వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు!
posted on Mar 29, 2021 @ 12:46PM
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన వైసీపీ.. తిరుపతిలో భారీ విజయానికి ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు దేశం నేతలు మాత్రం అధికారం ఉపయోగించి తిరుపతిలో అక్రమాలు చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిస్తే...వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మాట్లాడిన బుద్దా.. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయగలిగేది ఒక్క టీడీపీ మాత్రమే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు. డబ్బు, అధికారం, పోలీస్ అనే మూడు రత్నాలతో ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. 2024లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. తిరుపతి లోక్ సభ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావు 2 లక్షల 40 వేల మెజార్టీతె గెలిచారు.ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది.