ఆ తప్పు చేయనంటున్న కేసీఆర్.. సాగర్‌లో దుబ్బాక టెన్షన్..
posted on Mar 29, 2021 @ 5:30PM
నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు దుబ్బాక ఫీవర్ పట్టుకుంది. అక్కడి మాదిరే ఇక్కడా ఫలితం తేడా వస్తుందేమోనని భయపడుతోంది. అందుకే, సాగర్‌లో గెలుపు కోసం దుబ్బాక దంగల్‌లో జరిగిన పొరబాట్లు రిపీట్ కాకుండా చూస్తోంది. అందులో భాగంగా దుబ్బాక ఓటమికి కారణాలేంటో పోస్టుమార్టం చేసి.. నాగార్జున సాగర్ నేతలకు వివరించారు గులాబీ బాస్. ఆ తప్పులు ఇక్కడ చేయొద్దంటూ.. తానూ అలా చేయనంటూ.. టీఆర్ఎస్ నాయకులకు హితోపదేశం చేశారు కేసీఆర్.
దుబ్బాక ఓటమి కారు పార్టీని కలలో కూడా వెంటాడుతూనే ఉంటుంది. కీలక సమయంలో.. కీలకమైన నియోజకవర్గంలో.. కీలకమైన అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అధికార పార్టీకి తీవ్ర అవమానకరం. దుబ్బాక సీఎం కేసీఆర్ సొంత జిల్లా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్ల, హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేట.. ఈ మూడు ప్రాంతాలకు మధ్యలో ఉన్న దుబ్బాకలో ఓడిపోవడం మామూలు విషయం కాదు. అప్పటికే దుబ్బాక నుంచి నాలుగుసార్లు గెలిచింది టీఆర్ఎస్. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. కారు గుర్తుపై ఆయన భార్య పోటీల నిలిచారు. దండిగా సానుభూతి. ఫుల్లుగా పొలిటికల్ పవర్. గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు గులాబీ బాస్. అందుకే ప్రచారానికి అటువైపు కూడా చూడలేదు. కనీసం కేటీఆర్ సైతం దుబ్బాకలో అడుగుపెట్టలేదు. మంత్రి హరీశ్‌రావుకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. అదే తాము చేసిన తప్పంటున్నారు సీఎం కేసీఆర్. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో అధికార పార్టీ పరువంతా పోయింది. అప్పటి నుంచే బీజేపీ దూకుడు పెరిగింది. ఒక్క సీటు.. ఒకే ఒక్క సీటు కదాని లైట్ తీసుకుంటే.. అది గ్రేటర్ వరకూ వచ్చిందనేది గులాబీ బాస్ విశ్లేషణ.
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలాంటిది.. దుబ్బాకలో బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నా.. ప్రచారానికి దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడకపోవడమే తమ ఓటమికి కారణమని తేల్చేశారు కేసీఆర్. అక్కడ తాను కానీ, కేటీఆర్ కానీ ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామంటున్నారు కేసీఆర్. ఒక్క హరీశ్‌కే వదిలేయకుండా.. తామిద్దరం సైతం జోక్యం చేసుకొని ఉంటే.. దుబ్బాకలో ఫలితం మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు. అందుకే, దుబ్బాకలో చేసిన తప్పిదం నాగార్జున సాగర్‌లో రిపీట్ అవకుండా చూస్తామని చెప్పారు. సాగర్ ప్రచారానికి తనతో పాటు కేటీఆర్ కూడా వస్తారని నియోజక వర్గ నేతలకు అభయం ఇచ్చారు కేసీఆర్.
నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న నేతలను పిలిపించి మాట్లాడారు గులాబీ బాస్. అంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. మరోనేత చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్ చేస్తామని చెప్పారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో నాయకులంతా సాగర్‌లో కష్టపడాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.