2024లో యూటీగా హైదరాబాద్? మేడ్చల్, రంగారెడ్డిపై కేసీఆర్ ఫోకస్
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా? 2024లో యూటీ కావడం ఖాయమా?.. ఈ ప్రశ్న రాష్ట్ర విభజనకు ముందు నుంచి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనే ప్రచారం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగా చేసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేస్తారని చర్చ జరిగింది. కొందరు సమైక్యాంధ్ర నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది. కాకుంటే పదేళ్ల పాటు హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. ఆ గడువు 2024తో ముగియనుంది.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు మూడేండ్లలో ముగియనుండటంతో మళ్లీ కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే అంశం తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిని యూటీగా చేయాలని.. అవసరమైతే దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలనే నిర్ణయానికి కేంద్ర సర్కార్ వచ్చిందంటున్నారు. అందుకే కొన్ని రోజులుగా దీనిపై లీకులు ఇస్తున్నారని చెబుతున్నారు. ఫిబ్రవరిలో లోక్ సభలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దీనిపై మాట్లాడారు. హైదరాబాద్ ను యూటీగా మార్చాలని కేంద్రం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ ను యూటీ చేస్తున్నారంటూ అసద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అసద్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించినా... యూటీపై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి కేసీఆర్ కసరత్తు చేస్తుండటం ఇందుకు బలాన్నిస్తోంది. శుక్రవారం ఈ రెండు జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి చెంది నగర ముఖచిత్రాన్ని మరింత గుణాత్మకంగా మార్చివేస్తాయన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ సోమేశ్‌కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ ను యూటీ చేయాలనే కేంద్ర ఆలోచనపై సీఎం కేసీఆర్ కు సిగ్నల్స్ వచ్చాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి ఇస్తోంది. హైదరాబాద్ ను యూటీగా ప్రకటించినా... మేడ్చల్ , రంగారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే తెలంగాణకు డోకా ఉండదని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధిపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేయడానికి కేంద్ర పాలిత ప్రాంతం కానుందనే సమాచారమే కారణమంటున్నారు. నిజానికి హైదరాబాద్ ను యూటీ చేస్తే వరంగల్ ను రాజధానిగా మార్చాలని మొదట కేసీఆర్ నిర్ణయించారట. అయితే ఇప్పుడు ఆయన తన ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం అభివృద్ధి శర వేగంగా సాగుతోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఐటీ సంస్థలన్ని కోలువున్నాయి. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలన్ని అక్కడే ఉన్నాయి. అందుకే జీహెచ్ఎంసీని కేంద్రం యూటీగా మార్చినా.. తెలంగాణకు నష్టం లేకుండా ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేసుకోవాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా.. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ చుట్టూ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు అభివృద్ధి వేగంగా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కేసీఆర్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులకు భారీగా భూములు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ యూటీ ఎయితే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలని భావించడానికి ఇది కూడా ఒక కారణమంటున్నారు. అందుకే వరంగల్ ప్రతిపాదనను పక్కనపెట్టి... ఈ ప్రాంతంపై కేసీఆర్ ఫోకస్ చేశారని అంటున్నారు. రీజనల్ రింగు రోడ్డు కోసం కేంద్రంపై టీఆర్ఎస్ సర్కార్ ఒత్తిడి పెంచడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. రీజనల్ రింగు రోడ్డు వస్తే మేడ్చల్, రంగారెడ్డితో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు మహార్దశ పట్టనుంది. ఈ ప్రాంతంలోనూ కేసీఆర్ కుటుంబానికి భారీగా ఆస్తులు ఉన్నాయనే ప్రచారం ఉంది. మొత్తంగా మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రచించడానికి .. హైదరాబాద్ యూటీ కానుండటమే కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ ను యూటీ చేసినా తనకు ఇబ్బంది లేకుండా కేసీఆర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.