8 పెళ్లిళ్లు.. గంజాయి గ్యాంగులు.. వాడు మామూలోడు కాదు గురు..  

అతడు నిత్య పెళ్లి కొడుకు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు.  కట్ చేస్తే.. ఆ నిత్య పెళ్లి కొడుకు తిక్క కుదిర్చారు పోలీసులు.  స్టైల్  గా తయారు అవ్వడం. రోడ్ల వెంట రోమియోలా తిరగడం.. ఒంటరిగా  కనిపించిన అమ్మాయిలకు మస్కా కొట్టడం.. తన లైఫ్ చాలా రిచ్ అని నమ్మించడం. బుట్ట బొమ్మల్ని బుట్టలో వేసుకోవడం. తనను పెళ్లి చేసుకుంటే సుఖమైన జీవితం ఉందంటూ మొదట వెంటపడతాడు. వారిని నమ్మించి తనపై నమ్మకం కలిగే వరకు ప్రేమించమని ప్రాధేయపడతాడు. అతడి మాటలు నమ్మి ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకుంటే త్వరగానే పెళ్లికి అంగీకరిస్తాడు.. ఆ తరువాతే మనోడి అసలు రూపం బయటపడుతుంది. ఆ తర్వాత తన మాట వినాల్సిందే.. లేదంటే కత్తులు, గన్ చూపిస్తాడు.  చంపేస్తానంటూ బెదిరిస్తాడు.  విశాఖపట్నానికి చెందిన అరుణ్ కుమార్ కు వ్యభిచార ముఠాలు, గంజాయి గ్యాంగులతో సంబంధాలున్నాయి. వాళ్లకి అమ్మాయిలను,గంజాయిను సరఫరా చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అమ్మాయిలను వలలో వేసుకుంటాడు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వ్యభిచార రొంపిలోకి దింపుతాడు. తాజాగా తన మొదటి భార్య వ్యభిచారానికి నిరాకరించడంతో ఆమె కుమార్తెను అమ్మేస్తాను  అంటూ బెదిరింపులకు దిగాడు. కేవలం ఆమెనే కాదు.. తనను నమ్మి వివాహం చేసుకున్న వారందర్నీ ఇలానే బెదిరించాడు.  వ్యభిచార ముఠా, గంజాయి గ్యాంగులతో సంబంధాలు కారణంగా మారణాయుధాలు కూడా అతడి దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అది కూడా సినిమాల్లో ఏవైనా మారణాయుధాలను చూస్తే..అచ్చం అలాంటి వాటినే తయారు చేయించి తన దగ్గర పెట్టుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఎవరైతే తన మాట వినరో వారికి కత్తులు, తుపాకులను చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నట్టు చెప్పారు.  తన మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురిని అమ్మేస్తానని చెప్పడమే కాకుండా, కత్తులు, తుపాకులతో బెదిరించాడని ఆమె కంచరపాలెంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆమె మహిళా సంఘలను ఆశ్రయించింది. అయితే బాధిత మహిళలు మాత్రం అరుణ్ కుమార్ కు పోలీసులతో స్నేహ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని.. అతడిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అతడి బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

వేటగాళ్లు.. వాళ్లు చాలా ముదుర్లు..  

వికారాబాద్ లో వేట. వీకెండ్ వస్తే చాలు తుపాకుల మోత. బడాబాబుల చేతిలో అడవి జంతువుల కోత. జింకలు, ఆవులే వాళ్ళ టార్గెట్. అటవీశాఖ అధికారులు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. ఆ వన్యప్రాణుల ప్రాణాలు తీయడంలో వాళ్లంతా భాగ్యస్వామ్యులే.  హైదరాబాద్ నుంచి కొందరు వేటగాళ్లు సరదాగా అడవిబాట పడుతున్నారు. దామగుండం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫామ్ హౌసుల్లో బస చేస్తూ.. అడవుల్లో వేట కొనసాగిస్తూ. రాత్రి వేళ్లల్లో వారి కంటపడ్డ వన్యప్రాణులను తుపాకీ తూటాలకు బలి చేస్తున్నారు.  రెండు నెలల క్రితం ఆవుపై కాల్పులు జరిపిన ఘటన మరువకముందే  మళ్లీ కొందరు వేటగాళ్లు మరోసారి తుపాకీ పేల్చారు. ఓ కృష్ణ జింకను బలితీసుకున్నారు. దామగుండం అడవుల్లో కృష్ణ జింక కళేబరాన్ని స్థానిక పశువుల కాపర్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు ఘటనా స్థలానికి వెళ్లకుండానే కుక్కల దాడిలో జింక చనిపోయిందని అధికారులు తేల్చేశారని స్థానికులు మండిపడుతున్నారు. వేటగాళ్లంతా బడాబాబులు కావడంతో  వారి కనుసన్నల్లోనే ఫారెస్టు అధికారులు పనిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేటగాళ్ల ముసుగులో కొందరు పెద్దలు  వన్యప్రాణులను బలితీసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అసత్య ప్రచారం తగదు.. టీటీడీ వ్యాఖ్యలు సిగ్గుచేటు..

తలనీలాల విషయంలో టీటీడీపై సోషల్ మీడియాలో అనవసర నిందలు వేస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మిజోరం పోలీసులు నమోదు చేసిన కేసులో టీటీడీ పేరు లేదని స్పష్టం చేశారు. అన్‌ ప్రాసెస్డ్‌ హెయిర్‌ను పట్టుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ప్రాసెస్‌ చేయకుండా తలనీలాలు విక్రయించమని.. కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలు తిరుపతికి తరలిస్తామని.. ఒక్క వెంట్రుక కూడా దొంగతనంగా బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు అదనపు ఈవో ధర్మారెడ్డి. అత్యంత పారదర్శకంగా ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తామని, దీనిపై అసత్య ప్రచారం తగదని హితవు పలికారు.   అయితే.. టీటీడీ వివరణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి తలనీలాలు ఎక్కడో చైనాకు తరలిస్తుండగా పట్టుబడితే, టీటీడీ అధికారులు తమకేం సంబంధమనడం సిగ్గుచేటని మండిపడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. తలనీలాల కాంట్రాక్ట్ పొందిన సంస్థ పూర్వాపరాలు టీటీడీ అధికారులకు తెలియవా అని ప్రశ్నించారు. తలనీలాలు తీసుకెళ్లి సదరు సంస్థ ఎక్కడ విక్రయిస్తుందో, ఏం చేస్తుందో తెలుసుకోకుండానే పాలకవర్గం, టీటీడీ అధికారులు కాంట్రాక్ట్ కట్టబెట్టారా అని నిలదీశారు. తలనీలాల ఘటనకు సిగ్గుపడకుండా, ధర్మారెడ్డి ఎవరిపై కేసులు పెడతారని మండిపడ్డారు.  హిందువుల వైకుంఠమైన తిరుమలను జగన్మోహన్‌రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చేశాడని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. పరమతానికి చెందిన ముఖ్యమంత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయించాలన్నారు. టీటీడీ పాలకవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.

కేసీఆర్ మెడలో గంట కట్టేదెవరు?

తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, ఎవరికీ వారు సొంత దుకాణాలు పెట్టుకుంటే, ప్రయోజనం ఉండదని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శక్తి యుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కునే, ఉమ్మడి వేదికగా కొత్త పార్టీ ఏర్పాటు కావాలన్న అభిప్రాయం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మేథావి, మీడియా వర్గాలలోనూ వినవస్తోంది. అయితే, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.  ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తెరాసకు ధీటైన ప్రత్యాన్మాయం అవసరం చుట్టూ ఆలోచనలను నడిపిస్తున్నారు. అయితే ఆయన కూడా ఇదమిద్దంగా ఇదీ ఐడియా, ఇదీ బ్లూ ప్రింట్ అని కాకుండా, అటు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులతో, అదే విధంగా కాంగ్రెస్, బీజేపీ సహా అనేక ఇతర పార్టీలలో ఉన్న నాయకులతో బహిరంగంగా, లోపాయికారిగా చర్చలు జరుపుతున్నారు. మీడియా ముందు తమ ఆలోచనలను ఉంచుతున్నారు. ఒక విధంగా మేథోమథనం సాగిస్తున్నారు. అయితే, అది అంత సులభంగా అయ్యే పని కాదన్న వాదన కూడా వినిపిస్తోంది.  కేసీఆర్‌పై వ్యతిరేకత విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా.. నాయకత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరడం అయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కోదండరామ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఇలా చాలా మంది టీఆర్ఎస్‌కు, మరీ మాట్లాడితే కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేశారు. అయినా అందరూ విఫలమయ్యారు. ఒక విధంగా, ఎవరి కుంపటి వారు పెట్టుకోవడం వలన మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కారు పార్టీ విజయం సాధించింది. అంతే కాదు, కేసీఆర్ కుటుంబ పాలనపై ఒంటరి పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న ఓటమికి, వీరంతా కారణమయ్యారు. ఒక విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధులను కేసీఆర్ వ్యతిరేకులంతా ఎవరికి వారే విడిపోయి గెలిపించారు. ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావాలి. అలా అందరినీ ఏకం చేయాలంటే అందుకు మరో కేసీఆర్ కావాలి.. అన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  అదలా ఉంటే, ప్రాతీయ పార్టీలకు చెక్ పెట్టడం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే సాధ్యమన్న విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. బలమైన ప్రాంతీయ పార్టీకి బలమైన ప్రాంతీయ పార్టీనే ప్రత్యాన్మాయం అని ఆలోచించే వారు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతున్నారు. మరోవైపు ప్రాతీయ పార్టీకి జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ ప్రత్యాన్మాయం కాగలుగుతాయని చూపేందుకు అనేక ఉదాహరణలు చూపుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగు దేశం సుదీర్ఘ కాలం పాటు ప్రత్యాన్మాయంగా నిలిచింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో  ప్రాంతీయ పార్టీ తృణమూల్ కు జాతీయ పార్టీ బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లో సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రానికే చెందిన ఎస్పీ, బీఎస్పీలు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు, బీజేపీ అధికారంలో ఉంది. అలాగే, అస్సాం, బీహర్ సహా  ఇంకా చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ప్రత్యర్దులుగా పోటీ పడుతున్నాయి. మిత్ర పక్షాలుగా మెలుగుతున్నాయి. సో.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యాన్మాయం అవసరం కానీ, అది ప్రాంతీయ పార్టీనే కావాలని అనుకోవడంతో మాత్రం అర్థం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

పింగళికి జై కొట్టు తెలుగోడా..

75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని.. స్వాతంత్ర్యం రావడానికి కీలకపాత్ర వహించిన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యను అదే రీతిలో గుర్తించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. జాతీయ జెండా ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా విశిష్టతపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన సందర్శించారు.  పింగళి వెంకయ్య కృషిని వెలుగెత్తి చాటాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. పింగళి వెంకయ్యకు గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభ సమయంలో జాతీయ పతాకాన్ని రూపొందించాలని సాక్షాత్తు మహాత్మ గాంధీయే పింగళి వెంకయ్యకు సూచించారని అన్నారు. గాంధీ స్ఫూర్తితోనే పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి రూపకల్పన చేశారన్నారు. గురువారం విజయవాడలో జాతీయ జెండా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మండలి బుద్ద ప్రసాద్ వెల్లడించారు. 

ఒక్క  టీ.. నిండు ప్రాణం తీసింది.. 

పొద్దున్నే టీ కావాలి . అది తాగితేనే డే  స్టార్ట్ అవుతుంది. అది పట్నం లో ఉన్న వాళ్ళైనా పల్లెలో ఉన్న వాళ్ళైనా. కొంత మంది అయితే గంట కొట్టినట్లు .. గంటకో టీ తాగుతారు. కానీ ఈ  వార్త చదివాకా టీ వింటేనే మీకు వణుకు పుడుతుంది.  రోజు లాగే ఆమె టీ పెట్టింది. ఇంట్లో ఉన్న ముగ్గురికి టీ ఇచ్చింది. ఇక అంతే.  ఆ టీ తాగిన కొద్దిసేపటికి ఒకతను  మరణించాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. టీ తాగితే ప్రాణం పోవడం ఏంటని అనుకుంటున్నారా..   పొలంలో రైతులు చేనుకు చల్లే గుళికలు టీలో వేసింది ఆమె.  బచ్చన్నపేట మండలం రామచంద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ టీపొడి అనుకుని టీలో ఎండ్రీన్ గుళికలు వేసింది. ఆ టీ తాగిన వారిలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో దాసరం అంజమ్మ (60) అనే మహిల మృతి చెందింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చరీకి తరలించారు. దాసరం మల్లయ్య(70), దాసరం భిక్షపతి (60) ల పరిస్థితి విషమంగా ఉంది. ఆ మహిళా కావాలనే నిజంగానే పొరపాటు పడి టీ లో గుళికలు కలిపిందా..? లేక పొరపాటు గానే కలిపిందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వందేళ్ల వందనం.. తెలుగుజాతి గౌరవం..

మువ్వన్నెల జెండా. భారతీయుల గుండె చప్పుడు. మన జాతి నిండు గౌరవం. త్రివర్ణ పతాక రెపరెపలకు నేటికి సరిగ్గా నూరేళ్లు. అది మన తెలుగువాడి సంతకమే అవడం మనకందరికీ గర్వకారణం. ఆ జెండాకు వందనం చేసినప్పుడల్లా.. భారత ఘనకీర్తితో పాటు తెలుగువాడి పేరూ గుర్తుకొస్తుంటుంది. 1921 మార్చి 31న పింగళి వెంకయ్య రూపొందించిన పతాకం నేటితో శత వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ పతాకం దేశ భక్తికి నిదర్శనం. ఆ జెండా మన జాతి పొగరు. ఆ మూడు రంగులు.. సమతా స్పూర్తికి చిహ్నాలు. మధ్యలో అశోక చక్రం.. మన చరిత్ర స్వప్నం. చూట్టానికి సింపుల్‌గా కనిపించినా.. భిన్నత్వంలో ఏకత్వమంతా విశిష్టం. అంతటి మహత్తరమైన జాతీయ జెండాను మన పింగళి వెంకయ్య.. మూడంటే మూడు గంటల్లోనే రూపొందించడం విశేషం.  గాంధీ గారి సూచనలతో పింగళి వారు జాతీయ జెండాను తయారు చేసే బాధ్యతను స్వీకరించారు. మొదట్లో మూడు రంగులు లేవు. మధ్యలో అశోక చక్రమూ అనుకోలేదు.  పింగళి వెంకయ్య జెండాను రెండు రంగులతోనే రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. మధ్యలో 'చరకా'తో జెండా ముసాయిదా తయారు చేశారు. దాన్ని గాంధీకి చూపిస్తే.. ఆయన పలు మార్పులు సూచించారు. ఎరుపు స్థానంలో కాషాయం వచ్చింది. తెలుపు రంగు జోడించారు. ఆనాడు అది కాంగ్రెస్ జెండా మాత్రమే. ఆ తర్వాతే అది జాతీయ జెండాగా రూపాంతరం చెందింది. ఇందులో ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ ముస్లింలకు, తెలుపు ఇతర మతాలకు ప్రతీక.   జాతీయ పతాక రూపకల్పనకు బీజం పడింది 1906లోనే. కోల్‌కతాలో 22వ అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు నిర్వహించగా... ప్రారంభానికి ముందు బ్రిటీష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి రావడంతో పింగళి కలత చెందారు. ఈ క్షణంలోనే మనకు ప్రత్యేక జెండా ఉండాలని తలిచారు. ఆ సభలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తంచేయగా.. ఆయనను కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సమితి సభ్యుడిగా నియమించారు. పతాక ఆవశ్యకతను వివరిస్తూ వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆ తర్వాత జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు వ్యత్యాసం ఉండాలని.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగులతో.. మధ్యలో నీలిరంగు అశోకచక్రంతో.. జాతీయ పతాకం వినువీధుల్లో రెపరెపలాడింది.  అవి.. స్వాతంత్ర్య సంగ్రామం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీన ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల సమావేశాలు బెజవాడలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే పింగళి వెంకయ్య కాంగ్రెస్ జెండాకు ముసాయిదా రూపాన్ని ఇచ్చారు. ఆ జెండాకే కొన్ని మార్పులు చేసి తదనంతర కాలంలో జాతీయ జెండాగా ఆమోదించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకంతో.. ఇటు తెలుగువారికి, అటు బెజవాడకూ మంచి గుర్తింపు వచ్చింది.  త్రివర్ణ పతాకానికి వందేళ్లు పూర్తైన సందర్భంగా.. పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డ వాసులు ఆయనకు నివాళి అర్పించారు. పింగళి లాంటి మహోన్నత వ్యక్తి తమ గ్రామస్థుడు కావడం సంతోషంగా ఉందన్నారు. శతవసంతాల వేడుకని పురస్కరించుకుని వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జాతీయ పతాక ముసాయిదాను రూపొందించి వందేళ్లైన వేళ.. ప్రభుత్వం తరఫునా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏపీలో గానీ, కనీసం కృష్ణాజిల్లాలో గాని శతాబ్ది ఉత్సవాల ఊసే లేదు. ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ ఆనాటి సంఘటనల సమాహారమైన ఫొటోలతో కేటలాగ్‌ను విడుదల చేసి మమ అనిపించింది. అంతే తప్ప.. వందేళ్ల జాతీయ జెండా రూపంలో తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్యను సరైన విధంగా స్మరించుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ఆ మహానీయుడికి అవమానమే. 

బంజారాహిల్స్ లో మహిళ కిడ్నాప్ 

బంజారాహిల్స్ లో మహిళని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. దుండగులు మూడు బైకుల్లో వచ్చి. ఓ మహిళను  కిడ్నాప్ చేసినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆ ఏరియాలో వీధి లైట్స్ లేవు . సీసీ కెమెరాలు లేవు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది.. అక్కడే ఆ మహిళా కిడ్నప్ కి ప్లాన్ చేశారు.   మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో వీధి లైట్లు లేకపోవడం, సీసీ కెమెరాలు కూడా పక్కకు తిప్పి ఉండడం చూస్తే ఓ ప్లాన్ ప్రకారం యువతిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ జరిగిన కాసేపటికి వీధి లైట్లు వెలిగాయని స్థానికులు చెప్పారు. అయితే బాధితురాలు ఎవరు? కిడ్నాప్ ఎందుకు చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మద్యం డోర్ డెలివరీ.. యువతికి 2 లక్షలు టోపీ.. 

ఆన్లైన్ మోసగాళ్లు రూట్ మార్చారు. మొన్న పోలీసుల ఫేస్బుక్ హ్యాక్ చేసి డబ్బులు కావాలంటూ.. మెసేజిలు పంపారు.. తాజాగా ఆన్లైన్ లో మద్యం డోర్ డెలివరీ అంటూ  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దగ్గర ఏకంగా 2 లక్షలు వేటు వేశాడు.  తన ఫ్రెండ్  బర్త్‌డే గిఫ్ట్‌గా బ్రాండెడ్‌ మద్యం బాటిల్‌  ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుంది ఓ యువతి. అందుకోసం ఆన్‌లైన్‌ నమ్ముకుంది. లిక్కర్‌ ఆన్‌లైన్‌ డెలివరీ కోసం గూగుల్‌లో వెతికింది. అందులో ఓ నెంబర్‌ కనిపించడంతో ఫోన్‌ చేసింది. తాము కుల్దీప్‌ వైన్స్‌ నిర్వాహకులమని, ఆన్‌లైన్‌ ద్వారా నగరంలో ఎక్కడైనా మద్యం డోర్‌ డెలివరీ చేస్తామని ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన వ్యక్తి ఆమెకు నమ్మకంగా చెప్పాడు. ముందుగా రూ. 10 వేలు గూగుల్‌పే  చేయమన్నాడు. ఆగంతుకుడు సూచించిన నంబర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. డబ్బు జమకాలేదని, తాము పంపించే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలని అతడు చెప్పడంతో అలాగే చేసింది. ఇక అంతే మధ్య బాటిల్ ఇస్తే తన ఫ్రెండ్ సప్రైజ్ అయ్యేవాడా లేదా  తెలియదు గానీ.. యువతీ మాత్రం సర్ప్రైజ్ అయింది.  ఆమె ఖాతా నుంచి రూ. 30 వేలు డెబిట్‌ అయ్యాయి. మరోసారి కాల్‌ చేసిన ఆగంతుకుడు తమకు ఎక్కువగా డబ్బులు వచ్చాయని, బాటిల్‌ ఖరీదు పోను మిగతా డబ్బు రిటర్న్‌ చేస్తామని ఇంకో క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. అలా పలు దఫాలుగా రూ. 1.20 లక్షలు కాజేశారు. ఆమెను నమ్మించేందుకు కేటుగాడు రూ. 200 బాధితురాలి అకౌంట్‌లో జమచేశాడు. ఈ సారి క్రెడిట్‌కార్డు వివరాలు, సీవీవీ నంబర్‌, ఓటీపీ చెబితే డబ్బు మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని అతడు నమ్మించడంతో యువతి ఆ వివరాలు చెప్పింది. మరోసారి ఆమె క్రెడిట్‌ కార్డు నుచి రూ. 70వేలు డెబిట్‌ అయ్యాయి. బాధితురాలు సైబర్ ‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంతకైనా మంచిది కొంచం ఆచితూచి అడుగేయండి.. జీతం తో కష్టపడి పోగుచేసిన సొమ్ము దండుకుపోతారు ఆన్లైన్ మోసగాళ్లు.

రైతు కంట కన్నీళ్లు.. ఇదేనా మీ పరిపాలన?

'మీ బతుకులు చెడ.. ఇదేనా మీ పరిపాలన' అంటూ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. రైతులు సమస్యలతో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కనిపించడం లేదా? అంటూ నిలదీశారు. మంత్రులు ధాన్యాన్ని కొనుగులు చేయకుండా బూతులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఈ బూతుల మంత్రులు టీవీలో వస్తుంటే ప్రజలు చిదరించుకుంటున్నారని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గం, డక్కిలి మండలం, వెలికల్లు గ్రామ రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. 75 కిలోల వడ్ల బస్తాని 80 కిలోలు కడుతున్నారని.. కళ్ళ ముందు దోపిడీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చేతకాని ప్రభుత్వం, అసమర్ధ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. ‘‘మీ బ్రతుకులు చెడ ఇదేనా మీ పరిపాలన’’ అంటూ దుయ్యబట్టారు దేవినేని ఉమా. 

చదువు వద్దు.. పెళ్లి ముద్దు..

ఆ అమ్మాయికి 13 ఏళ్ళు. పడవ తరగతి చదువుతుంది. అమ్మాయి చదువుకుంటానంది .. తల్లిదండ్రులు పెళ్లి చేస్తమన్నారు.  బాలికకు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే బాలిక చదువుకుంటున్న తనకు ఎందుకు పెళ్లిచేస్తున్నారని తల్లిదండ్రులను నిలదీసి, ధైర్యంగా స్థానికంగా ఉన్న మహిళా పోలీసుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.  బాలిక సచివాలయంలోని మహిళా పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈవోపీఆర్డీ, రెవెన్యూ, గ్రామ సెక్రటరీ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక వయస్సు ఆధార్‌ నంబరులో గుర్తించి తల్లిదండ్రులను మందలించగా ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుసుకున్న అధికారులు వారికీ  కౌన్సిలింగ్‌ ఇచ్చి పెళ్లి ప్రయత్నం నిలుపుదల చేయించారు. బాలిక చదువుకునేందుకు ఆదుకుంటామని, సంక్షేమ పథకాలూ అందేలా చర్యలు తీసుకుంటామని ఈవోపీఆర్డీ తెలిపారు. ఈ ఘటన తూర్పు గోదావరి ఎటపాక మండలం గౌరీదేవిపేట గ్రామంలో జరిగింది.   

నోరు జారిన ఖుష్బూ.. బీజేపీ పరువు గోవిందా..

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఖుష్బూ దూసుకుపోతున్నారు. బీజేపీకే మీ ఓటు అంటూ ఊదరగొడుతున్నారు. పనిలో పనిగా.. ప్రజా సమస్యలపైనా ఫైర్ఱ అవుతున్నారు. థౌజెండ్‌లైట్స్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఖుష్బూ .. స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను దుమ్మి దులిపేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలను గాలికొదిలేశాడని మండిపడ్డారు. ఖుష్బూ ఇంతగా తిడుతుంటే.. అక్కడున్న ప్రజలంతా తెగ నవ్వుతున్నారు. ఖుష్బూ వెంట ఉన్న బీజేపీ నేతలు మేడమ్ వద్దు మేడమ్.. ఆపండి మేడమ్ అంటూ తెగ అరుస్తున్నారు.  ఇంతకీ అక్కడ జరిగిన పొరబాటు ఏంటంటే... ఖుష్బూ తిట్టిన గత ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆమె పక్కనే ఉన్నారు. సదరు ఎమ్మెల్యే డీఎంకేకు రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరారు. ఖుష్బూతో కలిసి.. థౌజెండ్‌లైట్స్‌లో విస్త‌ృత ప్రచారం చేస్తున్నారు. ఖుష్బూ తిట్టే సమయంలోనూ ఆయన ఆమె పక్కనే ఉన్నారు. దీంతో.. జనమంతా నవ్వుకున్నారు. వెనకాల ఉన్న బీజేపీ నేతలు ఆ పాత ఎమ్మెల్యే సెల్వం మీ పక్కనే ఉన్నారని చెప్పడంతే ఖుష్బూ సర్దుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడున్న కార్యకర్తలతా పెద్దపెట్టున నవ్వుతూ కేకలేశారు. దీంతో ఖుష్బూ కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. 

ప్రత్యాన్మాయం ఎవరో సాగర్‌లో తేలుతుందా?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరన్న ప్రశ్నకు సమాధనం చిక్కినట్లే కనిపించింది. దుబ్బాకలో అధికార పార్టీ సిట్టింగ్ సీటు గెలుచుకోవడంతో పాటుగా జీహెచ్ఎంసీలోఅధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన, బీజేపీనే తెరాసకు ప్రత్యాన్మాయం అని ప్రతి ఒక్కరూ ఫిక్సయి పోయారు. కానీ, ఇంతలోనే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలదళం కేసీఆర్ ఎత్తుకు చిత్తయి,బొక్కబోర్లా పడింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఊపు మీద హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ సిట్టింగ్ సీటుతో పాటుగా,   ఖమ్మం,వరంగల్, నల్గొండ సీటు మీద కూడా కన్నేసిన కమల దళానికి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లుగా, సిట్టింగ్ సీటు కూడా చేజారి పోయింది. అదే క్రమంలో వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కమలదళాధిపత్యాన్ని, ప్రత్యాన్మాయ స్టేటస్’ను మరోమారు ప్రశ్నార్ధకం చేసింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరసగా మూడు నాలుగు స్థానాలకు దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్’లో ఎన్నికలకు ముందే, బీజీపీని రేసులోంచి తప్పించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలో దిగడమే కాకుండా, గైలుపు మీద ధీమాతో ముందుకు సాగడంతో సాగర్’లో పోటీ తెరాస,కాంగ్రెస్ పార్టీల మధ్యనే అనే పర్సెప్షన్ క్రియేట్ అయింది. నిజంగానే,జానా రెడ్డి గెలిచినా గెలవక పోయినా బీజేపీది మూడో స్థానమే అనేది అయితే, ఇంతవరకు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెరాసకు ప్రత్యాన్మాయం ఎవరన్న ప్రశ్న మళ్ళీ మొదటికొచ్చింది.  అయితే, ఓ వంక సాగర్’లోనూ సత్తాచాటుతామని అంటూనే, బీజేపీ నాయకులు మరో వంక   నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ఒక ఎక్సెప్షనల్ కేసుగా పరిగణించాలని కూడా అంటున్నారు.ఒక విధంగా అది నిజమే కావచ్చును, అక్కడ కాంగ్రెస్ కంటే జానా ఇమేజే ఎక్కువగా కనిపిస్తోంది. జానా కూడా తన పర్సనల్ ఇమేజినే ఫోకస్ చేస్తున్నారు కానీ,కాంగ్రెస్ పార్టీ ఇమేజిని ఫోకస్ చేయడం లేదు. మాజీ ఎమ్మెల్యేగా,మంత్రిగా నియోజక వర్గానికి చేసిన సేవలు,మంచి పనులు చెప్పుకుంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారే కానీ, కాంగ్రెస్ పార్టీని గానీ,పార్టీ నాయకత్వాన్ని కానీ, పెద్దగా ప్రచారానికి వాడుకోవడంలేదు. ఒక విధంగా జానా,’ సింహం టైపులో సిగిల్’గానే ఫైట్ చేస్తున్నారు. అలాగే ఇతర నాయకులు కూడా, అంతగా పట్టించుకోవడం లేదు. ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు సభలు ఏర్పాటు చేయడమే తప్ప,పీసీసీ స్థాయిలో ప్రచారం వ్యూహం,ప్రచార బాధ్యతలు ఉన్నట్లు కనిపించడం లేదు. సరే, అది ఎలా ఉన్నా, ఒక వేళ సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ మూడవ స్థానానికే పరిమితం అయినా, దాన్నిజనరలైజ్ చేయలేమని, కమల దళం ఇప్పటి నుంచే మరో  లాజిక్ ‘ను ముందుకు తెస్తోంది.అయితే, జానా రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చాలామందే ఉన్నారు. అలాగే, దుబ్బాకలో బీజేపీ విజయం కూడా రఘునందన రావు వ్యక్తిగత విజయమని అనుకోవలసి వస్తుంది. సో ... స్టేట్’లో తెరాసకు ప్రత్యాన్మాయం తామే అని నిరూపించుకోవాలంటే  సాగర్ సీటును గెలుచికోవడం ఒక్కటే కమల దళం ముందున్న ఆప్షన్, అది అయ్యే పనేనా,అంటే కాదనే సమాధానమే వస్తోంది.

12 రోజులు బ్యాంకులు బంద్.. వామ్మో ఇన్ని సెలవులా? 

బ్యాంకులకు ఏప్రిల్‌లో ఎక్కువగా సెలవులు ఉన్నాయి. ఏప్రిల్‌లో 30 రోజులు ఉంటే అందులో 12 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.  అందుకు తగ్గట్టుగా కస్టమర్లు బ్యాంకు లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.  ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్, ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4- ఆదివారం, ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 10- రెండో శనివారం, ఏప్రిల్ 11- ఆదివారం బ్యాంకులకు సెలవు. దీంతో పాటు ఏప్రిల్ 13- ఉగాది, ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18- ఆదివారం, ఏప్రిల్ 21- శ్రీరామనవమి, ఏప్రిల్ 24- నాలుగో శనివారం, ఏప్రిల్ 25- ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇవన్నీ హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సెలవులు. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.  

ప్రభుత్వ సహకారంతోనే.. ఓటు కోసం హైకోర్టుకు?

ఏపీలో స్థానిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదు. స్థానిక ఎన్నికల్లా కాకుండా సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించాం. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. మార్చి 31తో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. మీడియా ద్వారా సిఎస్‌కు, సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవస్థల మధ్య అంతరాలు అనవసరంగా వచ్చాయన్నారు నిమ్మగడ్డ.  ఏపీ హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని నిమ్మగడ్డ గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, 243కె ద్వారా విస్తృత అధికారాలు రాజ్యాంగం కల్పించిందన్నారు. వ్యవస్థలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. నామినేషన్ వెయ్యనివ్వలేనప్పుడు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు.  ఇక తన ఓటు హక్కుపై చెలరేగిన దుమారంపైనా స్పందించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. తన ఓటు తెలంగాణలో రద్దు చేసుకుని సొంత గ్రామంలో ఓటు అడిగానని, అది నిరాకరించడంవల్ల టీ కప్పులో తుఫానుగా మారిందన్నారు. ఇప్పటికీ తన ఓటు హక్కు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదని.. పదవీ విరమణ తర్వాత ఒక పౌరుడిగా తన హక్కు సాధించుకోడానికి వెనకాడనన్నారు. ఓటు హక్కు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళతానన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

వైసీపీకి ఓటేయను.. జగన్ కి పనిచేయను...

ఏపీలో దళితుల హక్కులను తుంగలో తొక్కుతున్నారని. ఎసి ఎస్టీ అట్రాసిటీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. రైతులపై దాడులు చేస్తున్నారని. వైసీపీ ప్రభుత్వం పై అమరావతి దళిత జేఏసీ మండిపడింది. ఇది ఇలా ఉండగా రైతులు వైసీపీ పార్టీ పాలనపై చాలా విరక్తిగా మాట్లాడారు.    గత ఎన్నికల్లో వైసీపీ ఏజెంట్‌గా పని చేశాను. జీవితంలో బుద్ధి వచ్చింది. ఇంకోసారి వైసీపీకి ఓటు వేయను, ఆ పార్టీ కి పని చేయను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని అప్పుడు అన్నాడు. గెలిచాక ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తున్నాడు.  అవకాశం అంటే ఆదరించారు గానీ.. అన్యాయం జరిగితే ఊరుకునేది  లేదు ఆనుతున్నారు ఏపీ రైతు జెఏసి. అమరావతిలోని బడుగు, బలహీన వర్గాల రైతులను అణగదొక్కడానికి వైసీపీ ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన దళిత రైతులకు జగన్‌ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని రాజధాని దళిత జేఏసీ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగింది. వెలగపూడి రైతు జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన దళిత రైతుల సమావేశంలో రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెంకటపాలెం, ఐనవోలు, దొండపాడు గ్రామాలకు చెందిన దళిత, బీసీ, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన అసైన్డ్‌ రైతులు పాల్గొన్నారు. సమావేశంలో ఐనవోలుకు చెందిన రైతు జెట్టి చిన్నా మాట్లాడుతూ వైసీపీ కి ఎప్పుడు పనిచేయనని ఓటు వేసేది లేదని తెగేసి చెప్పాడు.   మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రము లో దళితులకు హక్కు కల్పిస్తూ గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ.41ని సీఎం జగన్‌రెడ్డి రద్దు చేస్తానని చెప్పడం ఆయన నియంత్ర పాలనకు నిదర్శనమని.. అమరావతి లో అసైన్డ్‌ రైతుల భూములు లాక్కున్నారని ప్రచారం చేయిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో జగన్‌రెడ్డి ప్రభుత్వమే అని శ్రావణ్ కుమార్ అన్నారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నాశనం చేయడానికి పూనుకున్నారని. మంగళగిరి ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని రాజధాని అసైన్డ్‌ రైతులు అడిగితేనే మాజీ సీఎం చంద్రబాబు జీఓ.41 ఇచ్చారన్నా రు. అసైన్డ్‌ దళిత రైతుల హక్కుల గురించి, జీఓ.41తో అసైన్డ్‌ రైతులకు కలిగే ప్రయోజనాల గురించి హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరిం చారు. గ్రామాల్లో దళిత రైతుల ఇళ్ల వద్దకు సీఐడీ పోలీసులు వచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలన్నారు. మిగిలిన రైతులతో సమానంగా అసైన్డ్‌ రైతులకు ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని  ప్రభుత్వం అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. దళితుల భూములను అడ్డంపెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడం జగన్ కే చెల్లుతుందని. అమరావతి లో కట్టిన పేదల టిడ్కో గృహాలు కల్పించాలని.  ప్రతి దళిత రైతుకి రూ.5వేలు పింఛను హామీ అమలు చేయాలని తీర్మానాలు చేశారు. రాజధానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు అధికారులు దళితుల భూములపై కుట్రలు పన్ని, వారిని మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నారని. వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశం లో దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, జేఏసీ మహిళా అధ్యక్షురాలు సువర్ణ కమల, కంభంపాటి శిరీష, జేఏసీ సభ్యులు బేతపూడి సుధాకర్‌, ముళ్లమూడి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి  ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఉపాధి హామీ పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సరైన జవాబు ఇవ్వకపోతే సీఎస్‌ను కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. రాష్ట్రంలో 2018 నుంచి 2019 వరకు నరేగా పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదంటూ న్యాయవాదులు వీరారెడ్డి, ప్రణతి, నర్రా శ్రీనివాస్‌ పిటిషన్లు వేశారు. దీనిపై సుమారు ఏడాది కాలంగా విచారణ జరుగుతోంది. 2018 నుంచి 2019 వరకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమాధానంగా కేంద్రం నుంచి డబ్బులు రాలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. ఆ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. 2018 నుంచి 2019 వరకు రాకపోతే ఆ తర్వాత సంవత్సరాలకు బిల్లులు ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. పైగా రూ. 5 లక్షల లోపు ఉన్న బిల్లులకు 20 శాతం తగ్గించి ఇస్తామని కోర్టుకు చెప్పి ఆ తర్వాత డబ్బులు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

హైదరాబాద్ లో కరోనా హాట్ స్పాట్స్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీలో ఆందోళనకరంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చిందనే భయాందోళన వ్యక్తమవుతోంది. దీంతో  మహమ్మారి కట్టడి కోసం జీహెచ్ఎంసీ గట్టి చర్యలు చేపట్టింది. మరోసారి నగరంలో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కూకట్ పల్లి, జీడిమెట్ల, శేరిలింగంపల్లి, హిమాయత్ నగర్, చింతల్ బస్తీ, మలక్ పేట్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ లను అధికారులు హాట్ స్పాట్స్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే సిటీలో మాస్క్ మస్ట్ అనే ప్రచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.  ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే కొంతవరకైనా కరోనా పాజిటివ్ కేసులు రాకుండా ఉంటాయని జీహెచ్ఎంసీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. జీహెచ్‌ఎంసీలోని ప్రధాన కార్యాలయంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కార్యాలయంలోని  3, 4, 5 అంతస్తుల్లో పని చేసే 10 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. దీంతో ఉద్యోగులు డ్యూటీకి రావాలంటేనే భయపడిపోతున్నారు మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులపై వాహనదారులకు రాచకొండ టాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించక పోతే కరోనా ఎలా వెంటాడుతుందో వాహన దారులకు తెలియజేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ప్రజలంతా కచ్చితంగా మాస్కులు ధరించాలని ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్నారు. గుంపులు గుంపులుగా గేదరింగ్ అవ్వొద్దని చెబుతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మరి కొన్ని రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.   

పవన్ సీఎం.. జగన్‌లో కలవరం..

మా సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సంచలన ప్రకటన. తిరుపతి ఉప ఎన్నికల కోసమే ఈ స్టేట్‌మెంట్ అంటూ ప్రత్యర్థి పార్టీల విమర్శ. మిగతా పార్టీల సంగతి ఏంటో గానీ.. అధికార వైసీపీలో మాత్రం ఈ ప్రకటన ప్రకంపణలు స‌ృష్టిస్తోంది. బీజేపీ. జనసేన కలిసి పోటీ చేయడం ఫ్యాన్ పార్టీకి సంకటమే. అలాంటిది పవన్ కల్యాణ్ సీఎం కేండిడేట్ అంటూ ఎన్నికల బరిలో దిగితే వైసీపీ ఓట్లు భారీగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన వేరు వేరుగా పోటీ చేయడంతో ఆ మేరకు వైసీపీ లాభపడింది. ఈ సారి సీన్ అలా ఉండబోదని.. జగన్ పార్టీ సీన్ సితారా కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ అంటే ఓ పేరు కాదు. అదో పవర్. అభిమానులకు పూనకం తెప్పించే ఎమోషన్. పవర్ స్టార్‌ను పవర్‌లో చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. ఆయన కనిపిస్తేనే ఊగిపోతారు. నినాదాలతో హోరెత్తిస్తారు. కానీ, ఓటేయమంటే సైడ్ అయిపోతారు. గత ఎన్నికల్లో ఇదే జరిగింది. ఈసారి మాత్రం అలా జరగబోదంటోంది జనసేన. తొలిసారి కాబట్టి జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఎందుకిచ్చామా అని జనం తల పట్టుకుంటున్నారు. రెండేళ్లలోనే జగన్ ఎంత డేంజరో జనాలకి తెలిసొచ్చింది. రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టిన జగన్‌ను ప్రజలు ఈసడించుకుంటున్నారు. జగన్‌కు ప్రత్యామ్నాయం జనసేనానే అంటున్నారు ఆయన అభిమానులు. 2019లో కామ్రేడ్లు, బీఎస్పీతో కలిసి బరిలో దిగారు పవన్ కల్యాణ్. ఎన్నికలయ్యాక మీకేమైనా బాకీనా? అంటూ కామ్రేడ్లతో దోస్తీకి కటీఫ్ చెప్పారు. మోదీనే బెస్ట్ అంటూ బీజేపీతో జత కలిశారు. తెలంగాణ బీజేపీతో సంబంధాలు చెడినా.. ఏపీ బీజేపీతో మైత్రి బంధం ప్రస్తుతానికైతే బాగానే నడుస్తోంది. ముందుముందూ నడుస్తుందని ఆశిస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రయత్నించింది. గత ఎంపీ ఎలక్షన్లలో బీజేపీకంటే తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ లెక్కలన్నీ ముందేసింది. అయినా, కమలనాథులు కనికరించలేదు. తిరుపతి సీటు జనసేనకు ఇవ్వలేదు. కానీ, అనూహ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కల్యాణే అంటూ సంచలన ప్రకటన చేశారు సోము వీర్రాజు. పీకే క్రేజ్‌ను తిరుపతి బై పోల్‌లో ఫుల్‌గా క్యాష్ చేసుకునేందుకే ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారని కొందరు అంటున్నారు. అయితే, అలాంటిదేమీ లేదని.. ఏపీలో బీజేపీ ఇంకా సీఎం కుర్చీకి పోటీ పడే స్థాయికి చేరుకోలేదని చెబుతున్నారు. ముందు తమ మిత్రుడు పవన్ కల్యాణ్‌కు ఛాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత పార్టీ పరంగా మరింత బలపడి.. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఆలోచనలో కమలదళం ఉందని విశ్లేషిస్తున్నారు. సీఎం కేండిడేట్‌గా పవన్ కల్యాణ్ పేరును ఇప్పుడే తెరమీదకు తీసుకురావడం వ్యూహాత్మకమంటున్నారు. అయితే, ఈ ప్రకటన అధికార వైసీపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీపై గుర్రుగా ఉన్నారు ఏపీ ప్రజలు. ఎంతగా టెంపుల్ పాలిటిక్స్ చేస్తున్నా.. ఓటర్లను ఆకర్షించలేకపోతున్నారు. అటు, పవన్ కల్యాణ్ టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ.. అప్పుడప్పుడూ ఆవేశంగా ఊగిపోతూ.. ఆ తర్వాత కొంతకాలం సినిమాలు చేస్తూ.. ఇలా రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం సాగిస్తున్నారు. ఆ రెండు పార్టీల మైనస్‌లు ఇన్నాళ్లూ వైసీపీకి పాజిటివ్‌గా మారాయి. ఇటీవల ముగిసిన స్థానిక సమరంలో జనసేన చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు గెలుచుకోవడం అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఇక ప్రజల్లో హీరో పరంగా ఫుల్ క్రేజ్ ఉన్న పీకే.. సీఎం కేండిడేట్‌గా బీజేపీ మద్దతుతో తెర మీదకు వస్తే.. అది వైసీపీకి పిడుగుపాటే. ఇప్పటికే మద్యం ధరలు, ఇసుక ధరలు, అభివ‌ృద్ధి తిరోగమనం తదితర అంశాలతో జగన్‌పై వ్యతిరేకత ఉన్న ఆ పార్టీ సానుభూతి వర్గం ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో జనసేన వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. టీడీపీ ఓట్లు ఎలానూ టీడీపీకే పడతాయి కాబట్టి.. పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అధికార పార్టీ ఓట్లకే చిల్లు. అందుకే, సోము వీర్రాజు ప్రకటన చేసినప్పటి నుంచీ వైసీపీలో కలకలం చెలరేగుతోంది. పైకి గంభీరంగా ఉంటున్నా.. లోలోన గుబులు మొదలైంది.