అమ్మకు ఓటేస్తారా? కమ్మకు ఓటేస్తారా?
posted on Mar 29, 2021 @ 8:45PM
జగన్.. 'రెడ్డి నాయకుడు'. చంద్రబాబు.. 'కమ్మ లీడర్'. కేసీఆర్.. 'వెలమ దొర'. పవన్.. 'కాపు నేత'. ఇలా నేతలందరినీ కులం గాడిన కట్టడం నేటి కుసంస్కార రాజకీయం. ఈ క్యాస్ట్ పాలిటిక్స్‌లో అందరికంటే కంత్రీగా తేలింది జగన్మోహన్‌రెడ్డినే. మాటిమాటికి చంద్రబాబుకు కమ్మ కులాన్ని అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేయడంలో ఆయన ఎక్స్‌పర్ట్. ఆఖరికి.. ఎస్ఈసీ లాంటి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు సైతం 'కమ్మ' కులాన్ని జోడించి.. చంద్రబాబుతో జత కలిపి.. చీప్ పాలి'ట్రిక్స్' ప్లే చేశారు ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు.. కరోనా సమయంలో విజయవాడ రమేశ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఆ హాస్పిటల్ యజమానికి సైతం కులం మకిలి అంటించిన ఘనత జగన్ సర్కారుదే.
ఈ కులం గొడవంతా ఇప్పుడు ఎందుకంటే.. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ తరం నేతలు, రాజకీయ విశ్లేషకులు ఓసారి గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రభంజనంలా, ప్రళయంలా రాయకీయ తెరపైకి దూసుకొచ్చిన ఎన్టీవోడ్ని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనాడే ఈ కుల గజ్జిని రాజకీయాలకు అంటించారని అంటున్నారు. అప్పటి వరకూ వెండితెర వేల్పులా వెలుగొందిన తారకరాముడు.. ఇందిరపై తిరుగుబాటుతో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించేందుకు.. తెలుగుదేశం పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఖాకీ డ్రెస్సుతో రాజకీయ కదనరంగంలో దూకారు. అన్నాళ్లూ తెరపైన చూసిన అసమాన్యుడు.. బ్రదర్ అంటూ.. సోదరసోదరీమణులంటూ.. ప్రజల మధ్యకు సామాన్యుడిలా రావడంతో జనాలంతా పూనకం వచ్చినట్టు ఎన్టీఆర్ వెంట నడిచారు. భూమి ఈనిందా? సముద్రం పొంగిందా? అన్నట్టు.. ఇసుకేస్తే రాలనంతగా జనం ఎన్టీఆర్ కోసం తరలివచ్చేవారు.
ఆ జన ప్రభంజనం చూసి.. ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ నేతలు. అందుకే, ఎన్టీఆర్ స్థాయిని ఎలాగైనా అడ్డుకోవాలని.. కుల కుతంత్రం రచించారు. అందరి వాడైన నందమూరి తారక రాముడిని కొందరి వాడిని చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌కు కమ్మ కులానికే పరిమితం చేసేలా కొత్త నినాదం సృష్టించారు. "అమ్మ కావాలా? కమ్మ కావాలా?".. "అమ్మకు ఓటేస్తారా? కమ్మకు ఓటేస్తారా?" అంటూ జనంలో కులాల వారీగా చీలిక తెచ్చే ఎత్తుగడ వేశారు. అమ్మ అంటే ఇందిరమ్మ. కమ్మ అంటే ఎన్టీఆర్. అనేది వారి నినాదం.
జన్మతహా కమ్మ కులంలో పుట్టినా.. ఎన్టీఆర్ ఏనాడూ కేవలం కమ్మలనే చేరదీయలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అన్ని కులాలను సమ ప్రాధాన్యత ఇచ్చారు. విద్యావంతులను, సంఘ సంస్కర్తలను పార్టీలోకి తీసుకున్నారు. యువకులకు పెద్ద పీట వేశారు. ఎక్కడా కులం, మతం అనే తారతమ్య బేధాలు చూపలేదు. అర్హత, చిత్తశుద్దే ప్రాతిపదికన అభ్యర్థులను నిలబెట్టారు. నేటి కేసీఆర్ లాంటి వారు సైతం ఆ కోటాలోనే అప్పట్లో టికెట్లు పొందారు. అప్పటి వరకూ కాంగ్రెస్‌లో కొన్ని కులాలదే ఆదిపత్యం కొనసాగగా.. టీడీపీ రాకతో అన్ని కులాలు రాజకీయ అందలమెక్కాయి. టీడీపీకి బీసీల పార్టీ అనే పేరు అందుకే వచ్చింది.
కులాల కంపులేని టీడీపీపై.. బలవంతంగా కమ్మ ముద్ర వేసే ప్రయత్నం అప్పుడూ జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ నాయకులు "అమ్మకు ఓటేస్తారా? కమ్మకు ఓటేస్తారా?" అంటూ రాజకీయాల్లో కుల చిచ్చు పెడితే.. ఈనాడు చంద్రబాబుకు 'కమ్మ' కులాన్ని అంటగట్టి.. కుల గజ్జిని తారాస్థాయికి తీసుకెళుతున్నారు జగన్మోహన్‌రెడ్డి. బలవంతుడైన నాయకుడిని ఎదుర్కోలేక.. బలహీనులు చేసే కుటిల ప్రయత్నమే.. ఈ కుల రాజకీయం.