ఆసుపత్రిలో రోజా.. అభిమానుల్లో ఆందోళన
posted on Mar 29, 2021 @ 2:19PM
నగరి ఎమ్మెల్యే రోజా అనారోగ్యతంతో ఆసుపత్రిలో చేరారు. చెన్నై అడయార్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఉన్నట్టుండి సడెన్‌గా రోజా ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోజాకు ఏమైందని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ జబర్దస్త్‌గా ఉండే రోజాకు అనారోగ్యం అనే న్యూస్ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయంగా దూకుడు మీదుండే నగరి ఎమ్మెల్యేకు ఏ సమస్య వచ్చిందోనని అంతా ఆందోళన పడుతున్నారు.
రోజా ఆరోగ్య పరిస్థితిపై ఆమె భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. చెన్నై అడయార్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రోజాకు ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆదివారం రాత్రి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారని.. 2-3 రోజుల్లో యథావిధిగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పారు. దయచేసి ఎవరూ హాస్పిటల్ దగ్గరకు రావద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు సెల్వమణి.
గతేడాది కరోనా, జనవరిలో ఎన్నికల కారణంగా సర్జరీలు వాయిదా వేశారని సెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే రోజా రెండు, మూడు నెలలుగా బిజీ, బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ హడావిడి ముగియడంతో రోజా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆడియో టేప్ రూపంలో ప్రకటన విడుదల చేశారు సెల్వమణి.