హోదా .. ఓ అంతులేని కథ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మరో మారు తెగేసి చెప్పింది. లోక్ సభలో తెలుగు దేశం పార్టీ సభ్యుడు కింజారపు రామ్మోహన నాయుడు రాష్ట్ర పునః వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీల అమలుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు, హోం శాఖ సహాయ మంత్రి నిద్యానంద రాయ్, ఎప్పటిలానే, 14 ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్థిక సంఘం హోదాకు ఎప్పుడొనే మంగళం పాడేసిందని, ఇక పై ఏ రాష్ట్రానికీ, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని మరో మారు స్పష్టం చేశారు.
నిజానికి,హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడోనే చెప్పిన కేంద్ర ప్రభుత్వం అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని విధాల అడిగినా అదే సమాధానం ఇస్తోంది.అయినా ఆంధ్ర ప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అవసరం చిక్కిన ప్రతి సంవత్సరంలోనూ హోదా ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. ఒక్క హోదా విషయంలోనే కాదు, విభజన హామీలకు సంబందించిన ఇతరత్రా అంశాలను కూడా అడగడం కాదనిపించుకోవడం,కాదంటే, తాజాగా నిద్యానంద రాయి చెప్పినట్లుగా ఇచ్చినవేవో ఇచ్చాం, ఇవ్వవలసినవి ఏవో ఇస్తాం, ఈలోగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని ఇచ్చి పుచ్చుకోవడాలు పూర్తి చేసుకోవడాలు కానిచ్చుకోండని కేంద్రం ఎప్పటికప్పుడు చేతులు కడిగేసుకుంటోంది.
అయితే, రాష్ట్రం పట్ల కేంద్రం ఎందుకిలా,వివక్ష చూపుతోంది? ఎందుకు,రాష్ట్రం పట్ల చిన్నచూపు చూస్తోంది?అంటే, అందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలే కనిపిస్తాయి.రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కనీసపాటి సయోధ్యత లేక పోవడం, అందులో ప్రధాన కారణం.ఇప్పుదు కాదు, విభజనకు ముందు నుంచి కూడా ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీల ధోరణి, ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లే సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి గురుంచి వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న ప్రాంతీయ పార్టీలి టీడీపీ , వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తూనే ఉంది. మంచి చెడులు, విచక్షణ లేకుండా ఒకరు అవునన్నది ఇంకొకరు కాదనడం, ఒకరు కాదన్నది ఇంకొకరు అవుననడం చూస్తూనే ఉన్నాం.
నిజానికి, సాకేతికంగా చూస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్పడం కాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం హోదాకు ప్రత్యాన్మాయంగా ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజికి ఆమోదం తెలుపుతూ శాసన సభ తీర్మానం చేసింది.ఆ తీర్మానంతోనే హోదా కథ ముగిసింది. బయట లోపలా ఎవరైనా ఏదైనా మాట్లడ వచ్చును, కానీ, అసెంబ్లీ తీర్మానమే ఫైనల్, అదే శాసనం.ఆ తీర్మానం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, హోదా ముగిసిన అధ్యాయమని చెప్పగలుగుతున్నాయి.
అయినా, టీడీపీ,ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి,చాలా పెద్ద ఎత్తున, హోదా కోసం ధర్మ పోరాటం చేసింది. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది. అలాగే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ, ఎపీలు రాజీనా చేశారు,ఇంకా చేయగలిగిన చర్చ, రచ్చంతా చేశారు. అయినా, హోదా రాలేదు.పైగా ఎగతాళి చేసేవారి ముందు జారిపడినట్లుగా చివరకు అవమానమే మిగిలింది.
ఇప్పటికైనా, హోదా కాకపోయినా, కనీసం విభజన చట్టంలోని ఇతర హామీలు అయినా అమలుకావాలంటే, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్రను పోషిస్తున్న వైసీపీ, టీడీపీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కౌరవ, పాండవులు లాగా, ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళితే ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది.
ఇదొకటి అయితే, అటు కేంద్రం వైపు నుంచి చూస్తే, సాంకేతిక అంశాలు, సిద్ధాంత రాద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ, రాజకీయంగా ఏ మాత్రం ప్రయోజనం లేక పోవడం రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిన్న చూపుకు, లేదా వివక్షకు ఒక మూల కారణంగా కనిపిస్తోంది. ఏపీలో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు, కాబట్టి రాష్ట్రం ఘోష కేంద్రం చెవిన పడడం లేదు. పైగా, కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వుంది. రాజ్య సభలో సంపూర్ణ బలం లేక పోయినా, అవసరంలో ఆదుకునేందుకు తెలుగు దేశం, వైసీపీతో పాటుగా తెరాస సహా చాలా వరకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.చివరకు కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం కూడా బీజేపీతో చేతులు కలిపింది. అనేక సందర్భాలలో అది రుజువైంది. సో.. రాష్ట్రానికి హోదా రాకపోవాడానికి కేంద్ర మాత్రమే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రస్తుత, గత ప్రభుత్వాలు, పార్టీలు కూడా బాధ్యత వహించక తప్పదు.నిజానికి, హోదా రాదన్నరాదన్న సత్యం, అదొక ముగిసిన అధ్యాయం అన్న నిజం,రామ్మోహన నాయుడు సహా అందరికే తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అదే ఆటలో హోదా, విభజన హామీలు ఆట బొమ్మలు.