ఎన్టీఆర్ రావాలి.. మరి, వస్తారా?
posted on Mar 29, 2021 @ 3:47PM
రావాలి.. రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. అభిమానుల నుంచి టీడీపీ సీనియర్ల వరకూ ఇదే డిమాండ్. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బలోపేతం కోసం పని చేయాలంటూ పిలుపిచ్చారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ సీనియర్ మోస్ట్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పని చేయాలని చెప్పారు. త్వరలోనే తెలుగుదేశంలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఆ మార్పు.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీనేనా అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.
టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీ సీనియర్ నేత నోటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు రావడం యాధృచ్చికమో.. వ్యూహాత్మకమో.. తెలీదు కానీ.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ సెగ తగిలింది. బాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణులు జూనియర్‌ను రాజకీయాల్లో దింపాలంటూ అధినేత సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటి నుంచి రామారావు రాకపై ఆసక్తి నెలకొంది. కట్ చేస్తే.. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నేరుగా ఎన్టీఆర్‌నే పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు జర్నలిస్టులు. ఇది సమయం కాదంటూ అప్పుడు మాట దాటేశారు జూనియర్. ఆ తర్వాత తెల్లవారితే గురువారం ప్రీరిలీజ్ ఫంక్షన్‌లోనూ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానుల సీఎం స్లోగన్స్‌పై సీరియస్ అయ్యారు జూనియర్. ఆగండి బ్రదర్.. అంటూ ఫ్యాన్స్‌ను అదుపు చేశారు ఎన్టీఆర్. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుందగా.. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేత సైతం ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
40ఏళ్ల ప్రస్తానంలో టీడీపీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అయినా.. ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచింది. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ పునాదులు కదిలించిన టీడీపీ.. ఆ తర్వాత చంద్రబాబు చేతిలో మరింత ఉన్నత శిఖరాలకు చేరింది. టీడీపీకి.. ఎన్టీఆర్ ఎలాగో.. చంద్రబాబూ అంతే. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోటు ఎన్నడూ ఎదురుకాలేదు. ఇప్పటికిప్పుడు పార్టీకి జూనియర్ అవసరమూ లేదంటున్నారు సీనియర్లు. ప్రస్తుతం టీడీపీ ప్రాభవం తగ్గినా.. ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇంకో పదేళ్లయినా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగలరు. ఆయన వారసులుగా లోకేవ్, బాలకృష్ణలు ఉండనే ఉన్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు వెండితెరపై మరింత మంచి భవిష్యత్ ఉంది. అర్జెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. అంతలా సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే.. మరో పది, పాతికేళ్ల తర్వాత రాజకీయ ఆలోచన చేయొచ్చు. అప్పటి వరకూ జై తెలుగుదేశం.. జై చంద్రబాబు.