కేసీఆర్‌ను సమర్థించిన చంద్రబాబు
posted on Mar 29, 2021 @ 6:16PM
సీన్ రివర్స్. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనొచ్చు. గతంలో ఏపీలో ఒక ఎకరం అమ్మి.. తెలంగాణలో 3 ఎకరాలు కొనేవారు. తెలంగాణ వచ్చాక సీన్ రివర్స్ అయిందంటూ అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు సీఎం కేసీఆర్.
అవును, సీఎం కేసీఆర్ చెప్పింది అక్షరాలా నిజమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలన్నారు చంద్రబాబు.
ఇటు కేసీఆర్ స్టేట్‌మెంట్.. అటు చంద్రబాబు సమర్ధింపు.. ఇద్దరి మాటలూ వాస్తవిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అంటున్నారు సామాజిక వేత్తలు. జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏపీ తిరోగమనంలో పయనిస్తోంది. అభివృద్ధి అనే పదమే అడ్రస్ లేకుండా పోయింది. సంక్షేమ పథకాల గోలే కానీ.. కంపెనీల ఊసే లేదు. విన్దామన్నా.. చూద్దామన్నా.. కొత్త కంపెనీ జాడే లేదు.
చంద్రబాబు హయాంలో కియాలాంటి కంపెనీలెన్నో ఏపీకి క్యూ కట్టాయి. పట్టిసీమతో పొలాలకు నీళ్లు పారాయి. ఆంధ్రుల కలల రాజధానితో అమరావతి పేరు ప్రపంచస్థాయిలో మారుమోగింది. ఇలా.. అనేక అంశాలతో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొంగొత్తగా దూసుకుపోయింది. ఏపీలో భూములు బంగారంగా మారాయి. 2019లో ప్రభుత్వం మారడంతో అంతా తారుమారు. కంపెనీలు లేవు, ప్రాజెక్టులు లేవు. పథకాలే తప్ప అభివృద్ధి మాటే లేదు. అందుకే, భూముల ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో భూములు.. అంగడి సరుకుగా మారిపోవడంతో విలువ దారుణంగా పతనమైంది. అందుకే, తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఏపీలో ఇప్పుడు రెండు ఎకరాలు కొనొచ్చంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందంటూ మండిపడ్డారు ప్రతిపక్ష నేత.