ 151, 149 అమలులో ఉన్నప్పుడు పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే, మెజిస్ట్రేట్ అనుమతి లేదా వారంట్ లేకుండానే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఆపై వారిని ఒక రోజు కస్టడీలో ఉంచవచ్చు. అవసరమైతే, దాన్ని పొడిగించవచ్చు. సెక్షన్ 144 అమలులో ఉంటే, ముగ్గురి కన్నా అధికంగా ఒక ప్రాంతంలో గుమికూడరాదు. ఈ చట్టాలు అమలులో ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తే, గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్లను అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ఎక్కువగా వినియోగిస్తుంటారు.                    అయితే అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించే చట్టాలను ఇప్పుడు కేరళ రాష్ట్రమంతా ప్రయోగించడం వివాదమవుతోంది.  కేరళ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నివారణకు ఈ సెక్షన్ల ప్రయోగం అవసరం లేదని నారు భావిస్తున్నారు. ఈ చట్టాల అమలు సమయంలో తమ అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని, ప్రజల స్వేచ్ఛ హరిస్తుందని అంటున్నారు.  కరోనాను అడ్డుకునేందుకు ఇటువంటి కఠిన చట్టాలు అవసరమా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీజేపీ కార్యకర్త మృతి.. అంతిమ యాత్రలో పాల్గొననున్న బండి సంజయ్

దుబ్బాక ఉపఎన్నిక సందర్భంలో జరిగిన ఘటనలలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌కు నిరసనగా నవంబర్‌1న హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌ ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ స్వస్థలం ఐన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, తుమ్మలోనిగూడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్ది సేపట్లో శ్రీనివాస్‌యాదవ్ అంతిమయాత్ర జరగనుంది. శ్రీనివాస్ మృతి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం తనన్నెంతగానో బాధిస్తోందని అన్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాస్ ను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ అంతిమయాత్రలో బండి సంజయ్‌ స్వయంగా పాల్గొననున్నారు. శ్రీనివాస్‌యాదవ్ కాలిన గాయాలతో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భారీ భద్రత మధ్య ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి చేశారు.   నవంబర్‌1 ఆదివారం శ్రీనివాస్‌ యాదవ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. అతడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అదే రోజు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి మార్చారు. అయితే శరీరం 60 శాతంపైగా కాలిపోవడంతో శ్రీనివాస్‌ కోలుకోవడం కష్టమైంది. అతనిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

చిరు బీజేపీలో చేరుతారని ప్రచారం! పాస్ మార్కుల కోసం సోము టీమ్ మాస్టర్ ప్లాన్?

నవ్వుపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి. సోము వీర్రాజు పగ్గాలు చేపట్టాక ఆ పార్టీ ఉనికే కనిపించకుండా పోయింది. పార్టీ బలోపేతం చేస్తానంటూ బీరాలు పలికిన వీర్రాజు.. కొన్ని రోజులు బయటికే రాలేదు. రాష్ట్రంలో బోలెడు సమస్యలున్నా, ప్రజలు కష్టాల్లో ఉన్నా కమలం నేత పట్టించుకోలేదు. దీంతో ఏపీలో పువ్వు పార్టీ పురోగతి ప్రశ్నార్దమయిందనే ప్రచారం జరిగింది. పైపెచ్చు పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించాల్సింది పోయి ఉన్న నేతలను సాగనంపారు సోము వీర్రాజు. దీంతో ఆయన సోము వీర్రాజు కాదు సస్పెండ్ల వీర్రాజు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలాయి. మొత్తంగా పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో  సోము వీర్రాజు  నేతృత్వంలో  ఏపీ బీజేపీ హోం క్వారంటైన్ లోకి వెళ్లిందనే చర్చ  జనాల్లో జోరుగా  జరిగింది.    తనపై వస్తున్న విమర్శలు, పార్టీ పరిస్థితిపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలియడంతోనే ఏమో సదరు సోము వీర్రాజు కొత్త డ్రామాకు తెర తీశారని తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి చేరుతున్నారన్న ప్రచారం. కొన్ని రోజులుగా ఏపీ బీజేపీ నేతలు చిరంజీవి త్వరలోనే కమలం గూటికి చేరుతారని ప్రచారం చేస్తున్నారు. అయితే దీని వెనక సోము వీర్రాజు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సోము  డైరెక్షన్ లోనే ఆయన వర్గం నేతలు ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారంతో ఏపీలో బీజేపీ బలోపేతం కోసం సోము వీర్రాజు బాగా కష్టపడుతున్నారని, పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారని హైకమాండ్ భావిస్తుందని వీర్రాజు వర్గీయుల భావనంగా ఉందని చెబుతున్నారు. దీంతో సోముకు పార్టీ పెద్దల నుంచి ప్లస్ మార్కులు పడతాయని వారి ఆశలట. కొందరు కమలం నేతలు కూడా అఫ్ ది రికార్డుగా ఇదే విషయం చెబుతున్నారు.    ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రకటించిన కొన్ని రోజులకే హైదరాబాద్ వెళ్లి చిరంజీవిని కలిశారు సోము వీర్రాజు. తనకు సహకరించాలని చిరంజీవిని సోము వీర్రాజు కోరారని..  జనసేనాని పవన్‌‌కల్యాణ్‌తో కలిసి ముందుకెళ్లాలని సోము వీర్రాజుకు చిరంజీవి సూచించారని అప్పడు ప్రచారం జరిగింది. చిరంజీవిని బీజేపీలోకి రావాలని వీర్రాజు ఆహ్వానించినట్లు కూడా మరో చర్చ జరిగింది. అయితే చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించలేదని సోము వీర్రాజే సమావేశం తర్వాత క్లారిటీ ఇచ్చారు. కేవలం మర్యాదపూర్వకంగానే చిరంజీవిని కలిశానని తెలిపారు. జనసేన, బీజేపీ కలసి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారని వీర్రాజు చెప్పారు. చిరంజీవికి వచ్చిన 18 శాతం ఓట్లు, జనసేనకు వచ్చిన 7శాతం ఓట్లు.. భవిష్యత్తులో తమకు అనుకూలంగా మారతాయని కూడా చెప్పారు సోము వీర్రాజు.   గతంలో హైదరాబాద్ లో చిరంజీవిని సోము వీర్రాజు కలిసిన ఫోటోలను వాడుకుంటూ ఇప్పుడు కొత్త ప్రచారం నిర్వహిస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్ అనుచరులు. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ ఫోకస్ చేసిందని, సినీ తారలను పార్టీలోకి ఆహ్వానిస్తుందని చెబుతున్నారు. ఆ ఆపరేషన్ లో భాగంగానే కాంగ్రెస్ లో నుంచి సినీ నటి కుష్బూ బీజేపీలో చేరిందని చెబుతున్నారు. తమిళనాడుపై ఫోకస్ చేసిన మోడీ టీమ్.. అధికారమే లక్ష్యంగా గురుమూర్తి ద్వారా రజినీ కాంత్ కు  ఒక ప్రతిపాదన పంపినట్లుగా బలంగా వినబడుతోంది.  సోము వీర్రాజు మనుషులు కర్ణాటక, తమిళనాడు పరిణామాలను సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేస్తున్నారు. రజనీకాంత్, కుష్బూ బాటలోనే చిరంజీవి కూడా త్వరలోనే కమలం కండువా కప్పుకోవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతోంది సోము వీర్రాజు వర్గం.    అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇప్పుడు షూటింగుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల గురించి అసలు ఆలోచించడం లేదని తెలుస్తోంది. గతంలో పార్టీ పెట్టిన చిరంజీవి అధికారంలోకి రాలేకపోయారు. ఆ తరువాత పార్టీని కాంగ్రెస్‍లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని  నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి మళ్లీ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినీ లోకంలోకి వచ్చారు. గతంలో తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకుని మళ్లీ ఉన్న పేరు తెచ్చుకోవటానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయాలకు రావడం అసాధ్యమంటున్నారు మెగాస్టార్ అభిమానులు.    మరోవైపు సొంత తమ్ముడు జనసేన పార్టీని స్థాపించి జనంలోకి వెళుతున్నారు. గత ఎన్నికలలో పవన్‍ ఓడిపోయినా.. ప్రజలలో ఆయనకు ఆదరణ తగ్గలేదని.. ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాలలో వెల్లడైంది. అంతే కాకుండా బిజెపితో పవన్‍ కళ్యాణ్‍ పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో  చిరంజీవి మళ్లీ రాజకీయాల వైపు ఆలోచిస్తే జనసేనతో ఉంటారు కాని తమ్ముడి పార్టీ ఉండగా మరో పార్టీలోకి ఎందుకు వెళతారనే బేసిక్ ప్రశ్న సామాన్య ప్రజల నుంచే వస్తోంది. ఒకవేళ సోము వీర్రాజు చెబుతున్నట్లు బీజేపీ పట్ల చిరంజీవి సానుకూలంగా ఉన్నా.. ఎలాగూ జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి కాబట్టి జనసేనలో ఉన్నా పెద్ద తేడా ఉండదని చెబుతున్నారు. జనసేనతో ఉంటూ కమలానికి సపోర్ట్ చేయవచ్చు. ఏ రకంగా చూసినా చిరంజీవి బీజేపీలో చేరడమంటూ ఉండదని రాజకీయ అనలిస్టులు కచ్చితంగా చెబుతున్నారు.   మొత్తంగా చిరంజీవి బీజేపీలో చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనక వీర్రాజు మాస్టర్ మైండ్ ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవిని అడ్డుపెట్టుకుని తనపై వస్తున్న విమర్శల నుంచి గట్టెక్కాలని ఆయన ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. కొందరు నేతలు తమ సొంత ప్రయోజనాల కోసం చిరంజీవి పేరును వాడుకుంటున్నారని  మెగాస్టార్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చిరంజీవి ప్రమేయం లేకుండా ఆయన పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు అన్నయ్య అభిమానులు.

ట్రంప్ కు కోర్టులోనూ చుక్కెదురు.. ఓటమి తప్పదా..! 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయి ఓట్లు లెక్కింపు కొనసా.... గుతున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు తరువాత జార్జియా, మిచిగన్ రాష్ట్రాల ఫలితాలను ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో సవాల్ చేయగా చుక్కెదురైంది. ఈ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ తొలి దశలలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా, తరువాత అనూహ్యంగా బైడెన్ పుంజుకుని లీడింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా జార్జియా విషయంలో 53 బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి ఆలస్యంగా వస్తే, వాటిని కూడా కలిపివేశారని ఆరోపిస్తూ, ట్రంప్ టీమ్ కోర్టును ఆశ్రయించింది. ఇటు మిచిగన్ లో కూడా ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ట్రంప్ టీం డిమాండ్ చేసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల న్యాయమూర్తులూ ట్రంప్ పిటిషన్లను తోసిపుచ్చారు.   జార్జియా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ బాస్, ట్రంప్ అభ్యర్ధనను తోసిపుచ్చుతూ.. బ్యాలెట్లు చెల్లవని చెప్పడానికి ఎటువంటి సాక్ష్యాలూ లభించలేదని వ్యాఖ్యానించారు. ఇక మిచిగన్ కేసులో న్యాయమూర్తి సింథియా స్టీఫెన్స్ అయితే అసలు కేసును విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడం లేదని పేర్కొన్నారు.   మిచిగన్, జార్జియా కోర్టు తాజా తీర్పులపై ట్రంప్ ప్రతినిధులు ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. నెవెడాలో బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మిచిగన్ లో బైడెన్ విజయం ఖాయమైంది. జార్జియాలో మాత్రం ప్రస్తుతానికి ట్రంప్ అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. నెవెడాలో చెల్లని ఓట్లను లెక్కించి, వాటిని బైడెన్ ఖాతాలో కలిపారని, అంతేకాకుండా కరోనా కాలంలో క్లార్క్ కౌంటీని విడిచి వెళ్లిపోయిన వేలాది మంది ఓట్లను తీసుకొచ్చి కలిపారని తమకు అనుమానాలు ఉన్నాయని ట్రంప్ టీమ్ సభ్యుడు, నెవడా మాజీ అటార్నీ జనరల్ అడామ్ లక్సలత్ ఆరోపించారు. ఈ విషయంలో మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు తాము సైద్దమౌతున్నామని తెలిపారు.